అన్వేషణం: పంటచేల మధ్య పల్లెటూరు | Longji village between Paddy crops in China | Sakshi
Sakshi News home page

అన్వేషణం: పంటచేల మధ్య పల్లెటూరు

Published Sun, Oct 13 2013 2:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

అన్వేషణం: పంటచేల మధ్య పల్లెటూరు

అన్వేషణం: పంటచేల మధ్య పల్లెటూరు

మన దేశంలోని పలు గ్రామాల్లో అక్కడక్కడా వరి చేలు కనిపిస్తూ ఉంటాయి మనకు. అయితే చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో మాత్రం చేల మధ్యన అక్కడక్కడా ఇళ్లు కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ పచ్చని చేలు ఆవరించి ఉండగా, మధ్యలో అక్కడక్కడా విసిరేసినట్టుగా ఇళ్లు ఉంటాయి. దాంతో అదో అద్భుతమైన చిత్రంలా కనిపిస్తుంది మనకు. ఇది నిజంగా ఎక్కడా కనిపించని ఓ అరుదైన దృశ్యమనే చెప్పాలి!
 
 గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని లాంగ్షెంగ్ కౌంటీలో ఉన్న లాంగ్జీ గ్రామం... ఈ పచ్చని పంటచేలకి నిలయం. ఆ గ్రామానికి వెళ్తే... పచ్చదనం తప్ప మరేమీ కనిపించదు. అత్యంత ఎత్తై కొండలకు పచ్చచీరను చుట్టినట్టుగా అనిపిస్తుంది. చీరమీద ఉన్న చుక్కల్లా కనిపిస్తాయి చేల మధ్య ఇళ్లు. ఆ పచ్చదనమంతా వరి చేలవల్ల వచ్చిందే. కొండవాలుల్లో చేలు ఉండటం అనేది కాస్త ఆశ్చర్యంగానూ, మరికాస్త అబ్బురంగానూ అనిపిస్తుంది. ప్రకృతిలోని సౌందర్యమంతా అక్కడే కుప్ప పోసిన అనుభూతి కలుగుతుంది.
 
 లాంగ్జీ అంటే... డ్రాగన్ వెన్నెముక అని అర్థం. ఈ గ్రామం ఎత్తయిన కొండ మీద ఏర్పడింది. దూరం నుంచి చూస్తే ఈ కొండ డ్రాగన్ వెన్నెముకలాగే కనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. లాంగ్జీ గ్రామస్థులకు పంటను పండించుకోవడానికి ప్రత్యేకంగా నేల లేదు. అందుకే కొండ వాలులనే వరి చేలుగా చేసుకున్నారు. వందలాది వరుసలుగా నాట్లు వేసి వరిని పండిస్తున్నారు. పర్వత ప్రాంతం కాబట్టి వర్షాలకు లోటు ఉండదు. పైగా ఏటవాలు ప్రాంతం కాబట్టి వర్షపు నీరు చక్కగా జారుతూ, మొత్తం చేలన్నిటినీ తడుపుతుంది. వర్షం పడనప్పుడు పక్కన ఉన్న జలాశయాల ద్వారా నీటి సదుపాయాన్ని ఏర్పరచుకుంటారు. ఈ టై వ్యవసాయం చాలాచోట్ల ఉన్నా... ఇక్కడ ఉన్నంత భారీ స్థాయిలో మాత్రం మరెక్కడా ఉండదు!
 
 వేళ్లాడే పూలతోట!
 గులాబి తోటలు, మల్లెతోటలు, చామంతి తోటల వంటివెన్నో చూస్తుంటాం. కానీ విస్టీరియా పూలతోటను చూసే అవకాశం మనకు దొరకదు. ఎందుకంటే, అవి మన దేశంలో ఉండవు. చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో మాత్రమే విరివిగా ఉంటాయి. మరికొన్ని దేశాల్లో కూడా ఉన్నా, చాలా తక్కువగానే కనిపిస్తాయి.
 
 తెలుపు, గులాబి, లేత నీలం, పర్పుల్ రంగుల్లో ఉండే విస్టీరియా పూల అందమే వేరు. ఈ పూలతీగలు ఎంతో వేగంగా వ్యాపిస్తాయి. రెయిలింగ్ మీద, గోడమీద, చెట్ల మీద... ఎక్కడైనా పాకేస్తాయి. చక్కటి లేత పరిమళాన్ని కూడా వెదజల్లుతాయి. జపాన్ వారికి ఈ పూలంటే ప్రత్యేకమైన ఇష్టం. అందుకే ఆ దేశంలోని పలు  ప్రదేశాల్లో ఈ పూలతీగలు కనిపిస్తుంటాయి. అయితే వీటి అసలైన అందాన్ని చూడాలంటే... టోక్యోకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కవాచీ ఫ్యుజీ గార్డెన్స్‌కు వెళ్లాలి.
 
 విస్టీరియా పూలతీగలు ఈ గార్డెన్‌లో ఉన్నంతగా మరెక్కడా ఉండవు. ఇక్కడ వీటిని ఓ క్రమ పద్ధతిలో పెంచారు. తెలుపు, గులాబి, నీలం, పర్పుల్ రంగుల పూల తీగలను ఓ వరుస క్రమంలో పెరిగేలా చేయడం వల్ల ఆ తోట ఓ ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకుంది. ఎత్తయిన రెయిలింగ్ మీద వీటిని పాకించి, అందంగా కత్తిరించడం వల్ల వాటి కింద నుంచి వెళ్తుంటే ఓ సొరంగంలోంచి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అందుకే దీనిని విస్టీరియా ఫ్లవర్ టన్నెల్ అంటారు. ఎప్పుడైనా జపాన్ వెళ్తే దీన్ని మిస్ కావొద్దు. ఎందుకంటే, అంత గొప్ప అనుభూతిని అన్నిసార్లూ పొందలేం కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement