మనసున్న మణిపూస! | Meritocracy | Sakshi
Sakshi News home page

మనసున్న మణిపూస!

Published Sun, Jan 24 2016 1:35 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

మనసున్న మణిపూస!

మనసున్న మణిపూస!

ఆదర్శం
 చదువులో వెనకబడినప్పుడు... ఉదయం లేవడానికి బద్ధకించినప్పుడు... ‘ఈ పని నేను చేయలేను’ అని పారిపోయి నప్పుడు.... వివిధ సందర్భాల్లో డీలా పడినప్పుడు మణిమారన్‌కు వాళ్ల నాన్న ఒక మాట చెబుతుండేవాడు. ‘ఒరేయ్ మణీ... మనిషిగా పుట్టినందుకు ఆ పుట్టుకకో సార్థకత ఉండాలి. లేకపోతే మనకూ జంతువుకూ తేడా ఉండదు.’
 
 ఈ మాట ఆ చెవితో విని ఈ చెవితో వదిలేయలేదు మణిమారన్. నాన్న చెప్పిన మాట అతనికి తారకమంత్రం అయింది. నాన్నకు తనను పెద్ద చదువులు చదివించా లనే కోరిక ఉండేది. అయితే పేదరికం వల్ల తొమ్మిదో తరగతికి మించి చదవలేక పోయాడు మణి. కానీ స్కూల్లో టీచర్లు మదర్ థెరిసా గురించి చెప్పిన విషయాలు, నాన్న  ఎప్పుడూ చెబుతుండే మాట... చదవకపోయినా ‘ఏదో చేయాలి’ అనే తపనను అతడిలో పెంచాయి.
 
 చదువు మానేశాక... తిరుపూర్‌లో తన సోదరుడు పనిచేసే ఓ టెక్ట్స్‌టైల్ మిల్‌లో పనికి చేరాడు మణి. నెలకు వెయ్యి రూపా యలు జీతం. అందులో సగం నాన్నకు పంపించేవాడు. మిగిలిన డబ్బుతో ఫుడ్ ప్యాకెట్లు కొని... రోడ్లు, పేవ్‌మెంట్‌లు, దేవాలయాల దగ్గర ఉన్న వృద్ధులకు ఇచ్చేవాడు. తన కోసం, తన సరదాల కోసం డబ్బు ఖర్చు చేయాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు. తన వంతుగా ఎవరికైనా చిన్న సహాయం చేసినా అతడి మనసంతా సంతోషంతో నిండిపోయేది. ఆ సంతోషం ముందు, ఏ సరదా అయినా దిగదిడుపే అనిపిస్తుంది మణికి.
 
 మణి ఎప్పుడు బయటకు వెళ్లినా ఓ చేతిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మరో చేతిలో ఒక బ్యాగు ఉండేవి. ఆ బ్యాగ్‌లో కొన్ని ధోవతులు, చీరలు ఉండేవి. ఎవరైనా గాయడిన వాళ్లను చూస్తే ప్రాథమిక చికిత్స చేసేవాడు. చిరిగిన దుస్తులతో ఎవరైనా కనిపిస్తే వారికి తన బ్యాగ్‌లోని దుస్తులు ఇచ్చేవాడు. అంతలో జరిగిన ఓ సంఘటన ఈ సేవా తత్పరతను మరింత పెంచింది.
 
 ఒకరోజు మణి బస్‌లో ప్రయాణిస్తు న్నాడు. ‘‘అమ్మా... కాసిన్ని నీళ్లు  ఇవ్వండమ్మా. దాహం తట్టుకోలేకుండా ఉన్నాను’’ అని ఒక వృద్ధురాలు బస్సులో ఉన్న వాళ్లందరినీ బతిమి లాడుతోంది. చాలామంది దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ ఆమె దాహాన్ని తీర్చడానికి ముందుకు రాలేదు. అందుకు కారణం... ఆమె కుష్ఠువ్యాధి గ్రస్తురాలు కావడమే!
 
 తర్వాతి స్టాప్‌లో బస్సు దిగిందామె. వెనుకే మణీ దిగాడు. ఆ వృద్ధురాలు ఒక మురికి కాలువలో నీళ్లు తాగబోతుంటే అడ్డుకున్నాడు. ఒక వాటర్ బాటిల్ కొని ఆమె దాహం తీర్చాడు. మరో బాటిల్ కొని ఆమె ముఖం శుభ్రం చేశాడు. ఆ వృద్ధురాలు కదిలిపోయి కళ్ల నీళ్లు పెట్టుకుంది. ‘‘నిలవ నీడ లేదు. నన్ను నీతో తీసుకెళ్తావా’’ అని వేడుకుంది. కాని  ఆమెను తీసుకెళ్లే పరిస్థితి మణికి లేదు. ఒక ఆటో డ్రైవరుకు అయిదు వందలు ఇచ్చి రెండు రోజుల పాటు ఆమె బాగోగులను చూసుకోమని, ఆ తరువాత తాను వచ్చి తీసుకు వెళతానని చెప్పాడు. రెండు మూడు రోజుల తరువాత ఆ వృద్ధురాలికి చీర, దుప్పటి కొనిచ్చి... కొంత నగదు ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు.
 
 నాటి నుంచీ అతడిలో ఒకటే చింత. ఆ వృద్ధురాలిలా ఇంకా ఎందరున్నారో ఏమో! అందుకే వెంటనే తిరువణ్ణమలై అంతా తిరిగాడు. కుష్ఠువ్యాధిగ్రస్తుల దీన స్థితిగతులను చూసి చలించిపోయాడు. ఆ బాధలో నుంచే ఒక మంచి ఆలోచన వచ్చింది.  వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ‘వరల్డ్ పీపుల్ సర్సీస్ సెంటర్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. దాతల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు. వచ్చిన ప్రతి రూపాయినీ కుష్ఠు వ్యాధిగ్రస్తుల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. వారికి నిలవ నీడ కల్పించడం కోసం తమిళనాడు ప్రభుత్వాన్ని అర్థించాడు.
 
  ప్రభుత్వం కేటాయించిన స్థలంలో యాభై మందికి పైగా కుష్ఠు వ్యాధిగ్రస్తుల్ని ఉంచి సాకుతున్నాడు. వారికి భోజన వసతి కల్పించడం, వైద్య అవసరాలు తీర్చడంతో పాటు  మానసిక ధైర్యాన్నీ ఇస్తున్నాడు. ఇది మాత్రమే కాదు... వందకు పైగా గుర్తు తెలియని శవాలకు సొంత ఖర్చులతో బిడ్డలా అంత్యక్రియలు చేశాడు. రెండు వందల మంది మానసిక వికలాంగులను పునరావస కేంద్రాల్లో చేర్చించాడు. అతడు చేస్తోన్న ఈ సేవకు గాను జాతీయస్థాయిలో అవార్డును అందు కున్నాడు. ఆ అవార్డు కింద వచ్చిన లక్ష రూపాయలను కూడా కుష్ఠువ్యాధిగ్రస్తుల అవసరాలకే వినియోగించాడు. మనసున్న ‘మణి’పూస అనిపించుకున్నాడు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement