వివరం: ఆత్మన్యూనత Vs ఆధిక్య భావన
ఆత్మన్యూనతా భావం ఎంతగా కుంగదీస్తుందో... ఆధిక్యభావన మనిషిని అంతగా ఎత్తి, కుదేస్తుంది! వ్యక్తిత్వం రూపుదిద్దుకునే క్రమంలో మనల్ని అనేక అనుభవాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటిల్లోంచి ఏర్పడే భావన... అది న్యూనత అయినా, అతి విశ్వాసంతో కూడిన ఆధిక్యభావన అయినా రెండూ నష్టం కలిగించేవే! తీవ్రమైన పరిణామాలకు దారి తీసేవే.
‘‘ఆ... మేం మీ అంత గొప్పవాళ్లం కాదు లెండి.’’
‘‘మీ అంత చదువుకున్న వాళ్లం కాదులెండి.’’
‘‘మీ అంత డబ్బున్నవాళ్లం కాదులెండి.’’
ఇలాంటి మాటలెప్పుడైనా మీరు విన్నారా? విన్నప్పుడు అందులో అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి ఆ మాటలంటున్న భావం ధ్వనిస్తే... ఆ వ్యక్తి కొద్దిపాటి ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నారన్నమాటే. అదే భావం మితిమీరిపోతే... అది మరింత అసమర్థతకు, ఒక్కోసారి ప్రమాదకరమైన డిప్రెషన్‌కూ దారితీయవచ్చు.
అసలేంటీ ఆత్మన్యూనతా భావం? దాని స్వరూప స్వభావాలు ఏంటి?
మనిషి స్వభావం, ప్రవర్తన, విలువలు, భావాలు, లక్ష్య సాధన యత్నాలు, ఇంకా అనేకానేక అంశాలు ఆ వ్యక్తికి తనపై తనకున్న నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి. ఓ వ్యక్తి జీవితాన్ని అతడి / ఆమె ఆత్మవిశ్వాసం కంటే మరేదీ ప్రభావితం చేయలేదంటే అది అతిశయోక్తి కాదు.
అందుకే ఒక వ్యక్తికి తనపైనా, తన తెలివితేటలపైనా, తన శక్తిసామర్థ్యాల పైనా నమ్మకం ఉండటం ఎంతైనా అవసరం. ఆ నమ్మకాన్నే ‘ఆత్మవిశ్వాసం’ అంటాం.
తనను తాను విశ్వసించని, తన సామర్థ్యాలపై నమ్మకం లేని, తనను తాను గౌరవించుకోలేని వ్యక్తి సమాజాన్ని నమ్మలేడు. సమాజం నమ్మకాన్నీ చూరగొనలేడు. దాంతో సమాజమూ అతడిని పెద్దగా పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ప్రతి వ్యక్తికీ ఆత్మవిశ్వాసం ఉండటం అవసరం.
ఈ ఆత్మవిశ్వాసం అనే భావనను కొందరిలో అధికంగానూ, మరికొందరిలో కాస్త తక్కువగానూ ఉండటం మనం చూస్తుంటాం. మన ప్రవర్తన, స్వభావం, భావోద్వేగాలూ... ఇవన్నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే అవన్నీ మళ్లీ ఆత్మవిశ్వాసంతో ప్రభావితం అవుతుంటాయి.
ఆత్మన్యూనత నుంచి బయటపడటం ఎలా?
ఓటమికి బీజం ఆత్మన్యూనత నుంచే పడుతుంది. అందుకే మనకు మనం విలువ ఇచ్చుకోవడం ఎంతైనా అవసరం. కొందరు తమను మరింత వినయంగా చూపుకోడానికి కాస్త తక్కువ చేసుకుంటుంటారు. ఇది మంచి గుణం అనుకుంటారు. నిజానికి ఎదుటివారిలో లోపాలను ఎత్తిచూపే వారిలోనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది.
అయితే అది ఎదుటివారిని కించపరిచే స్థాయిలో లేకుండా అలాంటి వారు నిత్యం సరిచూసుకుంటూ ఉండాలి. అలాగే మనలో ఆత్మన్యూనతను అధిగమించాలనుకున్నప్పుడు ముందుగా మన గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ లోపాలతో పాటు ప్రత్యేకతలూ ఏవో ఉంటాయని ముందుగా ప్రతి ఒక్కరూ నమ్మాలి. అప్పుడు చిన్న చిన్న విజయాలను లక్ష్యంగా చేసుకుంటూ తమ ప్రత్యేకతల ఆసరాతో వాటిని సాధిస్తూ పోవాలి. ఆ విజయాలను ప్రోత్సాహంగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రశంసలను స్వీకరించడం తప్పని అనుకోకూడదు. అయితే వాటిని మన పనితీరును మెరుగుపరచుకునేలా స్వీకరించడం మేలు. అవి ఆత్మతృప్తికి దారితీసి ప్రోత్సాహకరంగా మారతాయి. అయితే వాటిని స్వీకరించి, ఆ మత్తులో నైపుణ్యాలను మెరుగుపరచుకోలేకపోవడం సరికాదని గ్రహించాలి.
పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడం ఎలా?
ఆత్మవిశ్వాసానికి బీజం పసితనంలోనే పడుతుంది. అప్పటి సంఘటనలు, చుట్టూ ఉండే సమాజం... ఇవన్నీ ఆత్మవిశ్వాసానికి పునాది వేస్తాయి.
పిల్లలను మలచడంలో తల్లిదండ్రుల పాత్ర అందరికంటే ఎక్కువ. ఆ తర్వాతి భూమిక గురువు, తోడబుట్టినవారు, బంధువులు, స్నేహితులు. వీళ్లందరి సంయుక్త ప్రభావం పసివారిపై పడుతుంది. పసితనంలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఇతరులపై ఆధారపడి ఉంటారు. ఆ దశలో వారికి ప్రేమ, భద్రత, సాన్నిహిత్యం వంటి వాటిని అందివ్వడం పైన పేర్కొన్న అందరి బాధ్యత. వారందరి నుంచి లభించే సానుకూల (పాజిటివ్) ప్రభావం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక పని చేసినప్పుడు, ఒక దాన్ని స్వతంత్రంగా సాధించినప్పుడు లభించే చిన్నపాటి ప్రశంసను ఆ పిల్లవాడు తనకు తెలియకుండానే తనలో పాదుకొల్పుకోడానికి, దాన్ని అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాడు.
ఆ ప్రయత్నంలో తనకు ఏ విషయంలో ప్రశంస లభించిందో దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే పిల్లలతో వ్యవహరించే సమయంలో మనం ఇచ్చే ప్రశంసగాని, ప్రోత్సాహంగాని, మాటలు గాని పాజిటివ్‌గా ఉండేలా చూడాలి. దాంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ప్రేమ, ఉల్లాసభరిత వాతావరణం ఉండేలా చూడాలి. ఇలాంటి వాతావరణంలో పిల్లల వయసుతో పాటు వారి జీవితానుభవాలూ పెరుగుతాయి. ఈ అనుభవాలతో వారి ఆలోచనలు, భావాలు, ప్రవర్తనల్లో మార్పులు కలుగుతాయి. ఇవి సానుకూలంగా ఉన్నప్పుడు ఎదుటివారు కూడా సానుకూలంగానే ప్రతిస్పందిస్తుంటారు. ఇలాంటి స్పందన, ప్రతిస్పందనలే పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతుంటాయి. ఈ స్పందన, ప్రతిస్పందనల్లో పాజిటివ్ అంశాలు ఎంత ఎక్కువగా ఉంటుంటే... పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడం అంత ఎక్కువ. అందుకే ఈ విషయాన్ని గుర్తెరిగి తల్లిదండ్రులు ప్రవర్తించడం ఎంతో ముఖ్యం.
తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల్లో ప్రతిబింబించే తీరు
- తల్లిదండ్రుల ఓర్పు పిల్లలకు క్షమాగుణం,సహనం నేర్పుతాయి.
- తల్లిదండ్రుల ప్రశంస పిల్లలకు తమలోని ప్రత్యేకతలను గుర్తించేందుకు దోహదపడుతుంది.
- తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే భద్రత వారికి తమపైనా, సమాజంపైనా నమ్మకం కలిగించేలా చేస్తాయి.
- పిల్లలకు తల్లిదండ్రులందించే స్నేహం, ప్రేమించే తత్వం... వారికి ఇతరులను ప్రేమించే గుణాన్నీ, హాని చేయకూడదన్న విచక్షణను అలవరుస్తాయి.
క్లుప్తంగా చెప్పాలంటే మనం పిల్లల పట్ల ఏం చేస్తామో, పిల్లలకు ఏం అందిస్తామో మళ్లీ అదే మనం పిల్లలనుంచి తిరిగి పొందుతాం. అంటే పిల్లల ప్రవర్తనలో మనల్ని మనం ప్రతిబింబించుకుంటున్నామన్నమాట.
ఆధునిక జీవనశైలి కూడా ఒక కారణం
ఇటీవల ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక టెన్షన్, ఏవో చిరాకులు పరాకులూ ఉండనే ఉంటున్నాయి. ఆధునిక జీవనశైలిలోని ఒత్తిడులు, పోటీ తత్వం వంటి అంశాలు పెద్దలను ప్రభావితం చేస్తున్నాయి. దాంతో వాటిని పెద్దలు ఏదో ఒక దశలో పిల్లలపై ప్రదర్శిస్తుంటారు. ఫలితంగా పిల్లలు అయోమయానికి గురవుతుంటారు. వారి కోరికలను, అవసరాలను పెద్దల వద్ద వ్యక్తీకరించలేక ఒక రకమైన అసందిగ్ధతకు లోనవుతుంటారు. ఈ పరిస్థితుల్లో తాము భద్రమైన చోట లేమనీ, తమ శత్రువుల మధ్య ఉన్నామనే భావన వీళ్లలో కలుగుతుంది. తల్లిదండ్రుల ప్రవర్తనలో ప్రేమ కనిపించక, భద్రమైన భావన కనిపించక... తాము ప్రేమకు అనర్హులమనీ, చేతకానివారమనే భావనలు పెరుగుతాయి. అవి తమకు ఓటమి తప్పదనే భావనకు బదిలీ అవుతున్న కొద్దీ... అది ఆత్మన్యూనతకు దారితీస్తుంది. అందుకే ఆ దశ రాకుండానే పిల్లల పెంపకం సాగాలి.
అతి ఎప్పుడూ ప్రమాదమే...
అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం చాలా ప్రమాదమని గ్రహించాలి. తనను తాను ఇష్టపడటం, తనను తాను గౌరవించుకోవడం, తనను తాను ప్రేమించుకోవడం అవసరం. అది సెల్ఫ్ ఎస్టీమ్. అది మితిమీరిన ఆత్మవిశ్వాసంగా మారితే ప్రమాదం. తనను తాను అతిగా ప్రేమించుకునే ధోరణిని నార్సిజం అంటారు. గ్రీకు పురాణాల్లో నార్సిసస్ అనే ఒక అందమైన వ్యక్తి నీటిలోని తన అందమైన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, పరవశించిపోతూ దాన్ని కౌగిలించుకోవాలని ప్రయత్నిస్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోతాడు. ఈ వ్యక్తి పేరు నుంచి వచ్చిన పారిభాషికపదమే నార్సిజం. ఇలా తనను తాను ఎక్కువగా ప్రేమించుకుని, గొప్పగా ఊహించుకోవడం, తనకు తెలివితేటలు, అందం, వ్యక్తిత్వం వంటివి అన్నీ ఎక్కువని అతిగా ఊహించుకోవడం ప్రమాదం. ఇలాంటివారు క్రమంగా అహం, గర్వం, పొగరును పెంచుకుని ఇతరులను చులకన భావంతో చూడటం మొదలుపెడతారు. ఆత్మన్యూనతను తొలగింపజేసుకోడానికి చేయాల్సిన పని సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవడమే.
ఆత్మవిశ్వాసం ఉండే వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు:
- నిజాయితీ, సడలని పట్టుదల, విలువలకు కట్టుబడి ఉండే గుణం.
- తాము తీసుకున్న నిర్ణయాలకు తామే బాధ్యత వహించే తత్వం.
- తమ అభిప్రాయాలను ఇతరులు వ్యతిరేకిస్తారేమోనన్న భయం, జంకు లేకపోవడం.
- {పతి వ్యక్తిలోనూ కొన్ని లోపాలు సహజమనే విషయం తెలిసి ఉండటం.
- ఓటమినీ, వ్యతిరేకతలనూ జీవితంలో ఒక భాగంగా చూడగలిగే తత్వం. దాంతో వాటికి వెరవకపోవడం. అలాంటి అనుభవాలతో కొత్త పాఠాలు నేర్చుకుని ముందుకుసాగే తత్వం.
- సంతోషంతో పాటు, మానవ సహజ స్వభావాలైన కోపం, దుఃఖం మొదలైన భావోద్వేగాలనూ వ్యక్తీకరించగలగడం. దాంతో ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండటం. ఒక వ్యక్తి విజయానికి వెనక ఉన్న రహస్యం ఈ ఆత్మవిశ్వాసమే. ఇది పసితనంలోనే అలవడుతుంది.
ఇక పైన పేర్కొన్న అంశాలకు వ్యతిరేకమైనదే ‘ఆత్మన్యూనతాభావం’. అంటే... తమ పైనా, తాము చేసే పనుల ఫలితంపైనా తమకు నమ్మకం లేకపోవడం, తమను తాము ప్రేమించుకోలేకపోవడం. ఇలాంటివారు తాము అసమర్థులమని భావిస్తుంటారు. ఇతరుల ప్రేమకు అర్హుడిని / అర్హురాలిని కానంటూ భావిస్తుంటారు. ఆత్మన్యూనతకు గురయ్యేవారు ఓటమిని తమ చేతగానితనంగా అన్వయించుకుంటూ ఉంటారు. దాంతో ఎప్పుడూ ప్రతికూల ధోరణి (నెగెటివ్ నేచర్)తో ఉంటారు. ఏ పనినైనా మొదలుపెట్టే సమయంలో ఓటమి తప్పదనే భావనతో అసలు మొదలే పెట్టరు. ఒకవేళ సాహసించి మొదలుపెట్టినా ఓటమి భయం నిత్యం వెంటాడుతూ ఉండటం వల్ల దానిపై ధ్యాస నిలపలేరు. ఫలితంగా ఎక్కువ తప్పులకు ఆస్కారం ఉంటుంది. దాంతో తమ ప్రతికూల ఆలోచనా ధోరణిని మరింత బలపరచుకుంటూ ఉంటారు.
ఆత్మన్యూనతాభావం ఉన్న కొందరిలో కనిపించే అతి ఆత్మవిశ్వాస లక్షణాలు:
ఎదుటివారి ధోరణిని విమర్శించడం... ఎదుటి వారు తమ లోపాన్ని కనుగొనకముందే రక్షణాత్మక చర్యగా వారిపై విమర్శలకు పాల్పడుతుంటారు.
తాము అధికులమనే భావనను చూపడానికి ఖరీదైన దుస్తులను, తమ తాహతుకు మించిన వస్తువు లను ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రదర్శనా ధోరణి (ఆస్టేం టేషియస్ బిహేవియర్) ద్వారా తమలోని లోపాలను తేలిగ్గా బయట పడేసుకుంటుంటారు.
తమకు తెలియని పదాలను తప్పుడు అర్థంలో ప్రయోగిస్తుంటారు. దీన్నే పదడాంబికంగా చెప్పుకో వచ్చు. దీనిద్వారా తమ డొల్లదనాన్ని చెప్పకనే చెబుతుం టారు.
తమ పిల్లల గొప్పదనాన్ని తరచూ చెబుతుం టారు. సందర్భం లేకపోయినా... ఇలాంటి గొప్పలు చెప్పడానికి సందర్భాన్ని తామే కల్పిస్తుంటారు.
అప్పులతోనైనా ఇంట్లో విలాస వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. నిత్యం ఆర్థిక సమస్యలకు లోనైనా ఈ ధోరణి వీడరు. ఫలితంగా ఒక్కోసారి అవమానకరమైన పరిస్థి తులను ఎదుర్కొంటుంటారు.
ప్రవర్తనాపరంగా పెంచుకోవాల్సినవి...
ఆనందించడం ఆనందాలను ఇతరులతో కలిసి పంచుకోవడం ఇతరులను ప్రేమించడం, గౌరవించడం బాధ్యతగా ప్రవర్తించడం నిజాయితి నమ్మకాన్ని చూరగొనేలా వ్యవహరించే గుణం (ఇంటిగ్రిటీ) బ్యాలెన్స్ తప్పకుండా, పొల్లుమాటలు లేకుండా మాట్లాడటం పొగడ్తలనూ, విమర్శలనూ ఒకేలా స్వీకరించగలగడం.
స్వభావపరంగా అలవరచుకోవాల్సినవి...
ఇతరుల సమర్థత పట్ల నమ్మకం ఉంచుకోవడం, అలాగే... తన సమర్థత మీద కూడా నమ్మకం ఉంచుకోవడాన్ని నేర్చుకోవడం. ఒకవేళ పొరబాట్లు దొర్లినా తొలిదశలో అవి మామూలే అని ఓదార్చుకునే స్వభావాన్ని అలవరచుకోవడం.
పొరబాట్లనుంచి నేర్చుకోవడం, ఎదగడం.
నలుగురిలోకి చొచ్చుకుపోవడం, నలుగురితో సంబంధాలు పెంచుకోవడం.
తీసుకునే నిర్ణయాలకు బాధ్యత వహించడం.
అనుకున్నది చేయడం.
భావనపరంగా వ్యక్తీకరించాల్సినవి...
తన భావనలను స్వతంత్రంగా వ్యక్తపరచడం.
భావనల వ్యక్తీకరణలో నిజాయితీగా ఉండటం.
ఇతరులను భావాలను గౌరవించడం.
ఈ గుణాలను క్రమంగా అలవాటు చేసుకుంటూ ఉంటే క్రమంగా ఆత్మన్యూనతను అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు. అయితే ప్రయత్నపూర్వకంగా అలా చేయలేని సమయాల్లో సైకియాట్రిస్ట్ వంటి నిపుణులు/ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.
- డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై.,
సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం,
ఎర్రగడ్డ, హైదరాబాద్