Private hospital staff
-
నేటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిబ్బందికి టీకా
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందికి కరోనా టీకా వేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రైవేట్‌లో టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఒక్కో ఆసుపత్రికి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం మార్గదర్శకాలు జారీచేసింది. గతంలో 100 మందికిపైగా సిబ్బంది ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించగా, తాజా మార్గదర్శకాల్లో 50 మందికి పైగా ఉన్న ఆసుపత్రుల్లోనూ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ సిబ్బందిలో 64 శాతం మందికి టీకా ఈ నెల 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమంలో భాగంగా మొదటగా ప్రభుత్వ వైద్య సిబ్బందికి టీకా వేసిన విషయం విదితమే. అందులో 1.10 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి ఇప్పటిదాకా టీకాలు వేశారు. అంటే మొత్తం ప్రభుత్వ సిబ్బందిలో 64 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు. కొందరు టీకాను తిరస్కరించగా, కొందరు తర్వాత వేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వేయించుకోని ప్రభుత్వ సిబ్బందికి సోమవారం మాప్‌అప్ రౌండ్లో టీకా వేస్తారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేలా చూడాలని ఆసుపత్రి వర్గాలను ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు అవగాహన కల్పించాలని, టీకా సురక్షితమని తెలియజెప్పాలని సూచించింది. మొత్తం 1.90 లక్షల మంది ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. అందుకోసం 400 ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇవీ మార్గదర్శకాలు... – కోవిన్ పోర్టల్‌లో చేరిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అక్కడికి అవసరమైన సుశిక్షిత ప్రభుత్వ వైద్య సిబ్బందిని పంపిస్తారు. – ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో 50 మంది కంటే తక్కువ సిబ్బంది ఉంటే వారికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా వేస్తారు. అలాగే వాటికి సమీపంలో పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి ఉంటే వాటిల్లోనూ టీకాలు వేస్తారు. – ప్రతీ టీకా కేంద్రంలో 100 మందికంటే ఎక్కువగా టీకా వేయకూడదు. ఆ మేరకే ప్రణాళిక రచించాలి. – కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాతే టీకాలు వేయాలి. ఆఫ్‌లైన్ పద్దతిలో వ్యాక్సినేషన్‌కు అనుమతి లేదు. – వ్యాక్సినేషన్‌ను ముందుగానే ప్రారంభించాలి. మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేయాలి. అలా చేయడం వల్ల కోవిన్ యాప్‌లో వివరాలను నమోదు చేయడానికి సమయం దొరుకుతుంది. – టీకాలను బుధ, శనివారం (ఆదివారం సెలవు) మినహా మిగిలిన అన్ని రోజుల్లో వేసేలా ప్రణాళిక రూపొందించాలి. – ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి నియమితులయ్యే నోడల్ ఆఫీసర్ టీకాల కేంద్రాన్ని, తేదీలను, ఇతర సమాచారాన్ని సమన్వయం చేయాలి. అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు బాధ్యత ఆయనదే. – ప్రతి టీకా కేంద్రంలో సైడ్‌ఎఫెక్టŠస్ తలెత్తితే చికిత్స చేసేలా మెడికల్ కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. – ప్రజా ప్రతినిధులు, ఐఎంఏ ప్రతినిధులు, ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. -
అమ్మకే..బరువైన ఆడ శిశువు
తెగి పడ్డా నింగి చుక్కనా.. చెత్తకుండి కాడ కుక్కనా... ఏ తల్లీకన్నా బిడ్డనో.. నేను ఏ అయ్యా కన్నా పాపనో..? చెత్తకుప్పల వద్ద ప్రత్యక్షమయ్యే పసి బాలికల ఆవేదనను ఓ అభ్యుదయ కవి తన పాటలో చక్కగా వర్ణించాడు. అడపిల్ల పుట్టిందని కొందరు తల్లిదండ్రులు తమ పొత్తిళ్లబిడ్డను గుట్టుచప్పుడు కాకుండా చెత్తకుప్పల్లో వేస్తున్నారు. కన్న మమకారాన్ని కూడా కాదని నిలువునా వదిలించుకుంటున్నారు. వారికొచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ అప్పుడే బాహ్య ప్రపంచాన్ని చూసిన పసికందులను అనాధలను చేస్తున్నారు. - సింగరాయకొండలో చెత్తకుప్పలో పసిప్రాణం - పొత్తిళ్ల బాలికను అక్కున చేర్చుకున్న ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది - పాపను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించిన డాక్టర్ హరిబాబు - చైల్డ్‌లైన్ ప్రతినిధికి సమాచారం.. ఆ వెంటనే రిమ్స్‌కు తరలింపు సింగరాయకొండ : నాలుగు రోజులు కూడా నిండని పొత్తిళ్ల ఆడ బిడ్డను తల్లిదండ్రులు వదిలించుకున్నారు. వారికి వచ్చిన కష్టం ఏమిటో తెలియదుగానీ చెత్తకుప్పలో బిడ్డను వదిలి వెళ్లిపోయారు. ఈ సంఘటన స్థానిక ప్రగతి నర్శింగ్‌హోమ్ పక్కనే ఉన్న ఓ చెత్తకుప్పలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. ప్రగతి నర్శింగ్ హోమ్‌లో పనిచేసే కాంపౌండర్ పాలేటిపాటి వరప్రసాద్ తన దినచర్యలో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి వచ్చాడు. రోగులకు బీపీ చూసేందుకు గదుల వద్దకు వెళ్తుండగా పసిపాప ఏడుపు వినిపించింది. గదులన్నీ కలియతిరిగినా బాలిక కనిపించలేదు. సమయం గడిచేకొద్దీ బాలిక కేకలు బిగ్గరగా వినపడ్డాయి. ఆస్పత్రి గోడ పక్క నుంచి ఏడుపు వినిపించడాన్ని గమనించి దగ్గరకు వెళ్లి అవాక్కయ్యాడు. చెత్తకుప్పలో రోజుల బిడ్డను చూసి చలించిపోయాడు బిడ్డను అక్కున చేర్చుకుని తన సహచర సిబ్బందితో పాటు డాక్టర్ హరిబాబుకు సమాచారం అందించాడు. హరిబాబు స్పందించి చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు. వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి పాప సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఒంగోలు చైల్డ్‌లైన్(1098) ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చిన తర్వాత 108లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షల అనంతరం బాలికను గురువారం శిశుగృహకు తరలిస్తామని సాగర్ చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది షేక్ సల్మా, ఎంవీ స్వామి, షేక్ సుల్తాన్ పాల్గొన్నారు. రెండు నెలల్లో మూడు ఘటనలు బాలల సంక్షేమ కమిటీ జిల్లా చైర్మన్ బీవీఎస్ ప్రసాద్‌కు సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు బాలికను ఒంగోలులోని స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశుగృహానికి తరలిస్తామని సాగర్ తెలిపారు. జిల్లాలో పసిబిడ్డలను వదిలి వెళ్లడం రెండు నెలల్లో ఇది మూడో సంఘటనని చెప్పారు. వివాహేతర సంబంధాల వల్ల కలిగిన బిడ్డలు.. మగపిల్లల కోసం నిరీక్షించి ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలకు వడిగడుతున్నారని సాగర్ పేర్కొన్నారు. ఇదిగో.. నిబంధన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తప్పనిసరిగా ఉయ్యాలలు ఏర్పాటు చేయాలి. బిడ్డలను వదిలించుకోవాలనుకునేవారు వారిని ఆ ఉయ్యాలల్లో వదిలి పెట్టాలి. రోజూ అంగన్వాడీ ఆయాలు ఆ ఉయ్యాలలను పరిశీలించి అందులో బిడ్డ ఉంటే తక్షణమే శిశుగృహకు తరలించాలి. ఇందుకోసం ప్రభుత్వం ‘ఉయ్యాల’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది.