ముద్దొస్తోంది కదూ... ఆడ పిల్ల కావడంతో చెత్తకుప్పలో వదిలేసిన తల్లిదండ్రులు
తెగి పడ్డా నింగి చుక్కనా..
చెత్తకుండి కాడ కుక్కనా...
ఏ తల్లీకన్నా బిడ్డనో..
నేను ఏ అయ్యా కన్నా పాపనో..?
చెత్తకుప్పల వద్ద ప్రత్యక్షమయ్యే పసి బాలికల ఆవేదనను ఓ అభ్యుదయ కవి తన పాటలో చక్కగా వర్ణించాడు. అడపిల్ల పుట్టిందని కొందరు తల్లిదండ్రులు తమ పొత్తిళ్లబిడ్డను గుట్టుచప్పుడు కాకుండా చెత్తకుప్పల్లో వేస్తున్నారు. కన్న మమకారాన్ని కూడా కాదని నిలువునా వదిలించుకుంటున్నారు. వారికొచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ అప్పుడే బాహ్య ప్రపంచాన్ని చూసిన పసికందులను అనాధలను చేస్తున్నారు.
- సింగరాయకొండలో చెత్తకుప్పలో పసిప్రాణం
- పొత్తిళ్ల బాలికను అక్కున చేర్చుకున్న ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది
- పాపను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించిన డాక్టర్ హరిబాబు
- చైల్డ్‌లైన్ ప్రతినిధికి సమాచారం.. ఆ వెంటనే రిమ్స్‌కు తరలింపు
సింగరాయకొండ : నాలుగు రోజులు కూడా నిండని పొత్తిళ్ల ఆడ బిడ్డను తల్లిదండ్రులు వదిలించుకున్నారు. వారికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ చెత్తకుప్పలో బిడ్డను వదిలి వెళ్లిపోయారు. ఈ సంఘటన స్థానిక ప్రగతి నర్శింగ్‌హోమ్ పక్కనే ఉన్న ఓ చెత్తకుప్పలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. ప్రగతి నర్శింగ్ హోమ్‌లో పనిచేసే కాంపౌండర్ పాలేటిపాటి వరప్రసాద్ తన దినచర్యలో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి వచ్చాడు.
రోగులకు బీపీ చూసేందుకు గదుల వద్దకు వెళ్తుండగా పసిపాప ఏడుపు వినిపించింది. గదులన్నీ కలియతిరిగినా బాలిక కనిపించలేదు. సమయం గడిచేకొద్దీ బాలిక కేకలు బిగ్గరగా వినపడ్డాయి. ఆస్పత్రి గోడ పక్క నుంచి ఏడుపు వినిపించడాన్ని గమనించి దగ్గరకు వెళ్లి అవాక్కయ్యాడు. చెత్తకుప్పలో రోజుల బిడ్డను చూసి చలించిపోయాడు బిడ్డను అక్కున చేర్చుకుని తన సహచర సిబ్బందితో పాటు డాక్టర్ హరిబాబుకు సమాచారం అందించాడు.
హరిబాబు స్పందించి చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు. వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి పాప సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఒంగోలు చైల్డ్‌లైన్(1098) ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చిన తర్వాత 108లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షల అనంతరం బాలికను గురువారం శిశుగృహకు తరలిస్తామని సాగర్ చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది షేక్ సల్మా, ఎంవీ స్వామి, షేక్ సుల్తాన్ పాల్గొన్నారు.
రెండు నెలల్లో మూడు ఘటనలు
బాలల సంక్షేమ కమిటీ జిల్లా చైర్మన్ బీవీఎస్ ప్రసాద్‌కు సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు బాలికను ఒంగోలులోని స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశుగృహానికి తరలిస్తామని సాగర్ తెలిపారు. జిల్లాలో పసిబిడ్డలను వదిలి వెళ్లడం రెండు నెలల్లో ఇది మూడో సంఘటనని చెప్పారు. వివాహేతర సంబంధాల వల్ల కలిగిన బిడ్డలు.. మగపిల్లల కోసం నిరీక్షించి ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలకు వడిగడుతున్నారని సాగర్ పేర్కొన్నారు.
ఇదిగో.. నిబంధన
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తప్పనిసరిగా ఉయ్యాలలు ఏర్పాటు చేయాలి. బిడ్డలను వదిలించుకోవాలనుకునేవారు వారిని ఆ ఉయ్యాలల్లో వదిలి పెట్టాలి. రోజూ అంగన్‌వాడీ ఆయాలు ఆ ఉయ్యాలలను పరిశీలించి అందులో బిడ్డ ఉంటే తక్షణమే శిశుగృహకు తరలించాలి. ఇందుకోసం ప్రభుత్వం ‘ఉయ్యాల’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది.