సాక్షి, హైదరాబాద్: డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.. లైన్‌లో ఉండాలి.. మన టోకెన్ నంబర్ వచ్చే దాకా ఎదురుచూడాలి.. ఆ తర్వాత గానీ డాక్టర్ దగ్గరకు వెళ్లలేం.. వెళ్లినా మనకు వచి్చన సమస్య గురించి కొన్నిసార్లు పూర్తిగా డాక్టర్‌తో చెప్పుకోలేం. కొన్నిసార్లు చిన్నచిన్న సమస్యలే కదా అని ఊరుకుంటాం. వాటి గురించి డాక్టర్ దగ్గరికి వెళ్లాలా అని సంకోచం కూడా ఉంటుంది. మరికొందరికి కొన్ని అపోహలు ఉంటాయి.
వాటి గురించి సరైన అవగాహన ఉండదు. ఎవరిని అడగాలో తెలియదు. ఇలాంటి వారికోసమే కొందరు డాక్టర్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వేలాది మందికి సేవలు అందిస్తున్నారు. అలాంటి వారి సేవలు సమాజానికి ఎంతో అవసరం. సోమవారం ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా సేవలు అందిస్తున్న పలువురు స్ఫూర్తిదాయక వైద్యులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సంతానంపై అవగాహన కలి్పంచేందుకు..
సంతాన లేమితో చాలా మంది దంపతులు బాధపడుతున్నారు. సరైన చికిత్స అందకపోవడం.. సంతానం కలగకపోవడంతో మానసికంగా ఎంతో కుమిలిపోతుంటారు. వాళ్లు చెప్పారని, వీళ్లు చెప్పారని ఆస్పత్రులన్నీ తిరుగుతుంటారు. కానీ అసలు సమస్య తెలియదు. కొందరిలో సమస్య ఒకటైతే.. మరొక దానికి ట్రీట్‌మెంట్ ఇస్తుంటారు. అలాంటి వారి అనుమానాలను, సందేహాలను తీర్చేందుకు ప్రముఖ ఫరి్టలిటీ నిపుణురాలు శిలి్పకారెడ్డి ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌ను వేదికగా చేసుకున్నారు. తన వద్దకు ఎంతో మంది పేషెంట్లు వస్తుంటారని, వారికి సలహాలు చెబుతుంటానని, తన వద్దకు రాలేని వారికి కూడా అపోహలను పోగొట్టాలనేదే ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
– డాక్టర్ శిల్పికారెడ్డి, ఫరి్టలిటీ నిపుణురాలు
అపోహలు పోగొట్టేందుకే..
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఉంది. అయితే.. సమాచారం కూడా ఎక్కువగా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. కొన్ని సమస్యలకు గూగుల్‌లో వెతుకుతున్నారు. వారికి సరైన సమాచారం ఇవ్వడం తమ బాధ్యత అంటున్నారు ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ దీపక్. యూరాలజీకి సంబంధించి ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయని, ఆఖరికి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలనే విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఒక నిపుణుడిగా చెబితే ప్రజలకు కూడా నమ్మకం కలుగతుందని పేర్కొంటున్నారు. ఎవరెవరో ఆరోగ్యం గురించి చెబుతున్నప్పుడు తన లాంటి నిపుణులు ఎందుకు సమాజానికి ఎందుకు చెప్పకూడదనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల్లోకి వచ్చానని
చెబుతున్నారు.
ఎలాంటి అనుమానాలొద్దు..
దేశవ్యాప్తంగా ప్రజలకు దంతాల గురించి సరైన అవగాహన లేదు. దీనిపై అనుమానాలను తగ్గించేందుకు సోషల్ మీడియాను ఎంచుకున్నానని చెబుతున్నారు ప్రముఖ దంత వైద్యురాలు మానస. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని, ఆరు నెలలకు ఒకసారి డెంటిస్టును కలిస్తే సమస్యలు ఉండవనే విషయంపై అవగాహన చాలా మందిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల్లో కూడా దంత సమస్యల గురించి ఎప్పటికప్పుడు చెక్ చేయిస్తూ ఉండాలని, దీని వల్ల వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని చెబుతున్నారు. ఇక, పన్ను తొలగిస్తే అనేక సమస్యలు వస్తాయన్న అపోహలు ఇప్పటికీ పల్లెటూర్లలో ఉన్నాయని, వారి కోసం తాను సామాజిక మాధ్యమాన్ని ఎంచుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మానస.
– డాక్టర్ మానస, డెంటిస్టు
వైద్య వృత్తిలో భాగంగానే..
మనం చెబుతున్న మాటలే భవిష్యత్తులో సంస్కృతిగా మారుతాయన్న ప్లేటో చెప్పిన మాటలే ఆయనకు స్ఫూర్తి. వైద్య రంగం గురించి సమాజంలో చాలా విస్తృతంగా చర్చ జరగాలనేదే ఆయన ఆశయం. అప్పుడే వైద్య రంగం, చికిత్సలు సమాజంలో భాగం అవుతాయనేది ఆయన నమ్మకం. ప్రజలకు ఉన్న అనుమానాలను ఫేస్ బుక్ ద్వారా ఆయన వైద్య రంగానికి సంబంధించిన అపోహలను నివృత్తి చేయాలని కరోనా సమయంలో నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వయంగా రచయిత కూడా అయిన డాక్టర్ విరించి ఎన్నో రచనలను పోస్టు చేస్తూ అవగాహన కలి్పస్తూ వస్తున్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలనేదే తన ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు, రచనలకు ఎంతో మందికి మేలుకొలుపు అయింది.
– డాక్టర్ విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు
Comments
Please login to add a commentAdd a comment