
రాజమాత
తాను పునర్జన్మ ఎత్తి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తాను త్యాగమై బిడ్డకు విజయగీతమందిస్తుంది తల్లి... కష్టాలను సహించి బిడ్డలను కని పెంచడంలోనే కాదు, ఎంతో ఓరిమితో కుటుంబాన్ని చక్కదిద్దడంలో తల్లులు పోషించే పాత్ర సాటిలేనిది. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలోనూ తల్లులది గురుతర పాత్ర. ఎంతటి దేశాధినేతలైనా, మేధావులైనా, మహనీయులైనా వాళ్లంతా తల్లులకు బిడ్డలే. వాళ్లంతా తల్లుల చల్లని ఆలనపాలనలో ఎదిగిన వారే. తల్లుల దినోత్సవం సందర్భంగా మహనీయులను కన్న కొందరు తల్లుల గాథలను మీ ముందు ఉంచుతున్నాం...
అక్షరాలు దిద్దించిన తల్లి
అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర ప్రసిద్ధి పొందిన అబ్రహాం లింకన్‌ను కన్నతల్లి నాన్సీ లింకన్. బాల్యంలో అబ్రహాంపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. చిన్నారి అబ్రహాం చేత అక్షరాలు దిద్దించిన తొలి గురువు ఆమె. బాల్యంలో ఆమె తనకు ఇంట్లోనే చదువు చెప్పిన జ్ఞాపకాలను అబ్రహాం లింకన్ చాలాసార్లు నెమరు వేసుకునేవారు. సున్నితంగా మాట్లాడటం, పట్టుదల వంటి లక్షణాలను అబ్రహాం తన తల్లి నుంచే పుణికి పుచ్చుకున్నారు. దురదృష్టవశాత్తు అబ్రహాంకు తొమ్మిదేళ్ల వయసులోనే నాన్సీ అకాల మరణం పాలైంది. చిన్నారి అబ్రహాం తల్లి శవపేటిక తయారీలో తండ్రికి సహకరించారు. అధ్యక్షుడిగా ఎదిగినప్పటికీ అబ్రహాం జీవితాంతం తల్లి జ్ఞాపకాలను తలచుకుంటూ ఉండేవారు. నాన్సీ మరణం తర్వాత అబ్రహాం తండ్రి సారాను పెళ్లాడారు. అప్పటికి ఆమె ముగ్గురు పిల్లల తల్లి అయినా, అబ్రహాంను తన సొంత బిడ్డలతో సమానంగా ప్రేమించేది. ఆమెను అబ్రహాం ‘ఏంజెల్ మదర్’గా అభివర్ణించేవారు. తన జీవితంపై ఇద్దరు తల్లుల ప్రభావం ఉందని ఆయన తరచు చెప్పుకొనేవారు.
గురువుగా మారింది..
విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్తగా థామస్ అల్వా ఎడిసన్ సుప్రసిద్ధుడు. విద్యుత్ బల్బు మాత్రమే కాదు, చరిత్రను మలుపు తిప్పిన మోషన్ పిక్చర్ కెమెరా ‘కినెటోగ్రాఫ్’ వంటి పలు ఆవిష్కరణల ఘనత ఎడిసన్‌కు దక్కుతుంది. తల్లి నాన్సీ ఆలనపాలన, అకుంఠిత దీక్షా దక్షతలు లేకుంటే థామస్ ఎడిసన్ ఒక శాస్త్రవేత్తగా ఎదిగేవాడు కాదంటే అతిశయోక్తి కాదు. థామస్ ఎడిసన్ మొద్దబ్బాయి అని, అతడికి చదువు అబ్బదని స్కూల్ టీచర్ వ్యాఖ్యానించడంతో నాన్సీ కొడుకును స్కూలు మాన్పించింది. అలాంటి స్కూల్‌లో చదువుకుంటే తన కొడుకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని భావించి ఇంట్లో తానే స్వయంగా అతడికి పాఠాలు చెప్పింది. వినికిడి సమస్యతో పాటు నానా ఆరోగ్య సమస్యలతో బాధపడే కొడుకును కంటికిరెప్పలా కాపాడుకుంది. శాస్త్రవేత్తగా, పద్నాలుగు కంపెనీలను నెలకొల్పిన వాణిజ్యవేత్తగా థామస్ ఎడిసన్ సాధించిన ఎదుగుదల వెనుక ఆసరాగా నిలిచిన చల్లని తల్లి నాన్సీ.
జ్ఞానం పంచింది...
భారత వేదాంత సారాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి యోగిపుంగవుడు స్వామి వివేకానంద మాతృమూర్తి భువనేశ్వరీ దేవి. సంపన్న బెంగాలీ కాయస్థ కుటుంబంలో పుట్టిపెరిగిన భువనేశ్వరీ దేవి చిన్ననాటి నుంచి సనాతన ఆచారాలను పాటించేవారు. అయితే, మతపరంగా ఆమెవి ఉదార భావాలు. తన జ్ఞాన వికాసంలో తన తల్లి పాత్ర ఎంతగానో ఉందని, ఇందుకు ఆమెకు రుణపడి ఉంటానని స్వామి వివేకానంద స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఈ ప్రపంచంలో తాను ప్రేమించేది తన తల్లిని మాత్రమేనని కూడా ఆయన తన డెయిరీల్లో రాసుకున్నారు.
స్వదేశంలోను, విదేశంలోను విరివిగా పర్యటనలతో గడుపుతూ ఉండటం వల్ల తన తల్లికి తగినంతగా సేవ చేసుకోలేకపోయినందుకు స్వామి వివేకానంద పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. వివేకానంద రెండో సోదరుడు తల్లి భువనేశ్వరీ దేవి బాగోగులు చూసుకునేవారు. అనుకోకుండా ఆయన అకాల మరణం చెందడంతో ఆమె బాగా కుంగిపోయారు. ఆ పరిస్థితుల్లో తాను తల్లికి సేవ చేసుకోవాలని వివేకానంద బాగా తపించారు. అయితే, దురదృష్టవశాత్తు ఆయన తన తల్లి కంటే ముందే చాలా చిన్న వయసులో కన్నుమూశారు.
సామ్యవాదం వైపు నడిపింది..
క్యూబా విప్లవ నాయకుడు చేగువేరాను కన్న వీరమాత సిలియా డి లా సెర్నా. అర్జెంటీనాలో పుట్టి పెరిగిన ఆమెకు చిన్నప్పటి నుంచే రాజకీయ చైతన్యం ఉండేది. ఏకైక సంతానమైన చే గువేరాను విప్లవ నాయకుడిగా తీర్చిదిద్దడంలో ఆమెది చాలా కీలక పాత్ర. సిలియా సంపన్న కుటుంబంలో పుట్టిన ఆమె అప్పుడప్పుడే మొదలైన స్త్రీవాద ఉద్యమంలో చురుకుగా పాల్గొనేది. తొలినాళ్లలో కేథలిక్ ఆచారాలను తు.చ. తప్పకుండా పాటించినా, సామాజిక, రాజకీయ ఉద్యమాలకు చేరువగా మెలగడం వల్ల క్రమంగా మతపరమైన విశ్వాసాలను సడలించుకుని, ఉదారవాదిగా మారింది.
సోషలిస్టు భావజాలానికి దగ్గరైంది. తల్లికి గల సైద్ధాంతిక నేపథ్యమే చే గువేరాను ఉద్యమ మార్గంలో ముందుకు నడిచేలా చేసింది. అణగారిన ప్రజల విముక్తి కోసం ఆయుధం పట్టేలా చేసింది. తల్లి ఇచ్చిన స్ఫూర్తితో బాధ్యతగా చదువుకుని వైద్యుడిగా ఎదిగినా, కేవలం వైద్యరంగానికే పరిమితమైపోకుండా తల్లి ఆశయాల సాధన కోసం క్యూబా, కాంగో, బొలీవియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. చివరకు సీఐఏతో చేతులు కలిపిన బొలీవియా సైన్యం చేతిలో నేలకొరిగాడు.
వీరుడిగా మలచింది...
‘ఛత్రపతి’ శివాజీ తల్లి జిజియా బాయి. రాజ్యాధికారం సాధించేలా శివాజీని తీర్చిదిద్దిన ఘనత ఆమెకే దక్కుతుంది. జిజియా భర్త షాహాజీ స్వతంత్ర మరాఠా రాజ్య స్థాపన కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. మొగల్ సేనలు, అదిల్‌షాహీ సేనలు మూకుమ్మడిగా చేసిన యుద్ధంలో షాహాజీ ఓటమి పాలయ్యాడు. స్వతంత్ర మరాఠా రాజ్య స్థాపన చేయాలన్న భర్త ఆశయాన్ని కొడుకు శివాజీ ద్వారా నెరవేర్చాలని సంకల్పించింది జిజియాబాయి. చిన్నప్పటి నుంచి వీరగాథలను నూరిపోస్తూ ఆ ఆశయానికి అనుగుణంగానే అతడిని తీర్చిదిద్దింది. స్వరాజ్య స్థాపనతో పాటు ప్రజలకు సుపరిపాలన అందించాలని కొడుకుకు ఉద్బోధించేది. సైన్యాన్ని పోగు చేసుకుని శివాజీ రాజ్య స్థాపన దిశగా పోరాటం కొనసాగిస్తున్నప్పుడు న్యాయ, పరిపాలనాపరమైన అంశాల్లో జిజియాబాయి నిర్ణయాత్మక శక్తిగా ఉండేది. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించేది. చివరి రోజుల్లో కొడుకు పట్టాభిషేకాన్ని కళ్లారా చూసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే కన్నుమూసింది.
నైతికంగా తోడు నిలిచింది...
రష్యన్ సామ్యవాద విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తల్లి మారియా అలెగ్జాండ్రోవ్నా ఉల్యనోవా. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేసింది. జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లిష్, రష్యన్ భాషల్లో స్వయంకృషితో ప్రావీణ్యం సాధించింది. ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేసేది. ఆమె భర్త, లెనిన్ తండ్రి నికోలాయెవిచ్ ఉల్యనోవ్ గణిత, భౌతిక శాస్త్రాల అధ్యాపకుడిగా ఉండేవారు. స్వయంగా టీచర్ కావడంతో మారియా పిల్లలకు ఇంటి వద్దనే చదువు సంధ్యలు చెప్పేది. శాస్త్ర సామాజిక అంశాలను నిశితంగా అధ్యయనం చేయడం, వాటిని ఆకళింపు చేసుకోవడం లెనిన్‌కు తల్లి ద్వారానే అబ్బింది. విప్లవోద్యమ కాలంలో కుటుంబానికి ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నిబ్బరంగా తట్టుకుని నిలబడ్డ ధీరవనిత మారియా. ఉద్యమకాలంలో లెనిన్ ఫ్రాన్స్, స్వీడన్‌లలో తలదాచుకుంటున్నప్పుడు వ్యయప్రయాసలకు ఓర్చి అంత దూరాలు ప్రయాణించి, అతడిని స్వయంగా కలుసుకుని నైతిక సై్థర్యాన్ని ఇచ్చిన తల్లి ఆమె.
సత్య అహింసలను బోధించింది...
పుత్లీబాయి గాంధీ దేశానికి మహాత్ముడిని అందించిన మాతృమూర్తి. కరంచంద్ గాంధీకి నాలుగో భార్య ఆమె. మొదటి ముగ్గురు భార్యలు చిన్న వయసులోనే మరణించడంతో కరంచంద్ పుత్లీబాయిని పెళ్లాడారు. పెళ్లినాటికి ఆమె వయసు పదమూడేళ్లు మాత్రమే. ఆమె సంతానంలో మోహన్‌దాస్ చిన్నవాడు కావడంతో అతడిపై అపారమైన ప్రేమ చూపేవారు. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక చింతన గల పుత్లీబాయి పిల్లలను తన ఆదర్శాలకు, విశ్వాసాలకు అనుగుణంగానే పెంచారు. పిల్లలకు రామాయణ, మహాభారత కథలు చెప్పేవారు. ధర్మాచరణను వివరించేవారు.
సత్యసంధత, అహింస వంటి సుగుణాలను మహాత్మా గాంధీ తల్లి నుంచే నేర్చుకున్నారు. మోహన్ దాస్ భారత్‌లో చదువు పూర్తి చేసుకుని, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లడానికి సిద్ధపడినప్పుడు ఎలాంటి దురలవాట్లకు లోను కావద్దని పుత్లీబాయి కొడుకు చేత బాస చేయించుకున్నారు. మద్యమాంసాలకు దూరంగా ఉండాలని, అసత్యమాడరాదని మాట తీసుకున్నారు. మోహన్‌దాస్ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చాక మహాత్ముడిగా పరిణమించడంలో తల్లి పుత్లీబాయి పాత్ర ఎనలేనిది.
విజయాలకు బాటలు వేసింది...
సాఫ్ట్‌వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆయన సాధించిన ఘన విజయాల గురించి, తన చారిటీ సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి అంతర్జాతీయ మీడియాలో తరచు కథనాలు వస్తుంటాయి. బిల్ గేట్స్ ఘన విజయాల వెనుక అడుగడుగునా ఆసరాగా నిలిచిన ఘనత ఆయన తల్లి మేరీ మాక్స్‌వెల్ గేట్స్‌కే దక్కుతుంది. మేరీ గేట్స్ స్వయంగా వాణిజ్యవేత్త. పలు కార్పొరేట్ సంస్థల్లో, చారిటీ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసేది.
ఇంటా బయటా విపరీతమైన పని ఒత్తిడి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సైతం ఆమె తన కొడుకు బిల్ గేట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. అతడి చదువు సంధ్యలను పర్యవేక్షించేది. తన కొడుకు రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కొనుగోలు చేసేలా ఐబీఎం కంపెనీని ఒప్పించింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ చరిత్ర తెలిసిందే. వాణిజ్య విజయాలతోనే సరిపెట్టుకోకుండా సేవా కార్యక్రమాలు చేపట్టేలా తన కొడుకును ప్రోత్సహించిన మంచి మనసున్న తల్లి మేరీ గేట్స్.
స్ఫూర్తి నింపింది...
నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ను కన్న వీరమాత ప్రభావతీదేవి. ఆమె భర్త జానకీనాథ్ బోస్ కటక్ నగరంలో న్యాయవాదిగా ప్రసిద్ధుడు. సంపన్న కుటుంబం వారిది. జానకీనాథ్ బోస్, ప్రభావతీదేవి దంపతుల పద్నాలుగు మంది సంతానంలో సుభాష్‌చంద్ర బోస్ తొమ్మిదోవాడు. పద్నాలుగు మంది పిల్లలనూ ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఘనత ప్రభావతీదేవికే దక్కుతుంది. సనాతన ఆచారాలను పాటించే కుటుంబమే అయినా పిల్లలను స్వేచ్ఛగా పెంచారామె. తీరిక వేళల్లో పిల్లలను చుట్టూ కూర్చోబెట్టుకుని పురాణ కథలు చెబుతూ స్ఫూర్తి నింపేవారు. సుభాష్‌చంద్ర బోస్‌ను ముద్దుగా ‘రంగా’ అని పిలుచుకునేవారు. ఆమె స్ఫూర్తితోనే సుభాష్‌చంద్ర బోస్ చిన్ననాటి నుంచే అన్యాయాలను ఎదిరించే తత్వాన్ని అలవరచుకున్నారు. స్వాతంత్య్రోద్యమ నాయకుడిగా ఎదిగారు. ‘సంపూర్ణ స్వరాజ్యం’ నినాదంతో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు.
సామ్యవాదిగా మలచింది...
నల్లజాతి హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ తల్లి అల్బెర్టా కింగ్. నిజానికి తల్లి స్ఫూర్తితోనే మార్టిన్ లూథర్ కింగ్ నల్లజాతి ప్రజల హక్కుల కోసం పోరాటం సాగించాడు. ముగ్గురు పిల్లల తల్లిగా అల్బెర్టా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే చర్చి కార్యక్రమాల్లోను, సామాజిక కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొనేది. మహిళా సంఘాలతో కలసి పనిచేసేది. జాతి వివక్షపైనే కాదు, సమాజంలోని అన్ని రకాల అసమానతలపైనా ఆమెకు తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేలా ఆమె తన పిల్లలను తీర్చిదిద్దింది. వ్యవస్థలోని అన్ని అసమానతలనూ తన తల్లి తీవ్రంగా వ్యతిరేకించేదని, ఆమె ఆకాంక్ష మేరకు నల్లజాతి ప్రజలను తక్కువగా చూసే పరిస్థితులను తాను ఇక ఎంతమాత్రం కొనసాగనిచ్చేది లేదని మార్టిన్ లూథర్ కింగ్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. జాత్యహంకారుల చేతిలో మార్టిన్ లూథర్ కింగ్ హత్యకు గురైన ఆరేళ్లకు అల్బెర్టా కూడా చర్చి సమావేశంలో ఉండగా దుండగుల కాల్పుల్లో మరణించడం విషాదం.