వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ కరోలినా అక్వేరియం చాలా ఫేమస్. అక్కడికి రోజూ వేలాది మంది సందర్శకులు వస్తారు. అక్వేరియంలో ఉన్న స్మోకీ మౌంటేన్ నుంచి కిందకు జారే వాటర్ ఫాల్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. 30 అడుగుల లోతైన ఆ వాటర్‌ఫాల్స్‌లో నాణేలు వేసి ఏదైనా కోరుకుంటే అది తీరుతుందనే విశ్వాసం ఉంది. దాంతో సందర్శకులు ఆ వాటర్‌ఫాల్స్‌లో నాణేలు వేస్తుంటారు. సాధారణంగా జనాలతో కిక్కిరిసిపోయే ఆ అక్వేరియానికి ఆదాయానికి కూడా లోటు లేదు. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా దానిని మూసేయడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. రోజూవారి ఖర్చులు, జంతువుల సంరక్షణ కష్టమైంది. దాంతో అక్వేరియం నిర్వాహకులకు ఓ ఆలోచన తట్టింది. జనాల కోరికలు నెరవేరేందుకు వేసిన విషింగ్ కాయిన్స్‌ని బయటికి తీసేందుకు నిర్ణయించారు.
అయితే, వారి అంచనాలు తప్పయ్యాయి. ఆ వాటర్ ఫాల్స్ ఫౌంటేన్‌లో జనాల కోరికలు రాశులుగా పోగుపడి దర్శనమిచ్చాయి. వారు ఊహించినదానికంటే చాలా ఎక్కువ.. అంటే దాదాపు 100 గాలన్ల నాణేలు ఆ ఫౌంటేన్‌లో లభించాయి. తమ అంచనాలు తలకిందులు చేసిన ఆ నాణేల రాశులకు సంబంధించిన ఫొటోలను అక్వేరియం నిర్వాహకులు ఫేస్‌బుక్‌లో ఫేర్ చేశారు. ఈ మొత్తం నాణేలు ఎంత విలువ చేస్తాయో చెప్పగలరా? అని నెటిజన్లకు క్విజ్ పెట్టారు. 48 వేల డాలర్లు అని ఒకరు, 64,427 డాలర్లు అని ఇంకొకరు తమ తోచిన మొత్తాన్ని చెప్పుకొచ్చారు. ఈ నాణేలన్నీ చలామణిలోకి వస్తే దేశంలో వాటి కొరత తీరుతుందని మరో నెటిజన్ పేర్కొన్నారు. దేవుడు అందరి కోరికలు నెరవేర్చాలి అని మరొకరు ఆకాక్షించారు. ఈ పోస్టుకు లక్షా 80 వేల లైకులు రావడం విశేషం. కాగా, సరైన మొత్తం ఎంతో వచ్చేవారం జవాబు చెబుతామని అక్వేరియం నిర్వాహకులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment