
న్యూఢిల్లీ: దేశంలోని ఓడరేవులను ఉగ్రదాడుల బారిన పడకుండా ఉంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 227 చిన్న ఓడరేవుల్లో కూడా ఇటీవల భద్రతా తనిఖీలను నిర్వహించింది. 26/11 నాడు ముంబైలో జరిగిన ఉగ్రదాడి ఘటనకు తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో..ఆదివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు దేశంలో ఓడరేవులు, తీరప్రాంతంలోని భద్రత గురించి మీడియాకు వివరించారు.
తీరప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన (ఇస్రో) సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. తీరప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బోట్లు, పెద్ద పెద్ద పడవలను కూడా ఉపగ్రహ చిత్రాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కాండ్ల, ముంబై, జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు, మార్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, పారదీప్, విశాఖపట్టణం, కోల్‌కతా, హల్దియా ఓడరేవుల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేసినట్లు తెలిపారు.