బీటెక్ చదువుతున్న హ్యాపీ డేస్ అవి. కొత్తగా ఓపెన్ చేసిన ప్రసాద్స్ ఐమాక్స్ లోని స్కేరీ హౌస్ కి వెళ్లాలని కొద్ది రోజులుగా మా హాస్టల్ బ్యాచ్ అందరి కోరిక. మా గ్యాంగ్‌లో మేము మొత్తం పదిమందిమి. చిన్నపాటి ఆనందాలకి కూడా తెగ సంబరపడిపోయే బ్యాచ్ మాది. సరదా అయినా, షికారు అయినా అందరం కలిసే వెళ్ళేవాళ్ళం. మొత్తానికి అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఆదివారం నెక్లెస్ రోడ్‌లోని ఈట్ స్ట్రీట్‌కి వెళ్ళాము. అప్పుడే రిలీజ్ అయిన ఆనంద్ మూవీ ఎఫెక్టేమో! స్టీమ్‌దోశ, ఫిల్టర్ కాఫీ మాకు ఒక క్రేజీ కాంబినేషన్. ఈట్ స్ట్రీట్‌లో టిఫిన్ అయ్యాక, ప్రసాద్స్ ఐమాక్స్ వెళ్లాము. అద్దాలతో మెరిసిపోతోంది ఐమాక్స్. షాపింగ్ మాల్స్ అంటే ఇలా వుంటాయని అప్పుడప్పుడే తెలుసుకుంటున్న మాకు అది మరో ప్రపంచంలా కనిపించింది. కళ్ళు జిగేలుమనేలా చుట్టూ షాప్ ఔట్‌లెట్స్. మాల్ మొత్తం సుమారు ఒక గంటన్నర పాటు తిరిగి మా ఫైనల్ డెస్టినేషన్ అయిన స్కేరీ హౌస్ దగ్గరకు చేరుకున్నాం. అప్పటికే చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. ఒకపక్క నవ్వులు, మరోపక్క కేకలు అరుపులతో మొత్తం హడావుడిగా ఉంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా చకచకా టికెట్స్ తీసుకొని మేము కూడా క్యూలో నిలుచున్నాం. అప్పటి వరకు ధైర్యంగా వున్నా, హౌస్ లోపలి నుంచి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్‌కు, కేకలకు మా అందరిలో ఏదో మూల కొంచెం భయం మొదలైంది. అలా క్యూలో అరగంట గడిచింది. లోపలికి వెళ్ళడానికి మా ముందు ఇంకా రెండు బ్యాచులు మిగిలి ఉన్నాయి. అంతలో మానస ‘వామ్మో! నాకు మస్తు భయం ఐతాందే. నా వల్ల కాదు. నే డ్రాప్ ఐతా..’ ఏడుపు గొంతుతో అంది. దానికి అసలే భయం ఎక్కువ. ఏదో మేనేజ్ చేసి ఇంత దూరం లాక్కొచ్చాము. దాని మాటలకి రాధిక, శిల్ప కూడా వంతపాడారు.
‘ఒసేయ్ ఎంకి! లోపల ఉన్నవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్. మనుషులే దయ్యాల్లాగా ఉత్తుత్తి యాక్షన్. అంతా మనల్ని భయపెట్టడానికేనే’ ధైర్యం నూరిపోసింది లచ్చి. మృదుల, కన్య కూడా మానసని ఒప్పించడానికి వాళ్ల వంతు తంటాలు పడ్డారు. ఎలాగోలా మొత్తానికి మానసని ఒప్పించారు. మా మాటల్లో పడి క్యూ కదులుతున్న సంగతి కూడా మర్చిపోయాం. లోపలికి వెళ్లాల్సిన నెక్ట్స్‌ట్ బ్యాచ్ మాదే. డోర్ దగ్గర పొడుగ్గా ఒకతనునల్ల చొక్కా, నల్ల టోపీ వేసుకుని ఉన్నాడు. ‘లోపట మస్తు భయమేస్తదా ?‘‘గట్టిగ అరిస్తే జర సౌండ్ తగ్గించున్రి భయ్యా!!’..‘ఏ చోట ఎక్కువ భయం ఏస్తది ?’ ఇలా రాధిక కురిపించిన ప్రశ్నల వర్షానికి జవాబు అన్నట్టుగా స్కేరీ హౌస్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు అతను. సగం ధైర్యం, సగం భయంతో మేము ఒకరి చేయి ఇంకొకరం గట్టిగా పట్టుకుని లోపలికి వెళ్ళాము. డోర్ మూసుకుంది. అంతా మసక మసకగా ఉంది. అక్కడక్కడా లాంతరు వెలుగు మిణుకుమంటోంది. అంతలో ఎక్కడ నుంచి ప్రత్యక్షమయ్యాడో ఒకడు వికృతంగా నవ్వుతూ మాకు ఎడమ వైపున్న గోడను చూపించాడు. గోడపై ఏదో రాసుంది. మాకు ఆలోచించేంత సమయం ఇవ్వకుండా ఆ హౌస్ కథ అని వివరించాడు. అతను రక్త చరిత్ర రేంజ్ లో కథ చెప్తున్నా మాకు మాత్రం వినిపిస్తున్న సౌండ్ ఎఫెక్ట్స్‌కి చెమటలు పట్టేశాయి. ఒక్కసారిగా అరిచింది శ్రుతి. తన పక్కనే ఉన్న నా చేయి నలిపినంత పని చేసింది. ‘ఎ..ఎ... ఎముకల గూడు..’ వణుకుతూ అంది.ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి రైలు పెట్టెలులా ముందుకు కదిలాం. ఎదురుగా ఒక పెద్ద చెట్టు. దానిపై అస్థి పంజరాలు వేలాడుతున్నాయి. చెట్టు కింద ఒక ముసలివాడు పడుకుని మూలుగుతున్నాడు. మేము ముందుకు వెళ్లాలంటే అతన్ని దాటే వెళ్ళాలి. మా అందరిలోకల్లా కొద్దో గొప్పో ధైర్యం కొంచెం ఎక్కువున్న లచ్చి ముందుకు నడిచింది. అలా నడిచిందో లేదో, అతడు గబుక్కున లేచి కూర్చుని మంచంతో పాటు ముందుకు జరుగుతూ మమ్మల్ని అడ్డగించబోయాడు. నాకైతే పై ప్రాణం పైనే పోయినంత పనైంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాం. లోపలికి వెళుతున్నకొద్దీ చీకటి మమ్మల్ని మంచుపొరలా కమ్మేసింది.
తలో, ‘ఏయ్ వదులు... నా కాలు వదులు’ అంటూ హర్షిత కేక. తన కాలు ఎవరో పట్టుకున్నారు. భయంతో వాణ్ణి ఒక తన్ను తన్ని ఉరుకో ఉరుకు. అప్పటివరకు ఒకరినొకరం అంటి పెట్టుకునివున్న మేమంతా కూడా చెల్లా చెదురు అయిపోయాం. ఎక్కడ ఉన్నామో తెలియని అయోమయంలో ఉన్న నాకు, చేతికి ఏదో జుట్టులా తగిలేసరికి క్షణం పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మూసిన కళ్లు మూసినట్టే ఉన్నాయి. ఎటు కదలాలన్నా భయం. ధైర్యం కూడబలుక్కుని అక్కణ్ణుంచి పరుగులు తీశాను. చీకటిలో ఎటు వెళ్తున్నానో కూడా తెలియలేదు. ఎలాగోలా చివరకు ఒక తలుపు దగ్గరకు వచ్చాను. అది మూసి ఉంది. అంతలో, ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో, మర్రి ఊడల్లాంటి జడలతో ఒకడు భయపెడుతూ ఎదురొచ్చాడు. ఎటు వెళ్లాలో అర్థంకాక గట్టిగా కేకలు పెట్టాన్నేను. అంతలో వెనుక నుంచి సూపర్ వుమన్‌లా లచ్చి వాడిని ఒక్క ఉదుటున పట్టేసింది. వాడు వదిలించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. లచ్చి ఉడుం పట్టుకి వాడికి భయం వేసిందేమో...‘వదలవమ్మా తల్లే! నీకు దణ్ణం ఎడతా! నెక్ట్స్ బ్యాచ్ వచ్చేలోపు నే పోవాల. నా కొంప ముంచకు..’ అని గింజుకున్నాడు. ఒక్కసారిగా మమ్మల్ని కమ్మేసిన చీకటి పొరలు తొలగి వెలుతురు కనిపించింది. ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యిందని మాకు అర్థమయ్యేలోపు మేము స్కేరీ హౌస్ బయట వున్నాం. ఒక్కొక్కరుగా మా వాళ్ళందరూ బయటకి వచ్చారు. లచ్చి తన చేతిలో చింపిరి ఊడల జడ పట్టుకుని ఉంది.‘ఎక్కడ వాడు.. ఎక్కడ?’ అంటూ అటూ ఇటూ వెతికింది. దాన్ని అలా చూసి అందరం నవ్వాము. స్కేరీ హౌస్ బయట ఉన్నామని దానికి అర్థమవడానికి కొంత సమయం పట్టింది. లోపల జరిగింది మా వాళ్ళకి చెప్పా. అప్పటివరకు మాలో ఉన్న భయమంతా మా నవ్వులకి ఆవిరైపోయింది. లచ్చికి మేము పెట్టిన ‘జడల బొమ్మాళి’ అన్న పేరు, సోనీ కెమెరాలో బంధించిన ఆ క్షణాలు... ఎప్పుడు తలుచుకున్నా భలే నవ్వొస్తుంది.
– సుచిత్రారెడ్డి
జడల బొమ్మాళి
Published Sun, Nov 18 2018 1:53 AM | Last Updated on Sun, Nov 18 2018 1:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment