శివోహం | lord shiva speicla story | Sakshi
Sakshi News home page

శివోహం

Published Sun, Mar 11 2018 12:01 AM | Last Updated on Sun, Mar 11 2018 12:01 AM

lord shiva speicla story - Sakshi

విద్యలన్నింటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నింటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం గొప్పది. అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం గొప్పది. పంచాక్షరిని పలుకలేకున్నా, అందులో ‘శివ’ అనే రెండక్షరాలు చాలా గొప్పవి అని శాస్త్ర వచనం. శివుడినే శంకరుడని కూడా అంటారు. శంకరోతి ఇతి శంకరః అని వ్యుత్పత్తి. అంటే శమనం లేదా శాంతిని కలిగించేవాడు అని అర్థం. 

‘శివ శివ శివ యనరాదా... భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఉపవాస దీక్షలతో, జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో, అభిషేక, అర్చనాది శివారాధన కార్యక్రమాలలో నిమగ్నమై పునీతమవుతారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు తొలుత హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి ముల్లోకాలూ దగ్ధమై భస్మీపటలం కాగలవని భయపడిన దేవదానవులు తమను కాపాడాలంటూ శివుడికి మొర పెట్టుకోవడంతో, శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. హాలాహలం వేడిమికి శివుడి కంఠమంతా కమిలిపోయి, నీలంగా మారుతుంది. ఈ కారణంగానే శివుడు నీలకంఠుడిగా, గరళకంఠుడిగా పేరుగాంచాడు. ఇది జరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశి. లోకాలను కాపాడిన శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు జనులందరూ జాగరణ చేస్తారు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున శివభక్తులు జాగరణ చేయడం ఆచారంగా మారిందని ప్రతీతి. 

రాశులు... జ్యోతిర్లింగాలు
శైవక్షేత్రాలన్నింటిలోనూ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవి. ఏడాది పొడవునా భక్తుల సందడితో కనిపించే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినాన మరింతగా భక్తులతో కిటకిటలాడుతాయి. మహాశివరాత్రి రోజున జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించుకోవడంపై చాలామంది ఆసక్తి చూపుతారు. మన దేశంలో ఉన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకు రాశిచక్రంలోని ద్వాదశ రాశులకు సంబంధం ఉన్న సంగతి చాలామందికి తెలియదు. జ్యోతిర్లంగాలను సందర్శించుకోవాలనుకునే వారు తమ జన్మరాశులకు చెందిన జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం శుభదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగం ఏ రాశికి చెందుతుందంటే...

రామేశ్వరం – మేషం
మేషరాశికి చెందిన వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం. త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం ఇది. తమిళనాడులో సముద్ర తీరాన వెలసిన రామేశ్వరం తీరం నుంచే వానరులు లంక వరకు సేతువును నిర్మించారు. దీని మీదుగానే వానరసేనతో రామలక్ష్మణులు లంకకు చేరుకున్నారు. రావణుడి రాక్షస సేనతో యుద్ధం చేసిన శ్రీరాముడు చివరకు రావణుడిని సంహరించాడన్న రామాయణ గాథ అందరికీ తెలిసిందే. బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించడం వల్ల చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి శ్రీరాముడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.

సోమనాథ్‌ – వృషభం
వృషభ రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం సోమనాథ్‌. ద్వాపరయుగంలో దీనిని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు. గుజరాత్‌లో సముద్ర తీరాన వెలసిన క్షేత్రం ఇది. మహమ్మద్‌ ఘజనీ దాడిలో విధ్వంసానికి గురైన సోమనాథ్‌ ఆలయాన్ని స్వాతంత్య్రానంతర కాలంలో చాళుక్య శిల్ప శైలిలో పునర్నిర్మించారు. దక్షుడి శాపానికి గురైన చంద్రుడు ఇక్కడి జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల తిరిగి తేజస్సును పొందగలిగాడని, అందువల్ల దీనికి చంద్రుడి పేరిట సోమనాథ క్షేత్రమనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. 

నాగేశ్వరం – మిథునం
మిథున రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఇది గుజరాత్‌లో సముద్రతీరాన ద్వారకలోని దారుకావనంలో ఉంది. ఒకప్పుడు దారుకావన ప్రాంతాన్ని దారుకుడనే రాక్షసుడు పాలించేవాడు. జనాలను విపరీతంగా పీడించేవాడు. తనకు నచ్చని వారిని నిష్కారణంగా చెరసాలలో బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని కూడా అలాగే చెరసాలలో బంధించాడు. సుప్రియుడు ప్రార్థించడంతో శివుడు దారుకుడిని సంహరించి అక్కడ స్వయంభువుగా జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని శివపురాణం చెబుతోంది.

ఓంకారేశ్వరం – కర్కాటకం
కర్కాటర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం ఓంకారేశ్వర లింగం. ఇది మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో వింధ్య పర్వత శ్రేణుల్లో వెలసిన క్షేత్రం. ఓంకారేశ్వర లింగం ఆవిర్భావానికి సంబంధించి పురాణాల్లో పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత మహారాజు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించినట్లు ఒక గాథ ఉంది. 

వైద్యనాథ్‌ – సింహం
సింహ రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసినది వైద్యనాథ లింగం. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌ జిల్లాలో ఉన్న వైద్యనాథ క్షేత్రాన్ని స్థానికంగా బైద్యనాథ్‌గా పిలుస్తారు. వైద్యనాథ లింగం సాక్షాత్తు పరమశివుని ఆత్మలింగమేనని ప్రతీతి. లంకకు రక్షణగా సాక్షాత్తు శివుడినే ప్రతిష్ఠించాలనే సంకల్పంతో రావణుడు కైలాసానికి వెళ్లి, శివుడిని ఆత్మలింగం కోరాడు. అతడికి ఆత్మలింగం అనుగ్రహించిన శివుడు, మార్గమధ్యంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచరాదని షరతు విధిస్తాడు. అలా ఉంచితే అది అక్కడే శాశ్వతంగా ఉండిపోతుందని హెచ్చరిస్తాడు. రావణుడు ఆత్మలింగంతో లంకకు చేరుకుంటే ముల్లోకాలకు మరింత ప్రమాదకారిగా పరిణమించగలడని తలచిన దేవతలు అతడికి ఆటంకం కలిగించేందుకు వరుణుడి సాయం కోరుతారు. వరుణుడి ప్రభావంతో రావణుడికి మార్గమధ్యంలో లఘుశంక తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో బ్రాహ్మణ రూపంలో తారసపడిన వినాయకుడి చేతికి ఆత్మలింగం ఇచ్చి, దానిని జాగ్రత్తగా పట్టుకుని, తాను రాగానే తన చేతికి ఇవ్వాలని కోరాడు. అయితే, నిమిషంలోగా రాకుంటే శివలింగాన్ని వదిలేసి తన దారిన తాను పోతానని చెబుతాడు. రావణుడు నిమిషంలోగా తిరిగి రాలేకపోవడంతో వినాయకుడు దాన్ని  అక్కడే వదిలేసి మాయమవడంతో ఆత్మలింగం అక్కడే ఉండిపోయిందని శివపురాణం చెబుతోంది.

మల్లికార్జునుడు – కన్య
కన్య రాశి వారు దర్శించుకోవలసినది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున జ్యోతిర్లింగం. శివపార్వతులు తన కంటే ముందుగా వినాయకుడిని వివాహం చేయడంతో కార్తికేయుడు అలిగి కైలాసాన్ని వీడి, క్రౌంచపర్వతం మీదకు చేరుకుని అక్కడ జపతపాలు ప్రారంభిస్తాడు. కార్తికేయుడిని బుజ్జగించి ఎలాగైనా అతడిని తిరిగి కైలాసానికి తీసుకురావాలనే సంకల్పంతో శివపార్వతులిద్దరూ అక్కడకు బయలుదేరుతారు. తన తల్లిదండ్రులు అక్కడకు వస్తున్నట్లు దేవతల ద్వారా తెలుసుకున్న కార్తికేయుడు క్రౌంచపర్వతాన్ని వీడి వెళ్లడానికి సిద్ధపడతాడు. అయితే, దేవతలు నచ్చజెప్పడంతో అతడు అక్కడే ఉంటాడు. ఆ ప్రాంతానికి చేరుకున్న శివుడు జ్యోతిర్లింగంగా శ్రీశైలంపై ఆవిర్భవించి,. మల్లెపూలతో అర్చనలు అందుకోవడం వల్ల మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

మహాకాళేశ్వరం – తుల
తుల రాశి వారు దర్శించుకోవలసినది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడి జ్యోతిర్లింగం ఆవిర్భావానికి కారణాలుగా పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. శివుడు ఇక్కడ స్వయంభువుగా జ్యోతిర్లింగ రూపంలో వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తన భక్తుడైన రాజు చంద్రసేనుడిపై శత్రురాజులు దండెత్తినప్పుడు అతడికి రక్షణగా శివుడు మహాకాళుడిగా వచ్చి, శత్రువులను సంహరించాడు. ఆ తర్వాత ఇక్కడ జ్యోతిర్లింగంగా ఉద్భవించినట్లు పురాణాల కథనం. 

ఘృష్ణేశ్వరం – వృశ్చికం
వృశ్చిక రాశి వారు దర్శించుకోవలసినది ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. దీనినే ధూషణేశ్వర లింగం అని, కుశేశ్వర లింగం అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా ఎల్లోరా గుహలకు అత్యంత చేరువలో ఉంది. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావంపై అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు పార్వతీదేవి తన పాపిట తిలకం దిద్దుకోవడం కోసం అరచేతిలో కుంకుమపువ్వ, పసుపు నీటితో కలుపుతూ ఉండగా ఆశ్చర్యకరంగా అది తేజోవంతమైన శివలింగాకృతి ధరించింది. నేలపై ఉంచగానే అది నేలలో కూరుకుపోయింది. శివుడు ఈ విషయం చెప్పగా, తన తేజోరూపమైన జ్యోతిర్లింగం పాతాళంలో కూరుకుపోయిందని చెప్పి, దానిని తన త్రిశూలంతో పైకి తీసుకొస్తాడు. శివుడు త్రిశూలంతో తవ్విన చోట ఉద్భవించిన గంగ ఇక్కడ ఎలగంగానదిగా ప్రవహిస్తోంది. 

విశ్వేశ్వరం – ధనుస్సు
ధనుస్సు రాశి వారు దర్శించుకోవలసినది విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ భక్తులు అత్యధికంగా దర్శించుకునేది కాశీలోని పవిత్ర గంగా తీరంలో ఉన్న విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్నే. కాశీలోని విశ్వనాథ ఆలయం అత్యంత పురాతనమైనది. పలు పురాణాలలో కాశీ క్షేత్ర ప్రాశస్త్యం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇది మోక్ష క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. కాశీలో మరణిస్తే మరుజన్మ ఉండకుండా నేరుగా మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రాణాలు వదిలిన వారిని యమభటులు ఏమీ చేయరని వారు విశ్వసిస్తారు. నిర్గుణ నిరాకారుడిగా ఉన్న శివుడు సుగుణుడిగా జ్యోతిర్లింగ స్వరూపంతో ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతాయి. సాక్షాత్లు శివుడే కాశీ నగరాన్ని సృష్టించాడని ప్రతీతి. 

భీమశంకరం – మకరం
మకర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల వద్ద భీమా నది తీరాన వెలసింది భీమశంకర క్షేత్రం. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు దేవతల కోరిక మేరకు సహ్యాద్రికి చేరుకుని, ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంభువుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

కేదారేశ్వరం – కుంభం
 కుంభ రాశి వారు దర్శించుకోవలసినది కేదారే«శ్వర జ్యోతిర్లింగం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల వద్ద కైలాస పర్వతానికి సమీపంలో ఉంది కేదార్‌నాథ్‌ క్షేత్రం. నాలుగు పవిత్ర ధామాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఇది. కృతయుగంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కేదార మహారాజు పేరిట ఈ క్షేత్రానికి కేదార్‌నాథ్‌ అనే పేరు వచ్చిందని చెబుతారు. పురాణాల కథనం ప్రకారం... కురుక్షేత్ర సంగ్రామంలో సోదరులను వధించిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశారు. పాండవులు చేసిన పాపం తక్కువేమీ కాకపోవడంతో శివుడు వారికి అంత తేలికగా పాప విమోచనం కల్పించరాదని భావించాడు. వారికి పరీక్ష పెట్టడం కోసం వృషభ రూపంలో వారి ఎదుట రంకెలు వేస్తూ నిలిచాడు. భీముడు వృషభాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అతడు మూపురాన్ని మాత్రమే పట్టుకోగలిగాడు. ఆ మూపురమే ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసిందని పురాణాలు చెబుతాయి. 

త్రయంబకేశ్వరం – మీనం
మీన రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసినది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. త్య్రయంబకేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో గోదావరి నది ఉద్భవించిన ప్రదేశానికి చేరువలో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు ముఖాలు ఈ జ్యోతిర్లింగంపై ఉండటం ఇక్కడి విశేషం. పాండవుల నాటిదిగా చెప్పుకొనే రత్నఖచిత కిరీటం కూడా ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. ప్రతి సోమవారం ప్రదోష వేళ... అంటే సాయంత్రం సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ఈ కిరీటాన్ని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. పురాణాల కథనం ప్రకారం... గౌతమ మహర్షి చేతిలో మాయ గోవు మరణిస్తుంది. గోహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి గౌతమ మహర్షి శివుడి కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేస్తాడు. గౌతముడి తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంభువుగా అవతరించాడు. గౌతముడి కోరికపై గంగను గో కళేబరం మీదుగా ప్రవహింపజేసి, అతడికి పాప విమోచనుడిని చేశాడు. గో కళేబరం మీదుగా గంగ ప్రవహించడంతో ఇక్కడ ఆవిర్భవించిన నదికి గోదావరి అనే పేరువచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా రాజు బాలాజీ బాజీరావు నిర్మించాడు. త్రయంబకేశ్వర క్షేత్ర పరిసరాల్లో నీలాంబిక, మాతాంబిక మందిరాలు, దత్తాత్రేయ ఆలయం వంటి సందర్శనీయ స్థలాలు ఉన్నాయి.

మహాశివరాత్రిని ఎలా పాటించాలంటే...
మహాశివరాత్రి రోజున వేకువజామునే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో నిత్యపూజ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. ఉపవాస దీక్షలు పాటించేవారు పండ్లు, పాలు మాత్రమే స్వీకరించాలి. లౌకిక విషయాలను ఎక్కువగా చర్చించకుండా వీలైనంతగా భగవద్ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వీలుంటే మహాశివునికి అభిషేకం జరిపించడం మంచిది. మరునాటి సాయంత్రం ఆకాశంలో చుక్క కనిపించేంత వరకు జాగరణ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా భగవద్ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

మహా శివభక్తుడు కన్నప్ప
శివ భక్తులందరిలోనూ మహాభక్తుడైన కన్నప్ప ఉదంతమే వేరు. అతడి అసలు పేరు తిన్నడు. బోయవాడు. రోజూ అడవిలో వేటాడేవాడు. ఒకసారి అతడికి ఎవరూ లేని గుడిలో శివలింగం కనిపిస్తుంది. శివుడిని తనతో ఇంటికి రమ్మని వేడుకుంటాడు. శివలింగం నుంచి ఎలాంటి బదులు రాకపోవడంతో తాను అక్కడే ఉండిపోయి, రోజూ ఉదయం శివలింగాన్ని, ఆలయాన్ని శుభ్రపరచేవాడు. తర్వాత అడవిలోకి వెళ్లి రెండు చేతుల్లోనూ పట్టినన్ని బిల్వపత్రాలు, నోట పట్టినన్ని నీళ్లు తీసుకొచ్చేవాడు. శివలింగాన్ని నోట ఉన్న నీటితో అభిషేకించి, బిల్వపత్రాలతో అలంకరించేవాడు. వేటాడిన జంతువుల మాంసాన్ని నివేదించేవాడు. ఒకసారి శివలింగం కన్నుల నుంచి రక్తం కారడం గమనించి కలత చెందుతాడు. ముందుగా ఒక కంటిని బాణంతో పెకలించి శివుడికి అర్పిస్తాడు. శివలింగం రెండో కంటి నుంచి రక్తం కారుతుండటంతో గుర్తుగా దానిపై కాలి బొటనవేలిని ఉంచి, రెండో కంటిని పెకలించేందుకు సిద్ధపడగా, శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడికి కంటిని సమర్పించడం వల్ల కన్నప్పగా ప్రసిద్ధి పొందుతాడు. 
– పన్యాల జగన్నాథదాసు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement