కుటుంబ కలహాలతోనే అత్యధిక హత్యలు
రేప్ కేసుల్లో నిందితులు పరిచయస్తులే..
నేర గణాంకాల విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: సమాజంలో జరిగే ప్రతి నేరం వెనుక ఓ కారణం కచ్చితంగా ఉంటుంది. వార్షిక విలేకరుల సమావేశం సందర్భంగా ఆదివారం డీజీపీ డాక్టర్ జితేందర్ నేరాల సంబంధిత గణాంకాలను విడుదల చేశారు. 2024కు (నవంబర్ వరకు) సంబంధించి రాష్ట్రంలో నమోదైన నేరాలను పరిశీలిస్తే..వీటిల్లో అనేక ఆసక్తికరమైన కోణాలు కూడా ఉన్నాయి.
కుటుంబీకులే కత్తికడుతున్నారు...
బాడీలీ అఫెన్స్‌గా పిలిచే హత్య కేసులకు పోలీసులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వీటి దర్యాప్తు కోసం అవసరమైతే ప్రత్యేక బృందాలనూ రంగంలోకి దింపుతారు. సాధారణంగా ఓ వ్యక్తి/వ్యక్తులు మరొకరిని చంపడానికి ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తాం. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నమోదైన 856 హత్య కేసుల్లో అత్యధికంగా 229 (26.75 శాతం) కేసులు కుటుంబ కలహాల వల్లే జరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా 102, భూ వివాదాలతో 82, చిరు వివాదాల వల్ల మరో 82 హత్యలు జరిగితే.. ఆర్థిక కారణాల వల్ల 53 హత్యలు జరిగాయి. మరో 259 మాత్రం రకరకాలైన ఇతర కారణాల వల్ల జరిగాయి.
పిల్లలు తప్పిపోయినా కిడ్నాపే...
డబ్బు కోసం లేదా ఇతరత్రా లబ్ధి కోసం వ్యక్తులో, ముఠానో ఎవరినైనా ఎత్తుకుపోయి నిర్భంధిస్తే కిడ్నాప్‌గా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది తెలంగాణలో 1,525 అపహరణ కేసులు నమోదయ్యాయి. ఇంతమంది కిడ్నాప్‌కు గురయ్యారని అనుకుంటున్నారా? కానే కాదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మైనర్ల మిస్సింగ్ కేసుల్ని కూడా కిడ్నాప్‌గా నమోదు చేయడం తప్పనిసరి. దర్యాçప్తుల్లో నిర్లక్ష్యాన్ని నిరోధించడానికి న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఏడాది నమోదైన కిడ్నాపుల్లో మిస్సింగ్ సంబంధిత కేసులే 1,251 (82.03 శాతం) ఉన్నాయి. మిగిలినవి ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, చిరు వివాదాల నేపథ్యంలో జరిగినవి ఉన్నాయి.
చోరీలకు సెల్‌ఫోన్ల లింకు
ప్రతి వ్యక్తి చేతిలోకి అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్ ప్రభావం కేవలం సైబర్ నేరాల పైనే కాదు. చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం (డెకాయిటీ) కేసుల పైనా ఉంటోంది. ఈ ఏడాది 58 డెకాయిటీ కేసులు నమోదు కాగా.. వీటిలో 5 సెల్‌ఫోన్లు లాక్కుపోవడానికి సంబంధించివే. 703 దోపిడీ కేసుల్లో 67, 19480 చోరీ కేసుల్లో 1960 ఫోన్లతో ముడిపడి ఉన్నవే కారణం కావడం గమనార్హం.
పరిచయస్తులే చెరబట్టారు!
మహిళలపై జరుగుతున్న నేరాల్లో అత్యాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన అత్యాచారం కేసుల్లో పరిచయస్తులే నిందితులుగా ఉన్న ఉదంతాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం 2,945 కేసులు నమోదు కాగా...వీటిలో 2,922 (99.21 శాతం) పరిచయస్తుల వల్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించే అంశం. కేవలం 23 కేసుల్లో మాత్రమే బాధితులకు పరిచయం లేని వాళ్లు నిందితులుగా ఉన్నారు. మైనర్‌ను ప్రేమ పేరుతో మోసం చేయడం, పెళ్లి చేసుకోవడం తరహాకు చెందినవీ మొదటి కేటగిరీలోనే ఉంటున్నాయి. రేప్ కేసు బాధితుల్లో 15 ఏళ్ల లోపు వాళ్లు 87 మంది, 15–18 ఏళ్ల మధ్య వయసు్కలు 1,970 మంది, మేజర్లు 888 మంది ఉన్నారు.
మోసాల్లో సైబర్ నేరాలదే అగ్రస్థానం
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 33,618 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 24,643 (73.3 శాతం) సైబర్ నేరాలే కావడం గమనార్హం. చిన్న చిన్న మొత్తాలతో కూడిన సైబర్ నేరాలు ఫిర్యాదు దశలోనే ఆగిపోతున్నాయి. పెద్ద మొత్తాలు కోల్పోయిన వారిలోనూ దాదాపు సగం మంది పరువు, ప్రతిష్ట కోసం, సమాజానికి భయపడి ఫిర్యాదుల వరకు వెళ్లట్లేదు. ఇవి కూడా రికార్డుల్లోకి ఎక్కితే మోసం కేసుల సంఖ్య లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది.
ప్రమాదాలు, మరణాలు పైపైకే..
రాష్ట్ర వ్యాప్తంగా 2023లో (నవంబర్ వరకు) 20,702 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... 6,541 మంది చనిపోయారు. ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 23,491 రోడ్డు ప్రమాదాల్లో 6,640 మంది మరణించారు. మృతులు నమోదు కాని రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగాయి. 2023లో వీటి సంఖ్య 14,161 కాగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 16,851కి చేరింది. 2023లో అన్ని రకాల నేరాలూ కలిపి 1,38,312 నమోదు కాగా, 2024లో 1,69,477 నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment