క్యూట్ అప్‌డూ
సిగ సింగారం
ఈ హెయిర్ స్టయిల్‌ను ‘క్యూట్ అప్‌డూ’ అంటారు. ఇది ఎలాంటి డ్రెస్సుల మీదికైనా నప్పుతుంది. అంతేకాదు ఎలాంటి పార్టీలకైనా ఈ స్టయిల్‌ను నిశ్చింతగా వేసుకోవచ్చు. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండాల్సిన పని లేదు. కాబట్టి అందరూ హాయిగా ఈజీగా వేసుకోవచ్చు. ఈ క్యూట్ అప్‌డూ మీకు మంచి రాయల్ లుక్‌ను అందిస్తుంది. ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. వెంటనే ట్రై చేయండి మరి.
ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా ముందు భాగంలోని జుత్తు వెనక్కు రాకుండా ఏదైనా ప్లక్కర్ పెట్టేయాలి. ఆపైన వెనుక భాగం జుత్తుకు రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి.
ఇప్పుడు పోనీని మెలితిప్పుకోవాలి (కొద్దికొద్దిగా జుత్తును తీసుకొని ట్విస్ట్ చేసుకోవాలి). జుత్తు ఎంత పఫ్ఫీగా ఉంటే కొప్పు అంత అందంగా కనిపిస్తుంది. నుదురు దగ్గర జుత్తును కాస్తంత పఫ్ఫీగా పెట్టుకుంటే.. ముందు నుంచి హెయిర్ స్టయిల్ అదిరిపోతుంది.
ఆ పోనీని గుండ్రంగా చుడుతూ.. కొప్పులా చేసుకోవాలి.
తర్వాత కొప్పులో నుంచి జుత్తు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అలా అని కొప్పు మరీ టైట్‌గానూ ఉండకూడదు.
ఇప్పుడు నుదురు దగ్గర జుత్తును మూడు పాయలుగా తీసుకొని అల్లాలి. ఆపైన ఒక్కో అల్లికకు ఇరువైపుల నుంచి ఒక్కో పాయను తీసుకొని, జడలో అల్లుకుంటూ పోవాలి.
జడను కొప్పు వరకు అల్లి, చివరకు రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. జడను అల్లుకునేటప్పుడు, కొప్పు ఏమాత్రం కదలకుండా, వదులు కాకుండా చూసుకోవాలి.
తర్వాత ఆ జడ చివర్లలోని జుత్తును మెలితిప్పుకోవాలి.
ఆ మెలితిప్పిన జుత్తును కొప్పు చుట్టూ చుట్టాలి. మధ్యమధ్యలో జుత్తు చిట్లిపోకుండా హెయిర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి.
చివరగా కొప్పు వదులు కాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అవసరమనుకున్న ప్రతి చోటా స్లైడ్స్ పెట్టుకుంటే, కొప్పులో నుంచి వెంట్రుకలు బయటికి రావు. అలాగే, చివరికి మరోసారి హెయిర్ స్ప్రే చేసుకుంటే.. మీ హెయిర్ స్టయిల్ లుక్కే మారిపోతుంది. కావాలనుకుంటే హెయిర్ స్టయిల్ పూర్తిగా వేసుకున్నాక, ఏవైనా ఫ్లవర్ క్లిప్స్, స్టాన్ క్లిప్స్‌తో అలంకరించుకోవచ్చు. అప్పుడు కొప్పు మరింత అందంగా కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, క్యూట్ అప్‌డూ హెయిర్ స్టయిల్‌నూ మీరు వేసుకొని మురిసిపోండి.