అలోవెరా.. దీనినే కలబంద అంటాం. దీంట్లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ప్రతి ఇంటి బాల్కనీలో ఉండాల్సిన మొక్క ఇది. విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగానే కాదు సౌందర్య పరంగా కూడా కలబంద అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ముఖంపై మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను పోగొట్టడంలో అలొవెరా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కాస్మొటిక్స్‌లో అలొవెరాను ఎక్కువగా వాడుతుంటారు.
► అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. ఎండకు చర్మం మండినా, కందిపోయినట్లు అనిపించినా వెంటనే ఆ ప్రదేశంలో అలోవెరా గుజ్జును రాసేయాలి. ఫలితం క్షణాల్లో కనిపిస్తుంది.
►ఇందులో ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగోడుతుంది.
► స్నానం చేసే ముందు అలోవెరా గుజ్జును చర్మానికి అప్లై చేసుకొని 5నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే సబ్బుతో అవసరం లేకుండానే చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఇతరత్రా క్రిములన్నీ చనిపోయి చర్మం కోమలంగా మారుతుంది.
► అలోవెరాని ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది. స్కిన్ కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.
► అలోవెరాలో విటమిన్-సి, ఈ గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వయసు పైబడిన వారు వారానికి మూడుసార్లు క్రమం తప్పకుండా అలోవెరాను రాసుకుంటే వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి.
► మేకప్ రిమూవింగ్ క్రీమ్‌లాగా కూడా అలోవెరా జెల్ చక్కగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అలోవెరా గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కాటన్ బాల్‌తో మేకప్‌ని సులువుగా తొలగించుకోవచ్చు.
► టీనేజర్లను ఎక్కువగా వేధించే సమస్య మొటిమలు. కాలుష్యం కారణంగా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు అలోవెరా జెల్‌ని రాసుకొని పొద్దునే చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది.
► కలబందలో పసుపు, తులసి ఆకుల్ని మిక్సీ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment