small baby
-
డెంగీతో.. 'పసి హృదయం' విలవిల..! ఆదుకోవాలంటూ కన్నోళ్ల వేదన..!!
మహబూబాబాద్: ఓ పసి హృదయం విష జర్వంతో విలవిలాడుతోంది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఆ శిశువును డెంగీ మహమ్మారి ఆవహించింది. వాంతులు, విరోచనాలతో చుట్టుముట్టింది. దీనికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. చిన్నారిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడా తగ్గలేదు. వైద్యుల సూచన మేరకు చివరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ చిన్నారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక చేయూతనందించాలని వారు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ముల్కనూరు గ్రామ పంచాయతీ పరిధి దుబ్బగూడెం గ్రామానికి చెందిన చిన్నారి తోటకూర బాలకృష్ణ, లలిత దంపతుల 9 నెలల పాప ప్రణిద ఉంది. ఈ క్రమంలో ప్రణితకు ఈనెల 13న జ్వరం రావడంతో బయ్యారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో 14వ తేదీన ఖమ్మంలోని జాబిల్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఖమ్మంలో కూడా జ్వరం తగ్గకపోగా, వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అక్కడి వైద్యులు ఈనెల 17న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రికి రెఫర్ చేయగా చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే వైద్యఖర్చుల రోజుకు రూ.2 లక్షలు అవుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై దాతలు స్పందించి 9949803665 నంబర్‌కు ఫోన్ పే చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ముల్కనూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో బుధవారం దుబ్బగూడెంలో వైద్యశిబిరం నిర్వహించారు. -
నిజంగా ఆపిల్ పండు లాంటి బిడ్డ, కట్ చేస్తే..
ఆపిల్‌పండు లాంటి బిడ్డను కనమని కాబోయే తల్లులను దీవిస్తుంటారు పెద్దలు. కానీ, సింగపూర్‌లో నిజంగానే యాపిల్ పండు సైజులో ఓ బిడ్డ పుట్టింది. అయితే బతకడం కష్టమనుకున్న తరుణంలో దాదాపు 25 వారాలపాటు శ్రమించిన డాక్టర్లు.. ఎట్టకేలకు ఆ బిడ్డను ఆరోగ్యవంతమైన బరువుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్(NUH)లో కిందటి ఏడాది జూన్ 9న నెలలు నిండకుండానే ఓ పాప పుట్టింది. కేవలం 24 సెంటీమీటర్ల పొడవు, కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టందా పాప. దీంతో సగటు ఆపిల్ పండు కన్నా తక్కువ బరువు ఉందంటూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ఆ చిన్నారి. అయితే బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేయడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. వాళ్ల శోకాన్ని అర్థం చేసుకుని రిస్క్ చేసి మరీ 13 నెలలపాటు ఫ్రీ ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నించారు ఎన్హెచ్యూ వైద్యులు. 13 నెలల ఐసీయూ చికిత్సలో అద్భుతం జరిగింది. చివరికి 6.3 కేజీల ఆరోగ్యవంతమైన బరువుకు చేరిన ఆ చిన్నారిని.. ఈమధ్యే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ బిడ్డకు వెక్(క్వెక్) యూ గ్జువాన్ అని పేరుపెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నారి ఆరోగ్యంగా తమ చేతికి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లోవా రికార్డుల ప్రకారం.. అమెరికాలో 245 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి పేరిట రికార్డు ఉండగా.. వెక్ యూ గ్జువాన్ ఆ రికార్డును చెరిపేసింది. -
ఎంజీఎం ఆస్పత్రిలో పసిపాప వివాదం
సాక్షీ, ఎంజీఎం: పాప ముద్దుగా ఉంది అని ఆడిస్తానని పేర్కొంటూ.. నెమ్మదిగా దగ్గరైన మహిళ మోసం చేసిందని కన్నతల్లి పేర్కొంటుండగా.. వారి కుటుంబసభ్యుల అంగీకారం మేరకే తాను పెంచుకుంటానని చెప్పి చికిత్స పొందే వార్డులో తల్లి స్థానంలో తన పేరు రాయించానని మరో మహిళ పేర్కొంటోంది. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నాలుగు రోజులుగా సాగుతున్న ఈ వివాదం చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధుల వద్దకు చేరగా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీకేఎంలో ప్రసవం.. ఎంజీఎంలో చికిత్స.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన కోటపాటి సోని, దివాకర్ దంపతులకు గత నెల 26న వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో పాప జన్మించింది. రక్తహీనతతో బాధపడుతున్న బాలింత సోని 30న ఎంజీఎం ఫీమేల్ వార్డులో చికిత్స కోసం చేరింది. ఇదే వార్డులో సోని పక్కనే ధర్మసాగర్ మండలానికి చెందిన కమ్రత్ చికిత్స పొందుతుంది. ఇరువురి మధ్య స్నేహం పెరిగి పాపను కమ్రత్ ఆడించసాగింది. ఇక పాపకు చికిత్స అవసరం కావడంతో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చేందుకు కమ్రత్ తీసుకెళ్లింది. అక్కడ శిశువు తల్లి పేరు స్థానంలో కమ్రత్ పేరును, పాప పేరును అఫ్రిన్‌గా రాయించింది. మధ్యలో చూసేందుకు సోని వెళ్లగా అసలు తల్లిదండ్రులు వస్తేనే చూడడానికి అనుమతి ఇస్తామని వైద్యులు చెప్పడంతో వివాదం మొదలైంది. కన్నతల్లిని తానేనని చెబుతున్నా వైద్యులు నమ్మని దుస్థితి నెలకొంది. కాగా, సోని దంపతుల అంగీకారం మేరకే పాపను దత్తత తీసుకున్నానని ఖమ్రత్ చెబుతుండడం గమనార్హం. చివరకు ఈ వివాదం చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధుల వద్దకు చేరగా ఎంజీఎం వైద్యుల సహకారంతో చర్చించి పరిష్కరిస్తామని వారు తెలిపారు. అయితే, నాలుగు రోజులుగా జరుగుతున్న వివాదం ఆలస్యంగా బయటకు రావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంగట్లో ఆడపిల్ల
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అంతాపూర్ తండాలో నెలన్నర వయసున్న పసిపాప విక్రయాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. కోటగిరి మండలం జల్లాపల్లి అబాదికి చెందిన దేగావత్ శాంతాబాయి, మోహన్ దంపతులు ఏడేళ్ల క్రితం అంతాపూర్తండాకు వలస వచ్చి, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు. నెలన్నర క్రితం మరో కూతురు జన్మించింది. ముగ్గురు ఆడపిల్లలు కావడం, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో పసిపాపను విక్రయించాలని నిర్ణయిం చుకున్నారు. పాపను అమ్మేందుకు వారు మూడు రోజులుగా బోధన్ ప్రాంతంలో తిరుగుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ గురువారం ఉదయం ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు నిందితులకు అంగన్వాడీ కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. తమది పేద కుటుంబమని, ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని శాంతాబాయి, మోహన్ తెలిపారు. అందుకే పసిపాపను అమ్మాలనుకున్నామని చెప్పారు. సర్పంచ్ కిషన్, ఆర్ఐ వరుణ్, వీఆర్వో ఆశోక్ వారిని సముదాయించారు. అనంతరం పసిపాపను నిజామాబాద్‌లోని బాలసదన్‌కు తరలించారు. -
కర్ణుడు
కర్ణమంటే చుక్కాని అని ఒక అర్థముంది. ఈ చుక్కాని మనుగడ పడవని వెనుబాములోని చక్రాలగుండానైనా నడపగలదు. లేక, ఇంద్రియనాడుల గుండా బయటికి భౌతిక చైతన్యం వైపుకైనా నడపగలదు. ‘కర్ణ’మనే మాటను తిరగేస్తే ‘నరక’మవుతుంది. ఇతనికున్న లోభం నరక ద్వారాలు మూడింటిలోనూ ఒకటి. తతిమ్మా రెండూ కామరూపుడైన దుర్యోధనుడూ కోపరూపుడైన దుశ్శాసనుడూను. దుష్టచతుష్టయంలో ఒకడై, చెడు సావాసంతో పూర్తిగా చెడిపోవడాన్ని ప్రత్యక్షంగా రూపుకట్టిస్తాడు కర్ణుడు. పెద్దలు, సంగానికి దూరంగా ఉండమని చెబుతూ, సమాజంలో ఉన్నప్పుడు సంగం తప్పదు కనుక, సంగమే చేయవలసి వచ్చి నప్పుడు, మనను ఉద్ధరించగలిగే మంచి వాళ్లతోనే సహవాసం చేయాలని హెచ్చ రిస్తూ ఉంటారు. కర్ణుడు ఈ పెద్దల సుద్దిని పూర్తిగా కాదన్నాడు. అసలు కర్ణుడనే పేరు అతనికి పెట్టిన పేరు కాదు. వసుషేణు డనేదే అతని పేరు. కుంతికి కొడుకే అయినా... ఆమె, పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. పాండు రాజంటే బుద్ధీ విచక్షణాను. దివ్యశక్తుల్ని పిలవగలిగే కుంతి శక్తికి విచక్షణ ఇంకా తోడుకాక ముందే పుట్టాడు కనకనే ఇతనికి వివేకమబ్బలేదు. దూర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అవుపిస్తూన్న సూర్యుణ్నే ఆహ్వా నించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టినా, భయంకొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి, నీళ్లల్లో విడిచిపెట్టింది. ముక్కుపచ్చలారని కొడుకుని వదిలిపెట్టిందని కొంతమంది కవులు భావుకతకు లోబడి తప్పుపట్టారు గానీ, పుట్టుకకు కారణమైన అతని కర్మను వాళ్లు పట్టించుకోలేదు. కర్మే పుట్టుకను శాసిస్తుంది కనకనే ఒకే తల్లిదండ్రులకు పుట్టినవాళ్లంతా ఒకేలా ఉండరు. పసిబిడ్డ ఉన్న పెట్టె, రథాల్ని నడుపుకొనే అధిరథు డికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుర్రాణ్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనక అతనికి వసు షేణుడని పేరు పెట్టుకున్నారు (వసువంటే ధనం). గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునపటి కర్మ ఫలితమే. వసుషేణుడు సూర్యుణ్ని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుషేణుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్లి, అతని కవచకుండలాల్ని ఇమ్మనమని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనకనే అతనికి కర్ణుడూ వైకర్తనుడూ అనే పేర్లు వచ్చాయి (కృతీ-ఛేదనే). అయితే, ఈ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికివచ్చే శక్తినొకదాన్ని ప్రతిదానంగా తీసుకొన్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటి దైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది. కర్ణుడు ఆధ్యాత్మిక నేత్రరూపుడైన సూర్యు ణ్నించి పుట్టినా, వైరాగ్యానికి ప్రతీకయిన కుంతికి పుట్టినా కూడా, ఇంద్రియ సంబంధమైన మనసుండే స్థానంలో ధృత రాష్ట్రుడి అధీనంలో పెరిగాడు. ఇక్కణ్నించి కూడా అతను ఆధ్యాత్మిక లోకానికి తిరగ వచ్చు. కర్ణుడు అర్జునుడి మీది స్పర్ధ కొద్దీ, లోభంతో దుర్యోధనుడిచ్చిన ‘అంగ’ (శరీర) రాజ్యానికి రాజై, అతని కొమ్ము కాయడంతో శారీరక చైతన్యం వైపుకే చుక్కానిని తిప్పేశాడు. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్లాడు. బ్రహ్మా స్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుణ్నని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజున గురువు శిష్యుడి తొడను తల గడగా చేసుకొని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి, అతని తొడలో కన్నం పెట్టడం మొదలు పెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువుగారికి నిద్రా భంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి ‘నిజం చెప్పు నువ్వెవ డివి?’ అనేసరికి, ‘నేను సూతుణ్ని’ అని నిజం చెప్పాడు. అబద్ధమాడడాన్ని గమ నించకుండా ఇంద్రుణ్ని తప్పుపడుతూ ఉంటాం మనం. సత్యాన్ని కాదంటే ఇటు వంటి పరిస్థితిలోనే పడుతూంటాం. ‘గురు వైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక, అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయ మప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది. బ్రాహ్మణత్వం లేనివాడిలో ఈ అస్త్రం స్థిరంగా ఉండదు’ అంటూ పరశురాముడు శాపమిచ్చాడు. ఓసారి, విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరిగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు ‘అజాగ్రత్తతో నువ్వు బాణాల్ని వేసి, నా హోమధేనువు బిడ్డణ్ని చంపావు గనక, యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకు పోయి ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావు’ అని శపించాడు. అస్త్రాల్ని అభ్య సించాలన్న రాగం కొద్దీ అజాగ్రత్తతో ప్రవ ర్తించడం ఇతనిలో పెద్ద లోపం. ఆ బ్రాహ్మ ణుణ్ని ‘ఇంత డబ్బిస్తాను, కానుకలిస్తాను, ఆవులిస్తాను, ఎద్దులనిస్తాను’ అంటూ ప్రలోభపెట్టడంతో అతనికి ఇంకా కోపం వచ్చింది. ‘నేనెప్పుడూ అబద్ధమాడలేదు. అంచేత నేనన్న మాట అన్నట్టుగానే జరిగి తీరుతుంది’ అని రూఢి చేశాడు. ధర్మానికి ప్రతికూలమైన ప్రవర్తన వల్లనే శాపాలూ తాపాలూ సంక్రమిస్తాయి. అవి మన పనులు, ప్రవర్తన వల్లనే తారసిల్లుతాయి. పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శ నలో కర్ణుణ్ని చూసి, దుర్యోధనుడు తనకు అర్జునుణ్ని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కాని వాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి, అతన్ని రాజుగా చేయడానికి అప్పటి కప్పుడే కర్ణుణ్ని అంగ రాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై, ఉచ్చ నీచాలను చూడ కుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా ‘నువ్వు కౌంతేయుడివే’ అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, కురు వృద్ధుడైన భీష్ముడు చెప్పినా కూడా, అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయిన దనుకున్నాడు. అధర్మమని తెలిసినా, కౌంతేయుడనని ఇప్పుడటు వెళ్లిపోతే చెడ్డ పేరు వస్తుందనీ, అసౌఖ్యం కలుగు తుందనీ, ఆ భావాన్నే అడ్డుకొన్నాడు. ఇటు వంటి వెర్రి తలపులకూ ఇష్టానిష్టాలకూ బానిసతనం చూపించడమే లోభం. లోభం అవసరమైన అవసరాల్నీ అనవసరమైన ‘అవసరాల్నీ’ విడదీయనివ్వని తికమకను మనస్సులో కలగజేస్తుంది. అర్జునుణ్ని ఆరునూరైనా నూరు ఆరైనా జయించాలి. దానికోసం అధర్మం కొమ్మై కాయడానికి ఒప్పుకోవడమూ అది సరి అయినదా కాదా అని కొద్దిగా కూడా ఆలోచించకుండా దుర్యోధనుడితో మాటలో మాట కలపడమూ తన కోరిక ఎలాగైనా తీరాలనే యావ కొద్దీ జరిగాయి. వికర్ణుడు, ద్రౌపది దాసి కాదని తేల్చి నప్పుడు దుర్యోధనుడి మెచ్చుకోలు కోసం కర్ణుడు అతన్ని మూర్ఖుడిగా తీసిపారేశాడు. ‘‘ధర్మజుడు తనకున్నవన్నీ ఒడ్డేసి ఓడి పోయిన మీదట, తనలోనూ తమ్ముళ్ల ల్లోనూ అర్ధాంగిగా ఉన్న ద్రౌపదిని కూడా మనం గెలుచుకున్నట్టే లెక్క. ఏకవస్త్రను సభలోకి తీసుకొని రావడమూ తప్పు గాదు. స్త్రీకి ఒకే భర్త ఉండడం రివాజు. కానీ ఈవిడకు చాలామంది భర్తలున్నారు. అంటే, ఈవిడ ఒక వేశ్య. వేశ్యను ఏక వస్త్రగా ఉన్నా అసలు బట్టలు లేకుండా ఉన్నా సభకు తీసుకొని రావడం చిత్ర మేమీగాదు. దుశ్శాసనా! ఈ మీ తమ్ముడు వికర్ణుడు మూఢుడయ్యుండీ మహా జ్ఞాని లాగ మాట్లాడుతున్నాడు. ‘పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యా శ్చాప్యుపా హర’ అంటూ ఒక ఆడదాని బట్టల్ని ఒలవమని నిస్సిగ్గుగా నిండు కొలువులో దుశ్శాస నుణ్ని ప్రేరేపించి దుష్టాతి దుష్టత్వం చూపినవాడు కర్ణుడు. ‘ఇకపై దాస్యానికి నిన్ను అప్పగించని మరెవరి నైనా పతిగా వరించుకో’ అని ఒక మహా రాణిని ఘోరంగా అవమానించిన నికృష్టు డితను. దీనికి కారణం, స్వయంవర సమయంలో కర్ణుణ్ని చూసి ద్రౌపది, ‘సూతుణ్ని పెళ్లి చేసుకోను’ అనడంతో లక్ష్యాన్ని కొట్టడానికి ప్రయత్నించకుండానే వెళ్లిపోయాడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడే; మహా దానాలు చేసినవాడే. శౌర్యమూ వీర త్వమూ దానగుణమూ గొప్ప ధర్మాలే. కానీ, ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరే కించేలాగ ప్రవర్తిస్తే, ముందు చెప్పుకొన్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కొంతమంది తపస్వులు దేవుడిచ్చిన ఆ ప్రతిభను తమదే అన్నట్టు చాటుకుంటూ, తాగుడూ విచ్చలవిడి సంభోగమూ అవలంబిస్తూ, అదే గొప్పదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది దైవం పట్ల చేసే అపచారమే. కర్ణుడు దానవీరుడూ శూరమానీను. అయినా, దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపమూ బ్రాహ్మ ణుడి శాపమూ వచ్చిపడ్డాయి. ఎవరెలాగ ప్రవర్తిస్తే వాళ్లకలాగే జరుగుతుంది. భీష్ముడు తనను అర్ధ రథుడన్నాడని అతను సేనాపతిగా ఉన్నప్పుడు, నిర్ణాయక మైన యుద్ధానికే దూరమయ్యాడు. అస్త్రా లన్నీ తెలిసినా తప్పుడు ప్రవర్తనతో వచ్చి పడ్డ శాపాల వల్ల అతను ఒక్క రథికుడి తోనూ పోరాడలేని స్థితిని తెచ్చుకొన్నాడు కనకనే అతన్ని భీష్ముడు అర్ధ రథుడని అన్నాడు. ద్రోణుడు పోయిన తరవాత కర్ణుడు సేనాపతి అయ్యాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం అర్జునుణ్ని తప్ప తతిమ్మా నలుగుర్నీ చంపగలిగీ విడిచిపెట్టాడు. భీష్ముడు సేనాపతిగా ఉన్నప్పుడు యుద్ధానికి దూరం కావడం గానీ దొరికిన నలుగురు పాండవుల్నీ పట్టుకోకపోవడం గానీ స్నేహితుడని చెప్పుకొన్న దుర్యో ధనుడి విశ్వాసాన్ని వమ్ము చేయలేనని తల్లికీ కృష్ణుడికీ చెప్పిన దుర్యోధనుడి పట్ల ఇతను చేసిన ద్రోహం కిందే జమకట్టాలి. ఇతని ప్రవర్తన వల్ల వచ్చిపడిన శాపాలతో బాటు, కృష్ణుడితో సమానుడని తానే అడగ్గా దుర్యోధనుడు కల్పించిన శల్యుడి సారథ్యం కూడా ఇతని మనస్సును విరగ్గొ ట్టిన పెద్ద శాపమే అయింది. ‘అర్జునుడి ముందు నువ్వు దిగదుడుపే’ అని ముందు కూర్చొని పదేపదే అంటూ మనస్సుని కుళ్ళబొడవడం కూడా శాపం కన్నా ఏ మాత్రమూ తక్కువ కాదు. దుస్సంగంలో పడితే ఎన్నెన్ని శాపాలు వెన్నాడుతాయో ధర్మం తెలుసుండీ అధర్మాన్నే బలపర చడం వల్ల ఎన్నెన్నిసార్లు ఓడిపోవలసి వస్తుందో కర్ణుణ్ని చూస్తే అర్థమవుతుంది. దుర్యోధనుడు ఇతని మీద పెట్టుకున్న ఆశలన్నీ వట్టివే అయ్యాయి. ఘోష యాత్రలో ఓడిపోయి దూరంగా పోయాడు; ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. మహా యుద్ధంలో శాపాల బారినపడి, అర్జునుణ్ని ‘చంపుతాను,’ అని చెప్పుకొన్న గొప్పలన్నీ వట్టిపోగా, తానే నేలకొరిగిపోయాడు. లోభానికి లొంగినవాడికి ఎవడికైనా ఇంతే గతి పడుతుంది. విచక్షణతో మనలో ఉన్న మంచీచెడుల్ని విశ్లేషించుకోవాలి. మంచితో స్నేహం చెయ్యాలి. చెడును దూరంగా విడిచిపెట్టాలి. వీటన్నిటికీ వ్యతిరేకమైనవాడు బాధపడడం తప్పదు. -
అమ్మకే..బరువైన ఆడ శిశువు
తెగి పడ్డా నింగి చుక్కనా.. చెత్తకుండి కాడ కుక్కనా... ఏ తల్లీకన్నా బిడ్డనో.. నేను ఏ అయ్యా కన్నా పాపనో..? చెత్తకుప్పల వద్ద ప్రత్యక్షమయ్యే పసి బాలికల ఆవేదనను ఓ అభ్యుదయ కవి తన పాటలో చక్కగా వర్ణించాడు. అడపిల్ల పుట్టిందని కొందరు తల్లిదండ్రులు తమ పొత్తిళ్లబిడ్డను గుట్టుచప్పుడు కాకుండా చెత్తకుప్పల్లో వేస్తున్నారు. కన్న మమకారాన్ని కూడా కాదని నిలువునా వదిలించుకుంటున్నారు. వారికొచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ అప్పుడే బాహ్య ప్రపంచాన్ని చూసిన పసికందులను అనాధలను చేస్తున్నారు. - సింగరాయకొండలో చెత్తకుప్పలో పసిప్రాణం - పొత్తిళ్ల బాలికను అక్కున చేర్చుకున్న ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది - పాపను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించిన డాక్టర్ హరిబాబు - చైల్డ్‌లైన్ ప్రతినిధికి సమాచారం.. ఆ వెంటనే రిమ్స్‌కు తరలింపు సింగరాయకొండ : నాలుగు రోజులు కూడా నిండని పొత్తిళ్ల ఆడ బిడ్డను తల్లిదండ్రులు వదిలించుకున్నారు. వారికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ చెత్తకుప్పలో బిడ్డను వదిలి వెళ్లిపోయారు. ఈ సంఘటన స్థానిక ప్రగతి నర్శింగ్‌హోమ్ పక్కనే ఉన్న ఓ చెత్తకుప్పలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. ప్రగతి నర్శింగ్ హోమ్‌లో పనిచేసే కాంపౌండర్ పాలేటిపాటి వరప్రసాద్ తన దినచర్యలో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి వచ్చాడు. రోగులకు బీపీ చూసేందుకు గదుల వద్దకు వెళ్తుండగా పసిపాప ఏడుపు వినిపించింది. గదులన్నీ కలియతిరిగినా బాలిక కనిపించలేదు. సమయం గడిచేకొద్దీ బాలిక కేకలు బిగ్గరగా వినపడ్డాయి. ఆస్పత్రి గోడ పక్క నుంచి ఏడుపు వినిపించడాన్ని గమనించి దగ్గరకు వెళ్లి అవాక్కయ్యాడు. చెత్తకుప్పలో రోజుల బిడ్డను చూసి చలించిపోయాడు బిడ్డను అక్కున చేర్చుకుని తన సహచర సిబ్బందితో పాటు డాక్టర్ హరిబాబుకు సమాచారం అందించాడు. హరిబాబు స్పందించి చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు. వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి పాప సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఒంగోలు చైల్డ్‌లైన్(1098) ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చిన తర్వాత 108లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షల అనంతరం బాలికను గురువారం శిశుగృహకు తరలిస్తామని సాగర్ చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది షేక్ సల్మా, ఎంవీ స్వామి, షేక్ సుల్తాన్ పాల్గొన్నారు. రెండు నెలల్లో మూడు ఘటనలు బాలల సంక్షేమ కమిటీ జిల్లా చైర్మన్ బీవీఎస్ ప్రసాద్‌కు సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు బాలికను ఒంగోలులోని స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశుగృహానికి తరలిస్తామని సాగర్ తెలిపారు. జిల్లాలో పసిబిడ్డలను వదిలి వెళ్లడం రెండు నెలల్లో ఇది మూడో సంఘటనని చెప్పారు. వివాహేతర సంబంధాల వల్ల కలిగిన బిడ్డలు.. మగపిల్లల కోసం నిరీక్షించి ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలకు వడిగడుతున్నారని సాగర్ పేర్కొన్నారు. ఇదిగో.. నిబంధన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తప్పనిసరిగా ఉయ్యాలలు ఏర్పాటు చేయాలి. బిడ్డలను వదిలించుకోవాలనుకునేవారు వారిని ఆ ఉయ్యాలల్లో వదిలి పెట్టాలి. రోజూ అంగన్వాడీ ఆయాలు ఆ ఉయ్యాలలను పరిశీలించి అందులో బిడ్డ ఉంటే తక్షణమే శిశుగృహకు తరలించాలి. ఇందుకోసం ప్రభుత్వం ‘ఉయ్యాల’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది.