
‘‘సరీగమాపదనీసా.. కర్ కరోకరో కర్ జల్సా’’ అంటూ పాటపాడుకుంటూ.. ఫోర్త్ ఫ్లోర్‌లోని ఫ్రెండ్ రూమ్ నుంచి టెరాస్‌పైనున్న తన రూమ్‌వైపు పరుగుతీసింది సాగరిక...! అప్పుడు సమయం రాత్రి పదకొండు దాటింది..!! హాస్టల్‌లో కొందరు అప్పుడప్పుడే నిద్రలోకి జారుకోగా.. మరికొందరు వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్‌తో బిజీగా ఉన్నారు. రూమ్‌లో లైట్ వేసి ఉన్నట్లు గమనించిన సాగరిక.. ‘‘నీలిమా.. ఇంకా నిద్రపోలేదా..?’’ అంటూ డోర్ తీసి ఒక్కనిమిషం షాక్‌లో ఉండిపోయింది. ఆ వెంటనే కెవ్వు కెవ్వుమంటూ అరుస్తూనే ఉంది..! ఆమె భయానకమైన అరుపులకు.. హాస్టల్ మొత్తం ఆ రూమ్ ముందుకు వచ్చినా.. రూమ్‌లోకి వెళ్లేందుకు సాహసించలేకపోయారు.
‘‘హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ హాస్టల్‌లో యువతి దారుణ హత్య’’ అంటూ టీవీ చానల్స్ బ్రేకింగ్ వేసుకుంటున్నాయి. ఆ రూమ్ నిండా రక్తపుమరకలే. మంచంపైన పడి ఉన్న నీలిమ శరీరం కత్తిగాట్లతో ఛిద్రమై ఉంది. నోటినిండా గుడ్డలు కుక్కి ఉన్నాయి. తిన్న అన్నం కూడా సరిగా అరిగినట్లు లేదు. పొట్టలో బలమైన పోట్లతో కడుపులోని అన్నం మెతుకులు కూడా రక్తపు మడుగులో అక్కడక్కడా పడి ఉన్నాయి. అంత భయానకమైన దృశ్యాన్ని ఒక్కసారిగా చూసిన సాగరిక ఇంకా తేరుకోలేకపోతోంది.శవాన్ని హ్యాండోవర్ చేసుకోవడంతో పాటు.. ఆ రూమ్‌ని సీజ్ చెయ్యడం, హాస్టల్ మెయిన్ గేట్ దగ్గర ఉన్న సీసీ çఫుటేజ్ సేకరించడం, నీలిమ తల్లిదండ్రులకు, తన బాయ్ ఫ్రెండ్‌కు సమాచారం అందించడం ఇలా అన్నీ çపూర్తయ్యేసరికి తెల్లవారుజామున 3 అయ్యింది. ‘‘రూమ్‌మేట్ ఎవ్వరు?’’ అని ఎంక్వైరీ చేసిన ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ.. సాగరిక ఇంకా తేరుకోకపోవడాన్ని గమనించి మార్నింగ్ 10 తరువాత ఎంక్వైరీ ఉంటుంది అని చెప్పి వెళ్లిపోయాడు.
‘‘నీలిమ నువ్వూ ఫ్రెండ్సా?’’ ‘‘బెస్ట్ ఫ్రెండ్స్!’’ ‘‘మరి అంత బెస్ట్ ఫ్రెండ్‌ని వదిలేసి వేరే రూమ్‌కి వెళ్లాల్సిన పనేమొచ్చింది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవయ్యిందా?’’ ‘‘లేదు సార్.. మేం బాగానే ఉన్నాం. కానీ మా కింద ఫ్లోర్‌లో మా డిగ్రీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లు కూడా మాకు మంచి స్నేహితులే. రెండు రూమ్‌లకి తిరుగుతూ ఉంటాం! వాళ్లూ మా రూమ్‌కి వస్తుంటారు!’’‘‘హో.. ఏ టైమ్‌కి రూమ్ నుంచి బయటికి వెళ్లావ్?’’‘‘నైట్ ఎయిట్.. ఎయిట్ థర్టీ సార్..’’‘‘మళ్లీ తిరిగి ఎప్పుడొచ్చావ్?’’‘‘పదకొండు దాటుతుంది!’’‘‘అన్ని గంటలా..!?’’‘‘లాప్‌టాప్‌లో సినిమా చూశాం సార్!’’‘‘సినిమానా..?’’‘‘హా.. ‘రాయుడుగారి ఊరు’ సినిమా!’’‘‘అది మొన్నమొన్నే వచ్చిందిగా... పైరసీ..నా..?’’హు.. అన్నట్లు తలదించుకుంది!‘‘మరి నీతోపాటు సినిమా చూడ్డానికి నీలిమ ఎందుకు రాలేదు?’’‘‘తను ఆల్ రెడీ తన బాయ్ ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి హాల్లో చూసేసిందట. ‘నువ్వు వెళ్లు నేను చదువుకుంటా’ అంది.‘‘రాజేష్ ఎలాంటి వాడు?’’‘‘ఏమో సార్... నాకు తెలిసినంత వరకు తనకు అనుమానం! నీలిమ అబ్బాయిలతో మాట్లాడితే ఊరుకునేవాడు కాదు. తనని బాగా కమాండ్ చేసేవాడు. తనని సరదాగా బయట కూడా తిరగనిచ్చేవాడు కాదు. ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లాలంటాడు. చెబితే వద్దు అనేవాడు. తన మాట కాదని ఏ పనీ చేసేది కాదు. అందుకే మా ఇద్దరిమధ్య చాలాసార్లు గొడవైంది...!’’ ఓకే మిస్ సాగరిక.. మళ్లీ త్వరలోనే మిమ్మల్ని కలుస్తా.. అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ.
‘‘హాయ్ రాజేష్.. హౌ ఆర్ యు?’’ అనే పలకరింపు విని ఉలిక్కిపడ్డాడు రాజేష్.‘‘నీలిమ గురించి ఆలోచిస్తున్నావా?’’ అంటూ పక్కనే కూర్చున్నాడు ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ.‘‘అవును సార్.. అంత క్రూరంగా చంపేంత కోపం ఎవరికి ఉందా అని ఆలోచిస్తున్నా సార్!’’ అన్నాడు కళ్లనిండా నీళ్లు తెచ్చుకుని.‘‘తేల్చేద్దాం. మేం ఉన్నదే అందుకు!’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ కాస్త అనుమానంతో కూడిన వెటకారంతో..!
అతడి వెటకారాన్ని గమనించిన రాజేష్.. మౌనంగా ఉన్నాడు.‘‘సీ మిస్టర్ రాజేష్.. నీలిమ నీకు ఎంత కాలంగా తెలుసు?’’‘‘గత మూడేళ్లుగా!’’‘‘ఎలా పరిచయం?’’‘‘నేను తనని మొదటగా ట్రైన్‌లోనే చూశాను. మూడేళ్ల క్రితం జాబ్ ఇంటర్వ్యూ కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు నేను ఎక్కిన బోగీలో తనూ ఎక్కింది. కొద్దిసేపటికే మేం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఫోన్ నెంబర్స్ మార్చుకోవడం వల్ల హైదరాబాద్‌లో చాలా సార్లు కలిశాం. అలా నేను ప్రపోజ్ చేస్తే ఓకే చేసింది.’’‘‘తనని బాగా కంట్రోల్ చేసేవాడివట?’’‘‘తను ఒట్టి అమాయకురాలు.. అందరినీ ఇట్టే నమ్మేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదనే తనని హెచ్చరించేవాడిని, కోప్పడేవాడిని, తిట్టేవాడిని.’’‘‘చివరిగా ఓ ప్రశ్న.. మీకు సాగరిక తెలుసా?’’
‘‘హా.. నీలిమ ఫ్రెండ్ కదా!’’‘‘తనతో ఎప్పుడైనా మాట్లాడావా?’’‘‘పెద్ద పరిచయం లేదు సార్!’’‘‘నిజం చెప్పు మిస్టర్ రాజేష్..! నీలిమ కంటే ఎక్కువగా సాగరికతోనే కాల్స్ మాట్లాడుతూ.. నీలిమని సైడ్ చేస్తే ఇద్దరూ సెటిల్ అయిపోదామని ప్లాన్ చేశారు కదా!?’’‘‘ఏం మాట్లాడుతున్నారు సార్..!?’’‘‘ఎస్ మిస్టర్ రాజేష్.. సీ యువర్ కాల్ లిస్ట్..!’’ అంటూ కొన్ని పేపర్స్ రాజేష్ ముందేశాడు ఇన్స్‌స్పెక్టర్!!‘‘సార్.. మీరు పొరబడుతున్నారు.. నేను డైలీ సాగరిక ఫోన్‌లో మాట్లాడేది సాగరికతో కాదు..!’’‘‘మరి ఎవరితో..?’’‘‘నీలిమతో సార్!’’‘‘ఛా.. నీలిమకి ఫోన్ లేదా?’’‘‘ఉంది బట్.. తన ఫోన్‌కి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ నిత్యం ఫోన్ చేస్తుంటారు. ఆ సమయంలో కాల్ వెయిటింగ్ వస్తే నీలిమపై డౌట్ వస్తుందని సాగరిక ఫోన్ నీలిమ వాడేది సార్!’’.రాజేష్ మాటలకు మళ్లీ ఆలోచనలో పడ్డాడు ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ.‘‘అసలు ఈ నీలిమను ఎవరు చంపుంటారు? ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కూడా వేలిముద్రలు, డీఎన్‌ఏ శాంపిల్స్ దొరక్కుండా చాలా జాగ్రత్తపడ్డాడు హంతకుడు. సీసీ ఫుటేజుల్లోనూ కానరాలేదు. సాగరిక, రాజేష్‌లపై అనుమానం ఉంది కానీ, నిరూపించే ఆధారం కనిపించడంలేదు.’’ అంటూ తలపట్టుకున్న ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణకి... నీలిమ తల్లిదండ్రులను మరోసారి కలవాలనిపించింది. వెంటనే నీలిమ తండ్రి రమణమూర్తికి కాల్ చేశాడు.‘‘మీకు శత్రువులెవరైనా ఉన్నారా?’’‘‘మేం ఏదో కౌలు వ్యవసాయం చేసుకునేటోళ్లం. మాకు ఆస్తులా పాస్తులా.. మాకు పగోళ్లెవరుంటారు సారు?’’ అన్నాడు రమణమూర్తి.కాస్త ఆలోచించిన జయ కృష్ణ.. ‘‘మీ అమ్మాయి ఎప్పుడైనా.. ఎవరివల్లైనా ఇబ్బందిపడుతున్నానని కానీ, ఏదైనా సమస్య వచ్చిందనిగానీ మీతో చెప్పిందా?’’‘‘లేదు సారు. ఏదున్నా మా ప్రవీణ్‌తో మాట్లాడేది!’’‘‘ప్రవీణ్ ఎవరు?’’‘‘నా బిడ్డ సారు! నాకు ఓ కొడుకు, కూతురు!!’’‘‘తను ఎక్కడుంటాడు?’’‘‘బెంగుళూర్‌లో సార్!’’‘‘మరి మీ అమ్మాయి చనిపోయాక ఎందుకు రాలేదు?’’‘‘వచ్చి మళ్లీ వెళ్లిపోయినాడు సారు! బిడ్డ చాలా బాధపడిపోయినాడు!! సెలవులు దొరికితే మళ్లొస్తానన్నాడు.’’‘‘నేను తనని కలవాలి.. రమ్మని చెప్పండి! తన ఫోన్ నెంబర్ ఇవ్వండి!’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ.
ప్రవీణ్ నెంబర్ తీసుకున్న ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ తీవ్ర ఆలోచనలో పడ్డాడు. ‘‘ఈ నెంబర్...... నీలిమ కాల్ లిస్ట్ పేపర్స్‌లో చూశాను. కానీ ఫోన్‌లో చూడలేదే..!?’’ అనుమానం బలపడింది!!!అయినా సొంత అన్నకి చెల్లెల్ని చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ ఈ నెంబర్ నీలిమే ఫోన్‌లోంచి డిలీట్ చేసుంటుందా? అయినా అన్న నెంబర్ డిలీట్ చేసుకోవల్సిన అవసరం తనకేముంటుంది? మేబీ రాజేష్‌కి భయపడి డిలీట్ చేసిందా? రాజేష్‌కి అబ్బాయిలతో మాట్లాడితే ఇష్టం ఉండదన్న మాట నిజమైనా.. సొంత అన్నతో కూడా మాట్లాడొద్దనేంత మూర్ఖుడా రాజేష్??’’ ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు జయ కృష్ణ.‘‘నమస్తే సార్.. నేను ప్రవీణ్. మా చెల్లెలు మర్డర్ విషయంలో నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా. ఈలోపే మీరు రమ్మన్నారట. హంతకుడెవరో దొరికాడా సార్?’’ అన్నాడు ప్రవీణ్ ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ ఎదురుగా కూర్చుంటూ!!‘హాయ్ ప్రవీణ్... వెల్‌డన్! ప్రొఫెషనల్ కిలర్స్‌ని మించిపోయావ్‌గా!’ అన్నాడు ఇన్‌స్పెక్టర్.ఆ మాటకు కంగుతిన్న ప్రవీణ్.. ‘‘వాట్ ఆర్ యు టాకింగ్? హంతకుడిని పట్టుకోవడం మీ వల్ల కాదు అంటే కాదని చెప్పండి. ఇలా ఏదేదో మాట్లాడకండి!’’ అన్నాడు చాలా కోపంగా.డెస్క్‌లోని నీలిమ ఫోన్ బయటకి తీస్తూ... ‘‘నార్మల్ మెసేజ్‌లు, కాల్ లిస్ట్ క్లీన్ చేశావు కానీ.. ‘వే టు ఎస్‌ఎమ్‌ఎస్’లోని మెసేజ్‌లు డిలీట్ చెయ్యడం మరిచిపోయావ్ బంగారం!’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ.నీలిమ హత్య జరిగిన రోజు ‘వే టు ఎస్‌ఎమ్‌ఎస్’ మెసేజ్‌లన్నీ వరుసగా ఇలా ఉన్నాయి.. ‘‘హాయ్ అన్నయ్యా, తిన్నాను, ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లింది, సినిమా చూడ్డానికి, కొత్తసినిమా, లాపీలో, చదువుకుంటున్నా’’... ఈ మెసేజ్‌లన్నీ నీ నెంబర్‌కే వచ్చాయి. అంటే నువ్వు అడిగిన ప్రశ్నలకు ఇవన్నీ సమాధానాలు..!ఇప్పుడేమంటావ్?అంటూ ప్రవీణ్ కళ్లలోకి సూటిగా చూశాడు ఇన్‌స్పెక్టర్.ప్రవీణ్ స్వరంలో వణుకును గమనించిన ఇన్‌స్పెక్టర్.. తనదైన శైలిలో నిజం చెప్పించే ప్రయత్నం చేశాడు.
‘‘నీలిమ ప్రతీది నాతోనే షేర్ చేసుకునేది. అయితే కులంకానివాడిని ప్రేమించి తప్పు చేసింది. ఆ విషయం నా దగ్గర దాచి మరో తప్పు చేసింది. ఆరు నెలల క్రితం నా స్నేహితుడు హరి వల్ల ఈ విషయం తెలిసింది.
నిజమేనా అని నిలదీస్తే.. ఎదురు చెప్పింది. ఊరిలో పరువేం కావాలి? అంటూ నచ్చజెప్పాను. వద్దని హెచ్చరించాను. వినలేదు. పైగా ‘‘అమ్మని, నాన్నని ఒప్పించాల్సిన బాధ్యత నీదేనని, లేదంటే వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటామని’’ తెగేసి చెప్పింది. అందుకే.. చంపెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆఫీస్‌కి నెలరోజులు సెలవ్ పెట్టి బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చేశాను. దాని హాస్టల్ పక్క ఫ్లాట్‌లోనే దిగాను. నాకు మీ పెళ్లి ఇష్టమేనని నమ్మించాను. అమ్మా వాళ్లని ఒప్పించడానికి సమయం కావాలని అడిగాను. సరేనంది. ఇరవైనాలుగు గంటలు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తెలివిగా అడిగి తెలుసుకునేవాడిని.తన రూమ్‌మేట్ ఏదో కొత్త సినిమా చూడ్డానికి వేరే ఫ్రెండ్ రూమ్‌కి వెళ్లిందని, తను రూమ్‌లో చదువుకుంటున్నానని చెప్పింది. సినిమా అంటే కనీసం రెండు మూడు గంటలు.. అంతకన్నా మంచి అవకాశం రాదని నిర్ణయించుకున్నా. నేను ముందు వేసుకున్న పథకం ప్రకారమే... నేను ఉండే ఫ్లాట్ టెరాస్ మీద నుంచి.. తను ఉండే టెరాస్‌పైకి వెళ్లాను. తలుపు తీసే ఉండటంతో.. తోసుకుని లోపలికి వెళ్లి గడియపెట్టాను. నీలిమ షాక్ అయ్యింది. ‘‘అన్నయ్యా.. బెంగళూర్ నుంచి ఎప్పుడు వచ్చావ్..? అయినా లోపలికి ఎలా వచ్చావ్..?’’ అంటూ నా దగ్గరకు వచ్చింది. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా నోట్లో గుడ్డలు కుక్కి.. వెంటతెచ్చుకున్న కత్తితో ఊపిరి ఆగేంతవరకూ పొడిచేశాను. వెంటనే నా ఆనవాళ్లు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుని, తన ఫోన్‌లో నా చాటింగ్ మొత్తం డిలీట్ చేసి.. ఆ నైట్‌కే బెంగళూర్ వెళ్లిపోయాను’’ అంటూ.. ముగించాడు ప్రవీణ్.‘పరువు కోసం సొంత చెల్లెలి ప్రాణాలు తీసేస్తావా? ఇప్పుడేమైంద్రా నీ పరువు..?? ఆడపిల్లని పరువుగా భావించడం నీదిరా తప్పు. తనకి ఇష్టాలు ఉండవా? నిర్ణయాలు తీసుకో కూడదా?’’ అంటూ.. కాలర్ పట్టుకుని లాక్కెళ్లి జైల్లో పడేశాడు ఇన్‌స్పెక్టర్ జయ కృష్ణ.
నీలిమ అబ్బాయిలతో
మాట్లాడితే ఊరుకునేవాడు కాదు. తనని బాగా కమాండ్ చేసేవాడు. తనని సరదాగా బయట కూడా తిరగనిచ్చేవాడు కాదు. ఎక్కడకి వెళ్లినా చెప్పి వెళ్లాలంటాడు. చెబితే వద్దు అనేవాడు. తన మాట కాదని
ఏ పని చేసేది కాదు.
∙స్మృతిక