
అయ్ బా....బో...య్!
పందొమ్మిది సంవత్సరాల కొబ్జారో చూడడానికి నోట్లో నాలిక లేని వ్యక్తిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు చేసే సాహసాలు...
విడ్డూరం
పందొమ్మిది సంవత్సరాల కొబ్జారో చూడడానికి నోట్లో నాలిక లేని వ్యక్తిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు చేసే సాహసాలు చూస్తే మాత్రం ‘అయ్ బాబోయ్’ అనిపిస్తాయి. మాస్కో మెట్రో రైళ్లపై ‘ట్రైయిన్ సర్ఫింగ్’ చేయడం ఆమె హాబీ. పదిహేను సంవత్సరాల వయసు నుంచే ట్రైన్లపై ఈ సాహసం చేస్తుంది. ట్రైయిన్ పైన బ్యాలెన్సింగ్‌గా ఉండడం ఆషామాషీ విషయం కాదు. గుండెలు నాన్‌స్టాప్‌గా గుభేలంటాయి. అయితే ఈ టీనేజ్ డేర్‌డెవిల్‌కు మాత్రం అలాంటి భయాలేమీ లేవు. ‘జీవితం విలువైనది. ఇలాంటి సాహసాలకు పూనుకోవడం తగునా?’ అని ఆమెకు ఎవరైనా సలహా ఇస్తే...
‘సాహసంలేని జీవితం ఒక జీవితమేనా?’ అని ఎదురు ప్రశ్న వేస్తుంది. రక్తం గడ్డ కట్టే చలికాలాల్లోనూ... ట్రైన్ సర్ఫింగ్ చేయడం కొబ్జారో ప్రత్యేకత.
ఎవరైనా కొత్తవాళ్లు హఠాత్తుగా ట్రైన్ పైన కొబ్జారోని చూస్తే... ‘అదిగో... బ్యాట్ వుమెన్’ అని అరవడం ఖాయం. చాలా సందర్భాల్లో ఆమె బ్యాట్‌మెన్ వేషంలో ఈ సాహసం చేస్తుంటుంది మరి! మరి ఈ దుస్సాహసాన్ని పోలీసులు ఎలా సహిస్తున్నారు?
చాలా సందర్భాల్లో ఆమెకు పెనాల్టీ విధించారు.
అయినా కొబ్జారో ధోరణిలో మార్పు రావడం లేదు.
కొబ్జారోను ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడు ‘సాహసం’ అనే పదానికి చాలా దూరంగా, అతి జాగ్రత్తగా పెంచారు. పెద్దయ్యాక మాత్రం... తన ధోరణి ‘సాహసమే నా ఊపిరి’లా తయారైంది. ‘హద్దులను చెరిపేసేవాళ్లు, తమవైన కొత్త నియమాలు రూపొందించుకునేవాళ్లు అంటే ఇష్టం’ అంటున్న కొబ్జారో బ్రిటన్‌లో చదువుకుంది.
‘ట్రైన్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక విశాల ప్రపంచంలోకి వెళుతున్నట్లు అనిపిస్తుంది’ అంటుంది కొబ్జారో.
అంతేనా...
‘ఈ ప్రపంచాన్ని భిన్నమైన కోణం నుంచి చూడడానికి ట్రైయిన్ సర్ఫింగ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అని కూడా అంటుంది.
మాటలకేంగానీ, కాస్త జాగ్రత్త తల్లి!!