ధ్రువతార
కలల దారి ఎప్పుడూ విజయం అనే గమ్యా నికే చేరుస్తుంది. అందుకే అందరూ కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేం దుకు ప్రయత్నిం చాలి. అవ రోధాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలి. ఆ ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది.
- కల్పనా చావ్లా
ఆమె సాధించిన విజయం ఊహలకు అందనిది. దిగంతాలకు ఆవల ఏముందో తెలుసుకోవాలని తపించిన ఆమె సాహసం మాటలకందనిది. ఆ సాహసం ఆమెను ప్రతి భారతీయుని మదిలో ఆకాశమంత ఎత్తులో నిలిపింది. అంత ఎత్తుకు ఎదిగిన ఆమే... కల్పనా చావ్లా. అంతరిక్షయానం చేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు కల్పనాచావ్లా. ఆకాశం అవతల ఏముందో తెలుసుకోవాలని చిన్ననాటి నుంచే పరితపించిన ఆమె నక్షత్రాలను లెక్కపెడుతూ శూన్యంలోనే కలలకు గ్రాఫ్‌లు గీసుకునేవారు.
ఆ కలలను నిజం చేసుకుంటూ మూడు పదుల వయసులో అంతరిక్షంలోకి వెళ్లారు. మిషన్ స్పెషలిస్టుగా కొలంబియా ఎస్‌టిఎస్-87 మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేసి వచ్చారు. అంతరిక్షంలో పాదం మోపిన కల్పన 376 గంటల పాటు అక్కడే గడిపి, భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్లు ప్రయాణించారు. దీంతో యావత్ ప్రపంచం ఆమెను ఓ అద్భుత నక్షత్రంగా కీర్తిస్తూ తల ఎత్తి సెల్యూట్ చే సింది.
హర్యానాలోని కర్నాల్‌లో, ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారామె. నలుగురు సంతానంలో చిన్న. తండ్రి బనారసీలాల్ చావ్లా టైర్ల వ్యాపారంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, పట్టుదలతో రాణించారు. రాష్ట్రపతి అభినందనలందుకున్నారు. తండ్రి మాటలు, చేతలు కల్పన మనసులో బలంగా నాటుకుపోయాయి. లక్ష్యం ఏదైనా, దాన్ని అందుకోవాలంటే ఆటంకాలు తప్పవని తన జీవనయానంలో తెలుసుకున్నారు కల్పన. వాటిని అధిగమించేందుకు బాల్యం నుంచీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
చదువులో ఎప్పుడూ ముందుండే కల్పన ఇంటర్మీడియెట్ తర్వాత ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సు తీసుకోవాలనుకున్నారు. ఆడపిల్లలకు ఈ కోర్సు కష్టం, మరేదైనా ఎంచుకోమని అధ్యాపకులు నిరుత్సాహపరిచారు. అయితే, కల్పన వినలేదు. ‘ఇస్తే అందులో అవకాశమివ్వండి, లేదంటే ఇంటికి వెళ్లిపోతా’నని నిష్కర్షగా చెప్పారు. అధ్యాపకులు తలవంచక తప్పలేదు. డిగ్రీ చేతికి వచ్చాక పై చదువులకు అమెరికా వెళ్తానని తన కల గురించి చెప్పినప్పుడు ‘ఆడపిల్లవు.. పెళ్లి చేసుకొని స్థిరపడమ’న్నాడు తండ్రి. ఆయన్ని ఒప్పించి అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు.
పరిశోధనాకాలంలోనే తన అభిరుచులను గౌరవించే ఫ్రెంచ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, వైమానిక వ్యవహారాల రచయిత జీన్ పియెర్రా హ్యారిసన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొలరాడో యూనివర్శిటీలో డాక్టరేట్ పొందారు. కాలిఫోర్నియాలో పరిశోధనా శాస్త్రవేత్తగా అనుభవం గడించారు. ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించి సమర్థమైన మెళకువలు నేర్చుకున్నారు. వైవిధ్య అంశాలను శోధించారు. ‘నాసా’కు కల్పనతో పాటు 2 వేల మంది పోటీ పడ్డారు. అంతమందినీ పరిశీలించిన నాసా 23 మందిని ఎంపికచేస్తే వారిలో కల్పనాచావ్లా ముందున్నారు. శిక్షణలో భాగంగా కొండలు ఎక్కుతూ, బరువులు మోస్తూ పురుషులకంటే తాను బలంలోనూ, ధైర్యంలోనూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నారామె.
కల్పన ప్రతిభను గుర్తించిన నాసా 1997లో అంతరిక్షయానానికి పంపింది. రెండవసారి ఎస్‌టిఎస్-87 ప్రయోగ బాధ్యతలను కల్పనకే అప్పజెప్పింది. అయితే స్పార్టన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి వదలగా, అది పనిచేయకపోవడంతో కల్పనపై అభియోగాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయినా కృంగిపోలేదు. ఐదు నెలల విచారణ జరిపిన నాసా సాఫ్ట్‌వేర్, విమానసభ్యులదే తప్పిదమని తెలుసుకుంది. చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది.
ఆ తర్వాత రెండోసారి అంతరిక్షయానం చేసే అవకాశం కల్పనకు లభించింది. కొలంబియా వ్యోమనౌకలో మరో ఆరుగురు వ్యోమగాములతో కలిసి 2003 జనవరిలో అంతరిక్షంలోకి వెళ్లారు కల్పన. 16 రోజుల అనంతరం తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వ్యోమనౌకలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు సభ్యులతో పాటు కల్పనాచావ్లా ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షంలో ఏ చిన్న పొరపాటు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసినా ఈ ధీశాలి మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించారు మళ్లీ ఆకాశంలోకి పయనమైపోయారు. అయినా యావత్ ప్రపంచానికి తేజోవంతమైన నక్షత్రంలా ఎప్నటికీ భాసిల్లుతూనే ఉంటారు.
- నిర్మలారెడ్డి