అది ఆనంద్ ఇల్లు. వృద్ధులైన తన అమ్మా నాన్నా, తన భార్య, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్న హ్యాపీ హోమ్ ఆనంద్‌ది. ఒక హోమ్ హ్యాపీగా ఉండాలంటే ఏ డబ్బో, కారో, మోడ్రన్ గ్యాడ్జెట్సో ఉంటే సరిపోదు. తాను ఆనంద్ అని పేరు పెట్టుకున్నా సరే... ఆరోగ్యం లేనినాడు పైవన్నీ ఉన్నా ఆనందం ఉండదు. అన్నట్టు... ఎవరి వయసూ ఆగదు. ఆనంద్‌ది కూడా. ఆనంద్‌కు వయసుతో పాటు వచ్చే డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు రావచ్చు. వాటి కారణంగా వచ్చే గుండెజబ్బులు, బ్రెయిన్‌స్ట్రోక్ వంటి ముప్పు పొంచి ఉండవచ్చు. ఆనంద్ అమ్మా నాన్నా పెద్దవారు. కాబట్టి వారికి ఎముకలకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు ఉండవచ్చు. మహిళలకు ఉండే సాధారణ ఆరోగ్య సమస్యలైన గైనిక్ వంటివి ఆనంద్ తల్లికీ, భార్యకూ ఎదురుకావచ్చు.
ఆనంద్ కూతురు ఇప్పుడు టీనేజ్‌లో ఉండటం వల్ల యువతులు సాధారణంగా ఎదుర్కొనే రుతుసమస్యలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతుండవచ్చు. ఆనంద్ కొడుకుకూ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. మరి వాళ్ల సాధారణ సమస్యలన్నీ తీరాలంటే ఎలా? కుటుంబ సభ్యులందరూ ఇన్ని విభాగాల డాక్టర్ల దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండలేరు కదా. పైగా కొన్ని ప్రాథమిక అంశాలను ఒక్కో వ్యక్తికీ విపులంగా చెప్పడానికి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర తగినంత∙సమయం ఉండకపోవచ్చు. అందుకే అలాంటి పెద్ద పెద్ద హాస్పిటళ్లలోని పెద్ద డాక్టర్లందరూ మీ దగ్గరికే వస్తున్నారు. ఒక కుటుంబంలోని వారికి వచ్చేందుకు అవకాశం ఉన్న సాధారణ సమస్యల నివారణకు కొన్ని సూచనలు చేస్తున్నారు.
కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే ఊరు హెల్దీగా ఉంటుంది. ఊర్లో స్వస్థత నెలకొంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అలా దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే డాక్టర్ల సేవలకు సార్థకత. పేషెంట్ బాగుపడితే అదే డాక్టర్ సమర్థతకు చిహ్నం. అందుకే డాక్టర్స్ డే సందర్భంగా కొంతమంది డాక్టర్లంతా ఈ కథనం రూపంలో మీ ఇంటికే వస్తున్నారు. ఆనంద్‌లాంటి కుటుంబాలన్నీ ఆనందంగా ఉండటమే తమకు కావాల్సింది అంటున్నారు. ఇవి కేవలం ప్రాథమిక సూచనలు మాత్రమే. వీటిని పాటిస్తే... మీరు పేషెంట్ కావడం దాదాపుగా అసాధ్యమంటూ భరోసా ఇస్తున్నారు. మన ‘ఫన్‌డే’ ద్వారా ఇచ్చే ఈ సూచనలను మన ఫ్యామిలీ సభ్యులంతా పాటిస్తే... అదే తమకు నిజమైన డాక్టర్స్ డే అంటున్నారు. ఆ సూచనలు మీ కోసం...
గుండె
అకస్మాత్తుగా మరణాన్ని తెచ్చిపెట్టే అంశాల్లో గుండెపోటు ఒకటి. ఆందోళన పరిచే వ్యాధుల్లో గుండెజబ్బులు ముఖ్యమైనవి. వాటిని కేవలం కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో నివారించవచ్చు. ఆ సులభమైన మార్గాలను ఒకేచోట మీ కోసం అందిస్తున్ నాం.
♦ ఆహారంలో ఓట్ మీల్ తింటే మంచిది. పీచు ఎక్కువగా ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే
♦ స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, అవి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది
♦ డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరికే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్‌ల వల్ల ఉపయోగం లేదు
♦ విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో అతిగా పంచదార కలుపుకోకూ డదు. అసలు పంచదార లేకుండా తీసుకుంటే ఇంకా మేలు.
♦ సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
♦ బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది ∙టమోటాలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది.
♦ తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఫ్రిజ్‌లో నిల్వచేసిన పదార్థాల్లో 50–60 శాతం మేరకు పోషకాలు నశిస్తాయి. అందువల్ల పూర్తి పోషకాల కోసం తాజావి తీసుకోవడమే మేలు
♦ బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్‌నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది
♦ బీన్స్, బఠానీల లాంటి కాయధాన్యాల్లో కూడా కొవ్వు చేరనివ్వని బోలెడంత ప్రొటీన్ ఉంటుంది
♦ రోజూ నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండెజబ్బులు దాదాపు 20 శాతం తగ్గుతాయని ఓ అధ్యయనంలో తేలింది
♦ బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి
♦ అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్)లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. పీచు పదార్థం కూడా ఎక్కువే. కాబట్టి, అవి గుండెకు మంచిది
♦ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. అలాగే, యాపిల్ పండ్లు కూడా!
♦ సమతుల ఆహారం తీసుకోవాలి. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలి. చీటికీ మాటికీ ఏదో ఒకటి చిరుతిళ్లు పంటి కింద నమిలే అలవాటు ఉంటే మానేయాలి
♦ ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడకూడదు
♦ కోపం, ప్రేమ, విచారం, దుఃఖం వంటి భావోద్వేగాలను అణచుకోవడం అంత మంచిది కాదు. భావోద్వేగాలను అణచుకుంటే, ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ముప్పు ఏర్పడుతుంది ♦ వారానికి కనీసం ఐదు రోజులైనా, రోజుకు కనీసం 45 నిమిషాలపాటైనా గుండెపై ఒత్తిడి కలిగించని నడక, ఈత వంటి వ్యాయామాలు చేయాలి
♦ కంటినిండా నిద్రపోవడం కూడా గుండె ఆరోగ్యానికి ముఖ్యం. దీర్ఘకాలంగా నిద్రను అణచుకుంటూ ఉంటే, గుండె స్పందనల్లో లయతప్పే ప్రమాదం ఉంటుంది.
- డాక్టర్ హేమంత్ కౌకుంట్ల , చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ సెంచరీ హాస్పిటల్, హైదరాబాద్
మెదడు
మెదడుకు సంబంధించిన సమస్యల్లో ముఖ్యమైనది పక్షవాతం. ఇదిగాక మతిమరుపు, ఒక వయసు తర్వాత అలై్జమర్స్ వంటివి మామూలు. ఇలాంటి సమస్యలను నివారించడానికి గుండె విషయంలో పేర్కొన్న జాగ్రత్తలే చాలావరకు మెదడుకూ వర్తిస్తాయి. వాటితో పాటు ఈ కింది పేర్కొన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇవి మెదడును చురుగ్గా ఉంచడానికీ దోహదపడతాయి.
♦ ఆహారంలో చేపలు తీసుకోవడం అన్నివిధాలా మేలు చేసే అంశం. దాంతో పాటు మెదడు చురుకుదనానికీ ఇది బాగా దోహదపడుతుంది. పండు చేప / పంగుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్) వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ∙
♦ మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనెల్లో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్ట్రోక్), అలై్జమర్స్ వ్యాధులను నివారిస్తుంది ∙మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి
♦ ఇక కూరగాయలు, ఆకుకూరల విషయానికి వస్తే... పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. బీట్‌రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, వాటిని అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి
♦ వీటితో పాటు చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి.
మెదడుకు హాని చేసే ఆహారాలు : నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్న్‌డ్ సూప్స్ మెదడుకు హానికరంగా పరిణమిస్తాయి. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి ∙మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతో పాటు మెదడుకూ చేటు చేస్తుంది
♦ కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ కూడా పరిమితంగా వాడాలి
♦ ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడు స్థబ్దంగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరుపు) వంటి మెదడు సమస్యలకు దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి.
- డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి ,చీఫ్ న్యూరోఫిజీషియన్ సిటీ న్యూరో సెంటర్, హైదరాబాద్
కిడ్నీ
♦ డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచు కోవాలి. చక్కెర వ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా హెచ్‌బీ1ఏసీ (గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్) అనే పరీక్షను మూడు నెలలకు ఒకసారి చేయిస్తూ దాని ఫలితం 6.5 కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రక్తపోటు ఉన్నవారు తమ బీపీని నిత్యం 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమీ తినకముందు షుగర్ 100 ఎంజీ/డీఎల్ లోపల ఉండాలి. తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా చూసుకోవాలి ♦ రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే... మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి
♦ మన ఆహారంలో ఉప్పును పరిమితం చేసుకోవాలి. ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే బేకరీ ఆహారాన్ని, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు
♦ మూత్ర విసర్జన సమయంలో మూత్రంలో నురుగులా పోతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఇది ప్రోటీన్‌ను కోల్పోవడానికి సూచన.
కిడ్నీలో రాళ్ల నివారణ కోసం...
అందరికీ ఆరోగ్యాన్నిచ్చేవే అయినా కొందరికి అవి కాస్త ప్రతికూలంగా పనిచేస్తాయంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే పాలకూర వంటివి కొందరికి మాత్రం కిడ్నీలో రాళ్లను ఏర్పరచుతాయి. కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించండి.
♦ నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాల్సి ఉంటుంది కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది
♦ ఆహారంలో హై ప్రొటీన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి
♦ సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి
♦ క్యాల్షియం సప్లిమెంట్లను కారణం లేకుండా వాడకూడదు
♦ ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ
♦ కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు.
- డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి ,సీనియర్ నెఫ్రాలజిస్ట్ ,స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్
ఎముకలు
ఎముకలకు పటిష్టతను ఇచ్చేది క్యాల్షియమ్ అని తెలిసిందే. అది పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది.అయితే కేవలం క్యాల్షియమ్ తీసుకొని ఊరుకుంటే సరిపోదు. అది ఎముకల్లోకి ఇంకిపోయేలా చేయడానికి క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది.
లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయా మాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ∙యాభై ఏళ్ల వయసు దాటాక బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవడం అవసరం. అది డాక్టర్ల సూచన మేరకు చేయించుకోవాలి.
- డాక్టర్ సుధీర్‌రెడ్డి ,సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ,ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్
కడుపు
♦ ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది
♦ ఆహారాల్లో మసాలాలు తగ్గించాలి. వేపుళ్లు చాలా పరిమితంగా తీసుకోవాలి. ఉడికించిన పదార్థాలే కడుపు ఆరోగ్యానికి మేలు
♦ చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి
♦ స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి
♦ పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయాలి
♦ రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు
♦ రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి
♦ రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి
♦ రాత్రి నిద్రకు ముందర రెండు గంటల పాటు ఏమీ తినకూడదు
♦ కంటినిండా నిద్రపోవాలి
♦ డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తే తప్ప నొప్పి నివారణ మందులు తీసుకోకూడదు.
- డాక్టర్ భవానీరాజు ,సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
కాలేయం
♦ మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. ప్రతి వారానికి అర కిలో నుంచి కిలో బరువు తగ్గించుకునేలా శ్రమించాలి ♦ ♦ పొట్టుతో ఉండే తృణధాన్యాలు ఎక్కువగా వాడండి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా తీసుకోవాలి
♦ డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోండి
♦ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించుకోండి. దీనికి వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాల్సి ఉంటుంది
♦ ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే దానికి దూరంగా ఉండండి
♦ కాలేయాన్ని కాపాడుకునే అంశాల్లో ముఖ్యమైనది ఏమిటంటే... ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఎప్పుడూ వాడకూడదు.
కన్ను
♦ మంచి చూపు కోసం విటమిన్–ఏ పుష్కలంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరలు తీసుకోవాలి. వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం కంటికి రక్షణ కలిగించడమే కాదు... చూపు పదిలంగా ఉంచడానికి దోహదపడుతుంది
♦ ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మిట్ట మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకపోవడం మంచిది
♦ వీలైనంత వరకు కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది. అలాగే పుష్కలంగా నీళ్లు తాగుతూ ఉండాలి
♦ తరచూ కంటి పరీక్షలు చేయించుకోండి. తీక్షణంగా ఎండల్లో తిరిగేవారు తప్పనసరిగా తరచూ కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
♦ మంచి మేలైన ప్రమాణాలతో ఉన్న సన్ గ్లాసెస్ వాడటం ద్వారా తీక్షణ కాంతితో పాటు అనేక దుష్ప్రభావాలనుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్– గ్లాసెస్ వల్ల కన్ను మరింతగా తెరచుకుని చూడటంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే మంచి ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్ వంటి మెటీరియల్‌తో తయారైన మేలైన సన్‌గ్లాసెస్ వాడాలి.
♦ నీలం రంగులో ఉన్న కళ్లద్దాలు వాడకండి. నీలం రంగు కళ్లకు మంచిది కాదు.
♦ ఫ్రేమ్ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్ పేరిట ఫ్రేమ్ తక్కువగా ఉండే వాటికంటే... ఒకింత ఫ్రేమ్ ఎక్కువగా ఉండే గ్లాసెస్ మరింత మేలు చేస్తాయి.
- డాక్టర్ రవికుమార్ రెడ్డి ,సీనియర్ ఐ స్పెషలిస్ట్ ,మెడివిజన్ హాస్పిటల్, హైదరాబాద్
మహిళల ఆరోగ్యం
♦ యువతులు తమ రుతు సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. రుతుస్రావంతో వారు చాలారక్తాన్ని కోల్పోతారు. దాంతో వారిలో ఐరన్ తగ్గి అనీమియా కనిపించడం సాధారణం. అందుకే టీనేజ్‌నుంచే ఆడపిల్లలు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
♦ స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకోడాన్ని బీఎస్‌ఈ అని వ్యవహరిస్తారు. బిఎస్‌ఇ అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇరవై ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ నెలకోసారి బిఎస్‌ఈ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా పసిగట్టి చికిత్స చేయించుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.
♦ అద్దం ముందు నిలబడి స్వయంగా చేసుకునే పరీక్షలో చేతులను తల వెనకకు పెట్టి బ్రెస్ట్ ఆకారాన్ని రొమ్ముల ఆకారాన్ని గమనించాలి. రొమ్ముల పై భాగం, చుట్టూ, చంకల కింద కూడా నొక్కి చూడాలి
♦ ఇప్పుడు నిపిల్స్ మెల్లగా నొక్కి పాలలాగ లేదా నీటిలాగ ద్రవం విడుదలవుతుందేమో చూడాలి
♦ తర్వాత వెల్లకిలా పడుకుని చేతివేళ్లతో బ్రెస్ట్‌ను తాకుతూ పరీక్షించుకోవాలి. పడుకున్నప్పుడు తలకింద దిండు ఉండరాదు, భుజాల కింద మడతపెట్టిన టవల్‌ను ఉంచుకోవాలి. ఈ పరీక్షలో చిన్న గడ్డలాంటిది ఉన్నా వెంటనే తెలిసిపోతుంది.
♦ పైన పేర్కొన్న పరీక్షలను రుతుక్రమం పూర్తయిన తొలిరోజు చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీరియడ్స్ మొదలయ్యే సమయంలో సాధారణంగానే రొమ్ములలో చిన్నపాటి గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుక్రమం మొదలైన మూడు– నాలుగు రోజుల్లో కరిగిపోతాయి. ఆ తర్వాత కూడా ఏదైనా లంప్ తగిలితే అది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సూచిక అయి ఉండవచ్చనే సందేహంతో డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే అన్ని గడ్డలూ క్యాన్సర్‌లు కావు. అందుకే ఆందోళన అవసరం లేదు. అలాంటివేవైనా కనిపిస్తే మాత్రం డాక్టర్‌ను కలవాలి.
♦ ఇక మహిళల్లో వచ్చే మరో సాధారణ సమస్య సర్వైకల్ క్యాన్సర్. అయితే సెర్విక్స్ క్యాన్సర్ ముందుగా వచ్చే ప్రీ–క్యాన్సర్ దశ చాలా కాలం (దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు) కొనసాగుతుంది. అంటే అది పూర్తి క్యాన్సర్‌గా రూపొందడానికి సాగే ముందస్తు దశ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి అక్కడ వచ్చే మార్పులను ముందుగానే పసిగడితే అది క్యాన్సర్ కాకముందే చికిత్స చేయడం సాధ్యపడుతుంది. పాప్ స్మియర్ అనే చిన్న పరీక్షతో ఎంతో సులువుగా సెర్విక్స్ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్ దశలోనే గమనించి సమర్థంగా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ల వయసులో ఉన్న మహిళలంతా తప్పనిసరిగా కనీసం ఏడాదికి ఒకసారి చేయించుకోవడం అవసరం
♦ మహిళలు ఎల్‌బీఎస్ (లిక్విడ్ బేస్‌డ్ సైటాలజీ) పరీక్షను ప్రతి ఐదేళ్లకోమారు చేయించుకోవాలి.
- డాక్టర్ భాగ్యలక్ష్మి ,సీనియర్ గైనకాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, హైదరాబాద్
హెయిర్ & స్కిన్
వెంట్రుకల రక్షణ కోసం...
♦ మంచి జుట్టు కోసం మెగ్నీషియమ్, ఐరన్, జింక్ వంటి ఖనిజలవణాలు ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
♦ క్రమం తప్ప కుండా వెంట్రుకలను షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వెంట్రుకలను కడగటం కూడా మంచిదికాదని గుర్తుంచుకోవాలి. దీనివల్ల వెంట్రుకలు పొడిబారవచ్చు.
♦ అలర్జెన్స్, కాలుష్యాలు నేరుగా వెంట్రుకలు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హాట్ పెట్టుకోవడం చేయాలి
♦ ఒకవేళ చుండ్రు వంటి సమస్య ఉంటే కీటోకెనజాల్ లేదా సైక్లోపిరోగ్సాలమైన్ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి
♦ వెంట్రుక చివర్లు చిట్లి పోకుండా ఉండేలా ప్రతి ఆరు వారాలకు ఓమారు జుట్టును ట్రిమ్ చేసుకోవాలి
♦ మీరు రంగు వేసుకునే వారైతే అది పడుతోందా లేదా అన్నది పరిశీలించుకోవాలి.
చర్మం సంరక్షణ ఇలా...
♦ కాలుష్యాలైన పొగ, దుమ్ము, ధూళి నేరుగా తాకకుండా సాధ్యమైనంత వరకు చర్మం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అంటే ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లవ్‌జ్ వంటివి తొడుక్కోవాలి.
♦ చర్మం, వెంట్రుకలు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ రాత్రివేళ కూడా చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయడం మేలు చేస్తుంది.
♦ బయటకు వెళ్లడానికి కనీసం 15–20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దీనికి తోడు బయటకు వెళ్లాక కూడా ప్రతి రెండు, మూడు గంటలకోమారు మళ్లీ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సన్‌స్క్రీన్‌ను అన్ని సీజన్‌లలో రాసుకోవడం అవసరం.
- డాక్టర్ స్వప్న ప్రియ ,సీనియర్ డర్మటాలజిస్ట్ ,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
నోటి ఆరోగ్యం
♦ దంతసంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసు కోండి. ప్రతిరోజూ రెండు సార్లు పళ్లు తోముకోండి. (రాత్రి నిద్రకు ముందర, పొద్దున నిద్ర లేవగానే)
♦ మీ డెంటిస్ట్‌ను కలిసి క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోండి.
♦ మీరు బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడండి.
♦ దంత సంరక్షణను అందించే మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోండి.
♦ పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి.
♦ బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.
♦ మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి.
♦ లోపలివైపున బ్రష్ చేసుకోడానికి బ్రష్‌ను నిలు వుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదిలించండి.
♦ కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి.
♦ నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి.
♦ బ్రషింగ్ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి.
♦ చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
♦ ప్రతి మూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి.
♦ మీ బ్రష్‌ను టాయిలెట్ దగ్గర పెట్టవద్దు. బ్రష్ చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి, కప్‌బోర్డ్‌లో పెట్టండి.
♦ చిన్నపిల్లలు ఉన్నవారు ప్రతి ఆర్నెల్లకొకసారి వాళ్లను దంతవైద్యులకు చూపాలి. పాలపళ్లే కదా అని నిర్లక్ష్యం కూడదు. పాల పళ్లలోని ఇన్ఫెక్షన్, శాశ్వత దంతాలకూ పాకి, వాటిని పాడుచేయడమే కాక ఎగుడు–దిగుడు పళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ.
♦ పాలపీకతో పాలు తాగే పిల్లలకి రాత్రి నిద్రకు ముందు పాలపీకను నోట్లోంచి తీసేసి, వేలితో నోరు శుభ్రం చేయాలి. సీసాను అలాగే ఉంచేస్తే అన్ని పళ్లూ పిప్పిపళ్లయ్యే అవకాశం ఎక్కువ.
♦ చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో మౌత్‌గార్డ్స్ ధరించేలా చూడాలి. లేదంటే ఆటల్లో వారు కిందపడిపోతే పళ్లు ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
♦ దంతాలు శుభ్రంగా లేకపోతే అక్కడి బ్యాక్టీరియా గుండెకు పాకి, గుండెజబ్బులు వచ్చేందుకు అవకాశం అధికం.
♦ గుండెజబ్బులున్నవారు గుండె ఆపరేషన్‌కు ముందుగా దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకుండా చూసుకోవాలి. లేదంటే ఆపరేషన్ విజయవంతం కాకపోవడానికి ఆస్కారం ఎక్కువ.
♦ షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా దంతవైద్యులను సంప్రదించి, వారు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పళ్లు కదలడం, నోటిదుర్వాసన, చిగుర్ల ఇన్ఫెక్షన్, నోరు ఎండిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
♦ గర్భవతులకు హార్మోనల్ మార్పుల వల్ల చిగుర్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటిని నివారించకపోతే గర్భవతితో పాటు కడుపులోని బిడ్డకూ హాని కలిగే అవకాశాలు ఎక్కువ.
♦ వృద్ధులకు వాళ్ల వయసు వల్లగానీ, తీసుకునే మందుల వల్లగానీ లాలాజలం ఉత్పత్తి తగ్గితే, చిగుళ్ల వాపు, పిప్పిపళ్లు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువ. అందుకే వాళ్లు తరచూ దంతవైద్యులను సంప్రదించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
♦ పళ్లు లేనివారు వెంటనే లేని పళ్ల స్థానంలో కృత్రిమదంతాలను అమర్చుకోవాలి. లేకపోతే సరిగ్గా నమలలేకపోవడంతో జీర్ణకోశవ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ. నోట్లో షార్ప్ టీత్ ఉంటే వాటి పదునును తగ్గించాలి. లేదంటే నాలుక లేదా బుగ్గ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
♦ క్యాన్సర్ కారకాలైన పొగతాగడం, వక్కపొడి, సున్నం కలిపి తినడం, పాన్‌పరాగ్ నమలడం మానేయాలి. లేదంటే నోటిక్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
♦ టీనేజ్ వయసు రాగానే కొందరు పిల్లలు ఇప్పటి ఫ్యాషన్స్‌లో భాగంగా నోటికి, పెదవులకు రింగులు వేయించడం (పియర్సింగ్) వంటివి చేస్తుంటారు. ఇలా చేయదలచినప్పుడు ముందుగా మీ డెంటిస్ట్‌ను సంప్రదించాలి. అది సురక్షితంగా ఎలా చేసుకోవచ్చో ఆయన సూచిస్తారు. అయితే అలాంటి పియర్సింగ్ ప్రక్రియలు చేయకుండా ఉండటమే మంచిది.
♦ టీనేజ్ పిల్లల్లో విపరీతంగా తిని అదంతా వాంతి చేసుకోవడం వంటి లక్షణాలుండే బులీమియా, బరువు పెరుగుతామనే భయంతో అసలు తినడమే ఇష్టపడకపోవడం ఉండే అనొరెక్సియా నర్వోజా వంటివి చాలా సాధారణం. ఈ రెండు సమస్యలూ పళ్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ సమస్యల వల్ల పళ్ల ఎనామిల్ దెబ్బతింటుంది. కేవలం అనామిల్ దెబ్బతింటే డెంటిస్టులు చికిత్స అందిస్తారు. అయితే ఆ రెండు మానసిక సమస్యలకు సైకియాట్రిక్ చికిత్సతో పాటు కాస్తంత స్వయం నియంత్రణ కూడా అవసరం.
- డాక్టర్ ప్రత్యూష ,సీనియర్ డెంటల్ సర్జన్ ,కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment