నేను - కోతి - ఓ టపాకాయ్ | I - monkey - bomb | Sakshi
Sakshi News home page

నేను - కోతి - ఓ టపాకాయ్

Published Sun, Dec 14 2014 1:10 AM | Last Updated on Tue, Sep 18 2018 6:32 PM

నేను - కోతి - ఓ టపాకాయ్ - Sakshi

నేను - కోతి - ఓ టపాకాయ్

హైదరాబాద్‌లో రెండు దశాబ్దాలకు పైగా నివసించినప్పుడు బుక్కుల (పుస్తకాల) సరదా తీరింది కానీ మొక్కల సరదా తీరలేదు. ప్రతీ ఆదివారం ఆబిడ్స్ సర్కిల్‌కు పోయి నాలుగైదు పాత పుస్తకాలు కొని తెచ్చుకునేవాడిని. నా జీవితకాలంలో చదువుతానో లేదో కానీ వేలాది పుస్తకాలు సేకరించుకోగలిగాను. దాంతో పుస్తకాల పిచ్చి కొంత అదుపులోకి వచ్చింది. కానీ పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచాలనే సరదా మాత్రం హైదరాబాద్‌లో ఉండగా తీరలేదు.
 
వృత్తి వ్యాపకాల్లో మార్పుల కారణంగా ఇటీవల నా మకాం తూర్పుగోదావరి జిల్లాకు మారిపోయింది. ప్రస్తుతం ఉంటున్న గోకవరంలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. మేకల సంత, పశువుల సంత, కోళ్ళ సంత, కాయగూరల సంత కలగలిపి జరిగే ఈ సంతలోకి రాజమండ్రి సమీపంలోని కడియం, కడియపులంక తదితర ప్రాంతాల నుంచి పూలమొక్కలు, పండ్ల మొక్కలు తీసుకువచ్చి అమ్ముతుంటారు. దాంతో వాటిని కొని పెరట్లో పెంచుతూ చిన్నపాటి గార్డెన్ తయారు చేసుకోగలిగాను.
 
కాకపోతే ఏజెన్సీ ముఖద్వారంగా పిలువబడే గోకవరంలో కోతుల బెడద ఎక్కువ. కోతులు పందుల్లా గుంపులుగానూ, సింహంలా సింగిల్‌గానూ వచ్చి మరీ బొబ్బాసకాయలు, జామకాయలు కొరికిపడేస్తూ, పూలమొక్కల కొమ్మలు విరిచేస్తూ నానా హంగామా సృష్టిస్తుంటే ప్రాణం ఉసూరుమంటోంది. రాళ్ళు, కర్రలు, వేటలబారు వంటివి ఉపయోగించి బెదిరించినా, కొంత దూరం పారిపోయి మళ్ళీ వస్తున్నాయి.
 
దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తుండగా, చిన్న జీయర్‌స్వామి వారు చెప్పిన సలహా గుర్తుకొచ్చింది. హైదరాబాద్‌లో పాత్రికేయునిగా బతుకీడుస్తున్న రోజుల్లో ఒక ప్రముఖ దినపత్రికలో ‘ధర్మసందేహాలు’ అనే శీర్షిక నిర్వహించే భాగ్యం నాకు కలిగింది. పాఠకుల నుంచి ఉత్తరాల ద్వారా అందే ధర్మసందేహాలను క్రోడీకరించి స్వామివారి ఆశ్రమానికి పంపిస్తే, చిన్న జీయర్‌స్వామి వారు జవాబులు రాసి పంపించేవారు. కోతులను హింసించకుండా వాటి బెడద నుంచి ఎలా తప్పించుకోవాలని ఒక పాఠకుడు అడిగిన ప్రశ్నకు స్వామి వారు ఇచ్చిన జవాబు నాకింకా గుర్తుంది. ‘కోతులను బెదరించడానికి దీపావళి టపాకాయలు ప్రయోగించడం మంచి’దని ఆయన సలహా ఇచ్చారు. ఆ సలహా మొన్న దీపావళికి గుర్తుకొచ్చింది.
 
వెలిగిస్తుండగానే చేతిలో పేలిపోతాయనే భయం ఉండటం వల్ల సాధారణంగా నేను దీపావళి పటాసుల జోలికి వెళ్ళను. అయినా ధైర్యం చేసి సీమ టపాకాయలు కొనుక్కొచ్చాను. దీపావళి రోజున, ఆ మరునాడు కూడా కోతుల జాడలేదు. మూడో రోజున ఒక కోతి వచ్చి బొప్పాయికాయ కోసుకుని, గోడ మీద కూర్చుని తింటూ కనిపించింది. నేను సీమటపాకాయ్ కోతి మీద ప్రయోగించడానికి సిద్ధమయ్యాను. కొవ్వొత్తి కోసం వెదికితే సన్నగా కణికపుల్లలా, దాదాపు టపాకాయ్ సైజులోనే ఉన్న చిన్న కొవ్వొత్తి ముక్క దొరికింది.

ఒక చేత్తో సీమటపాకాయ్, మరో చేత్తో కొవ్వొత్తి పట్టుకుని వీధి అరుగుమీద నిలబడి, గోడమీద కూర్చున్న కోతి వంక చూసాను. వీడు నన్నేమి చేస్తాడులే అన్నట్లు అది నా వంక నిర్లక్ష్యంగా చూసింది. నాకు వళ్ళు మండింది. సీమటపాకాయ్ కాకుండా మిలటరీవాళ్ళు ఉపయోగించే హేండ్ గ్రెనేడ్ ఉండివుంటే ఆ కోతి అంతు చూద్దును కదా అనుకున్నాను. కానీ అలా లేకపోవడం కోతి అదృష్టం కాదు, నా అదృష్టమేనని మరుక్షణమే తెలిసింది. ఒక చేత్తో టపాకాయ్, మరో చేత్తో కొవ్వొత్తి పట్టుకున్న నేను టపాకాయ్ వెలిగించి దాన్ని గట్టిగా పట్టుకుని కొవ్వొత్తిని కోతివైపు విసిరేసాను. నాకు ఏమైందోనని కంగారుపడడం కోతివంతైంది!
 - యామన రంగారావ్ గోకవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement