తెల్ల దెయ్యం పూలు | Ghost white flowers | Sakshi
Sakshi News home page

తెల్ల దెయ్యం పూలు

Published Sat, Jan 28 2017 11:20 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

తెల్ల దెయ్యం పూలు - Sakshi

తెల్ల దెయ్యం పూలు

కథ

తెల్లపూలు గాలికి రెపరెపలాడుతున్నాయి. రివ్వున వీస్తున్న గాలి పూల మధ్యనుంచి మత్తుగా తూర్పు కొండల దిక్కు సాగుతోంది. తుమ్మచెట్ల దారి నుంచి రాళ్ళవంక పైకి చేరుకొని కట్ట దిగింది గుర్రమ్మ. ఆ మోట్లో మామిడిచెట్లకు కాపలాగా నులక మంచంపై కూర్చొని ఉండే తిరుమలయ్య తాత నోట్లో బీడీ పొగ పెడతాంది.‘మ్మీ... గుర్రమ్మ... ఏం యింత పొద్దున్నే పొలం దిక్కు పోతాండవే... ఏడి నీ మొగుడు గూడా వస్తాండడా...’ పలుకరించినాడు.గుర్రమ్మ ఏం జవాబు చెప్పలేదు.అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి.  చీర కాళ్ళకు తగులుకుంటూ మధ్య మధ్యలో విసిగిస్తోంది. కాళ్ళకు చెప్పులు కూడా లేవు.‘ఓయమ్మ! మాట్లాడేకి గూడా బరువైపోతాండేటట్లుందే... ఆ పక్కనేదో కొంపలు అంటుక పోతాండేటట్లు ఎగేసుకొని పోతాండవే...’ తిరుమలయ్య తాత బీడీ పొగ వదుల్తా వెటకారంగా వెక్కిరిచ్చినాడు.
గుర్రమ్మ వెనక్కి తిరిగి కూడా చూల్లేదు.రాళ్ళూ రప్పలూ, ముళ్ళూ ఏవీ చూసుకోవడం లేదు. పాదాలు వేగంగా ముందుకు పడ్తున్నాయి. సహదేవనాయుడి తోటలోంచి అడ్డదారి గుండా అటువైపుకి చేరుకుంది. అట్నుంచి గడ్డపైకెక్కి కిందకిదిగింది.

తెల్లపూలు మెరిసిపోతున్నాయి.కయ్యనిండా వేసిన తెల్లపూలు నవ్వుతూ పలుకరిస్తున్నాయి. వాటి కాయలు కలవరపెడ్తున్నాయి.పూలతోటనంతా కనులారా చూసుకుంది. కళ్ళనిండా కన్నీళ్ళు పొంగుకొచ్చాయి. అర చేత్తో తుడుచుకుంది. బాధ. గుండెల్ని పిండేసే దుఖ్కం. తన కుటుంబం గుర్తుకొచ్చింది. తన భర్త గుర్తుకొచ్చాడు. కూతురూ, కొడుకూ ఇద్దరూ గుర్తుకొచ్చారు. కళ్ళనిండా కన్నీళ్ళు పొంగుకొచ్చాయి. యిక ఆలస్యం చేయలేదు.ఒక్కొక్క మొక్కనూ పీకి పారేయ్యడం మొదలుపెట్టింది. ఏడుపు ఆగడం లేదు.కన్నీళ్ళు వాటికవే కార్తున్నాయి.ఒక మొక్క తర్వాత మరొకటి. దాని తర్వాత ఇంకొక్కటి. చేతులు వేగంగా ఆడిస్తోంది. విసుగూ, విరామం రెండూ లేవు. చేతులు బొబ్బలెక్కి పోతున్నా పట్టించుకోవడం లేదు.  పూల మొక్కలన్నీ పీకి నడి పొలం మధ్యలో కుప్పగాపోసింది. పూనకం వచ్చిన దానిలా! దేహమంతా చమటలు... గస.చిన్న ఎండు పుల్లలు ఏరుకొచ్చి కుప్పకింద పెట్టి నిప్పు రాజేసింది. పచ్చటి పొలాల మధ్యలోంచి ఎర్ర దుమ్ముతో నల్లటి పొగ చిటపటలాడుతూ రగులుకుంటూ గింగిరాలు తిరుగుతూ పైకి లేస్తోంది. తెల్లపూలు మాడిపోతున్నాయి.  కాయలు కందిపోయి వాసన వేస్తున్నాయి.కళ్ళముందు కాలిపోతున్న పూలమొక్కల్ని చూస్కొని కుదుటపడింది గుర్రమ్మ. గుండెల్లోని బరువు, భయం ఏదో తొలగిపోతున్న భావన. ప్రశాంతంగా పొలం గట్టుపై కూర్చొంది. కన్నీళ్ళు తుడుచుకుంది.

రెండోజుల్నుంచి పల్లెలో జరుగుతూ వస్తున్న విశేషాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. సర్పంచు తమ్ముడు సుబ్రమణ్యంను పోలీసులు పిల్చుక పోయారు. అలాగే ఎగువ ఇండ్లలోని రామరాజును పట్టుకపోయారు.పల్లెంతా భయంతో వణికిపోతోంది. ఎప్పుడు ఎవర్ని స్టేషనుకు రమ్మని కబురు పెడ్తారోనని బెంబేలెత్తి పోతున్నారు.

ఇంతకీ ఏం జరిగింది?
ఆర్నెల్ల క్రితం బెంగుళూర్నుంచి పల్లెలోకి ఒక కారు వచ్చింది. దాంట్లోంచి సర్పంచింటికి నలుగురు వ్యక్తులు వచ్చారు. రాత్రంతా మాట్లాడిన తర్వాత పగలు ఒక నిర్ణయానికి వచ్చారు.‘విత్తనాలు మేమే ఇస్తాం, పంట మేమే కొంటాం. మీరు పండించి ఇస్తే చాలు! మీకు రెండు చేతూల డబ్బు ముడుతుందని’ ఆశపెట్టారు.పల్లెలోవాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు ఎగాదిగా చూసుకున్నారు. మంచికైనా, చెడ్డకైనా సర్పంచయ్య ముందుకుంటాడు అనేది నమ్మకం. ఆయప్పనే ముందుకు నిలబడిన తర్వాత యింక మనకేమైతాది? అనే భరోసా.

‘అందరొద్దు గానీ నేను జెప్పినోళ్ళు నలుగురు వుండండి. ముందు పైలెట్‌ కింద పంట వేసి జూద్దాం.  బాగుంటే, మంచిగా గిట్టుబాటుంటే అప్పుడు అందరం వేసుకోవచ్చు’ తన మాటగా చెప్పినాడు సర్పంచయ్య.సర్పంచు తమ్ముడు సుబ్రహ్మణ్యం పైకి లేచి ఎగువిండ్ల రామరాజు, దిగువిండ్ల మేకల కృష్ణయ్య, జెండామాను సందులోని గౌస్‌ బాషా, రాయలసత్రం దగ్గరుండే మునిరత్నంలను ఈ పంట వేసేదానికి ఎంపిక చేసినాడు. మిగిలినోళ్ళు బయటికి వెళ్ళిపోయారు. చెప్పిన నల్గురూ ఒప్పుకున్నారు.బెంగుళూరు నుంచి వచ్చిన బానకడుపు మనిషి జారిపోతాండే బెల్టును సరిచేసుకుంటూ లేచి పంటను గురించి ఏదో చెప్పబోయాడు. ప్లాస్కులో టీ పట్టుకొచ్చాడు పనోడు.

‘న్నా! ఒక్క మాట అడుగుతా. ఇది గంజాయి సాగు కాదు కదా!’ భయం భయంగానే పైకి అడిగినాడు మునిరత్నం.  అరుగుమీద కూర్చొని వున్న సర్పంచయ్య నవ్వినాడు. అట్లే అందరూ కూడా. నిజానికి అక్కడ కూర్చున్న అందరిలో వున్న సందేహమే మునిరత్నం అడిగింది. కానీ అది బయటకు రానీయకుండా అందరూ తమ నవ్వు కింద కప్పిపుచ్చుకుంటున్న విషయం అర్థమౌతోంది. మునిరత్నం తల గోక్కున్నాడు.‘టీ తీసుకో రత్నం ఎందుకు భయపడ్తావ్‌... మేమందరం వుండాం గదా!’ సర్పంచ్‌ కాళ్లాడించుకుంటూ అన్నాడు. మునిరత్నం టీ గ్లాసు అందుకున్నాడు.‘ఇవి గసగసాల విత్తనాలు. వీటిని మీ పొలాల్లో కొద్ది భాగంలో సాగు చెయ్యండి. మామూలుగా దొరికే విత్తనాలు చల్లితే మొక్కలు రావు. ఇవి ప్రత్యేకంగా తెప్పించినవి. వీటినే చల్లాలి. పంట కోసం మీరు కొంత ఓపిక చేసుకోవాలి’ చెప్తున్నాడు బెంగుళూరు వ్యక్తి.టీ తాగుతూ అందరూ వింటున్నారు.

‘పంటకు తెల్లపూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. పచ్చికాయలకు గంటుపెట్టిన తర్వాత పాలు కారి నల్లబడ్తాయి. ఆ నల్లబడిన జిగురు మాకు కావాలి. అలాగే కాయలు కోసిన తర్వాత తీసివేసిన తొక్క కూడా కావాలి. దాన్ని ఎండబెట్టి పొడిచేసి మాకు ఇవ్వాలి. పొడి చేయడానికి కావలసిన మిషనరీ మేమే ఇస్తాం. కాయ లోపలుండే గింజలే గసగసాలు. అవి మీరు బయట అమ్ముకున్నా మాకభ్యంతరం లేదు. మాకే అమ్మినా కొంటాం. ఇలా వుంటుంది ఈ పని.’ తను చెప్పదల్చుకున్నది సూటిగానే చెప్పాడు బెంగళూరు వ్యక్తి. ‘గసగసాలు మీకమ్మితే కిలోకు ఎంతిస్తారూ?’ అడిగాడు దిగువ ఇండ్ల మేకల కృష్ణయ్య.

‘ఎనిమిది వందలు’ జవాబిచ్చాడు అతడు.‘ధరదేముండాదిలే... ఒక వంద అటో ఇటో తర్వాత మాట్లాడుకోవచ్చు’ సర్పంచయ్య మధ్యేమార్గంగా అన్నాడు.‘విత్తనాలు కారు డిక్కీలో వున్నాయి. లోపలికి తెప్పిస్తే పంపిణీ చేస్తాను’ సర్పంచు వైపుకు చూస్తూ అన్నాడు బెంగళూరు వ్యక్తి. సర్పంచు కనుసైగ చేశాడు.తమ్ముడు పనోళ్ళను పంపించి ఆ విత్తనాల సంచుల్ని లోపలికి తెప్పించాడు. ఐదుగురికి ఐదు సంచుల్ని పంచాడు.పేర్లు, ఫోన్ల నంబర్లు రాసుకున్నాడు.‘గసగసాల కాయల పొట్టుగానీ, జిగురుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటవాళ్ళకు ఇచ్చేదానికి ఒప్పుకోము. ముందే చెప్తావుండాము. తేడా వస్తే బాగుండదు!’ హెచ్చరిస్తా చెప్పినాడు బెంగళూరు వ్యక్తి.

వచ్చిన పని పూర్తయ్యింది.సర్పంచు సంతృప్తిగా చేతులూపినాడు.కారు కదలడానికి సిద్ధమైంది.‘భయపడాల్సిందేమీ లేదు. మీరు సాగు చేసేది కూడా పంటే. కాకుంటే కొంచెం పోలీసుల దృష్టిలో పడకుండా చూస్కోండి’ అనే మాట మాత్రం సూచనగా చెప్పాడు బెంగళూరు వ్యక్తి. కారు ముందుకు కదిలింది.అట్నుంచి అటే గసగసాల విత్తనాల సంచి భుజంపై పెట్టుకొని ఇంటికి చేరుకున్నాడు మునిరత్నం.  సర్పంచయ్య ఇంటి దగ్గర జరిగిన విషయమంతా తీరిగ్గా భార్య గుర్రమ్మకు చెప్పాడు.నాల్గు పచ్చ కాగితాలు చేతిలో మిగిలేటట్లు పంట సాగుకొస్తే తమ జీవితాల్లో కాస్తన్నా వెలుగు చూడాలనే కోరిక ఆమెది.రాత్రి పిల్లల్ని అటొక్కరిని ఇటొక్కరిని పడుకోబెట్టుకున్న తర్వాత పంట సాగు తర్వాత తమ చేతికి అందే సొమ్ము గురించి కలలు కంటూ నిద్రలోకి జారుకుంది.ఆకాశంలో నల్లమేఘాలు వెన్నెల చుట్టూ అల్లుకపోయాయి. తమ పొలంలోని ఒక కయ్యలో విత్తనాలు చల్లింది మొదలు నిరంతరంగా శ్రమిస్తూనే వున్నారు.కాలం తన చుట్టూ తాను తిరుగుతూనే తెల్లపూల చుట్టూ కూడా పరిభ్రమిస్తోంది. మధ్యమధ్యలో బెంగుళూరు నుంచి రెండు, మూడు సార్లు పొలంలో వేసిన గసగసాల సాగు గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూనే ఉన్నారు.మరో నెల రోజులు గడిచిన తర్వాత పల్లెలోకి పోలీసు జీపొచ్చింది.

కొత్తగా స్టేషనుకొచ్చిన ఎస్‌.ఐ.కి ఎవరో చెప్పారట – పల్లెలో గసగసాల సాగు చేస్తున్నారని!రచ్చబండ రావిచెట్లు మోట్లో జీపు ఆగింది. పల్లెలోని రైతులందర్నీ పంచాయితీకి రమ్మని దండోరా కొట్టించినారు.‘మీకు తెలిసి సాగు చేస్తున్నారో, తెలియక సాగు చేస్తున్నారో నాకు అనవసరం. గసగసాల సాగు చేయడం ఇక్కడ నేరం. ఈ పంట పండించాలంటే ప్రభుత్వ అనుమతి వుండాలి. అక్రమంగా ఎవరైనా సాగు చేస్తే కేసులు కడ్తాం. అరెస్టులు చేస్తాం. యిక మీ ఖర్మ!’ రచ్చబండ అరుగు పైకెక్కి ఎస్‌.ఐ. ఆవేశంగా చెప్తున్నాడు.రావిచెట్టు కొమ్మల్లోని పక్షులు కూత వేయకుండా నిశ్శబ్దంగా వున్నాయి. ఆకుల గలగల తప్ప మరే శబ్దం లేదు.‘గసగసాల కాయల పొట్టు మార్కెట్లో కిలో ధర నాలుగు వేలదాకా వుండొచ్చు. పచ్చికాయల జిగురు కిలో మూడు లక్షల దాకా పలుకుతోంది. మాదక ద్రవ్యాల ముఠాలు వీటితో మార్ఫిన్, ఓపియం వంటి డ్రగ్స్‌ తయారు చేస్తున్నాయి’ ఎస్‌.ఐ. చెప్పే మాట – ఆసక్తికరంగా జనం వింటున్నారు.

‘కర్నాటక రాష్ట్రం నుంచి ముఠాలు తిరుగుతున్నాయని మాకు అందిన సమాచారం. బెంగళూరు నుంచి ముంబై, గోవాల వంటి ప్రాంతాలకు ఈ డ్రగ్‌ మాఫియా విస్తరించి వుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఉచ్చుల్లో పడకండి’ ఎస్‌.ఐ. ఆవేశంగా హెచ్చరిస్తున్నాడు. దూరంగా అరుగుపైన కూర్చొని సర్పంచయ్య కూడా వింటున్నాడు. ఇంకాస్త దూరంలో కృష్ణయ్య, గౌస్‌ బాషా, రామరాజులందరూ ఈ మాటలు వింటున్నారు.దిగదాల బోరింగ దగ్గర కూర్చొని మునిరత్నం, గుర్రమ్మ కూడా మౌనంగా చూస్తున్నారు.పల్లె నిండా ఆవరించిన నిశ్శబ్దం.పోయిన వారం ఇంటి దేవత, గ్రామ దేవత బోయకొండ గంగమ్మకు మొక్కుబడి చెల్లించుకొని వచ్చిన దృశ్యమే గుర్రమ్మకు గుర్తుకు వస్తాంది. తన కుటుంబంతో పాటూ తల్లి దర్శనం చేసుకుంది. అక్కడే గుడి వద్ద వంట పాత్రలు అద్దెకు తీసుకొని వుండి వచ్చారు. తల్లి దగ్గరి రంగునీళ్ళ తీర్థం తీసుకొచ్చి పొలానికి చల్లుకున్నారు. ఆ తల్లి ఆశీస్సులతో పంట పొలాలకు చీడపీడలు తగలవని నమ్మకం. పోలీసులను చూస్తూ ఆ తల్లినే కాపాడమంటూ వేడుకుంది గుర్రమ్మ.

పోలీసు జీపు కదిలిపోతూ ఆగింది. సర్పంచు తమ్ముడు సుబ్రహ్మణ్యంను ఎస్‌.ఐ. పిలిచాడు. జీపులో వెనుక ఎక్కమన్నాడు. పల్లెంతా ఇప్పుడు గసగసాల సాగు గురించే మాట్లాడుకుంటున్నారు.నేడు సుబ్రహ్మణ్యం, రేపు రామరాజు, మర్నాడు క్రిష్ణయ్య తర్వాత తన వంతు అని లోలోపలే కుమిలి పోతున్నాడు – మునిరత్నం.రావి చెట్టు కొమ్మల్లోని పక్షులు రెక్కలు విప్పి ఎగురుతున్నాయి.రాత్రి గుర్రమ్మకు నిద్ర పట్టిందే లేదు.కాసేపు భర్తను, మరి కాసేపు పిల్లల్ని చూసుకుంటూ భయంతో, బాధతో సతమతమైంది.తనకి ధైర్యం లేదు కానీ లేదంటే నడిరాత్రే పొలం దగ్గరికి వెళ్ళాలనేంత కసి.కళ్ళు మూసుకుంటే కన్నుల నిండా కల్లోలం. కాళరాత్రి అంటే ఇలాగే వుంటుందా...
తను పుట్టి పెరిగిన మిట్ట చింతవారిపల్లెలోని తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. ఊరు, పేరు, కుటుంబ గౌరవం కళ్ళముందు మెదులుతున్నాయి. గుండె పగిలేంత బాధ.ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూ గడిపింది.అలసిన ఆలోచనలతోనే చీకటి దారిని దాటుకొని వెలుతురు ఉదయంలో ప్రయాణం మొదలుపెట్టింది.  ఉదయాన్నే ఎవరికీ చెప్పలేదు. ఎవరితో ఏమీ మాట్లాడలేదు.

ఒక నిర్ణయానికి వచ్చినదానిలా ముందుకు కదిలింది. తుమ్మచెట్ల దార్నుంచి రాళ్ళవంక దాటింది. సహదేవ నాయుడి తోట అడ్డదారి గుండా పొలానికి చేరుకుంది. కయ్యలో వేసిన గసగసాల పూల చెట్లన్నింటినీ ధ్వంసం చేసింది.తన చేతుల్తో తానే స్వయంగా పీకి కుప్పపోసి అగ్గిపెట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది.కన్నీళ్ళు తుడుచుకొని సాయంత్రానికి ఇంటిదారి పట్టింది.తనకిప్పుడు ధైర్యంగా వుంది.ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లుగా వుంది.గడప దగ్గర భర్త మునిరత్నం ఎదురైనాడు. తలొంచుకొని ఇంట్లోకెళ్ళింది.
మునిరత్నం ఏమీ అడగలేదు. కానీ గుర్రమ్మ తను ఉదయాన్నే పొలం దగ్గరికి వెళ్ళి చేసి వస్తున్న పనినంతా సూటిగా చెప్పింది. మునిరత్నం మండిపడ్డాడు.సర్పంచుకు ఎలా సమాధానమిచ్చుకోవాలో తెలియడం లేదన్నట్లు భగ్గున రగులుతున్నాడు. ‘కొంచెం ఓపిక పట్టివుంటే బాగుండునని’ దిగులు పడుతున్నాడు.బూడిద రంగు గసాల సాగుకోసం బతుకును బుగ్గిపాలు ఎవరు చేసుకొంటారు. కానీ నాల్గు నెలల్లోనే చేతికొస్తుందని సాగుకు పూనుకున్నాడు. ఇది నిషేధిత పంట అని తెలియదు. ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాళ్ళ గురి వుంటుందని తెలియదు. పోలీసులకు భయపడి గుర్రమ్మ చేసొచ్చిన పని మాత్రం కలవర పెడ్తోంది. కంపరంగా వుంది.
మునిరత్నం అసహనంగా ఉన్నాడు.

తిట్టాడు. అరిచాడు. కోప్పడ్డాడు. విసిరేశాడు. కొట్టడానికి వచ్చాడు.యిక చేసేదేం లేక మౌనంగా అలిగి అరుగుమీద కూర్చున్నాడు. ఇవేవీ పట్టించుకోకుండా గుర్రమ్మ వంట పనిలో నిమగ్నమై వుంది.నల్ల మందు మొక్కల తెల్ల దెయ్యం పూలు గుర్తొచ్చినప్పుడల్లా గుండెల నిండా భయం ఆవహిస్తోంది.గొంతు తడారి పోతోంది. కాసిన్ని నీళ్ళు తాగి నిమ్మళ పడుతోంది.ఇద్దరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని అన్నం వడ్డిస్తూ, తినిపిస్తూ ఆనందపడుతోంది. తమకు పట్టిన నరకం మబ్బు తొలగిపోయిందనే సంతోషం ఆమె ముఖంలో స్పష్టంగా కన్పిస్తోంది. బయట వెన్నెలను కమ్ముకున్న చీకటి నీడలు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి.నాల్గు పచ్చ కాగితాలు చేతిలో మిగిలేటట్లు పంట సాగుకొస్తే తమ జీవితాల్లో కాస్తన్నా వెలుగు చూడాలనే కోరిక ఆమెది.రాత్రి పిల్లల్ని అటొక్కరిని ఇటొక్కరిని పడుకోబెట్టుకున్న తర్వాత పంట సాగు తర్వాత తమ చేతికి అందే సొమ్ము గురించి కలలు కంటూ నిద్రలోకి జారుకుంది.ఆకాశంలో నల్లమేఘాలు వెన్నెల చుట్టూ అల్లుకపోయాయి.

పోలీసు జీపు కదిలిపోతూ ఆగింది. సర్పంచు తమ్ముడు సుబ్రహ్మణ్యంను ఎస్‌.ఐ. పిలిచాడు. జీపులో వెనుక ఎక్కమన్నాడు. పల్లెంతా ఇప్పుడు గసగసాల సాగు గురించే మాట్లాడుకుంటున్నారు.నేడు సుబ్రహ్మణ్యం, రేపు రామరాజు, మర్నాడు క్రిష్ణయ్య తర్వాత తన వంతు అని లోలోపలే కుమిలి పోతున్నాడు – మునిరత్నం.రావి చెట్టు కొమ్మల్లోని పక్షులు రెక్కలు విప్పి ఎగురుతున్నాయి. రాత్రి గుర్రమ్మకు నిద్ర పట్టిందే లేదు. కాసేపు భర్తను, మరి కాసేపు పిల్లల్ని చూసుకుంటూ భయంతో, బాధతో సతమతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement