Meritocracy
-
మనసున్న మణిపూస!
ఆదర్శం చదువులో వెనకబడినప్పుడు... ఉదయం లేవడానికి బద్ధకించినప్పుడు... ‘ఈ పని నేను చేయలేను’ అని పారిపోయి నప్పుడు.... వివిధ సందర్భాల్లో డీలా పడినప్పుడు మణిమారన్‌కు వాళ్ల నాన్న ఒక మాట చెబుతుండేవాడు. ‘ఒరేయ్ మణీ... మనిషిగా పుట్టినందుకు ఆ పుట్టుకకో సార్థకత ఉండాలి. లేకపోతే మనకూ జంతువుకూ తేడా ఉండదు.’ ఈ మాట ఆ చెవితో విని ఈ చెవితో వదిలేయలేదు మణిమారన్. నాన్న చెప్పిన మాట అతనికి తారకమంత్రం అయింది. నాన్నకు తనను పెద్ద చదువులు చదివించా లనే కోరిక ఉండేది. అయితే పేదరికం వల్ల తొమ్మిదో తరగతికి మించి చదవలేక పోయాడు మణి. కానీ స్కూల్లో టీచర్లు మదర్ థెరిసా గురించి చెప్పిన విషయాలు, నాన్న ఎప్పుడూ చెబుతుండే మాట... చదవకపోయినా ‘ఏదో చేయాలి’ అనే తపనను అతడిలో పెంచాయి. చదువు మానేశాక... తిరుపూర్‌లో తన సోదరుడు పనిచేసే ఓ టెక్ట్స్‌టైల్ మిల్లో పనికి చేరాడు మణి. నెలకు వెయ్యి రూపా యలు జీతం. అందులో సగం నాన్నకు పంపించేవాడు. మిగిలిన డబ్బుతో ఫుడ్ ప్యాకెట్లు కొని... రోడ్లు, పేవ్మెంట్లు, దేవాలయాల దగ్గర ఉన్న వృద్ధులకు ఇచ్చేవాడు. తన కోసం, తన సరదాల కోసం డబ్బు ఖర్చు చేయాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు. తన వంతుగా ఎవరికైనా చిన్న సహాయం చేసినా అతడి మనసంతా సంతోషంతో నిండిపోయేది. ఆ సంతోషం ముందు, ఏ సరదా అయినా దిగదిడుపే అనిపిస్తుంది మణికి. మణి ఎప్పుడు బయటకు వెళ్లినా ఓ చేతిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మరో చేతిలో ఒక బ్యాగు ఉండేవి. ఆ బ్యాగ్‌లో కొన్ని ధోవతులు, చీరలు ఉండేవి. ఎవరైనా గాయడిన వాళ్లను చూస్తే ప్రాథమిక చికిత్స చేసేవాడు. చిరిగిన దుస్తులతో ఎవరైనా కనిపిస్తే వారికి తన బ్యాగ్‌లోని దుస్తులు ఇచ్చేవాడు. అంతలో జరిగిన ఓ సంఘటన ఈ సేవా తత్పరతను మరింత పెంచింది. ఒకరోజు మణి బస్‌లో ప్రయాణిస్తు న్నాడు. ‘‘అమ్మా... కాసిన్ని నీళ్లు ఇవ్వండమ్మా. దాహం తట్టుకోలేకుండా ఉన్నాను’’ అని ఒక వృద్ధురాలు బస్సులో ఉన్న వాళ్లందరినీ బతిమి లాడుతోంది. చాలామంది దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ ఆమె దాహాన్ని తీర్చడానికి ముందుకు రాలేదు. అందుకు కారణం... ఆమె కుష్ఠువ్యాధి గ్రస్తురాలు కావడమే! తర్వాతి స్టాప్‌లో బస్సు దిగిందామె. వెనుకే మణీ దిగాడు. ఆ వృద్ధురాలు ఒక మురికి కాలువలో నీళ్లు తాగబోతుంటే అడ్డుకున్నాడు. ఒక వాటర్ బాటిల్ కొని ఆమె దాహం తీర్చాడు. మరో బాటిల్ కొని ఆమె ముఖం శుభ్రం చేశాడు. ఆ వృద్ధురాలు కదిలిపోయి కళ్ల నీళ్లు పెట్టుకుంది. ‘‘నిలవ నీడ లేదు. నన్ను నీతో తీసుకెళ్తావా’’ అని వేడుకుంది. కాని ఆమెను తీసుకెళ్లే పరిస్థితి మణికి లేదు. ఒక ఆటో డ్రైవరుకు అయిదు వందలు ఇచ్చి రెండు రోజుల పాటు ఆమె బాగోగులను చూసుకోమని, ఆ తరువాత తాను వచ్చి తీసుకు వెళతానని చెప్పాడు. రెండు మూడు రోజుల తరువాత ఆ వృద్ధురాలికి చీర, దుప్పటి కొనిచ్చి... కొంత నగదు ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. నాటి నుంచీ అతడిలో ఒకటే చింత. ఆ వృద్ధురాలిలా ఇంకా ఎందరున్నారో ఏమో! అందుకే వెంటనే తిరువణ్ణమలై అంతా తిరిగాడు. కుష్ఠువ్యాధిగ్రస్తుల దీన స్థితిగతులను చూసి చలించిపోయాడు. ఆ బాధలో నుంచే ఒక మంచి ఆలోచన వచ్చింది. వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ‘వరల్డ్ పీపుల్ సర్సీస్ సెంటర్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. దాతల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు. వచ్చిన ప్రతి రూపాయినీ కుష్ఠు వ్యాధిగ్రస్తుల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. వారికి నిలవ నీడ కల్పించడం కోసం తమిళనాడు ప్రభుత్వాన్ని అర్థించాడు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో యాభై మందికి పైగా కుష్ఠు వ్యాధిగ్రస్తుల్ని ఉంచి సాకుతున్నాడు. వారికి భోజన వసతి కల్పించడం, వైద్య అవసరాలు తీర్చడంతో పాటు మానసిక ధైర్యాన్నీ ఇస్తున్నాడు. ఇది మాత్రమే కాదు... వందకు పైగా గుర్తు తెలియని శవాలకు సొంత ఖర్చులతో బిడ్డలా అంత్యక్రియలు చేశాడు. రెండు వందల మంది మానసిక వికలాంగులను పునరావస కేంద్రాల్లో చేర్చించాడు. అతడు చేస్తోన్న ఈ సేవకు గాను జాతీయస్థాయిలో అవార్డును అందు కున్నాడు. ఆ అవార్డు కింద వచ్చిన లక్ష రూపాయలను కూడా కుష్ఠువ్యాధిగ్రస్తుల అవసరాలకే వినియోగించాడు. మనసున్న ‘మణి’పూస అనిపించుకున్నాడు! -
ప్రతిభావంతులకు న్యాయం చేస్తా
-
నిజమైన శ్రీమంతుడు!
ఆదర్శం ఈ మధ్యనే ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలైంది. అందులో మహేశ్‌బాబు కోటీశ్వరుడు. కానీ తన సొంత ఊరిని బాగు చేయడం కోసం అన్ని సుఖాలూ వదులు కుంటాడు. ఆ ఊరి రూపురేఖల్ని మారుస్తాడు. ఊరి జనం జీవితాల్లో సంతోషాన్ని నింపుతాడు. ఇదంతా చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మళ్లీ మళ్లీ చూసి సినిమాని సూపర్‌హిట్ చేశారు. అయితే సినిమాలోనే కాదు, నిజంగా కూడా అలా జరిగిందని, ఓ వ్యక్తి అచ్చం అలాగే తన సర్వస్వాన్నీ వదిలి, తన ఊరికే జీవితాన్ని అంకితమిచ్చాడని మీకు తెలుసా? ఇదిగో... ఇతనే ఆ రియల్ శ్రీమంతుడు! అమెరికాలో ఉద్యోగం. నెలకు రెండు లక్షల జీతం. సుఖాల్లో మునిగి తేలగల జీవితం. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని బతికే అవకాశం... ఇదీ సెంథిల్ జీవితం. అతడవన్నీ వదులుకున్నాడు. తాను ఒక్కడూ సుఖంగా, సంతోషంగా ఉంటే చాలదని... త నలాగే తాను పుట్టి పెరిగిన గ్రామ ప్రజలు కూడా ఉండాలని తపించాడు. వారి జీవితాలను మార్చేందుకు మహా యజ్ఞమే చేశాడు. తమిళనాడులోని తిరుచ్చికి దగ్గరలో ఉన్న తెన్నూర్ గ్రామంలో పుట్టి పెరిగాడు సెంథిల్. ఆ పేద ఊరిలో, కడు పేద కుటుంబంలో పుట్టాడతను. కష్టపడి చదివాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్లు పని చేశాక అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అమెరికాలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి సెంథిల్‌కి. కానీ ఏ రోజూ మన శ్శాంతిగా లేడు. ఎప్పుడూ ఊరే గుర్తొచ్చేది. పట్టు పరుపు మీద పడుకున్నప్పు డల్లా, తన ఊళ్లో చాపల మీద పడుకునే వాళ్లు గుర్తొచ్చేవారు. ఖరీదైన శాండ్విచ్లు తిన్నప్పుడల్లా, గంజి అన్నం దొరికినా చాలని పడిగాపులు పడే పసిపిల్లలు కళ్లముందు కదిలేవారు. చిన్నప్పట్నుంచీ అతని నైజం అంతే. తను ఎన్ని కష్టాలు పడినా, ఎదుటివాళ్ల కష్టాలు చూసి తట్టు కోలేకపోయేవాడు. తాను ఎదిగి అందరికీ సాయపడాలి అనుకునేవాడు. ఆ పట్టుదలే అతణ్ని ఇంతవాణ్ని చేసింది. అందుకే ఎప్పుడెప్పుడు తన ఊరికి వెళ్లిపోదామా, ఎప్పుడెప్పుడు తనవాళ్ల జీవితాలు మారు ద్దామా అని తపించేవాడు. కానీ అందుకు తగినంత డబ్బు కావాలి కాబట్టి, అది సంపాదించేవరకూ ఓపిక పట్టాడు. ఆ సొమ్ము సమకూరగానే ఫ్లయిట్ ఎక్కేశాడు. తన ఊళ్లో వాలిపోయాడు. మొత్తం మార్చేశాడు... ఊరిలో అడుగుపెట్టగానే చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది సెంథిల్‌కి. చిన్నప్పుడు అది ఎలా ఉందో, ఇన్ని సంవత్సరాల తర్వాతా అలానే ఉంది. అదే పేదరికం, అవే కష్టాలు, అవే కన్నీళ్లు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు సెంథిల్. పక్కా ప్రణా ళికలు వేసుకున్నాడు. అనుకున్నదే తడ వుగా అమలు చేయడం మొదలు పెట్టాడు. మొదట అందుబాటులో ఉన్న హెల్త్ వర్కర్స్‌ని, గ్రామస్తులనీ ఒక్కటి చేశాడు. ఊరంతా శుభ్రం చేయించాడు. బహిరంగ మల విసర్జనను నిషేధించాడు. మరుగు దొడ్లు కట్టించాడు. తర్వాత విద్యపై దృష్టి పెట్టాడు. చదువు అవసరాన్ని చాటి చెప్పి, పిల్లలందరూ స్కూళ్లకు వెళ్లేలా చేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అంతంత మాత్రంగా ఉండటం గమనించి, అధికారు లతో మాట్లాడాడు. మంచి టీచర్లు, పుస్తకాలు వగైరా ఏర్పాటు చేయించాడు. సరైన ఆహారం లేక పిల్లలు సరిగ్గా ఎదగక పోవడం గమనించి... సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాడు. దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టే భోజనంతో పాటు అదనంగా లడ్డూలు, పాలు తన సొంత ఖర్చుతో అందించ సాగాడు. తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులను స్టడీ చేసి, గ్రామ రైతులకు నేర్పాడు. యువకులకు పలు రకాల వ్యాపారాలు నేర్పించాడు. మహిళలతో స్వయం సహా యక సంఘాలను ఏర్పాటు చేసి, చేతి వృత్తుల ద్వారా సంపాదించడం నేర్పాడు. ఇలా తన సొంత ఊరికోసం ఎన్నో చేశాడు, చేస్తున్నాడు సెంథిల్. ఆ ఊరే అతని ప్రపంచం, ఆ మనుషులే అతని జీవితం. ఆ ఊరివాళ్లకు అతను దేవుడు. విదేశాల్లో చదువుకుని, స్వదేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన గాంధీని అతనిలో చూసుకుంటున్నారు వాళ్లు. అందుకే అతణ్ని ‘యంగ్ గాంధీ’ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. అతను లేకపోతే తమ పరిస్థితి ఇలా ఉండేది కాదని, తమ పిల్లల జీవితాలు నిరర్థకమై పోయేవని చెమ్మగిల్లిన కళ్లతో చెబుతు న్నారు. ఆ చెమ్మలో కృతజ్ఞత కదలాడు తుంది. వారి మాటల్లో సెంథిల్ గొప్ప దనం ప్రస్ఫుటమవుతుంది! -
గెలిచాడు... గెలిపించాడు!
ఆదర్శం * అతని కంటికి చూపు లేదు * కానీ అతని మనసుకు ఉంది * అదే తనని గెలిపించింది ‘మీరు చేరే గమ్యానికి మీ సమస్యల గురించి చెప్పకండి. కానీ సమస్యలకు మాత్రం మీరు చేరే గమ్యాన్ని గురించి చెప్పండి’ అంటాడు భవేష్ భాటియా. ఆయన ఆ మాటలు ఎందుకన్నాడో తెలియాలంటే... ఆయన గురించి మనకు తెలియాలి. అప్పటివరకూ ఇంద్రధనుస్సుల తోటలో విహరించిన వ్యక్తికి ఒక్కసారిగా చీకటి గదికి మాత్రమే పరిమితమైపోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? జీవితం కూడా చీకటిమయం అయిపోయినట్లు అని పిస్తుంది. భవేష్ భాటియాకు కూడా అలాగే అనిపించింది. ‘రెటీనా మాక్యులర్ డీజెనరేషన్’ వల్ల భవేష్ ఇరవయ్యేళ్ల వయసులో తన కంటి చూపును కోల్పో యాడు. దాంతో పాటు ధైర్యాన్నీ కోల్పో యాడు. కాలు మీద కాలు వేసుకొని కులా సాగా బతకడానికి తనది సంపన్న కుటుంబం కాదు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. దాంతో ఎలా బతకాలా అని ఒకటే ఆలోచనలు. అయితే అదృష్టంకొద్దీ ఆ ఆలోచనల మథనంలో ‘పిరికితనం’ అనే విషం పుట్టలేదు. ‘ఆత్మస్థైర్యం’ అనే అమృతం పుట్టింది. గుజరాత్‌లోని అంజార్ గ్రామంలో పుట్టాడు భవేష్. అక్కడ భూకంపం రావడంతో కుటుంబం మొత్తం మహా బలేశ్వర్ (మహారాష్ట్ర) వచ్చి స్థిరపడింది. చూపు పోయిన తరువాత కొంతకాలానికి మహాబలేశ్వర్‌లోని ఒక హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్‌గా చేరాడు భవేష్. అయితే చూపులేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ఉద్యోగాన్ని వదులుకోక తప్పింది కాదు. అలా అని ఇంట్లో కూర్చోవడానికి మనసొప్పలేదు. ఆ సమయంలోనే ఎవరో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్’ గురించి చెప్పడంతో ఆ ఇన్స్టిట్యూట్లో క్యాండిల్ మేకింగ్ కోర్స్‌లో చేరాడు. కోర్సు పూర్తయిన తరువాత తాను తయారుచేసిన క్యాండిల్స్‌ను రోడ్డు పక్కన అమ్మడం మొదలు పెట్టాడు. ఇది మొదలు అతడు ఎప్పుడూ వెనక్కితిరిగి చూసుకోలేదు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరికి ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగాడు. తనలాంటి 225 మంది అంధులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాడు. ‘‘ఉద్యోగం ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే నాలాంటి చూపులేని వ్యక్తులకు క్యాండిల్స్ తయారీలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నాను’’ అంటున్నాడు భవేష్. ‘‘వారికి తాత్కాలిక ఉపాధి కల్పించడం మాత్రమే నా ఉద్దేశం కాదు. భవిష్యత్తులో సొంత కాళ్ల మీద నిలబడి, నాలా కంపెనీ ప్రారంభించేలా తయారు చేస్తున్నాను’’ అని కూడా అంటున్నాడు. విశేషమేమిటంటే భవేష్ ఫ్యాక్టరీలో తయారయ్యేవి ఎకో-ఫ్రెండ్లీ క్యాండిల్స్! మూస పద్ధతిలో కాకుండా ఎప్పటికప్పుడు క్యాండిల్స్ తయారీలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటుంది భవేష్ కంపెనీ. పొగరహిత క్యాండిల్స్ తయారీ అలాంటిదే! క్యాండిల్స్‌తో రకరకాల కళా కృతులు, విగ్రహాలు కూడా తయారు చేస్తారు. ఈ కంపెనీ తయారుచేసిన కొన్ని క్యాండిల్స్... ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటాయి! వీరి సృజ నాత్మకను మెచ్చిన రిలయెన్‌స కంపెనీ వ్యాపారాన్ని విస్తరించ డానికి అవసరమైన గ్రాంటు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కానీ భవేష్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మాకు సహాయపడాలనుకుంటే మరింత ఎక్కువ పని ఇప్పించండి చాలు అన్నాడు. దీనికి వారు సంతోషంగా అంగీకరించారు. నాటి నుంచీ ఆ కంపెనీ నుంచి సన్రైజ్కి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి. భవేష్ అంకితభావం, టీమ్ వర్క్ వల్ల ఇప్పుడు క్యాండిల్ మేకింగ్ కంపెనీలలో ‘సన్‌రైజ్’ ప్రముఖంగా నిలిచింది. స్వదేశం నుంచే కాక వివిధ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. అయితే వ్యాపారంలోనే కాదు... క్రీడల్లోనూ సత్తా చాటుతున్నాడు భవేష్. నేషనల్ లెవెల్ పారాలింపిక్స్ చాంపియన్ అయిన అతడు, షార్ట్‌పుట్ విభాగంలో పలు పతకాలు గెలుచు కున్నాడు. అలాగే భవేష్ ట్రెక్కర్, రన్నర్ కూడా. 2016లో బ్రెజిల్లో జరగబోయే పారాలింపిక్స్ గేమ్స్ కోసం కాస్త గట్టిగానే సన్నద్ధమవు తున్నాడు. అయినా ఆయనకు విజయాలు కొత్తేమీ కాదుకదా! ఇప్పటికే జీవితంలో గెలిచాడు. ఎందరినో గెలిపించాడు.