
పేపర్ కాదు... పూపర్!
భలే బుర్ర
కాగితాన్ని సాధారణంగా దేనితో తయారు చేస్తారు..? కలప గుజ్జుతో చేస్తారు. అక్కడక్కడా గడ్డి, పీచు వంటి వాటితోనూ తయారు చేస్తారు. అయితే, కాగితాన్ని సాధారణంగా కాకుండా కాస్తంత అసాధారణంగా తయారు చేయాలనుకున్నారు మహిమా మెహ్రా, విజేంద్ర షెకావత్. వీళ్లిద్దరిదీ రాజస్థాన్. మహిమా మెహ్రా రిటైల్ వ్యాపారి. విజేంద్ర షెకావత్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఉత్పత్తిదారు. ఎప్పుడూ ఉపయోగించే పదార్థాలతో కాగితం తయారు చేయడంలో విశేషం ఏమీ లేదనుకున్నారు ఈ ఇద్దరూ.
ఓ కొత్తరకం కాగితాన్ని చేసి చూపించారు. ఒకసారి ఈ ఇద్దరూ అంబర్‌కోటకు విహార యాత్రకు వెళ్లారు. అప్పుడు వచ్చిందో ఐడియా..! అక్కడ వాళ్లిద్దరూ నక్కతోక తొక్కలేదు గానీ, కోట పరిసరాల్లో నడుస్తుండగా, పొరపాటున ఏనుగు లద్దెను తొక్కారు. ఏనుగులు, వాటి విసర్జకాలు పుష్కలంగా కనిపించేసరికి... ఈ పదార్థంతో కాగితం తయారీకి ఎందుకు ప్రయత్నించకూడదు..? అని ఆలోచించారు.
ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. నాటి నుంచీ గజ విసర్జకాన్ని భారీ ఎత్తున సేకరించడం ప్రారంభించారు మహిమ, విజేంద్ర. సేకరించిన దానిని కడిగి, ఉడికించి, ఎండబెట్టి... ఇన్ని ప్రక్రియల తర్వాత దాని నుంచి కాగితం తయారీకి అనుగుణమైన పిప్పిని సేకరించారు. ఆ పిప్పితో తయారు చేసిన కాగితాలు భేషుగ్గా వచ్చాయి.
దాంతో ఢిల్లీలో పరిశ్రమపెట్టి మందపాటి కార్డ్‌బోర్డులు, అట్టలు, డైరీలు, నోట్ పుస్తకాలు, ఫొటో ఆల్బమ్స్ వంటివి తయారు చేయడం ప్రారంభించారు. ఎలిఫెంట్ పూ పేపర్ డాట్ కామ్ పేరిట వెబ్‌సైట్ పెట్టి ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు సాగిస్తున్నారు. కావాలంటే మీరూ కొనుక్కోవచ్చు. లేదంటే ఆ స్ఫూర్తితో ఇలానే ఏదైనా కొత్త ఆవిష్కరణకు శ్రీకారమూ చుట్టవచ్చు.