'దెయ్యాలు మా కార్లలో రోజూ ఎక్కుతాయి'!
టోక్యో: ఇషినోమాకి.. ఇది జపాన్ లో 2011లో 30 అడుగుల ఎత్తు సునామీ అలల తాకిడికి నిండా మునిగిపోయిన నగరం. వేల సంఖ్యలో ఇక్కడ ప్రాణాలుకోల్పోయారు. సునామి సమయంలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లు కనిపించిన ఈ నగరం మళ్లీ ఊపిరి పోసుకొని మనుగడ ప్రారంభించింది. అయితే, ఆ నగరంలోని ట్యాక్సీ డ్రైవర్లను ఇప్పుడు ఒక సమస్య పట్టి పీడిస్తోంది. అదే దెయ్యాలు.
అవును.. తాము అప్పుడప్పుడు మనుషులనుకొని దెయ్యాలను ఎక్కించుకొని తిరుగుతున్నామని ఇషినోమాకి పట్టణంలో ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎంతో మంది క్యాబ్ డ్రైవర్లు ఇవే మాటలు చెప్తున్నారు. దీంతో అసలు ఆ విషయం ఏమిటా అని సెండాయ్ లోని తోహోకు గాకిన్ అనే విశ్వవిద్యాలయం, కెనడాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఆ ప్రాంతంలో పరిశోధనకు వెళ్లి ఇంటర్వ్యూలు చేశారు.
అనేకమంది క్యాబ్ డ్రైవర్లను ప్రశ్నించారు. ఆ సమయంలో వారు చెప్పిన పలు సమాధానాలు అధ్యయనకారులను ఆశ్చర్య పరిచాయి. తాము కార్లలో వెళుతున్నప్పుడు నిజమైన వ్యక్తుల్లాగే కనిపించిన కొందరు ఆపి ఎక్కుతారని, ప్రయాణం మధ్యలో వెనుక సీట్లోకి చూస్తే కనిపించకుండా పోతారని, ఇలా జరగడం తమకు తరుచుగా ఎదురవుతున్న అనుభవాలు అని చెప్పారు.
ఒక డ్రైవర్ అయితే 'నేనొకసారి ఒక మహిళను ఇషినోమాకి స్టేషన్లో ఎక్కించుకున్నాను. ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా మినమిహామాకు వెళ్లాలని చెప్పింది. ఆ ప్రాంతం సునామి దెబ్బకు తుడిచిపెట్టుకు పోయింది కదా అని నేను ప్రశ్నించాను. ఆ మాట విని ఆమె అయితే, నేను చనిపోయానా? అని ప్రశ్నించింది. ఆ మాట విని భయంతో వెనక్కి తిరిగి చూశాను. ఆమె ఆ సీట్లో లేదు' అని చెప్పాడు. ఇక మరో డ్రైవర్.. 'నేను కారు ఎక్కిన మనిషి చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లాను. అతడు చెప్పిన చోటు రాగానే వెనక్కి తిరిగి చూశాను. కానీ, అతడు కనిపించలేదు' అని చెప్పాడు. ఇలా అంతా ఇలాంటి అనుభవాలే చెప్పుకొచ్చారు.
అయితే, ఈ అధ్యయనం చేసిన వారు వారు చెప్తున్న దెయ్యాల అంశాలపై స్పందిస్తూ 2011, మార్చి 11న భూకంపం సంభవించి ఇషినోమాకిపై 30 అడుగుల ఎత్తు అలలతో సునామీ విరుచుపడిందని, ఆ దెబ్బతో దాదాపు 3,100మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించగా మరో 2,770 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ దృశ్యాలను స్వయంగా చూసిన వాళ్లలో ప్రస్తుతం డ్రైవర్లుగా పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు. ఆ సునామి వల్ల వారిలో ఏర్పడిన భయం ఓ రకమైన ఒత్తిడిగా మారి అవతలి వ్యక్తికి కనిపించనివి తమకే కనిపిస్తున్నట్లుగా భ్రమపడే ఓ వింత సమస్య నుంచి బాధపడుతున్నారని స్పష్టం చేశారు.