యంత్రంతో మంత్రం వేశాడు!
ఫ్లాష్ బ్యాక్
ఢిల్లీకి చెందిన ధరమ్‌వీర్‌సింగ్ కాంబోజీ కనుగొన్న మల్టీపర్పస్ యంత్రం హైటెక్ యంత్రాలకు ఏమాత్రం తీసిపోదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అదే. ఇది దేనికి పని కొస్తుందనుకుంటున్నారా? ఔషధ మూలికల నుంచి రసం తీసేందుకు, వాటిని పొడి చేసేందుకు, ముద్దగా రుబ్బేందుకు ఉప యోగపడుతుంది. కాయలు, గింజలు, చిరు ధాన్యాలు, పప్పులు వంటి వాటిని కూడా ఇది ఇట్టే ప్రాసెస్ చేసేయగలదు. ధరమ్‌వీర్ సింగ్ శాస్త్రవేత్త కాదు.
ఇంజినీరూ కాదు. పట్టుమని పదోతరగతి కూడా చదువుకో లేదు. ఢిల్లీ వీధుల్లో రిక్షా తొక్కుతూ పొట్ట పోసుకునేవాడు. అయితే, చిన్నప్పటి నుంచి ఆయుర్వేదంపై, వనమూలికలపై ఆసక్తి ఉండటంతో కొందరు సాధువుల వద్ద మూలికలతో ఔషధాలను తయారుచేసే పద్ధతులు నేర్చున్నాడు. 2004లో హర్యానా ప్రభుత్వం తరఫున రాజస్థాన్ వెళ్లిన రైతుల బృందంతో కలసి, అక్కడి అలోవెరా, ఆమ్లా ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించాడు.
అలాంటి యంత్రాలతో స్వయంగా ఏదైనా చేద్దామని భావించినా, వాటి ఖరీదు తన శక్తికి మించినది కావడంతో అప్పటికి మిన్నకున్నాడు. అయితే, రెండేళ్ల వ్యవధిలో స్వయంగా అలోవెరా రసాన్ని తీసే యంత్రాన్ని తయారు చేశాడు. ఇది విజయవంతంగా పని చేయడంతో, కొద్ది కాలానికే ఈ యంత్రానికి మార్పు చేర్పులు చేసి, ఎలాంటి మూలికలు, ఆహార ధాన్యాలనైనా ప్రాసెస్ చేయగల పూర్తిస్థాయి మల్టీపర్పస్ యంత్రంగా రూపొందించాడు.
గంటకు 50 కిలోలు, గంటకు 150 కిలోల పదార్థాలను ప్రాసెస్ చేయగల రెండు నమూనాల్లో ఈ యంత్రాన్ని తయారు చేసి, విజయవంత మైన పరిశ్రమకు యజమానిగా మారాడు. ఇప్పుడు ఇతని వద్ద డజను మంది కార్మికులు పనిచేస్తున్నారు.