కర్ణుడు
కర్ణమంటే చుక్కాని అని ఒక అర్థముంది. ఈ చుక్కాని మనుగడ పడవని వెనుబాములోని చక్రాలగుండానైనా నడపగలదు. లేక, ఇంద్రియనాడుల గుండా బయటికి భౌతిక చైతన్యం వైపుకైనా నడపగలదు. ‘కర్ణ’మనే మాటను తిరగేస్తే ‘నరక’మవుతుంది. ఇతనికున్న లోభం నరక ద్వారాలు మూడింటిలోనూ ఒకటి. తతిమ్మా రెండూ కామరూపుడైన దుర్యోధనుడూ
కోపరూపుడైన దుశ్శాసనుడూను.
దుష్టచతుష్టయంలో ఒకడై, చెడు సావాసంతో పూర్తిగా చెడిపోవడాన్ని ప్రత్యక్షంగా రూపుకట్టిస్తాడు కర్ణుడు. పెద్దలు, సంగానికి దూరంగా ఉండమని చెబుతూ, సమాజంలో ఉన్నప్పుడు సంగం తప్పదు కనుక, సంగమే చేయవలసి వచ్చి నప్పుడు, మనను ఉద్ధరించగలిగే మంచి వాళ్లతోనే సహవాసం చేయాలని హెచ్చ రిస్తూ ఉంటారు. కర్ణుడు ఈ పెద్దల సుద్దిని పూర్తిగా కాదన్నాడు. అసలు కర్ణుడనే పేరు అతనికి పెట్టిన పేరు కాదు.
వసుషేణు డనేదే అతని పేరు. కుంతికి కొడుకే అయినా... ఆమె, పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. పాండు రాజంటే బుద్ధీ విచక్షణాను. దివ్యశక్తుల్ని పిలవగలిగే కుంతి శక్తికి విచక్షణ ఇంకా తోడుకాక ముందే పుట్టాడు కనకనే ఇతనికి వివేకమబ్బలేదు. దూర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అవుపిస్తూన్న సూర్యుణ్నే ఆహ్వా నించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టినా, భయంకొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి, నీళ్లల్లో విడిచిపెట్టింది. ముక్కుపచ్చలారని కొడుకుని వదిలిపెట్టిందని కొంతమంది కవులు భావుకతకు లోబడి తప్పుపట్టారు గానీ, పుట్టుకకు కారణమైన అతని కర్మను వాళ్లు పట్టించుకోలేదు. కర్మే పుట్టుకను శాసిస్తుంది కనకనే ఒకే తల్లిదండ్రులకు పుట్టినవాళ్లంతా ఒకేలా ఉండరు.
పసిబిడ్డ ఉన్న పెట్టె, రథాల్ని నడుపుకొనే అధిరథు డికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుర్రాణ్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనక అతనికి వసు షేణుడని పేరు పెట్టుకున్నారు (వసువంటే ధనం). గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునపటి కర్మ ఫలితమే.
వసుషేణుడు సూర్యుణ్ని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుషేణుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్లి, అతని కవచకుండలాల్ని ఇమ్మనమని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనకనే అతనికి కర్ణుడూ వైకర్తనుడూ అనే పేర్లు వచ్చాయి (కృతీ-ఛేదనే). అయితే, ఈ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికివచ్చే శక్తినొకదాన్ని ప్రతిదానంగా తీసుకొన్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటి దైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది.
కర్ణుడు ఆధ్యాత్మిక నేత్రరూపుడైన సూర్యు ణ్నించి పుట్టినా, వైరాగ్యానికి ప్రతీకయిన కుంతికి పుట్టినా కూడా, ఇంద్రియ సంబంధమైన మనసుండే స్థానంలో ధృత రాష్ట్రుడి అధీనంలో పెరిగాడు. ఇక్కణ్నించి కూడా అతను ఆధ్యాత్మిక లోకానికి తిరగ వచ్చు. కర్ణుడు అర్జునుడి మీది స్పర్ధ కొద్దీ, లోభంతో దుర్యోధనుడిచ్చిన ‘అంగ’ (శరీర) రాజ్యానికి రాజై, అతని కొమ్ము కాయడంతో శారీరక చైతన్యం వైపుకే చుక్కానిని తిప్పేశాడు.
కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్లాడు. బ్రహ్మా స్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుణ్నని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజున గురువు శిష్యుడి తొడను తల గడగా చేసుకొని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి, అతని తొడలో కన్నం పెట్టడం మొదలు పెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువుగారికి నిద్రా భంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు.
అతని ధైర్యాన్ని గమనించి ‘నిజం చెప్పు నువ్వెవ డివి?’ అనేసరికి, ‘నేను సూతుణ్ని’ అని నిజం చెప్పాడు. అబద్ధమాడడాన్ని గమ నించకుండా ఇంద్రుణ్ని తప్పుపడుతూ ఉంటాం మనం. సత్యాన్ని కాదంటే ఇటు వంటి పరిస్థితిలోనే పడుతూంటాం. ‘గురు వైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక, అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయ మప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది. బ్రాహ్మణత్వం లేనివాడిలో ఈ అస్త్రం స్థిరంగా ఉండదు’ అంటూ పరశురాముడు శాపమిచ్చాడు.
ఓసారి, విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరిగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు ‘అజాగ్రత్తతో నువ్వు బాణాల్ని వేసి, నా హోమధేనువు బిడ్డణ్ని చంపావు గనక, యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకు పోయి ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావు’ అని శపించాడు.
అస్త్రాల్ని అభ్య సించాలన్న రాగం కొద్దీ అజాగ్రత్తతో ప్రవ ర్తించడం ఇతనిలో పెద్ద లోపం. ఆ బ్రాహ్మ ణుణ్ని ‘ఇంత డబ్బిస్తాను, కానుకలిస్తాను, ఆవులిస్తాను, ఎద్దులనిస్తాను’ అంటూ ప్రలోభపెట్టడంతో అతనికి ఇంకా కోపం వచ్చింది. ‘నేనెప్పుడూ అబద్ధమాడలేదు. అంచేత నేనన్న మాట అన్నట్టుగానే జరిగి తీరుతుంది’ అని రూఢి చేశాడు. ధర్మానికి ప్రతికూలమైన ప్రవర్తన వల్లనే శాపాలూ తాపాలూ సంక్రమిస్తాయి. అవి మన పనులు, ప్రవర్తన వల్లనే తారసిల్లుతాయి.
పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శ నలో కర్ణుణ్ని చూసి, దుర్యోధనుడు తనకు అర్జునుణ్ని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కాని వాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి, అతన్ని రాజుగా చేయడానికి అప్పటి కప్పుడే కర్ణుణ్ని అంగ రాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై, ఉచ్చ నీచాలను చూడ కుండా అధర్మం వైపు చేరిపోయాడు.
తల్లే స్వయంగా ‘నువ్వు కౌంతేయుడివే’ అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, కురు వృద్ధుడైన భీష్ముడు చెప్పినా కూడా, అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయిన దనుకున్నాడు. అధర్మమని తెలిసినా, కౌంతేయుడనని ఇప్పుడటు వెళ్లిపోతే చెడ్డ పేరు వస్తుందనీ, అసౌఖ్యం కలుగు తుందనీ, ఆ భావాన్నే అడ్డుకొన్నాడు. ఇటు వంటి వెర్రి తలపులకూ ఇష్టానిష్టాలకూ బానిసతనం చూపించడమే లోభం. లోభం అవసరమైన అవసరాల్నీ అనవసరమైన ‘అవసరాల్నీ’ విడదీయనివ్వని తికమకను మనస్సులో కలగజేస్తుంది.
అర్జునుణ్ని ఆరునూరైనా నూరు ఆరైనా జయించాలి. దానికోసం అధర్మం కొమ్మై కాయడానికి ఒప్పుకోవడమూ అది సరి అయినదా కాదా అని కొద్దిగా కూడా ఆలోచించకుండా దుర్యోధనుడితో మాటలో మాట కలపడమూ తన కోరిక ఎలాగైనా తీరాలనే యావ కొద్దీ జరిగాయి.
వికర్ణుడు, ద్రౌపది దాసి కాదని తేల్చి నప్పుడు దుర్యోధనుడి మెచ్చుకోలు కోసం కర్ణుడు అతన్ని మూర్ఖుడిగా తీసిపారేశాడు. ‘‘ధర్మజుడు తనకున్నవన్నీ ఒడ్డేసి ఓడి పోయిన మీదట, తనలోనూ తమ్ముళ్ల ల్లోనూ అర్ధాంగిగా ఉన్న ద్రౌపదిని కూడా మనం గెలుచుకున్నట్టే లెక్క. ఏకవస్త్రను సభలోకి తీసుకొని రావడమూ తప్పు గాదు. స్త్రీకి ఒకే భర్త ఉండడం రివాజు. కానీ ఈవిడకు చాలామంది భర్తలున్నారు. అంటే, ఈవిడ ఒక వేశ్య. వేశ్యను ఏక వస్త్రగా ఉన్నా అసలు బట్టలు లేకుండా ఉన్నా సభకు తీసుకొని రావడం చిత్ర మేమీగాదు. దుశ్శాసనా! ఈ మీ తమ్ముడు వికర్ణుడు మూఢుడయ్యుండీ మహా జ్ఞాని లాగ మాట్లాడుతున్నాడు. ‘పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యా శ్చాప్యుపా హర’ అంటూ ఒక ఆడదాని బట్టల్ని ఒలవమని నిస్సిగ్గుగా నిండు కొలువులో దుశ్శాస నుణ్ని ప్రేరేపించి దుష్టాతి దుష్టత్వం చూపినవాడు కర్ణుడు. ‘ఇకపై దాస్యానికి నిన్ను అప్పగించని మరెవరి నైనా పతిగా వరించుకో’ అని ఒక మహా రాణిని ఘోరంగా అవమానించిన నికృష్టు డితను. దీనికి కారణం, స్వయంవర సమయంలో కర్ణుణ్ని చూసి ద్రౌపది, ‘సూతుణ్ని పెళ్లి చేసుకోను’ అనడంతో లక్ష్యాన్ని కొట్టడానికి ప్రయత్నించకుండానే వెళ్లిపోయాడు.
కర్ణుడు మహాశౌర్యం కలవాడే; మహా దానాలు చేసినవాడే. శౌర్యమూ వీర త్వమూ దానగుణమూ గొప్ప ధర్మాలే. కానీ, ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరే కించేలాగ ప్రవర్తిస్తే, ముందు చెప్పుకొన్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కొంతమంది తపస్వులు దేవుడిచ్చిన ఆ ప్రతిభను తమదే అన్నట్టు చాటుకుంటూ, తాగుడూ విచ్చలవిడి సంభోగమూ అవలంబిస్తూ, అదే గొప్పదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది దైవం పట్ల చేసే అపచారమే. కర్ణుడు దానవీరుడూ శూరమానీను. అయినా, దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపమూ బ్రాహ్మ ణుడి శాపమూ వచ్చిపడ్డాయి. ఎవరెలాగ ప్రవర్తిస్తే వాళ్లకలాగే జరుగుతుంది.
భీష్ముడు తనను అర్ధ రథుడన్నాడని అతను సేనాపతిగా ఉన్నప్పుడు, నిర్ణాయక మైన యుద్ధానికే దూరమయ్యాడు. అస్త్రా లన్నీ తెలిసినా తప్పుడు ప్రవర్తనతో వచ్చి పడ్డ శాపాల వల్ల అతను ఒక్క రథికుడి తోనూ పోరాడలేని స్థితిని తెచ్చుకొన్నాడు కనకనే అతన్ని భీష్ముడు అర్ధ రథుడని అన్నాడు.
ద్రోణుడు పోయిన తరవాత కర్ణుడు సేనాపతి అయ్యాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం అర్జునుణ్ని తప్ప తతిమ్మా నలుగుర్నీ చంపగలిగీ విడిచిపెట్టాడు. భీష్ముడు సేనాపతిగా ఉన్నప్పుడు యుద్ధానికి దూరం కావడం గానీ దొరికిన నలుగురు పాండవుల్నీ పట్టుకోకపోవడం గానీ స్నేహితుడని చెప్పుకొన్న దుర్యో ధనుడి విశ్వాసాన్ని వమ్ము చేయలేనని తల్లికీ కృష్ణుడికీ చెప్పిన దుర్యోధనుడి పట్ల ఇతను చేసిన ద్రోహం కిందే జమకట్టాలి. ఇతని ప్రవర్తన వల్ల వచ్చిపడిన శాపాలతో బాటు, కృష్ణుడితో సమానుడని తానే అడగ్గా దుర్యోధనుడు కల్పించిన శల్యుడి సారథ్యం కూడా ఇతని మనస్సును విరగ్గొ ట్టిన పెద్ద శాపమే అయింది.
‘అర్జునుడి ముందు నువ్వు దిగదుడుపే’ అని ముందు కూర్చొని పదేపదే అంటూ మనస్సుని కుళ్ళబొడవడం కూడా శాపం కన్నా ఏ మాత్రమూ తక్కువ కాదు. దుస్సంగంలో పడితే ఎన్నెన్ని శాపాలు వెన్నాడుతాయో ధర్మం తెలుసుండీ అధర్మాన్నే బలపర చడం వల్ల ఎన్నెన్నిసార్లు ఓడిపోవలసి వస్తుందో కర్ణుణ్ని చూస్తే అర్థమవుతుంది. దుర్యోధనుడు ఇతని మీద పెట్టుకున్న ఆశలన్నీ వట్టివే అయ్యాయి. ఘోష యాత్రలో ఓడిపోయి దూరంగా పోయాడు; ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. మహా యుద్ధంలో శాపాల బారినపడి, అర్జునుణ్ని ‘చంపుతాను,’ అని చెప్పుకొన్న గొప్పలన్నీ వట్టిపోగా, తానే నేలకొరిగిపోయాడు. లోభానికి లొంగినవాడికి ఎవడికైనా ఇంతే గతి పడుతుంది. విచక్షణతో మనలో ఉన్న మంచీచెడుల్ని విశ్లేషించుకోవాలి. మంచితో స్నేహం చెయ్యాలి. చెడును దూరంగా విడిచిపెట్టాలి. వీటన్నిటికీ వ్యతిరేకమైనవాడు బాధపడడం తప్పదు.