అది జపాన్‌లోని టోక్యోకు ఉత్తరం వైపున్న టొచిగి పర్వత ప్రాంతం.. అక్కడి కొండల మధ్యలో ఓ రాయి.. ఏముందీ కొండల్లో ఉండేవి రాళ్లే కదా అంటారా.. కానీ ఇది చాలా స్పెషల్. ఇప్పుడు అప్పుడు అని కాదు.. దాదాపు వెయ్యేళ్లనాటి చరిత్ర ముడిపడి ఉన్న ఈ రాయి మాత్రం జపాన్‌లో జనాలను వణికించేస్తోంది. రాయి ఏమిటి, వణికించడం ఏమిటో తెలుసా?
జపాన్ పురాణాల్లోని ఓ గాథ ఈ రాయి ఏమిటో చెప్తుంది. 1107–1123 సంవత్సరాల మధ్య జపాన్‌ను పాలించిన టోబా చక్రవర్తిని కొందరు కుట్ర చేసి చంపేశారు. అందులో ముఖ్యమైనది టమామో నోమీ అనే ఓ మహిళా మంత్రగత్తె. అయితే చక్రవర్తి మరణించాక ఓ యుద్ధవీరుడు టమామోను చంపేయగా.. వెంటనే ఆమె మృతదేహం ఓ పెద్ద రాయిగా మారిపోయిందట. ఆ రాయిని ఎవరు తాకినా చనిపోయేవారట. అప్పటి నుంచీ ఆ రాయిని ‘సెషో సెకి (కిల్లింగ్ స్టోన్) అని పిలవడం మొదలుపెట్టారు. మంత్రగత్తె ఆత్మ అందులోనే బందీ అయి ఉందని భావించేవారు. ఈ రాయి ఈ మధ్యే రెండుగా విరిగిపోయింది దీంతో ఆ దెయ్యపు మంత్రగత్తె బయటికి వచ్చేసిందంటూ.. అక్కడి జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇది అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The Sessho-seki, a famous rock in Nasu, Japan that was said to have imprisoned the evil nine-tailed fox demoness Tamamo-no-Mae, was found broken in half.
— Nick Kapur (@nick_kapur) March 6, 2022
After nearly 1,000 years, the demon vixen is presumably once again on the loose. https://t.co/Fz3yRLy4qQ
వెయ్యేళ్ల తర్వాత దెయ్యం బయటికి వచ్చేసిందని కొందరు అంటుంటే.. రాయి మధ్యలోంచి ఏదో బయటికి వచ్చినట్టుగా పగిలిందంటూ మరికొందరు సాక్ష్యం చూపుతున్నారు. ఏదో కీడు జరుగుతుందేమో అంటూ ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాయికి కొన్నేళ్ల కిందే పగుళ్లు వచ్చాయని, ఇటీవలి భారీ వర్షాలతో నీటి ప్రవాహం దెబ్బకు రాయి విరిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చిత్రమేమిటంటే.. ఈ రాయి ఉన్న చోటు ఓ పర్యాటక ప్రాంతం. ఇన్నాళ్లూ జనం బాగానే పోటెత్తేవారు. రాయి విరిగిందని తెలిసినప్పటి నుంచి అటువైపు చూడటమే మానేశారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment