అక్కడ శ్రీవారికీ... ఇక్కడ దేవేరికీ... | goddess padmavathi blesses devotees atop giant ratham | Sakshi
Sakshi News home page

అక్కడ శ్రీవారికీ... ఇక్కడ దేవేరికీ...

Published Sun, Sep 28 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

అక్కడ శ్రీవారికీ... ఇక్కడ దేవేరికీ...

అక్కడ శ్రీవారికీ... ఇక్కడ దేవేరికీ...

త్రేతాయుగంలో సీతగా, ద్వాపరయుగంలో రుక్మిణిగా, కలియుగంలో వేంకటపతి ప్రియపత్ని అలమేలుమంగగా శ్రీ పద్మావతి అమ్మవారు దివ్య దర్శనమిస్తూ భక్తకోటిని కటాక్షిస్తున్నారు. అలమేలు మంగమ్మను దర్శించుకున్న తర్వాతే లక్ష్మీపతి అయిన శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవాలని స్థలపురాణం చెబుతోంది.  తన నివాసమైన శ్రీనివాసుని వక్షస్థలాన్ని భృగుమహర్షి కాలితో తన్నడంతో అమ్మవారు అలకబూని, వైకుంఠాన్ని వీడి, పాతాళ లోకంలో కపిల మహాముని ఆశ్రయం పొందారు. తర్వాత కొల్హాపూర్‌లో శ్రీ మహాలక్ష్మిగా కొలువయ్యారు. కొల్హాసురుడనే రాక్షసుని కడతేర్చిభక్తులకు అభయమిచ్చారు.
 
 సిరుల తల్లి లేక వైకుంఠం వెలవెలబోయింది. స్వామి విరహ వేదనతో వైకుంఠాన్ని వీడి, భూలోనికి చేరాడు. ప్రియసఖి కోసం చెట్టూపుట్టా వెతికాడు. శేషాచల కొండల్లో సంచరించాడు. భూ వరాహ క్షేత్రం వేంకటాచలానికి చేరాడు. తన ధర్మపత్ని కొల్హాపూర్‌లో కొలువై ఉందని తెలుసుకుని అక్కడికి చేరాడు. పదేళ్ళపాటు కఠోర తపస్సు చేసినా క్షేత్ర మహిమ వల్ల ఆమె కలియుగాంతం వరకూ ప్రసన్నం కాదన్న ఆకాశవాణి ఉపదేశంతో సువర్ణముఖి నదీ తీరాన వెలసిన తిరుచానూరు క్షేత్రంలో మరో పన్నెండేళ్ల్లపాటు తపస్సు చేశాడు. పద్మ సరోవరంలో కార్తిక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వుపై ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మి కలువ పూలదండతో శ్రీనివాసుడిని అలంకరించటంతో ఆ దంపతులు తిరిగి ఒకటయ్యారు.
 
 నాటి అలమేలుమంగాపురమే నేటి తిరుచానూరు
 తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నదీ తీరాన తిరుచానూరు ఉంది. వాడుకలో మంగపట్నమనీ, అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తుంటారు. తమిళంలో అలర్ అంటే పుష్పం, మేల్ అంటే పైన, మంగై అంటే అందమైన స్త్రీ. పుష్పంపై వెలసిన దేవి అని అర్థం. శుకము అంటే చిలుక. చిలుకలా మృదువుగా మాట్లాడే వ్యాసమహర్షి కుమారుడు శుకమహర్షి నివసించిన ఊరు తిరుచానూరు. అందుకే ఈ క్షేత్రం తిరుశుకనూరుగానూ, ఆ తర్వాత తిరుచానూరుగానూ ప్రసిద్ధి పొందింది. చారిత్రకంగా శ్రీపద్మావతిదేవి 12వ శతాబ్దిలో అస్తిత్వంలోకి వచ్చారు. పద్మావతిని పద్మశాలీలు తమ ఇంటి ఆడపడచుగా భావిస్తారు. ఈ ప్రాంతంలో వస్త్ర వ్యాపారం చేసే శ్రీమంతులైన పద్మశాలీలు పద్మావ తి దేవి ఆలయ నిర్మాణం కోసం అన్నమాచార్యుల మనుమడైన తాళ్లపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20 వేల వరహాలు వితరణ చేసినట్టు శాసనం ఉంది. ఇరవై వేలకు పైగా జనాభా కలిగిన తిరుచానూరులో వందకుపైగా కల్యాణమండపాలు ఉన్నాయి. అమ్మవారి సన్నిధిలో ఏటా రెండువేలకుపైగా వివాహాలు జరుగుతాయి.
 
 ఆలయ నిర్మాణం... శిల్పశోభితం
 చారిత్రక ఆధారాల ప్రకారం ఇది మొదట పల్లవులు, తర్వాత చోళుల పరిపాలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాచీన శిల్ప శోభితంగా ఆలయ నిర్మాణం జరిగింది. తిరుచానూరు అమ్మవారి ఆలయాన్ని మూడు విభాగాలుగా చూడవచ్చు. మొదటిది అమ్మవారి ఆలయం, రెండోది కృష్ణస్వామి ఆలయం, ఇక మూడోది సుందరరాజస్వామి ఆలయం. అమ్మవారి ఆలయ ముఖద్వారం తూర్పుదిశలో ఉంటుంది. ఆగ్నేయమూలలో పోటు, అదే వరుస క్రమంలో వాహన మండపం, పరకామణి ఉన్నాయి. ముందుగా ధ్వజస్తంభం, తర్వాత ముఖమండపం, అంతరాళం ఉంది. అక్కడి ద్వారంపై అష్టలక్ష్మీమూర్తులు దర్శనమిస్తారు. అంతరాళం దాటి ముందుకు సాగితే గర్భాలయంలో సిరులతో దేదీప్యమైన దివ్యదర్శనంతో ప్రకాశించే శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించవచ్చు. గర్భాలయం వెనుక ప్రాంతంలో ప్రదక్షిణ మార్గం ఉంది. ఇక్కడి దక్షిణమార్గంలో విష్వక్సేనుడు, ఉత్తర దిశలో రామానుజాచార్యులవారిని దర్శించవచ్చు. వాయవ్యదిశలో ఆలయ విమాన గోపురంపై గల విమాన లక్ష్మీదేవి ఏడు కొండలపై వెలసిన స్వామిని చూస్తున్నట్టుగా కొలువై ఉంటారు.
 
 అమ్మ జన్మనక్షత్రంలో పంచమి తీర్థం
 కార్తిక శుక్లపంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలోని శుభలగ్నంలో పాతాళలోకం నుంచి శ్రీ మహాలక్ష్మి... శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పద్మసరోవరంలో అవతరించారు. ఇదే పుణ్యఘడియల్లో ‘పంచమి తీర్థ ముక్కోటి’ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించటం సంప్రదాయం. పంచమినాడు అమ్మవారి జన్మనక్షత్రం కావటం వల్ల ఆ రోజు స్వామివారు తిరుమల కొండ దిగి అమ్మవారిని అలంకరించి ఆనందింప చేస్తారని భక్తుల విశ్వాసం.
 
 స్వామి తన పట్టపు రాణి కోసం తిరుమల సన్నిధి నుంచి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పట్టుచీరలు, వజ్ర, వైఢూర్య, మరకత మాణిక్యాది ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, లడ్డు, జిలేబీ వంటి పణ్యారాలతో కూడిన సారెను పంపుతారు. శ్రీవారి సన్నిధి నుంచి అర్చకులు పాదచారులై కాలిబాట మార్గం నుంచి అలిపిరి తీసుకొస్తారు. అక్కడ నుంచి ఆలయ సంప్రదాయాలతో ఏనుగుైపై పురవీధుల్లో ఊరేగింపుగా తిరుచానూరుకు చేరవేస్తారు.
 
 అలమేలుమంగ ఉత్సవ వైభవం
తిరుచానూరు అమ్మవారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యారాధనలు, ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రతినిత్యం సుప్రభాత సేవతో ప్రారంభమై సహస్రనామార్చన, నివేదన, నిత్యకల్యాణం, సాయంత్రం వేళలో డోలోత్సవం (ఊంజల్‌సేవ) నిర్వహిస్తారు. రాత్రి ‘ఏకాంత సేవ’తో ఆలయ పూజాకైంకర్యాలు పూర్తి చేస్తారు.
 
 ఇక వారపు సేవలు, ఉత్సవాల్లో సోమవారం అష్టదళ పాద పద్మారాధన సేవ, గురువారం తిరుప్పావడ (అన్నకూటోత్సవం), శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. శనివారం పుష్పాంజలి సేవ నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం కల్యాణోత్సవానికి ముందు ‘లక్ష్మీపూజ’ నిర్వహిస్తారు. కల్యాణం తర్వాత ఆలయానికి దక్షిణ దిశలో ఉండే శుక్రవారపు తోటకు వెళ్లి అక్కడ పసుపు, చందనం ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గ్రామోత్సవం నిర్వహిస్తారు.
 
 అచ్చం శ్రీవారికి జరిగినట్లే..!
 ప్రతి ఏడాది కార్తిక శుద్ధ పంచమికి ముగిసేలా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల ఆలయ తరహాలోనే అమ్మవారు వివిధ రూపాల్లో వాహనాలపై పురవీధుల్లో ఊరేగుతూ, భక్తకోటిని కటాక్షిస్తారు. శ్రీవారి గరుడ వాహన సేవ ఊరేగింపు సంబరం ఏ స్థాయిలో జరుగుతుందో అదే తరహాలోనే ఇక్కడ గజవాహన ఊరేగింపు కూడా వేడుకగా సాగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందురోజు అమ్మవారికి లక్షకుంకుమార్చన సేవ నిర్వహించటం సంప్రదాయం.
 
 తిరుచానూరు శ్రీపద్మావతి తాయార్ల బ్రహ్మోత్సవాలు
 తేది        ఉదయం        రాత్రి
 
 19.11.2014    ధ్వజారోహణం    చిన్నశేషవాహనం
 20.11.2014    పెద్దశేషవాహనం    హంసవాహనం
 21.11.2014    ముత్యపు పందిరివాహనం    సింహవాహనం
 22.11.2014    కల్పవృక్షవాహనం    హనుమద్వాహనం
 23.11.2014    పల్లకీఉత్సవం    
 సాయంత్రం    వసంతోత్సవం    గజవాహనం
 24.11.2014    సర్వభూపాల వాహనం
 సాయంత్రం    స్వర్ణరథం    గరుడ వాహనం
 25.11.2014    సూర్యప్రభ వాహనం    చంద్రప్రభ వాహనం
 26.11.2014    రథోత్సవం    అశ్వవాహనం
 27.11.2014    చక్రస్నానం, పంచమీతీర్థం    ధ్వజావరోహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement