ట్రంప్ పార్టీ కార్యాలయంపై బాంబు దాడి
వాషింగ్టన్: మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో 'రాజకీయ ఉగ్రవాదం'గా పరిగణిస్తోన్న దుశ్చర్య అమెరికాలో కలకలం రేపింది. అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న డోనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తోన్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేశారు.
ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి జరిపారని, కిటికీ గుండా ఆఫీసులోపలికి బాంబులు విరిసారని, పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నీచర్ తోపాటు ప్రచార సామాగ్రి కూడా కాలిపోయిందని ప్రకటించిన పోలీసులు.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి అతి సమీపంలోని ఓ మూసి ఉన్న షెట్టర్ పై 'నాజీ రిపబ్లికన్లారా.. ఇక్కడి నుంచి వెళ్లిపొండి. లేకుంటే..' అని రాసిఉన్నట్లు పోలీసులు చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటనను రిపబ్లికన్ పార్టీ 'రాజకీయ ఉగ్రవాదం'గా అభివర్ణించింది. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేసి 'హిల్లరీని సమర్థిస్తున్న జంతువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయి'అని అన్నారు. ఈ చర్యను అమెరికా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్న నార్త్ కరొలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ.. ఎన్నికల్లో హింసకు తావులేదని, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించానని తెలిపారు. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సైతం రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై బాంబు దాడిని ఖండించారు. ఈ భయానక దాడిలో ప్రాణనష్టం జరగనందుకు సంతోషిస్తున్నానంటూ హిల్లరీ ఆదివారం ట్విట్టర్ లో పేర్కొన్నారు.
రిపబ్లికన్ ఆఫీసుపై దాడిని మరింత రాజకీయం చేస్తూ ఆ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆదివారం వరుసగా ట్వీట్లు చేశారు. ఎన్నికల్లో కీలకమైన ఉత్తర కరొలినాలో హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్నందుకే తమపై ఇలాంటి దాడి జరిగిందని, కొన్ని జంతువులు ఆమె తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాయని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందన్న అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, బాంబు దాడి ఘటనను ఎన్నటికీ మర్చిపోమని, అక్కడ తమ గెలుపు ఖాయమైందని ట్రంప్ పేర్కొన్నారు.