మమ్మీ! దెయ్యం? | Mommy! The devil? | Sakshi
Sakshi News home page

మమ్మీ! దెయ్యం?

Published Tue, Mar 15 2016 5:46 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

మమ్మీ!  దెయ్యం? - Sakshi

మమ్మీ! దెయ్యం?

చేతనబడి
 
అమ్మ రారమ్మంటే పిల్లలు పరుగెత్తుకు వస్తారు
లకలక... అంటే దూరంగా పరుగెత్తుకుపోతారు
త్రివేణి ‘లకలక’మన్నప్పుడు పిల్లలు పారిపోయారు
‘మామూలయ్యాను’ రారమ్మంటోందిప్పుడు
‘నిజమేనా’ అన్నట్లున్నాయి వారి చూపులు

ఆ చూపులకు సమాధానం ఎవరు చెప్తారు?
 
‘అమ్మా! నువ్వు బాగయ్యావా!’ భయంభయంగా చూస్తూ అడిగాడు పదేళ్ల వినోద్. ఆ ప్రశ్నతో త్రివేణి ముఖం పాలిపోయింది. దగ్గరకు రమ్మన్నట్లు చేతులు చాచింది. వసంత్ కళ్లలో ఆందోళన. ఒక్క ఉదుటున అమ్మ దగ్గరకు వెళ్లబోతున్న తమ్ముడిని ఆపాడు. వెళ్లొద్దన్నట్లు కళ్లతోనే సైగ చేశాడు. అంతే... త్రివేణి కళ్లు జలపాతాలయ్యాయి. తానే లేచి వెళ్లి కొడుకులిద్దరినీ కౌగలించుకుని బావురుమన్నది.
 పిల్లలు త్రివేణి దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. పగలు ఈ మాత్రమైనా వస్తున్నారు. రాత్రి అమ్మ  దగ్గర పడుకోవడానికి భయపడుతున్నారు. ఎప్పుడూ అమ్మపక్కన నేనంటే నేనంటూ వచ్చే పిల్లలు... అమ్మ మీద చేయి వేసుకుని నిశ్చింతగా నిద్రపోయే పిల్లలు... ఇప్పుడు దగ్గరకు రావడానికే భయపడుతున్నారు. తనకేమైంది? త్రివేణికి గతం కళ్ల ముందు మెదిలింది.
   
గడచిన ఏడాది జూలై నెల. ఆరుద్రకార్తె రెండవ మంగళవారం. అనంతపురంలో శీతలయాడి జాతర జరుగుతోంది. బంజారాలకు అది పెద్ద వేడుక. తల మీద బోనాలతో రెండు వందల కుటుంబాలు జాతరలో పాల్గొన్నాయి. బ్యాండ్ మేళం ఊపందుకుంటోంది. త్రివేణి దేహంలో ప్రకంపనలు... బ్యాండు మేళం శబ్దానికి అనుగుణంగా కాళ్లుచేతులు కదలసాగాయి. ఆ తరవాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు. మరుసటి రోజు పరామర్శించడానికి వచ్చిన బంధువు ‘‘నువ్వు ఎప్పుడూ డాన్స్ చేయలేదు, నేర్చుకోలేదు కూడా. అయినా బీట్‌కి అనుగుణంగా అడుగులు భలే వేశావు. అయితే అంతలోనే పూనకం వచ్చినట్లు ఊగిపోయావు, దేవత పూనిందా’’ అత్యుత్సాహంతో అడిగిందామె. ఆ ప్రశ్నతోపాటు ఆమె మనసులో మాత్రం ‘దేవత పూనిందా, దెయ్యం పట్టిందా’ అనుకున్నది. అనుమానాన్ని బయటపడనివ్వకుండా ‘హారతి పట్టిన తరవాత మామూలయ్యావు’ అని కూడా చెప్పింది. ‘తనకేమయింది’ మొదటిసారిగా ఓ ప్రశ్న ఆమె మెదడులో. అప్పటి నుంచి వరుసగా వందలసార్లు అదే ప్రశ్న. తనను తాను ప్రశ్నించుకుంటోంది.
   
మధ్యాహ్నం మూడు గంటలు... ఇంట్లో త్రివేణి ఒక్కటే ఉంది. భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూల్‌కీ వెళ్లారు. ఇంట్లో ఏ వైపు నుంచి వస్తోందో కానీ, మల్లెపూల వాసన గుభాళిస్తోంది. ఇల్లంతా మల్లెలతో అందంగా అలంకరించినట్లుంది. ‘మల్లెలు ఎక్కడి నుంచి వచ్చాయి, నేనెప్పుడు అలంకరించాను’ అనే సందేహం తలలో గిర్రున తిరిగే లోపే కళ్లు వలయాకారంగా తిరిగిపోతున్నాయి. ‘లకలకలక’ అంటూ చంద్రముఖి సినిమాలో జ్యోతిక కళ్లు తిప్పినంత వేగంగా తిప్పుతోంది. స్కూలు నుంచి వచ్చిన పిల్లలు తల్లిని అలా చూడగానే భయభ్రాంతులయ్యారు. కొంతసేపటికి ఆమె మామూలయ్యింది. కానీ ఒంట్లో శక్తి అంతా ఎవరో తోడేసినట్లు మంచం మీద వాలిపోయింది. నాలుగైదు గంటలపాటు అచేతనంగా అలా పడి ఉంది. తండ్రి ఇంటికి వచ్చేవరకు భయంతో బిక్కచచ్చిపోయారు పిల్లలు. మెలకువ వచ్చిన తర్వాత త్రివేణికి ఇంటి వాతావరణంలో మార్పు కనిపించింది. మళ్లీ అదే ప్రశ్న... తనకేమైంది?
   
ఇదిలా ఉంటే త్రివేణికి దేవత పూనుతోందని తెలిసిన వాళ్లు ఇంటికి వస్తున్నారు. పూలుపండ్లు తెచ్చి పెట్టి పాదాలకు నమస్కరించి వాళ్ల సందేహాలు అడుగుతున్నారు. అలా ఎవరైనా రాగానే త్రివేణి దేవత పూనినట్లు మారిపోతోంది. మొదట్లో వారానికోసారి పూనిన దేవత, ఇప్పుడు రెండు గంటలకోసారి కనిపిస్తోంది. పూనకం వదిలిన తరవాత ‘బిడ్డలను దగ్గరకు తీసుకోలేని దైవత్వం నాకెందుకు’ అని త్రివేణి కుంగిపోతోంది.
   
ఓ రోజు త్రివేణి ఇంటి ఎదురుగా ఓ మాంత్రికుడు వచ్చి నిలబడ్డాడు. ఎంతకీ కదలడం లేదు. ‘మీ ఇంట్లో ఉన్నది దేవత కాదు, దెయ్యమూ కాదు, శని.’ అంటూ తొలిదెబ్బ వేశాడు. దెయ్యమా, దేవతా అనే సందిగ్ధంలో ఉన్న సంగతి ఈయనకెలా తెలిసింది అనే సందేహంతోపాటు ఆ మాంత్రికుడి మీద నమ్మకం కలుగుతోంది భరత్‌కి. ‘అష్టదిగ్బంధనం చేసి శనిని కట్టి పడేస్తాను’ అంటూ నవధాన్యాలు, నవరత్నాలు, తొమ్మిది కొబ్బరికాయలు, తొమ్మిది రాగిరేకులు, నిమ్మకాయలు తెప్పించాడు. ఇంటి ఆవరణలో నాలుగు మూలలు, నాలుగు దిక్కులతోపాటు ఇంటి మధ్యలో గుంత తీసి వాటిని పూడ్చాడు. భరత్‌కు దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చయ్యాయి. త్రివేణి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. తనకేదో అయిపోతోందన్న ఆందోళన ఆమెను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఓ రోజు అర్ధరాత్రి నరాలు బిగుసుకు పోతున్నాయి. చాలా సార్లు జనవిజ్ఞానవేదిక వాళ్లు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తండ్రి తన అత్తింటి వారిని బతిమాలుతున్న సంగతీ గుర్తొచ్చింది. భయంతో తండ్రికి ఫోన్ చేసింది. చచ్చిపోతానేమోనని భోరున ఏడ్చింది. ఇది జరిగిన నెల తర్వాత... చిన్న వాడు ‘అమ్మా నువ్వు బాగయ్యావా’ అని అడిగాడు.

మందుల పెట్టె తీసి చూపిస్తూ ‘ఈ మందులన్నీ వేసుకుంటున్నాగా, బాగయిపోయాను. బాగయిపోయానని డాక్టర్ కూడా చెప్పారు’ అని పిల్లలకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తోంది త్రివేణి. ‘ఇంకెప్పుడూ లకలక అనవుగా’ అనుమానంగా అడిగాడు వినోద్. ‘ఇంకెప్పుడూ అనను, కావాలంటే అన్నను అడుగు’ అంటూ పెద్దకొడుకు వసంత్‌ను చూసింది. పెద్దవాడివి కదా, నువ్వయినా అర్థం చేసుకోమనే అర్థింపు ఆమె కళ్లలో. అమ్మకు తగ్గిందోలేదో తెలియకపోయినా అమ్మ కళ్లలో అర్థింపు అర్థమైంది వసంత్‌కి. ‘అమ్మ ఇప్పుడు బాగుంది. భయపడొద్దు’ అని తమ్ముడికి ధైర్యం చెప్పాడు వసంత్.

నరాల బలహీనత ఆమెలో మానసిక స్థిరత్వలోపానికి కారణమైంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల ఆమె మరో పాత్రను ఆవహింపచేసుకోసాగింది. పూనకం వచ్చినట్లయి మరో పాత్రలోకి ప్రవేశించడం, కొంతసేపటికి మామూలవడం, వాతావరణ పరిస్థితులను బట్టి కొత్త పాత్రను ఆవహింపచేసుకోవడం ఇందులో ఉంటుంది. తండ్రి వచ్చి సైకియాట్రిస్ట్‌కు చూపించి మందులు వాడిన తర్వాత రెండు వారాల్లో త్రివేణి పూర్తిగా మామూలైంది. అయితే పిల్లలకు నమ్మకం కుదిరే వరకు ఆమె తల్లి మనసు వేదన తీరదు.
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 
దెయ్యం అన్నారు... దేవత అని కొలిచారు!
ఊరి చెరువు కట్ట కింద శ్మశానంలో ఓ మాంత్రికుడు ముగ్గుపోసి మధ్యలో పిండిబొమ్మ పెట్టి కోడిరక్తంతో తర్పణం చేశాడు. చేతబడి పోయిందని ఐదువేల రూపాయలు పట్టుకెళ్లాడు. కానీ త్రివేణిలో మార్పు రాలేదు. ఆంజనేయస్వామికి మొక్కితే దెయ్యాలు పోతాయని ఎవరో చెప్పారు. అది మరో మలుపు అవుతుందని ఆమె ఊహించనే లేదు. ‘ఈ అమ్మాయికి దెయ్యం పట్టలేదు, చేతబడి జరగలేదు. దేవత పూనుతోంద’ని చెప్పాడు పూజారి. ‘దేవత మొదటగా కనిపించింది శీతలయాడి జాతరరోజు. అక్కమ్మగార్లు పూనుతున్నారు’ అని తేల్చేశారు. ‘దేవత పునుతోందా... అయితే నేనేం చేయాలి’ త్రివేణిలో ఆందోళన.
 
ఓ రోజు ఉదయం పూజ పూర్తయ్యేలోపు త్రివేణిలో మార్పు వచ్చేసింది...  త్రివేణిని అలా చూస్తూనే ఆమె కాళ్ల మీద పడిపోయాడు భర్త భరత్. ‘నువ్వెవరమ్మా’ అనగానే ‘‘శీతలాదేవిని, అక్కమ్మ దేవతను నేనే. ఈ అమ్మాయి శుచిశుభ్రతతో చక్కగా ఉంది. నేనిక ఈ ఇంట్లోనే ఈమె ఒంట్లోనే ఉంటాను. నువ్వు తాకడానికి వీల్లేదు’’ అంది. భరత్‌కు జీవితం అగమ్యగోచరంగా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. ఎవరితోనూ చెప్పుకోకుండా ఉండలేని స్థితి. చేతికి రాగి కడియం వేస్తే దేవత రాదని చెప్పారెవరో. అదీ చేశారు. అయినా మార్పు రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement