నేనంటే నాకు ప్రేమ
వివేకం
ప్రేమకి- ప్రేమించేది అలాగే ప్రేమించబడేది అనేవి రెండు కావాలి. అదెలా అంటే, నేను మాట్లాడాలనుకుంటే, మాట్లాడేందుకు నాకు ఒకరు కావాలి. నన్ను నేను ప్రేమిస్తున్నాను అనేది ఒక వెర్రి ఆలోచన. ఇది నేను నాతో మాట్లాడుకుంటాను లాంటిది. మీరు మీతో మాట్లాడుకుంటుంటే, ఒకటి రెండుగా మారుతుంది. ఇది ఒక మనిషిలో బాగా నాటుకుపోతే, అలాంటి వ్యక్తిని పిచ్చివాడని అంటాం.
ప్రేమకు రెండు కావాలి. ఎందుకంటే ప్రేమనేది ఒక రకమైన లావాదేవి. నన్ను నేను ప్రేమిస్తున్నాను అనే విషయమే లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటానికి మీరొక మార్గం కనిపెట్టడానికి కారణం-మీ చుట్టూ ఉన్నవారెవరితోనూ మీరు సంబంధం నెలకొల్పుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే, మీలో ఉన్న గాఢమైన ఒంటరితనపు భావనే.
ఎప్పుడైతే, నన్ను నేను ప్రేమిస్తున్నాను, అని మీరు అంటారో, ఇక మీరు ఎవరితోనూ సంబంధాన్ని నెరపాల్సిన అవసరం ఏర్పడదు. మరెవరినైనా ప్రేమిస్తే, దానికి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీలో కొంత భాగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. మీరు ఆ వ్యక్తి కోసం కొంత వెసులుబాటు కల్పించాలి. ఎప్పుడూ నిజంగా ప్రేమించని వ్యక్తులే, ప్రేమించడాన్ని ఒక సుఖం అనుకుంటారు. ప్రేమ, సుఖం కాదు; ప్రేమ మిమ్మల్ని మీరు ఓడించుకునే ఓ మార్గం. మీరెంతగా ప్రేమిస్తే, అంతగా మీరు నశిస్తారు. ఇందుకే ప్రేమలో పడటం అనే మాట వచ్చింది. ప్రేమలో ఎవరూ లేవరు; ప్రేమలో ఎవరూ పైకి పాకరు. మీరు ప్రేమలో పడతారు. ఎందుకంటే మీరు నేను అనుకునేది కనీసం కొంతైనా పడితేనే, అక్కడో ప్రేమ వ్యవహారానికి తావుంటుంది. మీరు మీలానే ఉంటూ ప్రేమించాలని ప్రయత్నిస్తూ ఉంటే, అసలేమీ జరగదు. మీరు ప్రేమని ఎప్పటికీ తెలుసుకోలేరు.
మీరు ఇతరులకు ఒక అంగుళం కూడా స్థలమివ్వకపోతే, అప్పుడే మీతో మీరు ప్రేమ వ్యవహారాన్ని మొదలుపెడతారు. ఆ తరువాత కొంతకాలానికి, మీరు రెండుగా అయిపోతారు, కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించడానికి ప్రయత్నించకండి. మరెవరినైనా ప్రేమించడానికి ప్రయత్నించండి. మనుషులు మరీ అసాధ్యులనిపిస్తే, ఒక కుక్కతో ప్రేమలో పడటానికి ప్రయత్నించండి. ఇప్పటికే చాలామంది మనుషులపై ఆశలు వదులుకుని, కుక్కల్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఒక కుక్క మిమ్మల్ని ఆదరించినట్టుగా మరెవరూ ఆదరించలేరేమో. మీరు ఇంటికి రోజుకు ఐదుసార్లు వచ్చినా, ఆ ఐదుసార్లూ అది మిమ్మల్ని అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలుకుతుంది. ఇలా మీకోసం మీ భార్య కానీ, మీ బిడ్డ కానీ ఎవరూ చేయరు. కాబట్టి మీకు ఇంకొకరు మీ మీద శ్రద్ధ చూపించాలని చాలా తీవ్రంగా అనిపిస్తోంటే, కుక్క మీకు చాలా మంచిది. ఒక కుక్కను ప్రేమించడానికి ప్రయత్నించండి. అందులో విజేతలైతే, అప్పుడు మనిషిని ప్రేమించడం మొదలుపెట్టండి. కానీ మిమ్మల్ని మీరు ప్రేమించే ప్రయత్నం చేయకండి. అది చాలా అర్థరహిత ఆలోచన. మిమ్మల్ని మీరు ప్రేమించలేరు. ఎందుకంటే మీలో మీరు ఇద్దరిని సృష్టించుకుంటారు. ఒకసారి ఈ రెండూ స్థిరపడిపోతే, ఇక మీరు మానసిక వ్యాధిగ్రస్తులవుతారు.
సమస్య - పరిష్కారం
ఆత్మహత్యాయత్నాలకు సంబంధించిన వార్తలు ప్రతిరోజూ పత్రికల్లో వస్తూంటాయి. వీటికి దారితీసిన పరిస్థితులు ఆర్థిక సంక్షోభం నుండి మానసిక కుంగుబాటు వరకూ ఉంటాయి. ఈ ఆత్మహత్య అనేది సమర్థనీయమేనా?
- జి.శ్రీనివాస్, వరంగల్
సద్గురు: మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతుంటే, తమ ప్రాణాలు తాము తీసుకోవాలనుకోవడం తగ్గుతుంది లేదా ఇది పూర్తిగా తొలగిపోవచ్చు కూడా.
జీవితం మనుషుల్ని ఎలాంటి విపరీత పరిస్థితుల్లోకి తోస్తుందంటే, ఆ క్షణంలో వారికి ఆ జీవన స్థితి కంటే కచ్చితంగా మరణమే మేలైందనిపించవచ్చు. దీన్ని కనుక ఆమోదిస్తే, ప్రతి చిన్న కష్టాన్ని విపత్కరమైన కష్టంగా భావించి, వాళ్లు వెళ్లిపోదామనుకుంటారు. కాబట్టి దీన్ని ఆమోదించే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆ ఆమోదాన్ని సాంఘిక, సామాజిక చేతనలోకి తీసుకొస్తే, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు తమను తాము అంతమొందించుకుంటారు.
మీరు జీవితాన్ని సృష్టించలేదు, కాబట్టి దాన్ని తీసుకునే హక్కు కూడా మీకు లేదు - ఆ జీవితం మీదైనా సరే, మరొకరిదైనా సరే. మీకు సృష్టించడం సాధ్యమయ్యేవరకూ, మీరు దాన్ని నాశనం చేయకూడదు. జీవిత పరిస్థితుల్ని తీసుకుంటే, కొన్ని బావుంటాయి. కొన్ని బావుండవు. కొన్ని ఘోరంగా ఉంటాయి. అయినా మీకు జీవితాన్ని తీసుకునే హక్కు లేదు, ఎందుకంటే మీకు దాన్ని సృష్టించే సామర్థ్యం లేదు కనుక.