
కొత్త మమ్మీ
నేడు మదర్స్ డే
అర్ధరాత్రి 2 గంటల సమయం చిన్నారి గుక్క పెట్టింది. వెంటనే తండ్రి నిద్రలేచాడు. పాపని చేతుల్లోకి తీసుకున్నాడు. చేతికి తడిగా తగలడంతో డైపర్ మార్చాడు. అయినా పాప ఏడుపు మానలేదు. ‘‘ఊరుకో నాన్నా. మమ్మీ నిద్రపోతోంది. డిస్టర్‌బ చేయకూడదు. పద మనం బాల్కనీలోకి వెళదాం’’ అంటూ బాల్కనీలోకి తీసుకొచ్చాడు. ‘‘చందమామ రావే... జాబిల్లి రావే...’’ అంటూ జోల పాటందుకున్నాడు. పాప తండ్రి ఒళ్లోనే హాయిగా నిద్రపోయింది.
ఉదయం 7 గంటల సమయం...
పిల్లలిద్దరూ స్కూల్‌కి రెడీ అవుతున్నారు. ‘‘డాడీ.. మా స్కూల్ బస్ వచ్చేస్తోంది’’ అంటూ అరిచారు. ‘‘వస్తున్నా... ఇదిగో మీ టిఫిన్ బాక్స్ రెడీ’’ అంటూ ఆదరా బాదరాగా కిచెన్లోంచి వచ్చి పిల్లల చేతికిచ్చాడు తండ్రి. వాళ్లు బస్ ఎక్కేవరకూ గుమ్మం దగ్గరే ఉండి బై చెప్పాడు.
ఇలాంటి దృశ్యాలు చూస్తే తండ్రికి పిల్లల మీద ఎంత ప్రేమ అని కొందరికి అనిపిస్తుంది. మరికొందరికి అమ్మ బాధ్యతలు తగ్గుతున్నా యనే ఆనందం వేస్తుంది. అవును... ఆ ఆనందం పొందాల్సిన తరుణం వచ్చింది. నవతరం తండ్రులు తల్లులుగా మారుతున్నారు. పిల్లల ఆలనా పాలనా చూడడం తల్లి బాధ్యత మాత్రమే అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తున్నారు. తల్లి బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరిస్తున్నారు. తల్లి తమకు చేసిన సేవలు తలచుకుంటూ ఆమె గురించి గొప్పగా చెప్పుకునేది మదర్స్‌డే కాదు... మోయలేనన్ని బాధ్యతల బరువుతో సతమతమవుతున్న ఆమె భారాన్ని కొంతైనా పంచుకోవడమే అసలైన మదర్స్‌డే అని చెప్పకనే చెబుతున్నారు.
పెంచడంలోనూ... పంచడంలోనూ... గతంతో పోలిస్తే ఆడ-మగ పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల ఆలోచనాధోరణుల్లో చాలా మంచి మార్పులు వచ్చాయనే చెప్పాలి. మగ పిల్లాడంటే బయటకు వెళ్లి సంపాదించుకు వచ్చేవాడని, ఆడపిల్ల అంటే ఇంట్లో ఉన్న వారందరికీ సేవలు చేసిపెట్టే పనిపిల్ల అనే భావాలు దాదాపుగా కనుమరుగయ్యాయి.
ఇద్దర్నీ సమానంగా పెంచడానికి ఇష్టపడు తున్నారు. నవతరం తండ్రుల తల్లి రూపానికి అక్కడే బీజం పడుతోంది. అంతే కాకుండా ఇద్దర్నీ బాగా చదివించడం, ఇద్దర్నీ ఉద్యోగస్తులుగా చేయడం వంటివి మరింతగా మగవాళ్ల మనస్తత్వాలను మారుస్తున్నాయి.‘‘ఆడ మగ తేడా లేకుండా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరం అన్ని పనులూ సమానంగా చేసేవాళ్లం.
దాంతో ఇంటి పని అనేది ఆడవారి బాధ్యత అనే అభిప్రాయం నాకెప్పుడూ రాలేదు’’ అని చెప్పారు రూపేష్. ఇన్‌స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ అనే ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ అయిన ఆయన తన కొడుకు దర్శ్ ఆలనా పాలనా చూసుకోవ డంలో ఎప్పుడూ వెనుకాడలేదు. భార్య ఇంట్లో ఉందీ లేదు అనే విషయంతో సంబంధం లేకుండా బాబును స్కూల్‌కి రెడీ చేయడంతో పాటు తన కుమార్తెలకు సంబంధించిన ప్రతి పనినీ తాను చేస్తానని, అందులో తనకెలాంటి ఇబ్బందీ లేదని రూపేష్ స్పష్టం చేశారు.
ఫస్ట్‌క్లాస్ చదువుతున్న కొడుకుని స్కూల్ దగ్గర దించడం, తీసుకురావడం మాత్రమే కాదు... ఆఫీసు అయిపోయాక ఇంటికెళ్లి నిద్రపోయేదాకా బాబుకు సంబంధించిన ప్రతీ పనినీ స్వయంగా చూసుకోవడం తనకు అలవాటంటున్నారు రూపేష్. ‘‘చెడ్డీ జారిపోయినా డాడీ అంటూ పిలుస్తాడు మావాడు’’ అంటూ సరదాగా చెప్పుకునే రూపేష్‌ని చూస్తుంటే నవతరం తండ్రులు తల్లి బాధ్యతల్ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుంది.
కొందరు బిజీ కపుల్ ఇలాంటి విషయంలో ముందస్తు ప్లాన్డ్‌గా ఉంటున్నారు. తద్వారా పిల్లలపై తమ ‘బిజీనెస్’ ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికి నిదర్శనం రాజ్‌కిషోర్-రాధిక దంపతులు. ప్రైవేట్ జాబ్ చేసే రాధిక మధ్యాహ్నం 1.30 గంటకే ఆఫీసుకు వెళ్లిపోయి, తిరిగి రాత్రి 10.30 గంటలకు గానీ ఇంటికి రారు. ఈ మధ్యలోనే పాప అనీషా స్కూల్ నుంచి వస్తుంది.
కాబట్టి పాప బాధ్యత తీసుకోవడం రాజ్‌కిషోర్‌కి తప్పదు. ‘‘అదొక్కటే కాదు... ఇంటి బాధ్యతల్ని అన్ని రకాలుగా షేర్ చేసుకోవడంలో మేం ఇద్దరం ముందస్తు ప్రణాళికతో ఖచ్చితంగా ఉంటాం’’ అంటూ చెప్పారు ఈవెంట్ మేనేజర్ అయిన రాజ్‌కిషోర్. ఉత్సవ్ ఈవెంట్స్, సినిమాటిక్ వెడ్డింగ్స్ సంస్థలకు యజమాని అయిన రాజ్... తనది సొంత బిజినెస్ కావడంతో, భార్య కన్నా తనకు కాస్త సమయం వెసులు బాటు ఉంటుంది కాబట్టి, పాప బాధ్యతలు తనకే ఎక్కువని, అయితే పని విభజన వల్ల తమ మధ్య బాధ్యతల షేరింగ్‌లో ఎటువంటి సమస్యా రావడం లేదనీ అంటున్నారు.
సాకడంలో... సంతృప్తి...
ఇద్దరూ బయటకు వెళ్లి కష్టపడుతున్నారు కాబట్టి.. ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నారు కాబట్టి లాంటి కారణాలు పైకి కనపడుతున్నప్ప టికీ అంతకు మించిన మానసిక తృప్తి కూడా తమలో ఈ ధోరణి పెరగడానికి ఒక కారణంగా కొందరు తండ్రులు చెబుతున్నారు. ‘‘ఇంట్లో ఉంటే వీలైనంత వరకూ పాప పనులు నేనే చూసుకుంటా.
తనకి గౌను తొడగడం, తిని పించడం, చిట్టి పాదాలకు షూస్ వేయడం వంటి పనులు సంతో షంగా చేస్తా’’ అంటున్న పీయూష్... అలాంటి సమ యాల్లో హైదరాబాద్‌లో తానొక బిగ్‌షాట్ అని, పేరొందిన బిజినెస్ మ్యాన్ అని మర్చిపో తారు. అచ్చమైన స్వచ్ఛమైన కొత్త తరపు తండ్రిలా మైమరచి పోతారు. ఈ విషయంలో హౌస్ వైఫ్ అయిన తన భార్య దగ్గర్నుంచి పాప పనుల్ని దాదాపు లాక్కున్నంత పని చేస్తా నంటారాయన నవ్వుతూ. ‘‘పిల్లలు ఖుషిక, ప్రతీక్‌ల బాధ్యత తీసుకోవడం వల్ల నేను రోజు వారీ వ్యాపార, పని ఒత్తిడి నుంచి దూర మవుతా’’నని చెప్పారు పీయూష్.
అమ్మలకు ఆనందం...
చాలామంది మహిళలు పెళ్లయ్యాక కెరీర్‌కి గుడ్‌బై చెబుతారు. మరికొందరు బిడ్డ పుట్టాక ఆ పిల్లల ఆలనా పాలన తోనే సరిపోతోందంటూ ఉద్యో గానికి వీడ్కోలు లేదా కనీసం లాంగ్ టైమ్ గ్యాప్ ఇచ్చేస్తారు. అయితే పిల్లల బాధ్యత పంచుకోవడంలో నేటి తండ్రుల్లో వస్తున్న మార్పు అనూహ్యంగా తల్లులకు తగి నంత విశ్రాంతిని కల్పిస్తోంది. విశ్రాంతితో పాటు తమ వ్యక్తిగత జీవితాన్ని కాసింత విశ్లేషించుకుని, తమకంటూ ఓ కెరీర్‌ని ఎంచుకునే అవకాశాన్ని వారికిస్తోంది.
ఆర్ఙికంగా ఉపకరించడం వంటి లాభాలతో అంతిమంగా ఇది కుటుంబానికే మేలు చేస్తోంది. ‘‘మా వారు ఆర్టీసీలో చేస్తారు. ఆఫీసు అయి పోయి ఇంటికి వచ్చారంటే ఆయనకు పాప నిత్యశ్రీతోనే లోకం. పాప కూడా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన తినిపిస్తేనే తింటుంది. నేనుండగా మీరెందుకు దాని పనులు చేయడం అంటూ మొదట్లో వారించేదాన్ని. అయితే ఆయన వినలేదు. రాన్రానూ... దానికి డ్రెస్ వేయండి, జుట్టు దువ్వండి అని చెప్పడం కూడా నాకు అలవా టైంది.
దాని వల్ల నాకు కొంత ఖాళీ సమయం దొరకడంతో పాటు వాళ్లిద్దరి అనుబంధాన్ని ఆస్వాదించే అవకాశం కూడా దక్కుతోంది’’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తారు వారణాసి సురేఖ. అంతేకాదు... భర్త సుధాకర్ బిడ్డ బాధ్యతల్లో తనకు సహకరిస్తుండడంతో తన వ్యక్తిగత అభిరుచులను నెరవేర్చుకునే అవకాశం కలుగుతోందంటారామె. ప్రస్తుతం టీచర్‌గా పనిచేస్తున్న సురేఖ... తనకు కూతురు పుట్టిన తర్వాత బీఈడీ చేయగలగడానికి కారణం... తన భర్త కూతురు పట్ల చూపే బాధ్యతే అంటారు. తమ ముద్దుల తనయ ఆరేళ్ల నిత్యశ్రీకి నచ్చే నూడుల్స్‌ను బయట నుంచి తేవడం మాత్రమే కాదు, పొంగనాలు వండి పెట్టడం సంతోషంగా చేస్తారట సుధాకర్.
ఇవీ కొత్త మమ్మీల కథలు. బిడ్డ కోసం అమ్మ ఎన్నో త్యాగాలు చేస్తుంది. తనను తాను మొత్తంగా మర్చిపోతుంది. బిడ్డకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. కడుపులోని బిడ్డకు కవచంలా మారిపోతుంది. తన అందం గురించి పట్టించుకోదు. తను పడే కష్టం గురించి పట్టించుకోదు. పండంటి బిడ్డ గురించి మాత్రమే ఆమె పట్టింపు. అంత ప్రయాసకు ఓర్చుకుని బిడ్డను కన్నాక కూడా ఆమెకు అలసట తీర్చుకునే తీరిక ఉండదు. కడుపులో నుంచి వచ్చిన బిడ్డను కళ్లలో పెట్టుకుని అనుక్షణం కాపాడు కోవాలి.
ఇంత భారం ఆమె నెత్తిన వేసిందీ సమాజం. అసలు జన్మనివ్వ డాన్ని మించిన గొప్ప పని ఏముంది? అంత గొప్ప పని చేసిన తల్లి బాధ్యతల్ని పంచుకోవా ల్సింది పోయి... దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లిని సృష్టించాడు అంటూ ఆమె బాధ్యతల్ని మరింత పెంచే స్తున్నాం. మదర్స్‌డే సందర్భంగా ఒక్కమాట. అమ్మని దేవతని చేయక్కర్లేదు. మనిషిగా తను పడే శ్రమను, తనకు కలిగే అలసటను గుర్తిస్తే చాలు. కాసింత పంచుకుంటే చాలు. అలా పంచుకుంటున్న తల్లుల్లాంటి తండ్రులూ... అమ్మల తరపున మీకు మనస్ఫూర్తిగా థాంక్యూ.
- ఎస్.సత్యబాబు