అన్వేషణం : నేలపై సముద్రం... జార్జియా అక్వేరియం! | On the floor of the sea ... Georgia Aquarium! | Sakshi
Sakshi News home page

అన్వేషణం : నేలపై సముద్రం... జార్జియా అక్వేరియం!

Published Sun, Oct 27 2013 3:56 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అన్వేషణం :  నేలపై సముద్రం... జార్జియా అక్వేరియం! - Sakshi

అన్వేషణం : నేలపై సముద్రం... జార్జియా అక్వేరియం!

 చిన్ని చిన్ని అద్దాల పెట్టెల్లో, బుజ్జి బుజ్జి చేపలను వేసి, అక్వేరియం అంటూ ఇంట్లో అమర్చుకుంటాం. రంగుల చేపలను చూసి పిల్లలు గంతులు వేస్తుంటే చూసి మురిసిపోతాం. ఆ చిన్ని అక్వేరియమే మన ఇంట్లో ఇంత ఆనందాన్ని నింపితే... పదమూడు ఎకరాల్లో ఉండే జార్జియా అక్వేరియం ఇంకెంత గొప్ప అనుభూతిని కలిగిస్తుంది!
 
 అమెరికాలోని జార్జియా రాష్ర్టంలో ఉన్న సందర్శనీయ స్థలాల్లో జార్జియా అక్వేరియానిది ప్రత్యేక స్థానం. దాన్ని చూడటం జీవితంలోనే ఓ గొప్ప అనుభవం. దాదాపు ఎనభై లక్షల గ్యాలన్ల నీటిలో, లక్షా ఇరవై వేలకు పైగా సముద్ర జీవులు ఈదులాడుతూ ఉంటే, వాటి ముఖంలో ముఖం పెట్టి పలకరించడం ఇక్కడ మాత్రమే సాధ్యం.
 
 ప్రపంచంలోనే అతి పెద్దదైన జార్జియా అక్వేరియం నిర్మాణానికి కారకులు బెర్నార్డ్ మార్కస్. ప్రముఖ వ్యాపారస్తుడైన ఈయనకు సముద్ర జీవులంటే ఎంతో ఇష్టమట. అందుకే ఎక్కడ అక్వేరియంలు ఉన్నా ఇష్టంగా చూసేవారు. తన భార్యతో కలిసి పదమూడు దేశాలు తిరిగి, యాభై ఆరు అక్వేరియంల వరకూ సందర్శించి మరీ దీనికి రూపకల్పన చేశారు. రెండు వందల యాభై మిలియన్ డాలర్లను దీని కోసం వెచ్చించారు. అది కాక మరో నలభై మిలియన్ డాలర్లను పలువురి నుంచి సేకరించారు. ఫలితంగా 2005లో జార్జియా అక్వేరియం ప్రారంభమయింది. లక్షలాది మందికి ఓ చక్కని ఆటవిడుపుని, ఆనందాన్ని కలిగిస్తోంది!
 
 ఈ అక్వేరియం ఆరు విభాగాలుగా ఉంటుంది. వీటన్నిటి లోనూ రకరకాల సముద్ర జీవులు ఉంటాయి. సముద్ర మొక్కలు కూడా ఉంటాయి. గైడ్స్ మన వెంటే ఉండి, ప్రతి దాని గురించీ వివరిస్తారు. దాంతో ఉల్లాసంతో పాటు విజ్ఞానం కూడా లభిస్తుంది మనకు. అందుకే సరదాగా వచ్చే సందర్శకులతో పాటు, పరిశోధనల కోసం, ప్రాజెక్టు వర్కుల కోసం వచ్చేవారు కూడా ఎక్కువే!
 
 అమ్మో... అడుగుకో దెయ్యం!
 
 ఇంగ్లండులోని ప్లక్‌లీ గ్రామం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఏదో గొప్పదనం వల్ల కాదు. ఎక్కడా లేని దెయ్యాలు అక్కడే ఉన్నాయని! ఆ ఊరు పగలంతా సందడిగా ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించాక ఆ ఊళ్లో ఒక్క మనిషి కూడా గడప దాటి అడుగు బయటపెట్టడు. పెడితే... ఎక్కడ, ఏ దెయ్యాన్ని చూడాల్సి వస్తుందోనని భయం!
 
 ప్లక్‌లీలో పన్నెండు దెయ్యాలు చాలా ఫేమస్. రహదారి మీద తిరిగే మగదెయ్యం ప్రయాణీకులను ముప్పు తిప్పలు పెడుతుందట. పినాక్ సరస్సులో ఉండే ఆడదెయ్యం అర్ధరాత్రి అయితే చాలు, ఊరంతా చక్కర్లు కొడుతుందట. అదే టైమ్‌లో పన్నెండు గుర్రాలు ఉన్న రథంలో మరో దెయ్యం షికార్లు చేస్తుందట. ఇంకా చర్చిలో, పబ్‌లో, స్కూల్లో... ఇలా పలుచోట్ల ఉన్న ప్రముఖ దెయ్యాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని అంటారు. ఇవి కాక ఇంకా ఓ ఇరవై, ముప్ఫై దెయ్యాల వరకు ఉన్నాయట ఆ ఊళ్లో.  వీటిని పుకార్లుగా నిరూపించేందుకుగాను ప్లక్‌లీకి వచ్చిన పరిశోధకులు సైతం, దెయ్యాల దెబ్బకి జడుసుకున్నారు. అర్ధరాత్రి వినిపించే అరుపులు, అడుగుకొకటి చొప్పున ఎదురై పలకరించే ఆత్మల ధాటికి తట్టుకోలేక పరారయ్యారు. అందుకే ఈ ఊరు... అత్యంత భయానక ప్రదేశంగా మిగిలిపోయింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement