వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అంతాపూర్ తండాలో నెలన్నర వయసున్న పసిపాప విక్రయాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. కోటగిరి మండలం జల్లాపల్లి అబాదికి చెందిన దేగావత్ శాంతాబాయి, మోహన్ దంపతులు ఏడేళ్ల క్రితం అంతాపూర్‌తండాకు వలస వచ్చి, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు. నెలన్నర క్రితం మరో కూతురు జన్మించింది. ముగ్గురు ఆడపిల్లలు కావడం, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో పసిపాపను విక్రయించాలని నిర్ణయిం చుకున్నారు. పాపను అమ్మేందుకు వారు మూడు రోజులుగా బోధన్ ప్రాంతంలో తిరుగుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త చంద్రకళ గురువారం ఉదయం ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు నిందితులకు అంగన్‌వాడీ కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. తమది పేద కుటుంబమని, ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని శాంతాబాయి, మోహన్ తెలిపారు. అందుకే పసిపాపను అమ్మాలనుకున్నామని చెప్పారు. సర్పంచ్ కిషన్, ఆర్‌ఐ వరుణ్, వీఆర్వో ఆశోక్ వారిని సముదాయించారు. అనంతరం పసిపాపను నిజామాబాద్‌లోని బాలసదన్‌కు తరలించారు.
అంగట్లో ఆడపిల్ల
Published Fri, Jun 10 2016 3:45 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement