టీవీక్షణం: యాంకర్‌గా ఫెయిలైందా?!
చాలామంది యాంకర్లు నటీమణులుగా కూడా అదరగొడుతుంటారు. కొందరు నటీమణులు యాంకర్లుగా మారి అలరిస్తుంటారు. అయితే అందరూ అన్నింట్లో విజయం సాధిస్తారని చెప్పలేం. కొందరు ఫెయిలవుతారు... ద్రష్టి ధామిలాగా.
టెలివిజన్ ప్రపంచంలో ద్రష్టికి ఓ స్థానం ఉంది. ఆమె చేసే సీరియల్‌కి ఆమె పోషించే పాత్ర పేరే ఉంటుంది. తనకిచ్చిన ఆ ప్రాధాన్యతను వృథా చేయదామె. అద్భుతంగా నటించి సీరియల్‌ని హిట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ‘గీత్’ చేసినప్పుడు అందరూ ఆ పేరుతోనే పిలిచారామెని. ఇప్పుడు ‘మధుబాల’ చేస్తుంటే మధుబాలా అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేస్తుంది. అందుకే మోస్ట్ వాంటెడ్ టెలివిజన్ యాక్ట్రెస్‌గా అవార్డులు అందుకుంది.
అయితే నటిగా ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ద్రష్టి... యాంకర్‌గా మాత్రం అట్టర్ ఫ్లాపయ్యింది. కలర్స్‌లో ప్రసారమవుతోన్న ‘ఝలక్ దిఖ్‌లాజా’ 7వ సిరీస్‌కి హోస్ట్‌గా ఎంపికైంది ద్రష్టి. అయితే ప్రేక్షకుల్ని అల రించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ఆమెను షో నుంచి తొలగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో ప్రముఖ యాంకర్ మనీష్ పాల్‌ని తీసుకున్నారు. ద్రష్టిని తీసేయడం ఆమె అభిమానుల్ని బాధించింది. కానీ ద్రష్టి మాత్రం తన ఓటమిని నిజాయతీగా ఒప్పుకుంది. ‘నా స్థానంలో వేరొకరిని తీసుకుంటున్నామని ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు నేనేమీ బాధపడలేదు, అందరూ అన్నీ చేయలేరు, నేను దీన్ని సరిగ్గా చేసివుండకపోవచ్చు, ఆ నిర్ణయం తీసుకునే హక్కు వారికుంది’ అంటూ నవ్వుతూ చెప్పింది. యాంకర్‌గా ఫెయిలైతేనేం... ఈ ఒక్కమాటతో వ్యక్తిగా డిస్టింక్షన్లో పాసయ్యింది!