అనుమానాస్పదంగా మృతి చెందిన సారా ఎవెరార్డ్‌కు లండన్‌లో నివాళులర్పిస్తున్న ప్రజలు
లండన్: దక్షిణ లండన్‌లో 33 ఏళ్ల యువతి సారా ఎవెరార్డ్ హత్యను నిరసిస్తూ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని అడ్డుకున్న స్కాట్‌ల్యాండ్ పోలీసులు తమ చర్యల్ని పూర్తిగా సమర్థించు కున్నారు. కరోనా నిబంధనల్ని అతిక్రమిస్తూ జనం సారాకి మద్దతుగా భారీ సంఖ్యలో గుమిగూడడం వల్లే వారిని చెదరగొట్టామని చెబుతున్నారు. ర్యాలీలో పాల్గొన్నవారిలో నలుగురిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ‘‘ప్రజల భద్రత గురించి ఆలోచిస్తూ పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఇంకా కరోనా సంక్షోభం ముగియకుండా అంత మంది ఒకే చోట గుమిగూడడం మంచిది కాదు’’అని పోలీసు కమిషనర్ హెలెన్ బాల్ అన్నారు.
‘‘పోలీసులు వెళ్లిపోమని చెప్పగానే చాలా మంది వెనక్కి మళ్లారు కానీ కొంత మంది పోలీసులపైకి వస్తువులు విసిరారు. అందుకే వారిని కట్టడి చేయాల్సి వచ్చింది’’అని చెప్పారు. అయితే పోలీసులకి, నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరస్ అయ్యాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతో లండన్ మేయర్ సాదిక్ ఖాన్ సహా ఎందరో నాయకులు దీనిపై స్పందించారు. పోలీసుల తీరుని తప్పు పట్టారు. గత వారంలో స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ సారా ఎవెరార్డ్ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత శవమై కనిపించడం బ్రిటన్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు బయటకి వచ్చి హత్యను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment