
బతుకు బడిలో చేదు గుణపాఠం!
జ్ఞాపకం
బస్టాప్‌కి వచ్చేసరికి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్లడానికి బస్సు సిద్ధంగా ఉంది. గబగబా వెళ్లి ఎక్కబోయాను. ఆ కంగారులో చీర కాలికి అడ్డుపడింది. గభాలున ముందుకు పడబోతే ఎవరో చేయి పట్టుకుని ఆపారు. థాంక్యూ అన్నాను. ‘వెల్‌కమ్’ అని బదులు వచ్చింది. ఎక్కడో విన్న గొంతు. చప్పున చూశాను... రవీందర్. విస్తుపోయాను. అతను చిన్నగా నవ్వి దూరంగా వెళ్లి నిలబడ్డాడు. నా మనసు అదోలా అయిపోయింది. ఒక్కసారి గతంలోకి పరుగెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో పుట్టాను నేను. నాన్న రైతు. అమ్మ గృహిణి. ఒక్కదాన్నే సంతానం. పెద్దగా సంపద లేకపోయినా అమ్మానాన్నలు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు.
కానీ నాకు మాత్రం సంతోషంగా ఉండేది కాదు. మా ఊళ్లో మంచి స్కూల్ లేదని నన్ను పక్కనున్న టౌను స్కూల్లో వేశారు నాన్న. రోజూ సైకిల్ మీద తీసుకెళ్లి తీసుకొచ్చేవారు. నాకోసం అంత కష్టపడుతున్నందుకు నేనెప్పుడూ సంతోష పడలేదు. నా స్నేహితురాళ్ల నాన్నలు వాళ్లను బైకుల మీద తీసుకొస్తున్నారని బాధగా ఉండేది. ఉన్నదాంట్లోనే అన్నీ అమర్చేవారు అమ్మానాన్నలు. కానీ నా స్నేహితురాళ్ల దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు నాకు లేవనే బాధ. ఎప్పుడూ ఇలా ఏదో వెలితి. ఏవేవో కావాలని మనసు ఉర్రూతలూగుతూనే ఉండేది. ఆ వెర్రే నా జీవితంలో సంతోషం లేకుండా చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.
డిగ్రీ అయ్యాక హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో పీజీ చేయడానికి పంపారు నన్ను. ఒక్కసారిగా అంత పెద్ద సిటీలో అడుగు పెట్టగానే మనసు పక్షిలా ఎగరసాగింది. కాలేజీలో సాటి అమ్మాయిల ఆధునికత, ఖరీదైన జీవితాలు నన్ను అయస్కాంతంలా లాగేవి. నాకూ అలా బతకాలనే తహతహ. అదే నన్ను విక్రమ్‌కి అట్రాక్ట్ అయ్యేలా చేసింది. తను డబ్బున్నవాడు. కరెన్సీ నోట్లను చిత్తు కాగితాల్లా చూసేవాడు. ఎంత అంటే అంత ఖర్చు పెట్టేవాడు. మొదటిసారి నన్ను చూసినప్పట్నుంచే నా వెంట పడటం మొదలెట్టాడు. నేను లేకుండా బతకలేనన్నాడు. అలాంటివాణ్ని చేసుకుంటే నా కలలన్నీ తీరతాయనుకున్నాను. అతని మోజులో పడ్డాను.
సరిగ్గా అదే సమయంలో రవీందర్ నాకు ప్రపోజ్ చేశాడు. కానీ అతడు నా కంటికి ఆనలేదు. విక్రమ్‌ని ప్రేమిస్తున్నానని ముఖమ్మీదే చెప్పాను. ఇంకోసారి నాకు కనిపించకు అన్నాను. అతను వెళ్లిపోయాను. నా జీవితం నుంచే కాదు, కాలేజీ నుంచే వెళ్లిపోయాడు. అందరూ అయ్యోపాపం అన్నాను. నేను మాత్రం వాడి ఖర్మనుకున్నాను. కాలం గిర్రున తిరిగింది. పీజీ ముగిసింది. నేను ఊరెళ్లిపోయాను. అప్పుడే నా కళ్లు తెరచుకున్నాయి. విక్రమ్ ఫోన్ ఎంతకీ కనెక్ట్ కాలేదు. మెయిల్‌కి రిప్లై లేదు. ఫ్రెండ్స్‌ని అడిగితే తెలియదన్నారు. తన కోసం చాలా వెతికాను. చాన్నాళ్లు గాలించాను.
కనిపించలేదు. తను నన్ను మోసం చేశాడని అప్పుడుగానీ అర్థం కాలేదు. మనసు విరిగిపోయింది. డబ్బు వ్యామోహంలో పడి ఏం పోగొట్టుకున్నానో అర్థమైంది. బాధను అణచుకుని హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాను. అమ్మానాన్నలు పెళ్లి చేస్తామన్నా వద్దన్నాను. వాళ్లను బాగా చూసుకుంటే చాలనుకున్నాను. కానీ ఆరేళ్ల తర్వాత రవీం దర్‌ని చూడగానే ఏవేవో ఆలోచనలు. ఏవో కొత్త ఆశలు. దగ్గరకు వెళ్దామని అడుగు ముందుకేయబోయి చప్పున ఆగిపోయాను. ఎందుకంటే... పక్కనే అతని భార్య, పిల్లలు! బతుకు పాఠశాల ఎన్ని పాఠాలు, చేదు గుణపాఠాలు నేర్పుతుందో కదా!
- డి.యస్, హైదరాబాద్