విభిన్నం: వినోదాల రహదారి | Gurgaon turns Raahgiri Day into Holi-day | Sakshi
Sakshi News home page

విభిన్నం: వినోదాల రహదారి

Published Sun, Apr 6 2014 2:52 AM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

విభిన్నం: వినోదాల రహదారి - Sakshi

విభిన్నం: వినోదాల రహదారి

ఆదివారం వస్తే చాలు... ఆ వీధి ఒక ఆడిటోరియం, ఒక మైదానం, ఒక యోగా రూం, ఒక స్కేటింగ్ ప్లేస్. అక్కడికి కార్లు రావు. వాహనాలు తిరగవు. రోడ్డు మొత్తం జనంతో నిండిపోతుంది. అక్కడేమీ జాతర కూడా జరగదు. ఎవరికి నచ్చిన ‘వినోదం’ వారు పొందుతుంటారు. ఇది ఏ దేశంలో?... మనదేశంలోనే! ఏ ఊర్లో?... ఢిల్లీ పక్కనున్న గుర్గావ్‌లో!
 
 రచ్చబండ, ఇరుగుపొరుగు, కాలనీ స్నేహాలు... మెల్లగా కనుమరుగవుతున్నాయి. నిజానికి భారతీయులు కళలకు, వినోదానికి పెద్దపీట వేసిన వారు. జీవితం ఆస్వాదించడం అంటే మన తర్వాతే ఎవరైనా అన్నంత గొప్పగా బతికినవారు. కానీ తరాలు మారిపోయాయి. జీవితాలు మారిపోయాయి. కానీ ఆ మార్పు అంత బాగోలేదు. మనల్ని వేరే వారి నుంచే కాదు, మనల్ని మన నుంచే దూరం చేసే మార్పు అది. నేటి తరాలు క్రమంగా ఉద్యోగమే జీవితంగా గడిపేస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న భారతావని నేడు పట్టణాలకు తరలిపోవడమే దీనికి కారణం. వ్యవసాయ, గ్రామీణ దేశమైన భారత్‌లో ఏడాదికి కేవలం ఖరీఫ్, రబీ పనిదినాలు కలిపినా కూడా ఆర్నెల్లకు మించేవి కాదు. జీవితంలో సగం పని ఉంటే సగం వినోదం ఉండేది. ఇపుడు 365 రోజులు పనిలోనో, పనికి సంబంధించిన ఆలోచనతోనో గడిపేస్తున్నాం. ఉద్యోగం, పని నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పక్కింటి వారెవరో కూడా తెలియడం లేదు.
 
 ఈ పరిస్థితి మారడానికి గుర్గావ్ ప్రజలు ఒక మార్గం కనుక్కున్నారు. పక్కింటి వారినే కాదు... మన వీధిలోని వారితోనూ సంబంధాలు ఏర్పడే ఒక కొత్త సామాజిక విప్లవాన్ని తెచ్చారు. దానిపేరు ‘రాహ్‌గిరి డే’.
 
 లక్ష్యం:
 జనంలో సామాజిక సంబంధాలు పెంచడం. నడకను, సైక్లింగ్‌ను ప్రోత్సహించడం. నలుగురితో కలిసిపోయే భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుకోవడం.
 
 
 ఎలా:
 కొన్ని చక్కటి వీధులను ఎంపిక చేశారు. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి వాహనాలను ఆ రోడ్లలో అనుమతించరు. సైకిళ్లను మాత్రమే అనుమతిస్తారు.
 
 ఏం చేస్తారు:
 అందరూ ఇళ్లలోంచి వీధుల్లోకి వస్తారు. నచ్చిన పనులతో రిలాక్సవుతారు. కొందరు యోగా చేస్తారు. యోగా వచ్చిన వారు ఉచితంగా నేర్పిస్తారు. రాని వారు నేర్చుకుంటారు. సంగీతం వచ్చిన వారు కచేరి పెడతారు. ఆస్వాదించాలనుకునే వారు ఎంజాయ్ చేస్తారు. వచ్చిన వారు డ్యాన్స్ చేస్తారు. పిల్లలు స్కేటింగ్ చేస్తారు. ఆడుకుంటారు. పాడుకుంటారు. సామూహిక వంటకాలు చేసుకుంటారు. ఆ రోజే పండగలు వస్తే కలిసి పండుగలు జరుపుకుంటారు. కబుర్లు చెప్పుకునే వారు తమ పనిలో బిజీగా ఉంటారు.
 
 పర్యవేక్షణ:
 రాహ్‌గిరి డే కోసం గుర్గావ్‌లో స్వచ్ఛంద సంస్థలన్నీ ఒక్కటయ్యాయి. సామాజిక కార్యకర్తలు చేతులు కలిపారు. దీనికి నగర పాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అందరూ సహకరించారు.
 
 ఈ స్ఫూర్తి ఎక్కడిది?
 కొలంబియా రాజధాని బగోటాలో ‘సైక్లోవియా’ అనే కార్యక్రమం జరుగుతుంది. దీని అర్థం ‘సైకిల్ దారి’. సైకిల్ మాత్రమే తిరగడానికి అనుమతిస్తూ అక్కడ నిషిద్ధాజ్ఞలు విధిస్తారు. వారానికి ఒకరోజు ఇవి అమల్లోకి వస్తాయి. ఈ ప్రయోగం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. దీని స్ఫూర్తితో మరికొన్ని దేశాలు సమ్మర్ స్ట్రీట్స్, ఓపెన్ స్ట్రీట్స్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీని నుంచి స్ఫూర్తి పొందిన కొందరు వ్యక్తులు గుర్గావ్‌ని ఏకం చేసి ‘రాహ్‌గిరి డే’ ప్రారంభించారు. గత ఏడాది నవంబరులో పదో తేదీన మొదలైన ఈ ‘వారాంతపు సామాజిక వినోదాల వల్లరి’ 2014 మార్చి 30తో ముగిసింది. అంతకుముందు హోలీ ఆదివారమే రావడంతో ఆ వీధులన్నీ రంగులతో, సంతోషాలతో నిండిపోయాయి. అత్యంత విజయవంతంగా పూర్తయిన ఈ ప్రాజెక్టు కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement