
‘‘ఈమధ్య చంద్రబాబు సినిమాలు తెగ చూస్తున్నాడు. తెగ ఇన్‌స్పైర్ అవుతున్నాడు. బాహుబలి చూసి ఆ మైకంలో ఆ సినిమాలోని సెట్టింగ్‌లా రాజధాని నిర్మించాలని డిసైడ్ అయిపోయాడు. ఆయన ఇంగ్లిష్ సినిమాలు చూడకపోవడం మన అదృష్టం’’ అని బాబు గురించి పబ్లిక్‌టాక్. ఇంగ్లిష్ సినిమాలేం ఖర్మ...తమిళ డబ్బింగ్ సినిమాలు చూసినా చంద్రబాబు ఏ విధంగా ఇన్‌స్పైర్ అవుతారనేదానికి ఇదో చిలిపి ఊహ. చలో అమరావతి...
ఆరోజు ఆదివారం. ఉండవల్లిలోని గెస్ట్‌హౌస్‌లో టీవీ ముందు కూర్చున్న బాబుకు రకరకాల న్యూస్‌చానల్స్ చూసి బోర్ కొట్టింది. ఏదైనా సినిమా చూడాలనిపించింది. రిమోట్ నొక్కుతుండగా ఒక చానల్‌లో ‘కాసేపట్లో రోబో సినిమా’ అనే ప్రకటన వచ్చింది. బాబుకు హుషారొచ్చింది. వెంటనే తన మంత్రివర్గ సభ్యులకు ఫోన్ చేసి అర్జెంట్‌గా గెస్ట్‌హౌస్‌కు రమ్మని ఆదేశించాడు. విషయం తెలియని మంత్రులు ఆందోళనతో బాబు ఇంటికి పరుగు తీశారు. ‘‘రజనీకాంత్ రోబో సినిమా టీవీలో రాబోతుంది. అందరం కలిసి సినిమా చూద్దాం... ఆ విధంగా ముందుకు పోదాం’’ అని గడ్డం సవరించాడు బాబు. ‘‘అలాగే సార్!’’ అని అందరూ టీవీ ముందు బుద్ధిగా కూర్చున్నారు. సినిమా మొదలైంది.
‘ది ఎండ్’ కార్డ్ పడిందో లేదో గెస్ట్‌హౌస్ నుంచి బయటికి వచ్చి ఒక చెట్టు కింద నిల్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు బాబు.‘‘సార్... మీకు ఈ సినిమా తెగ నచ్చేసి ఉంటుంది. నా వయసు 72 ఏళ్లు సార్. అయినా సరే... కిలిమంజారో పాట వస్తుంటే డ్యాన్స్ చేయాలనిపించింది అంటే నమ్మండి! ఇక ఐషు అందం గురించి ఎంత చెప్పినా తక్కువే!’’ అని నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతున్నాడు టీడీపీ సీనియర్ నేత ఒకరు.‘‘ఆపవయ్యా నీ సోది’’ అని కళ్లు పెద్దవి చేసి గద్దించి ఉన్నపళంగా కారు ఎక్కాడు చంద్రబాబు.చుట్టూ ఉన్నవాళ్లు ఈ దృశ్యం చూసి షాక్ తిన్నారు. చంద్రబాబు తన గెస్ట్‌హౌస్ నుంచి నేరుగా సెక్రటేరియట్‌కు చేరుకున్నాడు. ‘‘ఈరోజు నన్ను ఎవరూ కలవడానికి వీల్లేదు. చివరికి లోకేశ్ కూడా’’ అని సిబ్బందికి ఆర్డర్ వేసి తన ఛాంబర్‌లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు బాబు. మరోవైపు బాబు గురించిమంత్రులు హాటుహాటుగా చర్చించుకుంటున్నారు.‘‘ఎంత చెత్త సినిమా చూసినా ఆ సినిమా గొప్పతనం గురించి మురిసి పోతుంటాడు బాబు. అలాంటిది సూపర్ డూపర్ హిట్ సినిమా ‘రోబో’ బాబుకు నచ్చలేదా?’’ అని ఒక మంత్రి ఇంకో మంత్రిని అడిగాడు.
‘‘సీనియర్ నాయకుడిని అకారణంగా విసుక్కోవడం చూస్తుంటే ఆయనకు సినిమా నచ్చలేదనే అనిపిస్తుంది’’ అన్నాడా మంత్రి. ఇక అక్కడ బాబు ఏంచేస్తున్నాడో చూద్దాం... అన్ని శాఖల ఫైళ్లను దగ్గర పెట్టుకొని కాగితాల మీద ఏవేవో లెక్కలు వేస్తున్నాడు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు... ఒక్కటనేమిటి? అన్నీ చేస్తున్నాడు బాబు. కాసేపు కంప్యూటర్‌లోకి దూరి ఏదో సమాచారం లాగాడు. మళ్లీ లెక్కలు వేశాడు. ఈ లెక్కల పనిలో పడి భోజనం చేయకపోవడమే కాదు... పచ్చికాఫీ కూడా ముట్టలేదు బాబు. బాబు తన పని ముగించుకునేసరికి రాత్రి పదకొండు దాటింది. బయటికి వచ్చిన బాబు ‘కనిపెట్టేశా. ఇక నాకు తిరుగే లేదు. నేను గ్రేట్’ అని గట్టిగా నవ్వుతున్నాడు.‘‘సార్... ఏమైంది?’’ భద్రతా సిబ్బంది ఆందోళనగా అడిగారు.‘‘ఏమీ లేదు. రేపు అర్జంటుగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నా’’ అని ప్రకటించాడు. మరుసటి రోజు మంత్రివర్గ సమావేశంలో బాబు మాట్లాడటం మొదలు పెట్టాడు...‘‘సినిమాల నుంచి కూడా చాలా ఇన్‌స్పైర్ కావచ్చు అనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. బాహుబలి చూశానా...అందులో సెట్టింగ్స్‌లా మన రాజధాని ఉండాలని రాజమౌళికి కబురు చేశాను. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నాడు. నిన్నటికి నిన్న రోబో సినిమా చూశాను.అందులో ఒక సీన్ నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసింది. ఈ ఆలోచన విజయవంతమైతే ‘చ.ము’ ‘చ.త’ అని చరిత్ర రెండుగా విడిపోతుంది’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు బాబు.
‘‘చ. ము... చ.త అంటే ఏమిటి సార్?’’ అని అడిగాడు నిమ్మకాయల చినరాజప్ప.‘‘చ.ము అంటే చంద్రబాబుకు ముందు... చ.త అంటే చంద్రబాబు తరువాత’’ అని వివరించిన బాబు మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టాడు...‘‘రోబో సినిమాలో ఒక సీన్‌లో.... మిలటరీ ఆఫీసర్‌లకు ‘చిట్టి’ రోబోను పరిచయం చేస్తూ సైంటిస్ట్ రజనీకాంత్ ఏమంటాడో తెలుసా? ‘ఈ రోబో ఒక్కటి వంద మందితో సమానం’ అని. ఈ సీన్ నుంచి నేను ఇన్‌స్పైర్ అయిందేమిటంటే, ‘‘సైన్యంలో ఏంఖర్మ...మన ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రోబోలనే ఉద్యోగులుగా నియమించాలనుకుంటున్నాను. రోబోలకు జీతాలు ఇవ్వాల్సిన పనిలేదు. పెంచాల్సిన అవసరం లేదు. పెన్షన్ ఇవ్వాల్సిన పని అంతకంటే లేదు. ఈ రోబో ఉద్యోగుల వల్ల గవర్నమెంట్‌కు ఎంత ఆదాయం మిగులుతుందంటే...’’ అని జేబులో నుంచి కాగితం తీసి ఆనందంగా చదువుతూ పోతున్నాడు బాబు. చప్పట్లు కొట్టకపోతే ‘రోబో మంత్రులు’ అనే ఐడియా బాబుకు ఎక్కడ వస్తుందోనని భయపడి హాల్ అదిరేలా చప్పట్లు కొట్టారు మంత్రులు. మరుసటి రోజే ‘రోబో’ డైరెక్టర్ శంకర్‌తో కలిసి జపాన్‌కు వెళ్లిన బాబు.... లక్షలాది రోబోలను కొనుగోలు చేశాడు. ఒక నెల తరువాత...ఏపీలో ఎక్కడ చూసినా రోబో డాక్టర్లు, రోబో ఇంజనీర్లు, రోబో టీచర్లు... ఇలా ఏ ప్రభుత్వ విభాగంలో చూసినా ఉద్యోగుల స్థానంలో రోబోలే కనిపిస్తున్నాయి. ఉద్యోగుల జీతాలు మిగిలాయి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు వందల కోట్లు ఉన్నాయి. అలా మిగిలిన డబ్బుతో రెండు వేల ఎకరాల ‘రామోజీ ఫిలిం సిటీ’కీ దీటుగా భీమిలి దగ్గర మూడువేల ఎకరాల్లో ‘భీమోజీ ఫిలిం సిటీ’ నిర్మించాడు బాబు. కొద్ది కాలం తరువాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది.
‘‘మీ పార్టీ చిత్తుగా ఓడిపోబోతుంది’’ అని చెప్పాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. ఆరోజు చాలా బాధగా ఇంట్లో కూర్చున్నాడు బాబు. ‘‘ఏమైంది డాడీ!’’ ఆరాతీశాడు లోకేశ్. జరగబోయేది చెప్పాడు బాబు.‘‘ఓస్... ఈ మాత్రం దానికే ఇంత అదవ్వాలా? నా దగ్గర గొప్ప ఐడియా ఉంది’’ అన్నాడు కాలరెగరేస్తూ లోకేశ్. ‘‘ఏమిటి నాన్నా అది?’’ అని ఆసక్తిగా లోకేశ్ దగ్గరకు వచ్చాడు బాబు.‘‘అర్జంటుగా జపాన్‌కి వెళ్లి రోబో ఓటర్లకు ఆర్డర్ ఇద్దాం. ఇక ఏపీలో టోటల్ సీట్లన్నీ మనవే’’ అని చంద్రబాబు చెవిలో రహస్యంగా చెప్పాడు చినబాబు లోకేశ్.
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment