ఏ తల్లి అయినా తన సంతానాన్ని కేవలం ప్రేమిస్తూ మాత్రమే పెంచలేదు. తన అనురాగంతో పాటు వాళ్లు గనుక తెలియనితనం(అజ్ఞానం)తో తప్పు చేసినా కావాలని ఓ మొండితనంతో తెలిసి తెలిసి (జ్ఞానం) తప్పు చేసినా తప్పక దండించి తీరుతుంది. ఆ దండన కారణంగా సంతానానికి ఏది చేస్తే అది తప్పు అవుతుందో, ఎలా ప్రవర్తిస్తే అది తప్పుకాదో అమ్మ అనురాగానికి పాత్రతని పొందగల ప్రవర్తన అవుతుందో వాళ్లకి అర్థమైపోతుంది. గత భాగంలో పంచభూతాల మీదా ఆధిపత్యం ఉన్న సాయి తన అంతేవాసి (తన వద్దే ఉంటూ సాయినే సర్వస్వంగా భావించేవాడు) అయిన శ్యామాని ఎలా ప్రాణి(వాయువు) పోకుండా రక్షించాడో తెలుసుకున్నాం కదా! పైన చెప్పుకున్న తల్లి ఉదాహరణలో తల్లి అనుగ్రహంతో పాటు ఆగ్రహాన్ని కూడా చూపిస్తుందనుకున్నాం కదా! అదే తీరుగా సాయి కొందరి విషయంలో ప్రాణ (వాయు) రక్షణ చేయడంతో పాటు కొందరిని తన సమక్షంలోనే ప్రాణ(వాయు) త్యాగం చేసేలా కూడా చేశాడు. ఈ విషయాన్ని వింటూనే సాయి కళ్లముందే చచ్చిపోతుంటే కళ్లారా చూస్తూ కూడా మంత్రం వేసి రక్షించకుండా చంపేశాడా? అనుకుంటారు కొందరు. అందుకే పెద్దలంటారు. స్పష్టమగ్రే భవిష్యతి– ఏ విషయమైనా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆది నుండి తుది దాకా శ్రద్ధతో వినాలి అనీ. అప్పుడే లోవిషయం స్పష్టంగా అవగాహనకి వస్తుందనీను. నేటికాలంలో వారికి ఏదో ఓ కథకి సంబంధించిన నీతి అనే సూచిక పక్కన ఉన్న వాక్యాన్ని చదివేసి – కథలో నీతి ఇదన్నమాట అనుకుంటూ కథని చదవకుండా పెదవి విరిచేసినట్టు, ఓ విషయాన్ని ఓ వాక్యంలో వినేసి ఓ నిర్ణయానికొచ్చేయడం అలవాటైపోయింది. కాబట్టి సాయి సమక్షంలో ఎవరెవరి ప్రాణాలు పోయాయో ఆ సంఘటనలని కూడా తెలుసుకున్న పక్షంలో సాయితత్త్వం మనకి బోధపడి తీరుతుంది.
నీ సంగతి చూసుకో!
మద్రాసు నుంచి మానససరోవరానికి యాత్రకి బయలుదేరాడు విజయానందుడనే సన్యాసి. తోవలో షిర్డీకి వచ్చాడు. హరిద్వారం నుండి వచ్చిన ఓ స్వామితో మాట్లాడుతుంటే ఆయన మానససరోవర ప్రయాణపు కష్టాలనీ, అక్కడి చలినీ, పైగా అక్కడి భూటాన్ ప్రజలు కావాలని పెట్టే ఇబ్బందుల్నీ వివరించి చెప్పగానే ఈ సన్యాసి మానససరోవర యాత్రకి స్వస్తి చెప్పి బాబా దర్శనం చేద్దామని సాష్టాంగపడ్డాడు సాయి మందిరానికి వెళ్లి. బాబా ఈ విజయానందుడు సాష్టాంగపడుతుండగానే కోపంతో ఇతడో పనికిమాలిన సన్యాసి. అతని సాంగత్యం, సాహచర్యం మనకి మంచిది కాదు. ఇతడ్ని ఎందుకు రానిచ్చారు. పంపించివేయండి అన్నాడు. భక్తులకేమీ అర్థం కాలేదు. విజయానంద సన్యాసి తనని అలా సాయి అవమానించినా ఏ మాత్రం చలించకుండా మందిరంలోనే కూచుని సాయికి భక్తులు జరుపుతున్న అర్చనలని చూస్తూ అలాగే కూచుండిపోయాడు. ఎందుకో తెలియని ఆనందం, ఆకర్షణ బాబా విషయంలో కలిగిన విజయానందుడు షిర్డీని విడువకూడదని నిశ్చయించుకుని రెండు మూడు రోజులు అలాగే ఉండిపోయాడు. బాబా దగ్గరే ఉండిపోవాలనే కోరిక బలంగా కలిగిన విజయానందునికి తల్లి నుండి ఉత్తరం వచ్చింది. ఆమెకి జబ్బు చేసిందని. ఇష్టం లేకున్నా షిర్డీ నుంచి వెళ్లాలంటే బాబా అనుమతిని పొంది వెళ్లాల్సిందేనని భావించిన విజయానందుడు సాయి అనుమతి కోసం ప్రార్థించాడు.
సాయి ఆ సన్యాసిని చూస్తూ ‘నువ్వో సన్యాసివా? కేవలం కాషాయవస్త్రాలని ధరించినంత మాత్రాన సన్యాసివి అయిపోయినట్లేనా? నీ తల్లి మీద అంత ప్రేమ ఉండి వెంటనే ఆమెకి సపర్య చేయాలని భావించేవాడివైతే ఎందుకు సన్యాసాన్ని తీసుకున్నావు? భవబంధాలని తెంచుకోవడమంటే ఇదేనా? ఓపిక పట్టి కొన్ని రోజులు ఇక్కడే ఉండు! అయినా ముందు నీ సంగతి చూసుకో! (ఈ వాక్యం మరాఠాభాషలో ఉన్న ‘ఓవీ’ల్లో ఉంది) ఇక్కడ దొంగలున్నారు. తలుపు గడియ వేసుకో! ధనం, అధికారం... వంటివన్నీ నిత్యం కాదు. శ్రీహరి చరణాలని పట్టుకో! శాశ్వత సుఖమైన మోక్షాన్ని పొందగలవు. నీ పూర్వ పుణ్యం ఎక్కువైన కారణంగా ఈ పవిత్ర స్థలానికి, నిత్యం దైవభక్తిపరులే ఉండే ప్రదేశానికి రాగలిగావు. మిగిలిన కోరికలన్నింటినీ వీడి.. రేపటి నుండి భాగవత పారాయణాన్ని చేస్తూ ఉండు. ఇదిగో! శ్రద్ధగా విను! ఒక్కో వారం రోజులకి ఓ మారు పారాయణంచొప్పున చేస్తూ మూడు సప్తాహాలని (ఏడు రోజులు) చేస్తే భగవంతుడు ఆనందపడి నీకున్న విచారాలని పోగొడతాడు. నీకు చెప్పలేని శాంతి లభిస్తుంది’’ అన్నాడు.ఈ మాటల్ని వింటూన్న అందరికీ కూడా తల్లి జబ్బు గురించి ఆత్మసిద్ధినీ సాక్షాత్కారాన్ని గురించి ఆలోచించనివాడూ ఆలోచించుకోనివాడూ సన్యాసి ఎందుకు అవుతాడనే తీరు ఆలోచనలే కలిగాయి. లోఅర్థం అది కాదు.
బాబా మాటలలో అర్థం
బాబాకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసనేది అనేక సందర్భాల్లో మనం గమనించుకున్నాం. గోవా నుండి భక్తులొస్తే వాళ్లకి జరిగిన విశేషాలని చెప్పి 15 రూపాయలే దక్షిణగా తీసుకోవడం ద్వారా భూతకాల విశేషాలని బాబా గ్రహించగలడని అర్థం చేసుకున్నాం. చాంద్‌పాటిల్ గుర్రం ఎక్కడుందో చెప్పగలగడం ద్వారా వర్తమానం బాబాకి తెలుసనే విశేషాన్ని గ్రహించగలిగాం. ఇంతకు ముందనుకున్న శ్యామాకి జరిగిన పాముకాటు సంఘటన ద్వారా శ్యామాకి మరణకాలం కాలేదని తెలుసుకున్న సాయి అతనికి ఏం చేయాలో చెప్పి బ్రతికించడాన్ని స్పష్టంగా చూసి, శ్యామా మరణం ఇప్పుడు కాదనే భవిష్యత్ కాల విశేషాన్ని బాబా గ్రహించగలిగాడని సాక్ష్యపూర్వకంగా దర్శించుకున్నాం కదా! అదే తీరులో బాబా ఈ వచ్చిన విజయానందుడ్ని చూశాడు. అతనికి సంబంధించిన భూత భవిష్యత్ వర్తమానాల మూటనీ తన లోదృష్టితో పరిశీలించాడు. మానససరోవరానికి యాత్రకంటూ బయలుదేరిన సన్యాసి తన ప్రయాణమధ్యంలో ఎవరో ఒక సన్యాసి చెప్పిన మాటల్ని విని మానససరోవరయాత్రని మానుకున్నాడని అర్థమయింది బాబాకి. ‘సన్యాసమంటేనే కష్టానికి సిద్ధపడి ఉండాల్సిన పదవి’ కదా! మరి తాను తట్టుకోగలిగి వెళ్లగలుగుతాననకుండా మానుకోవడం ద్వారా సరైన సన్యాసి కాదని అర్థమైంది సాయికి. అందుకే విజయానందస్వామి తనకి సాష్టాంగపడగానే ఈ పనికిమాలిన స్వామిని ఎందుకిక్కడికి రప్పించారు? రానిచ్చారు? ఇతని సాహచర్యం, సాంగత్యం ద్వారా స్థిర బుద్ధి ఉన్న మన భక్తులు కూడా చంచల స్వభావులుగా అయిపోతారంటూ సన్యాసి సమక్షంలోనే మాట్లాడాడు. ఇందులో తప్పు పట్టుకోవాల్సిందేముంది? ఈ లోతు అర్థం కాని కొందరు భక్తులు సాయి మాటలని మరోలా అనుకుని ఉండచ్చు. లోఅర్థం తెలియని స్థాయిలో ఉన్నవాళ్లు మాత్రం సాయి ఇలా అంటున్నాడంటే ఏదో చెప్పలేని విశేషం ఉండి ఉండవచ్చని అర్థం చేసుకున్నారు. ఆ విశేషం ఇదన్నమాట. కాబట్టి విజయానందుని భూతకాల పరిస్థితి అది! ఇక వర్తమానపరిస్థితిని చూస్తే... సన్యాసి అయ్యుండీ తన తల్లి నుండి ఉత్తరం రాగానే, వెంటనే బయలుదేరి మద్రాసు వెళ్తానంటూ అనుమతిని ప్రార్థించే స్థాయిలో ఉన్నాడు ఈ సన్యాసి. ఇది కూడా సన్యాస« ధర్మవిరుద్ధమే కదా! అందుకే తల్లి గురించి ఆలోచించే నీకు భవబంధవిముక్తి ఏమైంది? ఏముందంటూ బహిరంగంగానే మాట్లాడాడు సాయి. దీంతో సాయిని ఎదుటివ్యక్తి భూతమూ వర్తమానమూ కూడా తెలిశాయనే విషయం తెలుస్తోందిగా!
ఇక విజయానందుని భవిష్యత్కాలాన్ని కూడా సాయి గమనించాడు తన లోదృష్టితో. ఆశ్చర్యమనిపించింది సాయికి. ఎందుకంటే.. విజయానందునికి సరిగా ఆ రోజునుండి 3“7 (మూడు సప్తాహాలు అంటే 21 రోజులు) రోజుల్లో ఏనాడైనా మరణించవలసిన.. అంటే తన ప్రాణవాయువుని త్యాగం(విడిచివేయవలసిన) అవసరముందని గ్రహించాడు సాయి. అందుకే తల్లి వద్దకి పోవద్దని ఇటు సన్యాసధర్మం ప్రకారం చెప్తున్నట్టుగా పైకి చెప్తూ, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడాన్ని చూసుకోవాలనే ధర్మబోధని చేస్తున్నట్లుగా లోవిశేషంతో ఉపదేశిస్తూ.. నీ సంగతి చూసుకో! అన్నాడు సాయి. ఇది నిజంకాని పక్షంలో ‘న మాతుఃపరదైవతమ్ – అన్నారు కాబట్టి, తల్లికంటె మరో దైవమే లేదని ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టీ ఆ తల్లి వద్దకి పోవద్దని చెప్పిన సాయి అధర్మపరుడు అయ్యుండేవాడు కాడూ? రుషులూ సిద్ధులూ సద్గురువులూ అలాగే నేటికాలంలోనైతే పెద్దలూ అనుభవజ్ఞులూ వృద్ధులూ సరైన మార్గాన్నే ఉపదేశిస్తారు. ఎక్కడైనా జరగరానిది జరిగే పరిస్థితి గాని వాళ్లకి గోచరిస్తే ఆ విషయాన్ని కుండ పగలగొట్టినట్టుగా చెప్పకుండా వాళ్లకి మాత్రమే అవగాహనతో అర్థమయ్యే తీరులో నర్మగర్భంగా చెప్తారు. ఆ లోఅర్థం తెలియని పక్షంలో సూటిగా చెప్తారు తప్ప ముందే సూటిగా చెప్పి ఆందోళనకీ భయభ్రాంతులకీ గురిచేయరు.
ఈ నేపథ్యంలో సాయి ఆ విజయానందుని అవశ్యమరణం(తప్పక మరణించవలసిన పరిస్థితి) గమనించి తాను మరణాన్ని వాయిదా వేయించగలశక్తి (శ్యామా విషయం లోలాగా) కలవాడే అయినా ఆ పనిని చేయలేదు. దానికి కారణం అతనికి రాబోయే మరణం దైవనిశ్చితం అయ్యుండటమే. సాయి ఎంత గొప్పవాడంటే తాను నిత్యం మననం చేస్తూండే ‘అల్లాహ్ హో మాలిక్!’ మంత్రాన్ని మననం చేస్తూ ఉండవలసిందని ఆజ్ఞాపించకుండా, శ్రీహరి చరణాలని ఆశ్రయించు. అందుకే భాగవతాన్ని 7 రోజుల్లో (ఆ పరీక్షిస్మహారాజులాగా) పారాయణాన్ని పూర్తి చేస్తూ 3 వారాల పాటు కొనసాగించవలసిందన్నాడు కూడా. అలా కాక 21 రోజుల్లో భాగవతాన్ని పూర్తి చేయవలసిందనిగాని సాయి ఆజ్ఞాపించి ఉంటే దురదృష్టవశాత్తూ ఏ 16వ రోజునో అతడు గాని మరణిస్తే ఇటు భాగవత పారాయణం ముగిసి ఉండేది కాదు. అతని మరణానికి ముందు సరైన మార్గదర్శనాన్ని తాను చేసినట్లు అయ్యుండేదీ కాదు. ఇంత ఆలోచించి సాయి చెప్పాడు విజయానందునికి భగవత పారాయణం చేయవలసిందని. సాయినోటి నుంచి వచ్చిన ఆ వాక్యాలు విజయానందునికి ఆజ్ఞలుగా తోచాయి. కర్తవ్యాలుగా అనిపించాయి. అంతే! ఆ మరురోజునుండే పారాయణాన్ని ప్రారంభించదలిచి ఉదయం స్నానాన్ని ముగించి లెండీ తోటకి వెళ్లి ఏకాంతంగా కూచుని భాగవతగ్రంథాన్ని తెరిచాడు. తీవ్రమైన ఏకాగ్రతతో రెండు రోజుల పాటు పారాయణాన్ని చేసి తీవ్రంగా అలసిపోయాడు. మళ్లీ మందిరానికొచ్చి ఆ మందిరం పక్కనే భక్తులందరూ వచ్చి కూర్చునే ‘వాడా’కి వచ్చి విశ్రాంతికోసం మరో రెండురోజులున్నాడు. మూడవ రోజున మళ్లీ పారాయణం చేద్దామనుకుంటూ తన పక్కనే కూచున్న ‘బడేబాబా’ అనే ఆయన తొడమీదికి ఒరిగిలపడి అక్కడే అప్పుడే ప్రాణాలని విడిచాడు.మరి ప్రాణవాయువు తన అధీనంలో ఉన్న సాయి ఇతడ్ని బతికించలేకపోవడానికి కారణం పైన అనుకున్నతీరుగా ఆయన మరణం దైవనిర్ణయమని సాయికి ముందుగానే తెలిసి ఉండటం. నిజంగా తన తల్లి నుండి ఉత్తరం వచ్చింది కాబట్టి ఈ విజయానందునికే సాయి అనుమతిని ఇచ్చి వెళ్లవలసిందన్నట్లయితే ఆ సన్యాసి శీఘ్రప్రయాణ సౌకర్యాలులేని ఆ కాలంలో ఏ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచి ఉండేవాడు. ఇటు సాయి దర్శనానికీ, అటు తల్లి దర్శనానికీ కూడా నోచుకోగలిగి ఉండేవాడే కాకపోయేవాడు.
అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్! యం ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ‘ఎవరైతే మరణించబోతున్న కాలంలో భగవంతుడైన తనని స్మరిస్తూ శరీరంలోని ప్రాణాలని విడుస్తూ శరీరంలోని చైతన్యాన్ని కోల్పోతారో వాళ్లు తనలో ఐక్యమవుతారంటూ ఏ శ్రీకృష్ణుడు తన గీతా ఉపదేశంలో చెప్పాడో, దానికి అనుగుణంగా ఈ విజయానంద సన్యాసి తల్లి దర్శనానికై ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ప్రాణత్యాగం చేయడం కాకుండా, పవిత్రషిర్డీ ప్రదేశంలో, భక్తి భావం మాత్రమే కల సాయి భక్తుల సమక్షంలో మరణించగలిగాడు. అలా అంత్యకాలంలో భగవత్ స్మరణ చేస్తూ ప్రాణత్యాగాన్ని చేయగల సహాయాన్ని ఆ సన్యాసికి చేశాడు సాయి. సాయి తన తొలిమాటలలో ఈ సన్యాసితో వాడాలో ఎందరో దొంగలున్నారు, తలుపులకి గడియవేసుకోవలసిందని కూడా సూచించాడు. సాయి సంస్థానంలో కూడా దొంగలుగా భక్తులు ఉన్నట్లయితే ఇక ఆ సమాధి మందిరానికి పవిత్రత ఎక్కడున్నట్లు? భక్తుల్లో సత్‌ప్రవర్తన ఎక్కడున్నట్లు? అనిపిస్తుంది మనకి. సాయి మాట్లాడిన ‘దొంగలున్నారు–గడియవేసుకోవలసిందనే మాటలకి అర్థం ఉంది.వాడా అంటే ఈ శరీరమనీ, దానిలో దొంగలున్నారంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే పేర్లున్న ఆరుగురు దొంగలు ఉన్నారనీ, వాళ్లు అజాగ్రత్తగా ఉన్నవారి సంపదనంతా దోచుకుని పారిపోతారనీ ఆ మాటలకర్థం. కాబట్టి సాయి అతనిని ప్రాణ (వాయు) త్యాగం చేసేలా చేసి, అంత్యకాలంలో భగవత్‌స్మరణ ద్వారా మోక్షాన్ని కూడా ఇప్పించాడని చెప్పితీరాలి.
ప్రాణ(వాయు)త్యాగం
ఇక బాబా మరోవారం రోజులకి సమాధి అవుతారనగా కొందరు గ్రామస్థులు ఒక పులిని ఒక నాటుబండిలో బంధించి, సాయి దర్శనం కారణంగా దాన్ని జీవింపజేయాలనుకుని తెచ్చారు సాయి సమ్ముఖానికి. ఆ పులిని ఇలాగే ఒక బందిఖానా వంటి ఊచలున్న ఓ బోనులో బంధించి ఊరూరా దాన్ని తిప్పుతూ దానిమీద వచ్చే సొమ్ముతో జీవనాన్ని చేసుకుంటూ ఉండేవారు ఆ మనుష్యులు. బాగా వృద్ధాప్యం వచ్చి ఉండటం, అదీకాక ఆ పులి జబ్బుపడి ఉండటం, దాంతో ఏం చేయాలో తోచని స్థితితో పులి ముందుకీ వెనక్కీ వడివడిగా అడుగులేస్తూ అక్కడే తిరుగుతూ ఉండటం, బోను తలుపుగాని తీస్తే మీదపడి ఎందరి ప్రాణాలని తీస్తుందో లెక్కించలేని తనంతో జనం ఉండటం కారణంగా ఆ పులిని సాయి దర్శనానికంటూ తెచ్చారు. దీనిమీద మీరు సొమ్మును సంపాదించుకుంటూ దానికి ఏ మాత్రపు ఆరోగ్యపరిరక్షణనీ చేయకుండా దాదాపు విడిచేసినట్లున్నారే? అని సాయి మందలించాడు ఆ అంగడివాడ్ని. సాయికి పులిని చూపించే ఉద్దేశ్యంతో గొలుసులతో కట్టిఉంచిన ఆ పులిని సాయి ఎదురుగా ఉంచారు. పైకి బాగా కనిపిస్తున్నా దానికి మాత్రం జబ్బు ముదిరిన కారణంగా సాయి తానే ఆజ్ఞ చేశాడు పులిని తేవలసిందని. బాబాముఖ కాంతికీ తేజస్సుకీ తట్టుకోలేని పులి తనలోని చైతన్యాన్ని కోల్పోయి తలవంచి తెలివి తప్పి నేలమీద పడిపోయింది. సాయి ముఖాన్నే చూస్తూ తన తోకతో నేలని ముమ్మారు కొట్టి అంతలోనే ప్రాణ(వాయు)త్యాగం చేసింది పులి. ప్రాణవాయువుని తన అధీనంలో ఉంచుకున్న సాయి ఆ పులిని రక్షించలేకపోవడానికి కారణం... దానికి దైవాజ్ఞ ప్రకారం మరణం సిద్ధంగా ఉండి ఉండటమే. ఆ పులి తన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కారణంగా సాయిని చూస్తూ మరణించాల్సి ఉంది. అదే జరిగింది కూడా!యోగులూ సిద్ధులూ అయిన వారిని దర్శిస్తూ ఆ తన ప్రాణాలని విడిచినవాడు ఎంతటి ధర్మబద్ధుడో తెలియజేయడానికి సాక్ష్యం పులి. ఇంత శక్తిగల సాయి ప్రాణవాయువు తర్వాత అపానమనే వాయువు మీద ఎలా ఆధిపత్యాన్ని కలిగినవాడు అయ్యాడో తెలుసుకుందాం!
– సశేషం.
- డా. మైలవరపు శ్రీనివాసరావు
పంచ భూతాధికారి ప్రాణవాయువుపై పర్యవేక్షణ
Published Sun, Dec 2 2018 2:08 AM | Last Updated on Sun, Dec 2 2018 2:08 AM
Comments
Please login to add a commentAdd a comment