security check point
-
వాషింగ్టన్లో సాయుధుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లలో భాగంగా రాజధాని వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద వెస్లీ అలెన్ బీలెర్ (31) అనే వ్యక్తి శుక్రవారం ఆయుధంతో తిరుగుతూ పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడి కారులో నుంచి లైసెన్స్ లేని 9ఎంఎం హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెస్లీని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉగ్రవాదులతో అతడికి ఎలాంటి సంబంధాలు లేవని, తెలియకుండా ఆ ప్రాంతంలోకి వచ్చాడని నిర్ధారణ కావడంతో శనివారం విడిచిపెట్టారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడన్న ఆరోపణతో కేసు నమోదు చేశారు. భద్రతా సిబ్బందికి ఉచితంగా పిజ్జాలు జో బైడెన్ యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తారు. కొద్దిరోజుల క్రితం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అప్పటినుంచి ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది నిర్విరామంగా పహారా కాస్తున్నారు. వారి శ్రమను చూసి చలించిపోయిన ‘వి ద పిజ్జా’ అనే రెస్టారెంట్ ఉచితంగా పిజ్జాలు అందజేస్తూ అందరి మన్ననలు చూరగొంటోంది. సెక్యూరిటీ సిబ్బందికి భోజనం అందించడానికి రెస్టారెంట్ యాజమాన్యం ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తోంది. వి ద పిజ్జా ఔదార్యం చూసిన మరికొన్ని రెస్టారెంట్లు కూడా ఉచితంగా భోజనం అందించడానికి ముందుకొచ్చాయి. హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాల స్వాధీనం -
మాజీ సీఎంలకు మినహాయింపు లేదు
సాక్షి, అమరావతి: విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీల్లో మాజీ ముఖ్యమంత్రులకు మినహాయింపులేదని, చంద్రబాబును తనిఖీ చేయడంపై వాస్తవాలు తెలుసుకోకుండా రాద్ధాంతం సరికాదని ఐపీఎస్ అధికారి, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఐజీ ఇ.దామోదర్ చెప్పారు. ఈ విషయమై ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను మూడున్నరేళ్లు ఏవియేషన్ వీఐపీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసిన అనుభవంతో ఏవియేషన్ సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) చికాగో కన్వెన్షన్‌లోని 17వ అనుబంధం ప్రకారం సభ్యదేశాలు అన్నీ నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఐరాస సభ్య దేశమైన భారత్‌లో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. స్వతంత్ర సంస్థ అయిన స్టాండర్డ్స్ అండ్ రికమండెడ్ ప్రాక్టీసెస్ (ఎస్ఏఆర్పీఎస్) నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలకు 36/2005 సర్క్యులర్ కూడా జారీ అయిందని గుర్తు చేశారు. దీనిలో మాజీ ముఖ్యమంత్రులకు, జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన వారికీ కూడా విమానాశ్రయాల్లోకి ప్రవేశించే ముందు తనిఖీల నుంచి మినహాయింపు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఆమె కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసి మాజీ ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన తనిఖీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినా ఫలితం లేదని చెప్పారు. బీసీఏఎస్ తరహాలోనే నిబంధనలు పాటించే అమెరికాలోని ట్రాన్స్‌పోర్టు సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) నిబంధనల మేరకు అక్కడి విమానాశ్రయంలో గతంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాంను తనిఖీ చేశారని వివరించారు. అమెరికాలోని టీఎస్ఏ నిబంధనల ప్రకారం కేబినెట్ సెక్రటరీ అయినా, అమెరికాకు చెందిన అత్యున్నత మిలట్రీ అధికారులైనా విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు లేదని చెప్పారు. అలాగే మన దేశంలోని ఏ విమానాశ్రయంలోనైనా నిబంధనల ప్రకారం సోదాలు జరుగుతాయన్నారు. విమానాల సొంత యజమానులు అయినా, ప్రైవేటు ఆపరేటర్లు అయినా లోపలికి వెళ్లే ప్రతీసారి సీఐఎస్ఎఫ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేస్తారన్నారు. నిబంధనల ప్రకారం సోదాలు చేసిన గన్నవరం విమానాశ్రయంలోని సిబ్బందిని అభినందించాల్సిందిపోయి దాన్ని రాద్ధాంతం చేయడం అవగాహనలేమే అవుతుందన్నారు. మీడియా సైతం వాస్తవాలను గమనించి ప్రచారం చేయాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలు సరికాదని ఐజీ దామోదర్ సూచించారు. -
ఓర్నీ యాసాలో.. మళ్లీ మొదలెట్టేశార్రో..!
చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా.. ఎన్నో అనుమానాలు, సందేహాల మధ్య.. జీవీఎంసీలో కొందరు అధికారుల ‘పచ్చ’పాత కుట్రలతో ఎన్నికల్లో గట్టెక్కామనిపించుకున్న టీడీపీ నగర ఎమ్మెల్యేలు తమ పాత శైలినే అందిపుచ్చుకుంటున్నారు. తమ ట్రేడ్‌మార్క్ వెర్రివేషాలు, విన్యాసాలు మళ్లీ మొదలెట్టేశారు. అందులోనూ వెలగపూడి, వాసుపల్లిల ఓవర్ యాక్షన్ ఏపాటిదో నగర ప్రజలకు తెలియంది కాదు. ఒళ్లు తెలియకుండా నోటికొచ్చినట్టు బండబూతులు మాట్లాడే వెలగపూడి..చీప్ ట్రిక్కులు, చిల్లర వేషాలతో వాసుపల్లి చేసే విన్యాసాలు నగర ప్రజలకు కొత్తకాదు. అధికార మదంతో ఇప్పటివరకు విర్రవీగిన వీరిద్దరినీ ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఇక నుంచైనా ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తారని, ప్రజలతో మమేకమవుతారని అందరూ ఆశించారు. కానీ తమ నైజం మారలేదని వారిద్దరు శనివారం నిరూపించారు. ఎన్నికల తర్వాత ఇంతవరకు ప్రజాక్షేత్రంలోకి రాని.. వారి సమస్యలు పట్టని వీరు.. తమ అధినేతను ఎక్కడో ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసి అవమానించారంటూ గగ్గోలు పెడుతూ.. వీరావేశంతో చొక్కాలిప్పి గంతులేశారు. సాక్షి, విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే అదేదో మహాఅపరాధంలా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై విమానాశ్రయాల భద్రత పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్)తోపాటు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెంటనే వివరణ కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్ష నేతలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉండని స్పష్టం చేశారు. పౌర విమానయాన శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం విమానాశ్రయాల్లో చెక్ ఇన్ వద్ద తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రముఖుల జాబితా కూడా బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయినా సరే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చంద్రబాబుకు అన్యాయం, అవమానం జరిగిందంటూ ఊదరగొడుతూ వచ్చాయి. ఇక విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లిలైతే శనివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎయిర్పోర్ట్ నిబంధనలు తెలియని పార్టీ శ్రేణులకు సర్దిచెప్పాల్సిన ఎమ్మెల్యేలే చొక్కాలిప్పేసి, గొంతుచించుకుని గగ్గోలు పెట్టారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ చీప్ ట్రిక్స్ మొదలెట్టేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును నిబంధనల మేరకు తనిఖీ చేసి అవమానించారని గొంతు చించుకుంటున్న టీడీపీ నేతలు.. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్జగన్మోహన్రెడ్డి ఈ నిబంధనలను గౌరవించి.. విమానాశ్రయాల్లో తనను తనిఖీ చేసేందుకు సహకరించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ.. టీడీపీ ఎమ్మెల్యేల వెకిలి వేషాలను ఏవగించుకుంటున్నారు. -
నాడు ఒప్పు.. నేడు తప్పట!
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో నిబంధనల మేరకు చంద్రబాబుకు భద్రతా తనిఖీలు నిర్వహించడంపై టీడీపీ నానా యాగీ చేస్తోంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏ) నిబంధనలను అధికారులు పాటించినప్పటికీ టీడీపీ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. టీడీపీ అసత్య ప్రచారం, అనవసర రాద్ధాంతం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన కాన్వాయ్ నేరుగా విమానాశ్రయం రన్‌వే వరకు వెళ్లేది. సీఎం హోదాలో చంద్రబాబుకు తనిఖీలు లేకుండానే విమానంలోకి అనుమతించేవారు. ఆయన ప్రస్తుతం సీఎం కాదు. ప్రతిపక్ష నేత. దాంతో నిబంధనల మేరకు విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు చేయించుకుని వెళ్లాలి. ఆ ప్రకారమే అధికారులు విమానాశ్రయంలోని చెక్ ఇన్ పాయింట్ వద్ద చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతించారు. అనంతరం ఆయన ఇతర ప్రయాణికులతో పాటు బస్‌లో కాసేపు ప్రయాణించి విమానం వద్దకు చేరుకున్నారు. దీనిపై టీడీపీ నానా రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రముఖులకు మినహాయింపు లేదు విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపునిస్తూ బీసీఏ పేర్కొన్న జాబితాలో మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు, జెడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రముఖులు లేరు. ఆ మూడు కేటగిరీల పరిధిలోకి వచ్చే చంద్రబాబుకు భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు లేదన్నది స్పష్టమవుతోంది. ఎస్పీజీ భద్రత ఉన్న ప్రముఖులకు మాత్రమే విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, సోనియా కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంది. చంద్రబాబుకు ఉన్నది జెడ్ ప్లస్ భద్రత. ఆయనతో పాటు దేశంలోని మరికొందరు ప్రముఖులకు కూడా జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. వారికి విమానాశ్రయాల వద్ద భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు లేదు. విమానాశ్రయాల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు తనఖీలపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కచ్చితమైన నిబంధనలను రూపొందించింది. ప్రోటోకాల్, విదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, భద్రతా కారణాలతో 32 కేటగిరీలకు చెందిన ప్రముఖులకు విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చింది. వారిలో మాజీ సీఎంలు, ప్రతిపక్ష నేతలు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నవారు లేకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ గత ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నిబంధనలను కచ్చితంగా పాటించడం గమనార్హం. -
227 ఓడరేవుల్లో భద్రతా తనిఖీలు
న్యూఢిల్లీ: దేశంలోని ఓడరేవులను ఉగ్రదాడుల బారిన పడకుండా ఉంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 227 చిన్న ఓడరేవుల్లో కూడా ఇటీవల భద్రతా తనిఖీలను నిర్వహించింది. 26/11 నాడు ముంబైలో జరిగిన ఉగ్రదాడి ఘటనకు తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో..ఆదివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు దేశంలో ఓడరేవులు, తీరప్రాంతంలోని భద్రత గురించి మీడియాకు వివరించారు. తీరప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన (ఇస్రో) సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. తీరప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బోట్లు, పెద్ద పెద్ద పడవలను కూడా ఉపగ్రహ చిత్రాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కాండ్ల, ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్టు, మార్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, పారదీప్, విశాఖపట్టణం, కోల్‌కతా, హల్దియా ఓడరేవుల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేసినట్లు తెలిపారు. -
చెక్‌పోస్టుపై దాడి : 17 మంది మృతి
ట్రిపోలి: లిబియాలోని సుక్నా పట్టణంలో సెక్యూరిటీ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 17 మంది మరణించారు. మృతుల్లో 14 మంది భద్రత సిబ్బందితోపాటు ముగ్గురు పౌరులు ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. భద్రత సిబ్బంది అంతా 168వ ఆర్మీ బెటాలియన్‌కు చెందిన వారని తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఎవరు ప్రకటించలేదని చెప్పారు. లిబియా రాజధాని ట్రిపోలికి దాదాపు 165 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఇటీవల కాలంలో లిబియాలో ఉగ్రవాదులు మరింతగా పేట్రేగిపోతున్నారు.గత వారం ట్రిపోలికి 150 కిలోమీటర్ల దూరంలోని సిర్తే పట్టణంలో పవర్ ప్లాంట్ వద్ద పహారా కాస్తున్న భద్రత సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే.