గెలిచాడు... గెలిపించాడు! | Blind vendor now a millionaire | Sakshi
Sakshi News home page

గెలిచాడు... గెలిపించాడు!

Published Sun, Aug 23 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

గెలిచాడు... గెలిపించాడు!

గెలిచాడు... గెలిపించాడు!

ఆదర్శం
* అతని కంటికి చూపు లేదు
* కానీ అతని మనసుకు ఉంది
* అదే తనని గెలిపించింది
‘మీరు చేరే గమ్యానికి మీ సమస్యల గురించి చెప్పకండి. కానీ సమస్యలకు మాత్రం మీరు చేరే గమ్యాన్ని గురించి చెప్పండి’ అంటాడు భవేష్ భాటియా. ఆయన ఆ మాటలు ఎందుకన్నాడో తెలియాలంటే... ఆయన గురించి మనకు తెలియాలి.
 
అప్పటివరకూ ఇంద్రధనుస్సుల తోటలో విహరించిన వ్యక్తికి ఒక్కసారిగా చీకటి గదికి మాత్రమే పరిమితమైపోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? జీవితం కూడా చీకటిమయం అయిపోయినట్లు అని పిస్తుంది. భవేష్ భాటియాకు కూడా అలాగే అనిపించింది. ‘రెటీనా మాక్యులర్ డీజెనరేషన్’ వల్ల భవేష్ ఇరవయ్యేళ్ల వయసులో తన కంటి చూపును కోల్పో యాడు. దాంతో పాటు ధైర్యాన్నీ కోల్పో యాడు. కాలు మీద కాలు వేసుకొని కులా సాగా బతకడానికి తనది సంపన్న కుటుంబం కాదు.

రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. దాంతో ఎలా బతకాలా అని ఒకటే ఆలోచనలు. అయితే అదృష్టంకొద్దీ ఆ ఆలోచనల మథనంలో ‘పిరికితనం’ అనే విషం పుట్టలేదు. ‘ఆత్మస్థైర్యం’ అనే అమృతం పుట్టింది. గుజరాత్‌లోని అంజార్ గ్రామంలో పుట్టాడు భవేష్. అక్కడ భూకంపం రావడంతో కుటుంబం మొత్తం మహా బలేశ్వర్ (మహారాష్ట్ర) వచ్చి స్థిరపడింది. చూపు పోయిన తరువాత కొంతకాలానికి మహాబలేశ్వర్‌లోని ఒక హోటల్‌లో  టెలిఫోన్ ఆపరేటర్‌గా చేరాడు భవేష్.

అయితే చూపులేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ఉద్యోగాన్ని వదులుకోక తప్పింది కాదు. అలా అని ఇంట్లో కూర్చోవడానికి మనసొప్పలేదు.  ఆ సమయంలోనే ఎవరో ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్’ గురించి చెప్పడంతో ఆ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాండిల్ మేకింగ్ కోర్స్‌లో చేరాడు. కోర్సు  పూర్తయిన తరువాత తాను తయారుచేసిన క్యాండిల్స్‌ను రోడ్డు పక్కన అమ్మడం మొదలు పెట్టాడు. ఇది  మొదలు అతడు ఎప్పుడూ వెనక్కితిరిగి చూసుకోలేదు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరికి ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగాడు. తనలాంటి 225 మంది అంధులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాడు.
 
‘‘ఉద్యోగం ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే నాలాంటి చూపులేని వ్యక్తులకు క్యాండిల్స్ తయారీలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నాను’’ అంటున్నాడు భవేష్. ‘‘వారికి తాత్కాలిక ఉపాధి కల్పించడం మాత్రమే నా ఉద్దేశం కాదు. భవిష్యత్తులో సొంత కాళ్ల మీద నిలబడి, నాలా కంపెనీ ప్రారంభించేలా తయారు చేస్తున్నాను’’ అని కూడా అంటున్నాడు.
 విశేషమేమిటంటే  భవేష్ ఫ్యాక్టరీలో తయారయ్యేవి ఎకో-ఫ్రెండ్లీ క్యాండిల్స్! మూస పద్ధతిలో కాకుండా ఎప్పటికప్పుడు క్యాండిల్స్ తయారీలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటుంది భవేష్ కంపెనీ. పొగరహిత క్యాండిల్స్ తయారీ అలాంటిదే! క్యాండిల్స్‌తో రకరకాల కళా కృతులు, విగ్రహాలు కూడా తయారు చేస్తారు. ఈ కంపెనీ తయారుచేసిన కొన్ని క్యాండిల్స్... ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటాయి!
 
వీరి సృజ నాత్మకను మెచ్చిన రిలయెన్‌‌స కంపెనీ వ్యాపారాన్ని విస్తరించ డానికి అవసరమైన గ్రాంటు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కానీ భవేష్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మాకు సహాయపడాలనుకుంటే మరింత ఎక్కువ పని ఇప్పించండి చాలు అన్నాడు. దీనికి వారు సంతోషంగా అంగీకరించారు. నాటి నుంచీ ఆ కంపెనీ నుంచి సన్‌రైజ్‌కి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి.
 
భవేష్ అంకితభావం, టీమ్ వర్క్ వల్ల ఇప్పుడు క్యాండిల్ మేకింగ్ కంపెనీలలో ‘సన్‌రైజ్’ ప్రముఖంగా నిలిచింది. స్వదేశం నుంచే కాక వివిధ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. అయితే వ్యాపారంలోనే కాదు... క్రీడల్లోనూ సత్తా చాటుతున్నాడు భవేష్. నేషనల్ లెవెల్ పారాలింపిక్స్ చాంపియన్ అయిన అతడు, షార్ట్‌పుట్ విభాగంలో పలు పతకాలు గెలుచు కున్నాడు. అలాగే భవేష్ ట్రెక్కర్, రన్నర్ కూడా. 2016లో బ్రెజిల్‌లో జరగబోయే పారాలింపిక్స్ గేమ్స్ కోసం కాస్త గట్టిగానే సన్నద్ధమవు తున్నాడు. అయినా ఆయనకు విజయాలు కొత్తేమీ కాదుకదా! ఇప్పటికే జీవితంలో గెలిచాడు. ఎందరినో గెలిపించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement