ఘోస్ట్ కారు | ghost car | Sakshi
Sakshi News home page

ఘోస్ట్ కారు

Published Sun, Jul 26 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

ఘోస్ట్ కారు

ఘోస్ట్ కారు

 కాలిఫోర్నియా, 1956.‘‘వావ్... ఏముందిరా ఈ కారు! నాకిదే కావాలి’’... ఎదురుగా కనిపిస్తోన్న స్పోర్ట్స్ కారుని చూసి మురిసిపోతూ అన్నాడు మైఖేల్. ‘‘అవున్రా. భలే స్టైల్‌గా ఉంది. ఇదే తీసుకో. ఇక ఈ రేసులో నిన్ను కొట్టేవాడే ఉండడు’’... ప్రోత్సహించాడు స్నేహితుడు జోనా. దాంతో మరీ హుషారొచ్చేసింది మైఖేల్‌కి. వెంటనే సేల్స్‌మేన్‌ని పిలిచి బేరమాడాడు. తనకు ఆ కారు కావాలని ఆర్డర్ ఇచ్చేశాడు. వారం తిరిగేసరికి ఆ కారు మైఖేల్ ఇంటి ముందుంది. మరో వారం రోజుల్లో జరిగే రేస్‌కి ముస్తాబయ్యింది.
 
    
 తన కొత్త కారులో కూర్చుని రేస్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు మైఖేల్. సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతడు ఇప్పటికే చాలా రేసుల్లో పాల్గొన్నాడు. చాలా వాటిలో విజయం కూడా సాధించాడు. అయితే ఎందుకో ఎప్పుడూ లేనిది ఈసారి చాలా ఉద్విగ్నతకు లోనవుతున్నాడు. ఇంతలో సిగ్నల్ వచ్చింది. రేస్ ప్రారంభమయ్యింది. తనదైన వేగంతో దూసుకుపోతున్నాడు మైఖేల్. అందరినీ దాటుకుంటూ ముందుకు పోతున్నాడు. మరో ఐదు నిమిషాల్లో గమ్యాన్ని చేరుకునేవాడే. కానీ అంతలో అనుకోకుండా జరిగింది ఓ సంఘటన.
 
  వేగంగా పోతోన్న కారు పట్టు తప్పింది. పల్టీలు కొట్టింది. గిరగిరా తిరుగుతూ వెళ్లి గోడకు గుద్దుకుని పచ్చడైపోయింది. క్షణాల్లో మైఖేల్ ప్రాణాల్ని గాలిలో కలిపేసింది. అందరూ అవాక్కయిపోయారు. కళ్లముందే ఓ మంచి రేసర్ ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. వార్త అందుకుని పోలీసులొచ్చారు. తమ డ్యూటీ తాము చేయడంలో మునిగిపోయారు. ‘‘ఇదిగో ఇటు చూడు... ఈ కారు గురించి నీకు తెలుసా? ఇది జేమ్స్ డీన్ కారు ఇంజిన్‌తో తయారు చేసింది. దీన్ని తయారు చేసిన ఇంజినీర్ నా బెస్ట్ ఫ్రెండ్. దీన్ని చేశాక నాకు చూపించాడు కూడా’’... యాక్సిడెంట్ అయిన కారును పరిశీలిస్తూ తన పక్కనున్న సబార్డినేట్‌తో అన్నాడు ఇన్‌స్పెక్టర్.
 
 ‘‘ఏమంటున్నారు సర్? జేమ్స్ డీన్ కారా? అతను కూడా ఇలాగే యాక్సిడెంట్లో...’’
 సబార్డినేట్ మాట పూర్తి కాకుండానే అవునన్నట్టు తలూపాడు ఇన్‌స్పెక్టర్. మరుక్షణం సబార్డినేట్ ముఖంలో రంగులు మారాయి. ‘‘ఇది చాలా విచిత్రంగా ఉంది సర్. అచ్చం డీన్ విషయంలో ఏం జరిగిందో ఇతని విషయంలోనూ అదే జరిగింది. కొంపదీసి ఇదంతా కారు వల్ల కాదు కదా?’’
 
 చురుక్కున చూశాడు ఇన్‌స్పెక్టర్. ఇంతవరకూ అతని మనసులో అలాంటి సందేహం కలగలేదు. అలా అని ఇప్పుడైనా సందేహ పడవచ్చో లేదో అర్థం కాలేదు. దాంతో ఓ క్షణం ఆలోచించి ఆ విషయాన్ని వదిలేశాడు. అలా వదలకుండా ఉండివుంటే ఆ తర్వాత జరిగే ఎన్నో అనర్థాలను అతడు ఆపగలిగి ఉండేవాడు. జేమ్స్ డీన్ శాపానికి గురి కాకుండా కొన్ని ప్రాణాలను నిలబెట్టగలిగి ఉండేవాడు. ఇంతకీ అసలు ఎవరా జేమ్స్ డీన్? ఏమిటా శాపం?
    
 జేమ్స్ డీన్... ఒకప్పుడు అమ్మాయిలంతా మనసు పారేసుకున్న హాలీవుడ్ నటుడు. ఎంతో అందంగా ఉండేవాడు. చలాకీగా కనిపించేవాడు. అతడు మాట్లాడితే అందరికీ వినాలనిపించేది. అతడు నవ్వుతుంటే అలా చూస్తూనే ఉండాలనిపించేది. జేమ్స్ కేవలం నటుడే కాదు... మంచి రేసర్ కూడా. చాలా రేసుల్లో పాల్గొన్నాడు. విజయాలనూ చవిచూశాడు. ముఖ్యంగా రేసుల కోసం అతడు ఎంచుకునే కార్లు అతణ్ని అందరిలోకీ ప్రత్యేకంగా నిలబెట్టేవి. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే కొనేసేవాడు. ఆ అలవాటే అతణ్ని ‘లిటిల్ బాస్టర్డ్’ని కొనేలా చేసింది.
 
 మార్కెట్లోకి ‘పోర్షా 550 స్పైడర్’ కారు కొత్తగా వచ్చింది. దాన్ని తయారు చేసిన జార్జ్ బ్యారిస్ ఆ కారుకి లిటిల్ బాస్టర్డ్ అని పేరు పెట్టాడు. దాన్ని ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు డీన్. దాన్ని చూసి చాలా మురిసిపోయాడు. కానీ ఆ కారే తన పాలిట శాపమవుతుందని అతడు ఊహించలేదు.  అది సెప్టెంబర్ 30, 1955. త్వరలో తాను పాల్గొనబోయే రేస్ కోసం ప్రాక్టీస్ చేసేందుకు తన ‘లిటిల్ బాస్టర్డ్’లో బయలుదేరాడు డీన్. అతడితో పాటు మెకానిక్, ఓ ఫొటోగ్రాఫర్, తాను అప్పటికి చేస్తోన్న ‘రెబెల్ వితవుట్ ఎ కాజ్’ చిత్ర స్టంట్‌మ్యాన్ బిల్ హిక్‌మ్యాన్ కూడా అతడితో ఉన్నారు.

కొంత దూరం వెళ్లాక నలుగురూ రోడ్డు పక్కన ఉన్న ఓ రెస్టారెంటు దగ్గర ఆగారు. అక్కడ బిల్ అన్నాడు... ‘‘చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నావు డీన్, అదంత మంచిది కాదు, కాస్త మెల్లగా నడుపు’. సరే అన్నాడు డీన్. కానీ మళ్లీ రోడ్డు మీదికి వెళ్లగానే ఆ మాట మర్చిపోయాడు. వేగాన్ని పెంచాడు. ఎంతో.. మరెంతో వేగంగా నడపసాగాడు. కొంత దూరం పోయాక మలుపు తీసుకునే క్రమంలో కారు అదుపు తప్పింది. ముందు వెళ్తోన్న ఓ కారును ఢీకొని నలభై తొమ్మిది అడుగుల ఎత్తుకు లేచి నేలమీద పడింది. డీన్ శరీరాన్ని పచ్చడి చేసేసింది. మిగతా వారి ఎముకలను ముక్కలు చేసింది. చరిత్రలో ఓ పెద్ద విషాదాన్ని లిఖించింది.  ఒక్క తప్పు చాలు... జీవితాలను సమాధి చేయడానికి. ఆ తప్పు డీన్ చేశాడు. అందుకే మిగతావారు ప్రాణాలతో బయటపడినా డీన్ మాత్రం మృత్యు ఒడికి చేరుకున్నాడు.

 అయితే కథ అక్కడితో ముగిసి పోలేదు. అక్కడే మొదలైంది. ప్రమాదంలో లిటిల్ బాస్టర్డ్ తుక్కు తుక్కు అయినా దాని ఇంజిన్ మాత్రం చెక్కు చెదరలేదు. దాంతో ఆ ఇంజిన్‌ని ఉపయోగించి మరో కారును తయారు చేశారు. దాన్ని మైఖేల్ కొన్నాడు. యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత కాస్త మాత్రమే పాడయిన ఇంజిన్‌ని రిపేర్ చేసి మరో కారుకు అమర్చారు. ఆ కారును ఓ డబ్బున్న వ్యక్తి కొనుగోలు చేశాడు. అతడు తన కుటుంబంతో పాటు ప్రయాణిస్తు న్నప్పుడు ఘోర ప్రమాదం జరిగింది. కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఇంజిన్ పూర్తిగా డ్యామేజ్ అయినా కారులోని మిగతా భాగాలు కొన్ని బాగుండటంతో వాటిని వేర్వేరు కార్ల తయారీలో ఉపయోగించారు.

విచిత్రమేమిటంటే ఆ కార్లు అన్నీ ప్రమాదానికి గురయ్యాయి. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరెందరినో జీవచ్ఛవాలుగా మిగిల్చాయి. దాంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇది కచ్చితంగా జేమ్స్ డీన్ శాపమే, అందుకే అతడి కారుతో సంబంధం ఉన్న ప్రతి వారూ ప్రాణాలు కోల్పోతున్నారు అనే నమ్మకం బలపడింది. కొందరైతే డీన్ దెయ్యమై ఆ కారును ఆవహించాడన్నారు. దాంతో లిటిల్ బాస్టర్డ్‌తో సంబంధం ఉన్న కార్లు, వాటి విడి భాగాలన్నిటినీ ఏరి ఓ చోట పడేశారు. వాటిని మళ్లీ ముట్టుకోకూడదని తీర్మానించుకున్నారు. అయితే ఇది నిజంగా డీన్ శాపమేనా అంటే అవును అని కచ్చితంగా చెప్పగలిగే వారు లేరు. కానీ శాపం కాకపోతే ఇంత మందికి ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న మాత్రం అడుగుతారు. దానికి సమాధానం చెప్పేవాళ్లు లేకపోవడంతో ఆ ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.
 
 మరణించడానికి రెండు వారాల క్రితమే ప్రభుత్వ రూపొందించిన ఓ యాడ్‌లో నటించాడు డీన్. ఆ యాడ్‌లో డీన్ ఓ మాట చెప్తాడు... ‘‘మెల్లగా డ్రైవ్ చేయండి. మీరు కాపాడే ఓ ప్రాణం బహుశా నాదే అయి ఉండొచ్చు, గుర్తు పెట్టుకోండి’’ అని. ఆ యాడ్ చూసి డీన్ అభిమానులు ఉర్రూతలూగారు. కానీ అతడు తాను చెప్పిన మాటల్ని తానే మర్చిపోతాడని, తన ప్రాణాలను పోగొట్టుకుంటాడని వాళ్లు ఊహించలేకపోయారు.
 
 - మీరా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement