సుశర్మ | Mahabharat characters - 32 | Sakshi
Sakshi News home page

సుశర్మ

Published Sun, Jan 31 2016 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

సుశర్మ

సుశర్మ

సుశర్మ త్రిగర్త దేశానికి రాజు. గర్తమంటే రథమనే కాక ఇంకా చాలా అర్థాలున్నాయి: గుంతా జూద పీఠమూ శ్మశాన రాశీ

 ఐదోవేదం  మహాభారత పాత్రలు - 32
 సుశర్మ త్రిగర్త దేశానికి రాజు. గర్తమంటే రథమనే కాక ఇంకా చాలా అర్థాలున్నాయి: గుంతా జూద పీఠమూ శ్మశాన రాశీ అని. ‘శ్మ’ అంటే శరీరం; రథమన్నా శరీరమని పోలిక కొద్దీ చెబుతారు. రథంలో రథికు డున్నట్టే శరీరంలో దానికి చైతన్యాన్నిచ్చే ఆత్మ ఉంటుంది. శరీరమంటే శిథిలమై పోయేదీ నాశనమైపోయేదీ అని అర్థం. మనిషికి ఒక శరీరం కాదు, మూడు ఉన్నాయి: స్థూలంగా పైకి అవుపించే శరీరం ఒకటి; ఈ స్థూల శరీరానికి శక్తినిచ్చే సూక్ష్మ శరీరం రెండోది; ఈ రెండింటికీ కారణమైన కారణ శరీరం మూడోది. త్రిగర్తమంటే మనిషి ముప్పేట శరీరం.
 
 దాన్ని పణంగా పెట్టి, మనిషి కూడని పందేలు వేస్తూ ఉంటాడు. దీనికి మూడు గుంతలని అర్థం చెబితే, ఆ గుంతలు మూడూ నరకానికి, అంటే కిందికి తీసుకు పోడానికి ప్రవేశద్వారాలైన కామమూ క్రోధమూ లోభమూను. వాటిలో ఏదో అధికమైన సుఖం ఉందనుకునే పందెగాడు సుశర్మ. శర్మ అంటే సుఖం. ప్రతివాడూ సుఖం కోసమనే చూస్తాడు. కానీ ఆ సుఖం రాదు సరిగదా ఉన్న దుఃఖమూ పోదు; దానికితోడు మరో దుఃఖం వచ్చి కూర్చుంటుంది. సుశర్మకూ అంతే జరిగింది. అవమానానికి ప్రతి చేద్దామని పోతే దానికన్నా ఇంకా ఎక్కువ అవమానమూ చివరికి చావూ వచ్చాయి.
 
 కోపంతోనే మత్స్యదేశం మీద దండెత్తాలన్న సూచన చేశాడు సుశర్మ దుర్యోధనుడికి. దానిలో లోభం కూడా ఉంది. ఆ దేశంలో పశుసంపద కన్ను కుట్టేలాగ ఉందని, దుర్యోధనుణ్ని మత్స్య దేశం మీద దాడి చేయడానికి పురిగొల్ప డానికి ఉపోద్ఘాతంగా కీచకుడు విరటుడి పేర ఎంత హింస పెట్టాడో ఏకరువు పెట్టాడు. చాలాసార్లే కీచకుడు త్రిగర్తుల్ని బాధపెట్టాడు. అటువంటి నిర్దయుడూ పాపా చారీ గంధర్వుల చేతిలో మడిసిపోయాడని ఇప్పుడు దుర్యోధన గూఢచారులు చెప్పగా విన్న సుశర్మ అతి ఉత్సాహంతో మునుపటి కక్ష తీర్చుకోవ డానికి కాలం కలిసి వస్తుందని ఆలోచించాడు.
 
  గూఢచారుల నోట కీచక వధను విన్న దుర్యోధనుడు లోలోపల ఏదో ఆలోచించడాన్ని గమనించిన సుశర్మ ‘ఇదే అదను’ అనుకొని దుర్యోధనుడి మదిలో మత్స్యదేశాన్ని ఆక్రమించాలనే ప్రలోభాన్ని రేకెత్తించాడు.దుర్యోధనుడు కీచకుడి వధను విన్న దగ్గర్నుంచీ లోపల ఆలోచనలో మునిగి ఉండడం అతనికేదో సందేహం కలిగిందని పిస్తుంది. కీచకుడు ఒక ఆడదాని కోసం ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంటే అక్కడ భీముడు ఉన్నాడా అన్న అనుమానం అతనికి కలిగి ఉంటుంది. అది బయటికి అనకపోయినా లోలోపల వాళ్లను కనుక్కో వడం ఈవిధంగా పడవచ్చునన్న ఆశ అతనిలో చిగురెత్తి ఉంటుంది. పదమూడో ఏడాది నిండకుండానే పాండవుల్ని కనుక్కోగలిగితే ఇంకేముంది? వాళ్లు మళ్లీ అడవులు పట్టి పోవలసి వస్తుంది, ఇక తన రాజ్యానికి ఢోకా ఉండదు. ఈ కుటిలమైన ఆలోచనా అనుమానమూ సుశర్మ మాటలతో కొంత ప్రభావితమైంది. అతను సుశర్మ చేసిన యుద్ధ ప్రతిపా దనను ఆమోదించాడు. కానీ దుర్యో ధనుడు రోజుల్లెక్కల్లో ఎప్పుడో పప్పులో కాలేశాడు. ఆలస్యంగానే ఈ దాడికి సన్నద్ధమయ్యాడు. అప్పటికి పదమూడేళ్లూ అయిపోయాయని అతనికి తెలియదు.
 
 విరటుడి నగరానికి ఆగ్నేయ కోణం నుంచి సుశర్మ తన త్రిగర్త సేనల్ని వెంట బెట్టుకొని కృష్ణ పక్ష సప్తమినాడు దాడికి దిగి, అక్కడి గో సంపదను అపహరించ డానికి శ్రీకారం చుట్టాడు. విరటుడికి దాడివార్త అంది రణక్షేత్రానికి చేరుకునే సరికి మధ్యాహ్నం బాగా దాటిపోయింది. త్రిగర్త మత్స్య దేశ సేనల పరస్పర యుద్ధం దేవాసురుల పోరాటం లాగ అతి భీకరంగా సాగింది. విరటుడి తమ్ముళ్లు శతానీకుడూ మదిరాక్షుడూ త్రిగర్ద యోద్ధలను చంపుతూ వాళ్ల సేనలోకి చొచ్చుకొనిపోయారు.
 
 విరటుడు కూడా త్రిగర్త సేనలోని అయిదు వందల రథికుల్నీ ఎనిమిది వందల ఆశ్వికుల్నీ ఐదుగురు మహారథుల్నీ చంపి, ఆ మీద సుశర్మను ఎదిరించాడు. సుశర్మ యాభై బాణాలతో విరటుణ్ని వేటు వేశాడు; విరటుడూ దానికి దీటుగానే బాణవర్షం కురిపించాడు. త్రిగర్తాధిపతి తన తమ్ముడితో కలిసి రథ సమూహంతో అన్ని వైపుల నుంచీ విరటుడి మీద విరుచుకు పడ్డాడు. విరటుడి బలగాల్ని సుశర్మ నాశనం చేసి, అతని వెనక ఉండే రక్షకుల్ని చంపి, అతన్ని విరథుణ్ని చేసి ఖైదీగా పట్టు కున్నాడు. అతణ్ని తన రథం మీదకు ఎక్కించుకొని వెళ్లిపోవడానికి సంసిద్ధ మయ్యాడు. ఇది చూసి ధర్మరాజు భీముడితో ‘ఇంత కాలమూ సుఖంగా ఉండడానికి వీలు కల్పించిన ఈ రాజుకు మనం కృతజ్ఞతను చూపవలసిన సమయం వచ్చింది.
 
  అతన్ని విడిపించు. నీ వెనక నేనూ నకుల సహదేవులూ ఉంటాం’ అని అంటూ కర్తవ్యాన్ని ప్రబోధించాడు. భీముడు చెట్టునొకదాన్ని తన గదగా చేసు కుందామన్న ధోరణిలో ఉంటే, ‘నువ్వు అలాగ చెట్టూ చేమా పీకి భుజం మీద పెట్టుకుంటే ఇతను భీముడని అందరికీ అర్థమై పోతుంది. ఏదో సంసార పక్షంగా విల్లునో ఖడ్గాన్నో తీసుకొని వెళ్లు’ అని తమ గుట్టును కాపాడగలిగే సలహా నిచ్చాడు కంకుభట్టు. వలలుడు ధర్మరాజు మాటను అర్థం చేసుకొని వెంటనే ఒక విల్లు తీసుకొని కాలాంతక యముడి మాదిరిగా సుశర్మను వెంబడించాడు. అతను తన తమ్ముళ్లతో సహా వెనక్కి తిరిగి భీముడితో తలపడవలసివచ్చింది. త్రిగర్తుల సేనను చాలామటుకు ఇట్టే మట్టుబెట్టేసరికి సుశర్మకు చాలా భయం వేసింది.
 
 దర్మజుడు బాణాలతో ఒకవైపు నుంచి దాడిచేస్తూ ఉంటే, భీముడు సుశర్మ రథాశ్వాల్ని చంపేశాడు; పార్శ్వ రక్షకుల్ని బాణాలతో నేలకూల్చాడు; సారథిని నేల మీద పడిపోయేలాగ చేశాడు. అంతే, ఆ అదను చూసి, విరటుడు సుశర్మ రథం నుంచి ఉరికి బయటపడ్డాడు. సుశర్మ పలాయనం చిత్తగిస్తూంటే, ‘ఆగు, ఆగు’ అంటూ వెంటబడి అతని జుటు ్టపట్టుకున్నాడు. అతను తప్పించుకోవ డానికి గింజుకొంటూ ఉంటే, బల వంతంగా నేలమీద పడేసి ఈడ్చాడు. ‘ఇతగాణ్ని చంపెయ్యాలి గానీ మా అన్న చాలా దయావంతుడు. చూద్దాం ఏం చేస్తాడో’ అనుకుంటూ సుశర్మని అన్న ముందు నిలబెట్టాడు. ‘ఇక మీద ఎప్పుడూ ఇటువంటి సాహసం చెయ్యకు’ అని సుశర్మను మందలించాడు.
 
  సుశర్మ సిగ్గుతో తలవంచుకొని విరాట రాజుకు నమస్కరించి, తోక ముడుచుకొని పోయాడు.
 మరొకరి సంపత్తిని చూసి దాన్ని తనదిగా చేసుకోవాలన్న కోరికా కక్కుర్తీ ఎంత నీచ దశకు తెస్తాయో చావుతప్పి కన్ను లొట్టబోయిన సుశర్మకు కొంతగా తెలిసినా అది శ్మశాన వైరాగ్యంలాగా ప్రసూతి వైరాగ్యంలాగా ఎంతోసేపు నిలవ లేదు. ద్రోణ సైనాపత్యంలో ద్రోణుడు దుర్యోధనుడికిచ్చిన వరాన్ని తీర్చడానికి ‘ఏదో ఒక ఉపాయంతో నువ్వు అర్జునుణ్ని దూరంగా తీసుకొని వెళ్లగలిగితేనే యుధిష్ఠి రుణ్ని పట్టుకోవడం జరుగుతుంది’ అని అన్నప్పుడు మళ్లీ త్రిగర్తుడే తన తమ్ముళ్లతో కలిసి అర్జునుణ్ని దూరంగా తీసుకొని పోయి యుద్ధం చేస్తానని శపథం చేశాడు;  ‘మేమే గనక అర్జునుణ్ని చంపకుండా వెనక్కి తిరిగివస్తే, లేదా, అతని బాణాలకు జంకి పారిపోయినా మాకు బ్రహ్మహత్యా దోషమంత మహాపాపం అంటినట్టను కొంటాం.
 
  మా అన్నదమ్ములందరమూ అగ్నిసాక్షికంగా శపథం చేసి ఇదే వెళ్తున్నాం’ అంటూ సంశప్తకుడై సుశర్మ తన తమ్ముళ్లతో సహా అర్జునుణ్ని సవాలు చేస్తూ, యుద్ధభూమికి దక్షిణంగా దూరంగా తీసుకొనిపోయాడు.త్రిగర్తులు పదివేలు; వాళ్లతోబాటు మాలువులూ తుండికేరులూ మావేల్లకులూ లలిత్థులూ మద్రకులూ మరో ఇరవై వేల చిలుకు ఉన్నారు. శ్రీకృష్ణుడు దుర్యోధను డికి తన దగ్గరికి సాయాన్ని అర్ధించడానికి వచ్చినప్పుడిచ్చిన నారాయణీసేనలోని నాలుగువేల మందీ ఈ సంశప్తకుల్లో చేరారు. రుద్రుడు జగత్తులోని జీవుల్ని సంహరించే విధంగా అర్జునుడు సంశప్తక సేనల్ని సంహరించడానికి ఉద్యతుడై వెళ్లాడు.
 
  దేవదత్తమనే తన శంఖాన్ని పూరించేసరికి సంశప్తక సైనికులందరూ గడగడలాడిపోయారు. శత్రు సంఘాన్ని మోహపెట్టే త్వాష్ట్రాస్త్రాన్ని వేశాడు అర్జునుడు. దాని ప్రభావం వల్ల తమలాగే ఉండే వేలాది రూపాలు వాళ్లను దెబ్బ తీయడం మొదలుపెట్టాయి. ‘ఇడుగో అర్జునుడు, అడుగో కృష్ణుడు, ఇదుగో వీళ్లిద్దరే కృష్ణార్జునులు’ అని మోహంలో పడి పరస్పరమూ చంపుకున్నారు. అర్జు నుడు లలిత్థుల్నీ మాలవుల్నీ మావేల్లకుల్నీ త్రిగర్తుల్నీ బాణవర్షంతో ముంచెత్తాడు. ఇది సహించక వాళ్లందరూ ఒక్కుమ్మడిగా శ్రీకృష్ణార్జునులిద్దరి మీదా నానావిధ శర జాలాలను గుప్పించారు.
 
 ఆ బాణాల ఆసారంలో వాళ్లిద్దరూ కొంతసేపు కని పించకపోయేసరికి శ్రీకృష్ణార్జునులిద్దరూ చనిపోయారంటూ అతి సంతోషంతో వాళ్లు తమపై బట్టల్ని తీసి ఊపడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడికి ముచ్చెమ టలు పట్టాయి: ‘ఎక్కడున్నావు అర్జునా! బతికి ఉన్నావా?’ అంటూ అర్జునుణ్ని పిలిచేసరికి అతను వ్యాయవ్యాస్త్రాన్ని వేసి వాళ్లందర్నీ ఎండుటాకుల్లాగ ఎగిరిపోయే లాగ చేశాడు. ఇంతలో అక్కడ కురుక్షేత్రంలో భగదత్తుడు తన మహాగజంతో పాండవుల సేనను కకావికలు చేస్తూన్న హడావిడిని దూరం నుంచే అర్జునుడు విన్నాడు.
 
 భగదత్తుణ్ని ఎదురుకోకపోతే ఈ రోజునే యుద్ధాన్ని ముగిస్తాడేమో అనిపిస్తోందని అర్జునుడు కృష్ణుణ్ని రథం అక్కడికి మళ్లించమన్నాడు. కానీ సంశప్తకుడైన సుశర్మా అతని ఇతర సోదరులూ తోటి సంశప్తకులూ అర్జునుడి వెంటబడి అతన్ని కదలనీయలేదు. ఆ సంశప్తక మహారథు లందరూ అర్జునుణ్ని బాణధారలతో మూసుకుపోయేలాగ చేశారు. మళ్లీ శ్రీ కృష్ణుడికి చెమటలు పోశాయి. అప్పుడు చాలామందిని బ్రహ్మాస్త్రంతో సంహరించి తిరిగి భగదత్తుడి వైపుకు వెళ్దామని ప్రయ త్నించాడు అర్జునుడు.
 
  ఈసారి కూడా సుశర్మ తన సహ సంశప్తకులతో సహా ‘ఎక్కడికి వెళ్తావు? మాతో పోరాడి గానీ నువ్వెక్కడికీ వెళ్లలేవు’ అంటూ అటకా యించాడు. సుశర్మను అప్పుడు శర సమూహంతో విమోహితుడిగా చేసి, అతని సైన్యాన్నంతనీ భస్మం చేశాడు. ద్రోణుడు సేనాధిపతిగా ఉన్న మూడో రోజున అభిమన్యుడి వధ జరిగింది. దానిక్కారణం ఈ సంశప్తకులు అర్జునుణ్ని తమతో పోరాడి వెళ్లాలని నిర్బంధపెట్టడం వల్లనే. ఆ రోజంతా సంశప్తక గణాన్ని నాశనం చేసి వచ్చేసరికి అభిమన్యుడు రాలిపోయాడన్న దుర్వార్త అర్జునుణ్ని నిశ్చేష్టుడిగా చేసింది.                    
   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement