సంద్రాన నగరం... సడి లేక మాయం! | Mystery of the story | Sakshi
Sakshi News home page

సంద్రాన నగరం... సడి లేక మాయం!

Published Sun, Sep 13 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

సంద్రాన నగరం... సడి లేక మాయం!

సంద్రాన నగరం... సడి లేక మాయం!

మిస్టరీ
జూన్ 7, 1692... జమైకా... మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. కరీబియన్ సముద్రపు అలలపై ఓ నౌక అల్లనల్లన సాగిపోతోంది. నౌకలో ఉన్న ముగ్గురూ ఎవరి మానాన వాళ్లు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. అంతలో ఒకతను అన్నాడు.
 ‘‘అలెక్స్... నువ్వన్నదే ఫైనలా?’’
 అలెక్స్ ఆలోచనల్లోంచి బయట పడ్డాడు. ‘‘అవును జేమ్స్... అదే ఫైనల్.

ఇంత దూరం వచ్చాక కూడా డౌటుగా అడుగుతావే’’ అన్నాడు సీరియస్‌గా.
 మూడో వ్యక్తి ఆ ఇద్దరి వైపూ ఓసారి చూశాడు. తర్వాత అన్నాడు.. ‘నాకెందుకో ఇది రిస్కేమో అనిపిస్తోంది ఫ్రెండ్స్. పోర్ట్ రాయల్ సిటీకి వెళ్లడమంటే  మాటలా?’’
 అలెక్స్‌కి నవ్వొచ్చింది. ‘‘దొంగోడికి మరో దొంగోడి దగ్గరకు వెళ్లడానికి భయమేంట్రా బిల్లీ?’’ అన్నాడు. జేమ్స్ పకపకా నవ్వాడు.
 
బిల్లీకి మాత్రం నవ్వు రాలేదు. అతనికి భయంగా ఉంది. పోర్ట్ రాయల్ సిటీ గురించి అతను చాలా విన్నాడు. అక్కడ కరడుగట్టిన గజదొంగలుంటారు. ఏదైనా తేడా వస్తే సొమ్ములతో పాటు ప్రాణాలను సైతం దోచుకుంటారు. జాలి, దయ అనేవి వాళ్ల డిక్షనరీలోనే ఉండవు. అలాంటి వాళ్ల దగ్గరికి వెళ్లడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వెళ్లక తప్పని పరిస్థితి.
 దాదాపు పదేళ్లుగా వాళ్లు ముగ్గురూ కలిసి దొంగతనాలు చేస్తున్నారు. కానీ మొదటిసారి ఓ చోరీ కేసులో తమ గురిం చిన ఆధారాలు పోలీసులకి దొరికాయి.

వాళ్లు కచ్చితంగా తమను పట్టేస్తారు. అందుకే పారిపోయి పోర్ట్ రాయల్ నగరంలో తలదాచుకుందామని అలెక్స్ ప్లాన్ వేశాడు. ఒక రకంగా అతని ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఆ పట్టణం... ఓ ప్రత్యేక ప్రపంచం. నేరస్తులకి అది స్వర్గం. అక్కడి వాళ్లు ఎవరినీ లెక్క చేయరు. ఎవరికీ భయపడరు. తమ జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టరు. వాళ్లను మంచి చేసుకుని అక్కడ సెటిలైపోతే, ఇక తమనెవరూ పట్టు కోలేరు అంటాడు అలెక్స్.

కానీ బిల్లీకి సందేహం... తాము అక్కడ ఉండటానికి వాళ్లు అనుమతిస్తారా లేదా అని. అదే అంటే కొట్టి పారేశాడు అలెక్స్. తాను వాళ్లను ఒప్పిస్తానన్నాడు. అతడు ఓసారి ఫిక్సయ్యాడంటే ఇక ఎవరి మాటా వినడు. అందుకే ఇష్టం లేకపోయినా మౌనంగా ఉండిపోయాడు బిల్లీ.
 ‘‘జేమ్స్, బిల్లీ... పది నిమిషాల్లో అక్కడ ఉంటాం. ఇక మనల్నెవ్వరూ పట్టుకోలేరు’’... అన్నాడు అలెక్స్ ఆనందంగా.
 
పది నిమిషాలు గడిచాయి. పదిహేను నిమిషాలు గడిచాయి. కానీ ఎంతకీ సిటీని చేరుకోవడం లేదు పడవ.
 ‘‘ఏది అలెక్స్... పది నిమిషాలే అన్నావ్. ఎంత దూరం పోయినా సిటీ రావడం లేదే’’ అన్నాడు జేమ్స్ అనుమానంగా.
 వెంటనే చుట్టూ చూశాడు అలెక్స్. దూరంగా ఓ పక్కన కింగ్స్‌టన్ హార్బర్ కనిపిస్తోంది. దానికి దగ్గర్లో మరో పక్కగా ఉండే దీవి, ఆ దీవి మీద ఉండాల్సిన పోర్ట్ రాయల్ నగరం మాత్రం కనిపించడం లేదు.

కళ్లు నులుముకుని మళ్లీ చూశాడు. అంతా శూన్యం. భవంతులు లేవు. రేవులో కట్టేసి ఉండే పడవలు లేవు. అసలక్కడ ఏమీ లేదు. ‘‘ఏంట్రా ఇది? సిటీ ఏది?’’ అన్నాడు అయోమయంగా.
 ‘‘మనం తప్పు అడ్రస్‌కి వచ్చామేమో’’ అన్నాడు బిల్లీ సందేహంగా.
 ‘‘నీ ముఖం. నిన్న నేను వచ్చి అన్నీ పరిశీలించాను కదా. పోర్ట్ రాయల్ నగరం ఇక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు కనిపించడం లేదు.

నిన్న ఇక్కడే ఉన్నది ఇవాళ ఏమైపోతుంది?’’
 అలెక్స్ మాటలు విని ఆశ్చర్యపోయా రిద్దరూ. నిన్న ఉందా? ఇవాళ లేదా? అంత పెద్ద నగరం ఉన్నట్టుండి  ఎలా మాయమవుతుంది? రెండువేల ఇళ్లు ఎలా మాయమైపోతాయి? అందులో ఉండే మనుషులందరూ ఏమైపోతారు?
 తలలు బద్దలయ్యేలా ఆలోచించారు ముగ్గురూ. కానీ ఏం అర్థం కాలేదు. దాంతో మౌనంగా వెనుదిరిగారు.
 
నిజానికి వాళ్లకే కాదు... వాళ్ల ద్వారా పోర్ట్ రాయల్ నగరం గురించి విన్న వాళ్లెవరికీ ఏమీ అర్థం కాలేదు. పోర్ట్ రాయల్ ఒక్కసారిగా అంతర్థానమై పోయింది. మొండి గోడలు కాదు కదా, ఎక్కడా చిన్న ఇటుక ముక్క కూడా కనిపించడం లేదు. అలా ఎలా జరిగింది? అసలా పట్టణానికి ఏమయ్యింది?
   
జమైకా దేశానికి ఈశాన్య దిశలో... కరీబియన్ సముద్ర జలాల్లో ఒక దీవి ఉంది. 1494లో కొలంబస్ ఈ దీవిని కనుక్కున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కొందరు మత్స్యకారులు ఆ దీవి మీద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచీ మెల్లగా జనాభా పెరిగింది. అయితే 1655లో బ్రిటిష్‌వారు ఆక్రమించుకున్న తర్వాత ఈ దీవి రూపమే మారిపోయింది.
 ఆంగ్లేయులు ఈ ద్వీపాన్ని అందంగా మార్చాలనుకున్నారు.

పెద్ద పెద్ద ఇళ్లు, చక్కని దుకాణాలతో ఓ అందమైన నగ రాన్ని నిర్మించారు. దానికి పోర్ట్ రాయల్ సిటీ అని పేరు పెట్టారు. మెల్లగా జనాభా పెరిగింది. వ్యాపారాలు వెలిశాయి. సంపద కూడా పెరిగింది. కానీ అక్కడి వారికి ప్రశాంతత మాత్రం కరువైంది.
 ఎందుకో తెలియదు కానీ... పోర్ట్ రాయల్‌లో తరచుగా భయంకర వ్యాధులు ప్రబలుతూ ఉండేవి. ఎంతోమంది వాటి బారిన పడి అల్లాడేవారు. అలాగే అప్పు డప్పుడూ భూకంపాలు కూడా వచ్చి ఆస్తి నష్టం సంభవిస్తూ ఉండేది.

ఒక్కోసారి హరికేన్లు విరుచుకుపడి పంటల్ని నాశనం చేసేవి. ఇవన్నీ కలిసి పోర్ట్ రాయల్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేసేవి. దాంతో మెల్లగా వారి సంపద తగ్గుతూ వచ్చింది. ఓ సమయంలో కరవు కూడా ఏర్పడింది. కానీ అప్పుడే పోర్ట్ రాయల్ నగరం మరో కొత్త రూపును సంతరించు కోవడం మొదలైంది.
 
తమ అవసరాలను తీర్చుకోవడం కోసం అక్కడి ప్రజల్లో కొందరు సముద్రపు దొంగలుగా మారారు. సముద్ర మార్గాన వెళ్లేవారిని దోచుకోవడం మొదలుపెట్టారు. తక్కువ కష్టం, ఎక్కువ లాభం. జీవితాలు మారిపోయాయి. సంపదలో మునిగి తేల సాగారు. వారిని చూసి మిగతావారంతా కూడా అదే పనికి పూనుకున్నారు. కొన్నాళ్లు గడిచేసరికి ఒక్కొక్కరుగా అందరూ దొంగలైపోయారు. దాంతో పోర్ట్ రాయల్ సిటీ కాస్తా పైరేట్ సిటీగా మారిపోయింది.
 అయితే వాళ్లు దొంగతనాల దగ్గరే ఆగి పోలేదు.

చేతినిండా సొమ్ము ఉండటంతో విపరీతమైన విలాసాలకు అలవాటు పడ్డారు. ఎప్పుడూ మత్తులో మునిగి తేలే వారు. వ్యభిచారులుగా తయారయ్యారు. ఓడలను అడ్డుకుని దోచుకోవడమే కాక, మహిళలను ఎత్తుకొచ్చి బంధించేవారు. అత్యాచారాలు చేసేవారు. తర్వాత వారిని చంపి సముద్రంలో పారేసేవారు.
 
మెల్లగా వీరి అక్రమాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ అధికారులు పోర్ట్ రాయల్‌లో జరిగే దారుణాలను ఆపాలని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. ఎందు కంటే అక్కడి మనుషులంతా అప్పటికే క్రూరంగా మారిపోయారు. ఎవరినీ తమ పట్టణంలో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. వాళ్లు అనుకున్నదే న్యాయం, చేసిందే చట్టం. ఎవరైనా వాళ్లకు వ్యతిరేకంగా నడచుకుంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడేవారు కాదు. అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి వస్తారనే నమ్మకం లేకపోవడంతో వెళ్లే ధైర్యం ఎవరూ చేసేవారు కాదు. దాంతో అడ్డూ అదుపూ లేక నగరం పూర్తిగా దుర్మార్గాలతో, అక్రమాలు అన్యాయాలతో నిండిపోయింది.
 
అలాంటి ఆ సిటీ... 1692లో ఓ రోజు కనిపించకుండా పోయింది. రెండువేలకు పైగా ఇళ్లు... మార్కెట్లు, దుకాణాలు... ఏ ఒక్కటీ అక్కడ లేదు. వేలమంది జనాభాలో ఒక్కరి జాడ కూడా అక్కడ కనిపించలేదు. చేతితో తీసేసినట్టుగా ప్రపంచపటం నుంచి దాని ఆనవాళ్లు తుడిచి పెట్టుకుపోయాయి.
 
ప్రపంచం అవాక్కయ్యింది. ప్రజానీకం విస్తుపోయింది. పైరేట్ సిటీకి ఏమయ్యిందా అంటూ ఎంక్వయిరీ మొదలుపెట్టింది. కానీ కారణాలు మాత్రం కనిపెట్టలేకపోయింది. భూకంపం వచ్చిందన్నారు కొందరు. సునామీ వచ్చి ఉంటుందన్నారు ఇంకొందరు. రెండూ కలిసి వచ్చి ఉంటాయి, అందుకే నామ రూపాలు లేకుండా పోయింది అన్నారు మరికొందరు. వాళ్లు అలా అనడానికి కారణం ఉంది.

పోర్ట్ రాయల్ నగరం నిర్మితమైంది నిజానికి దీవి మీద కాదు. అసలు అది దీవే కాదు. పొరలు పొరలుగా ఇసుక మేట వేయడం వల్ల ఏర్పడిన నేల. దానికి బలం ఉండదు. ఆ వాస్తవాన్ని గుర్తించకుండా, దాని మీద నగరాన్ని నిర్మించారు. కాబట్టి అది సముద్రంలోకి కుంగిపోయి ఉంటుందని అంచనా వేశారు. కొందరైతే ఇదంతా దేవుడి శాపం అన్నారు. పాపంతో నిండిపోయిన పైరేట్ సిటీని చూసి దేవుడు ఆగ్రహించాడని, అందుకే ఆ నగరాన్ని రాత్రికి రాత్రే నాశనం చేశాడని అభిప్రాయపడ్డారు. అయితే ఇవన్నీ అభిప్రాయాలు మాత్రమే. ఊహల ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. నిజంగా పైరేట్ సిటీ ఎందుకు మాయమైంది అన్నది ఇప్పటికీ ఒక ముడి వీడని మిస్టరీనే!
 
ఒకనాటి పైరేట్ సిటీ వర్ణచిత్రం
రెండు సంవత్సరాల క్రితం కరీబియన్ సముద్రపు అడుగున కొన్ని భవనాల అవశేషాలు కనిపించాయి శాస్త్రవేత్తలకు. సరిగ్గా అదే ప్రాంతంలో ఒకప్పుడు పైరేట్ సిటీ ఉండేది. దాంతో సదరు భవనాలు ఆ సిటీకి సంబంధించినవేనని, సునామీ వల్లనో భూకంపం వల్లనో పైరేట్ సిటీ సముద్రంలో కలిసిపోయిందని అన్నారు వారు. అయితే దాన్ని నిర్థారించేందుకు తగిన ఆధారాలు వారికి ఇంకా లభ్యం కాలేదు. ఒకవేళ లభ్యమైతే మిస్టరీ విడిపోతుంది. లేదంటే పైరేట్ సిటీ అంతర్థానం ఎప్పటికీ రహస్యంగానే మిగిలిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement