విదేశీయం... మోదీప్యమానం | PM Narendra Modi Pays Tribute to Martyrs of 2001 Parliament Attack | Sakshi
Sakshi News home page

విదేశీయం... మోదీప్యమానం

Published Sun, Dec 14 2014 1:02 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

విదేశీయం... మోదీప్యమానం - Sakshi

విదేశీయం... మోదీప్యమానం

మోదీ కంటే ముందరి ప్రధాని... కదిలేవారు కాదు. మెదిలేవారు కాదు. పెదవి విప్పి పలికేవారు కాదు. మోదీ అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. అసలు ఇంటిపట్టునే ఉండట్లేదు! ఒకవేళ ఉన్నా కూడా, ఇరుగు పొరుగును ఆహ్వానించి మరీ అవీ ఇవీ మాట్లాడుతున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోడీ ఇప్పటి వరకు తొమ్మిది దేశాలను సందర్శించి వచ్చారు. మరో ఐదు దేశాలు ఆయన పర్యటించబోయే జాబితాలో ఉన్నాయి. మోదీ ఎందుకింతగా విదేశాంగ విధానంపై శ్రద్ధ పెడుతున్నారు? భారత్‌కు ఒకవైపు స్నేహహస్తం చాస్తూనే, మరోవైపు కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా వ్యూహాత్మక కదలికల వలలో పొరుగు దేశాలు పడకుండా దౌత్యపరంగా జాగ్రత్తపడడం ద్వారా భారతదేశపు భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవాలన్నదే మోదీ ధ్యేయమా? లేక ఇంకేదైనా సంకల్పమా? దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్లు కనిపిస్తున్న మోదీ విదేశాంగ వ్యూహం... ప్రధానిగా ఆయనను నిలబెట్టేదా? లేక దేశానికొక కొత్త ప్రతిష్టను తెచ్చిపెట్టేదా? ఈ సందేహాలకు సమాధానాలు వెతికే ప్రయత్నమే ఈవారం మన ‘వివరం’.  
 
డాక్టర్ బి.జె.బి.కృపాదానం
సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ

మన ప్రధాని గత ఆరు నెలల్లో జపాన్, అమెరికా, మయన్మార్, బ్రెజిల్, భూటాన్, ఆస్ట్రేలియా, ఫిజి, నేపాల్ సందర్శించారు. ఆస్ట్రేలియా ప్రధాని టోని ఆబట్, చైనా అధ్యక్షుడు గ్జీజిన్‌పింగ్ భారతదేశాన్ని సందర్శించి కీలకమైన ఒప్పందాలకు తమ ఆమోదాన్ని తెలిపారు. ప్రధాని మోదీ ఇండియా - ఆసియాన్, తూర్పు ఆసియా, జి20, సార్క్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యారు.

గత 33 సంవత్సరాలలో ఫిజి, 28 సంవత్సరాలలో ఆస్ట్రేలియా, 17 సంవత్సరాలలో నేపాల్ సందర్శించిన మొదటి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఈ పర్యటనలు దక్షిణ ఆసియా, ఆసియా, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు కీలకమైనవని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పార్లమెంటులో ప్రకటించారు. ఆ వ్యాఖ్య అతిశయోక్తి అని ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి. పైగా తరచూ విదేశాలకు వెళ్తూ, దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యతనివ్వడం లేదని, ఇంట గెలవకుండా, రచ్చగెలవడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రతిపక్షాలు కత్తులు దూసాయి. ఏది ఏమైనప్పటికీ, మన విదేశాంగ విధానం మీద తన ముద్రను వేసిన రెండవ ప్రధాని మోదీ అని ఒప్పుకోక తప్పదేమో. (జవహర్‌లాల్‌నెహ్రూ మొదటి ప్రధాని). అంతమాత్రం చేత, గుజ్రాల్ సిద్ధాంతం మాదిరిగా మోదీ సిద్ధాంతం రూపొందుతుందనడానికి వీలులేదు.
 
ఒక దశాబ్దాన్ని కోల్పోయాం
ప్రపంచ జనాభాలో ఆరవ వంతుకు ప్రాతినిధ్యమిస్తున్న భారతదేశం అంతర్జాతీయ వ్యవహారాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇప్పటివరకు రూపొందించుకోలేకపోయింది. అంతర్జాతీయంగా, మన దేశం నిబంధనలను పాటించడమే గానీ, వీటిని రూపొందించే స్థితికి ఇంకా చేరుకోలేదు. విదేశీవ్యవహారాల నిపుణుల అభిప్రాయంలో భారతదేశం బలహీనమైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. తనకు తానే తనకు లభ్యమవ్వవలసిన ఘనతను నిరాకరిస్తూ తనకు తానే శత్రువుగా వ్యవహరిస్తోంది.

ఇటీవల కాలంలో భారత్ గణనీయమైన ఆర్థిక ప్రగతిని సాధించినప్పటికీ, దానికనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోయింది. 20వ శతాబ్దాపు చివరి దశకంలో (1989-1998) తరచూ సంభవించిన రాజకీయ అస్థిరత అనే సుడిగాలిలో ఊగిసలాడింది. అలాగే డా.మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిత్వంలో భారతదేశం కీలకరంగాల్లో ‘ఒక దశాబ్దాన్ని కోల్పోయింది’ అనడంలో అతిశయోక్తిలేదు.
 
కేంద్ర బిందువు పాకిస్థాన్

2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో మిగిలిన రాజకీయ పక్షాలను మట్టి కరిపించింది. ఇది ఆ పార్టీ మీద ఒక పెద్దభారాన్ని మోపింది. దేశీయ, విదేశీ సమస్యలకు సత్వరపరిష్కారాన్ని అన్వేషించాల్సిన బాధ్యత, మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కనుగుణంగా విదేశాంగ విధానాన్ని రూపొందించాల్సిన అనివార్యత మోదీ ప్రభుత్వం మీద పడింది. గత రెండు దశాబ్దాలలో కొనసాగిన రాజకీయ నిస్తేజం భారతదేశపు ప్రాంతీయ, అంతర్జాతీయ హోదాని దెబ్బతీసింది.

చైనాతో పోల్చి చూస్తే భారత్ అన్నిరంగాల్లో డీలాపడిపోతోంది. పొరుగు దేశంతో మనకున్న సంబంధాలు మరింత పేలవంగా మారుతున్నాయి. చిన్నదేశమైన మాల్దీవులు ఈ మధ్య తన విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న భారతీయ కాంట్రాక్టర్‌ని అకస్మాత్తుగా వెళ్ళగొట్టడం, నేపాల్ చైనా బూచిని చూపించి మనతో దోబూచులాడడం, శ్రీలంక... చైనాకు మరింత దగ్గరకావడం, ఆఫ్గనిస్థాన్‌లో చైనా ప్రాభవాన్ని పెంచడానికి పాకిస్థాన్ తహతహలాడడం లాంటి సంఘటనలు భారత్ దీన స్థితిని తెలియజేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో దృఢమైన రాజకీయ నాయకత్వపు ఆవశ్యకత ఎంతగానో ఉంది. మరి ప్రధాని మోదీలో ఆ లక్షణాలున్నాయా? సంఘ్‌పరివార్ మద్దతుతో రాజకీయంగా ఎదిగిన మోదీ ఏ మేరకు స్వతంత్రంగా విదేశాంగ విధానానికి వ్యూహాన్ని రూపొందించగలడు? అఖండ భారత్‌ను పునర్మించాలని తహతహలాడే రాష్ట్రీయ స్వయం సేవక్‌లను కాదని పొరుగు దేశాలైన పాకిస్ధాన్, బంగ్లాదేశ్‌లతో సంబంధాలను ఎంతమేరకు మెరుగుపర్చగలడు? భారత్ విదేశాంగ విధానం ప్రధానంగా పాకిస్థాన్ చుట్టూ పరిభ్రమిస్తోంది. మిగిలిన దేశాలతో మన నెయ్యం, కయ్యం, ఆ దేశాలు పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
 
ఆచితూచి చైనాతో...
ప్రధానమంత్రి మోదీ అనుసరిస్తున్న వ్యూహం స్వర్గీయ ఇందిరాగాంధీ రాజకీయ చతురతను పునరావృతం చేస్తున్నట్లున్నది. దృఢనిశ్చయత, విశ్వసనీయత, ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తియే ఓటమికి భయపడక ముందుకు పోగలడు. మోదీ విదేశాంగ విధానం సరియైనరీతిలో పయనిస్తున్నట్లనిపిస్తోంది. ఒక వైపు చైనాతో సంబంధాలు మెరుగుపరుస్తూ ఇంకొక వైపు చైనాను అదుపులో పెట్టడానికి అన్నట్లు, జపాన్, అమెరికాలతో వ్యూహాత్మక ఒప్పందాలను ఖరారు చేయడం, చైనాతో ఎడముఖం, పెడముఖంతో ఉంటున్న వియత్నాంతో ఖనిజ వాయువుల అన్వేషణకు ఒప్పందం కుదుర్చుకోవడం ఆచరణాత్మక రాజకీయాలకు నిదర్శనం.

అలాగే బంగ్లాదేశ్‌తో సరిహద్దు వివాదపరిష్కారానికి రాజ్యాంగ సవరణ చేయడానికి చొరవ చూపడం ముదావహం. కాని పటిష్టవంతమైన విదేశాంగ విధానానికి పునాది శక్తిమంతమైన దేశీయ విధానం, ఆర్థిక పురోగతి, మత సామరస్యం, రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని, కీలకనిర్ణయాలలో వాటి మద్దతును పొందడం ఎంతైనా అవసరం. సంకీర్ణ రాజకీయవ్యవస్థలో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర వహిస్తాయి.

ఇటీవలకాలంలో శ్రీలంక విషయంలో ద్రవిడ రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన విషయం విదితమే. అలాగే బంగ్లాదేశ్‌తో నదీ జలాల ఒప్పందం జరగకుండా చివరి క్షణంలో తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఇబ్బంది పెట్టిన విషయం మర్చిపోకూడదు. మారిన రాజకీయ పరిస్థితులతో విదేశాంగ విధానం కేవలం కేంద్రమే ఏకపక్షంగా రూపొందించలేదు. రాష్ట్రాల మద్దతులేకుండా సమర్ధవంతమైన విదేశాంగ విధానం అమలు చేయడం కష్టం. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు భారత్- బంగ్లాదేశ్, భారత్- మయన్మార్ సంబంధాలను ప్రభావితం చేస్తాయి.
 
వెయ్యికళ్లతో గమనిస్తుంటాయి

అంతర్జాతీయ స్థాయిలో మోదీ పరిణతి చెందిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాని పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పర్చుకోవడంలో ఏ మేరకు విజయం సాధిస్తారనేది ప్రశ్నార్థకం. మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజపేయి మాటల్లో.... ‘‘మన పొరుగువారు ఎవరై ఉండాలి అనేది మనము నిర్ణయించలేము’’. మనకు ఇష్టమున్నా, లేకపోయినా పొరుగుదేశాలైన, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో కలిసి జీవించాలి.

సార్క్ కూటమిలో అతిపెద్ద దేశమైన భారత్ వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. మన ప్రతి కదలికను పొరుగు దేశాలు వెయ్యికళ్ళతో గమనిస్తాయి. ‘పెద్దన్న’ లాగా వ్యవహరిస్తున్నామని నిందిస్తాయి. మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో దక్షిణాసియా దేశాల ప్రభుత్వ అధిపతులను ఆహ్వానించడం, వారు మన్నించి హాజరు కావడం శుభసూచకం.

విశాల హృదయంతో పొరుగు దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించడం భారత్ ప్రయోజనాల పరిరక్షణకు దోహదం చేస్తాయి. ప్రాంతీయ వాణిజ్యమంతా భారత్ చుట్టూ పరిభ్రమిస్తుంది. పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్ లాంటి వాటితో ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ వీటిని సకాలంలో అమలు చేయలేదనే అపవాదున్నది. సహజంగా ఈ దేశాలు చైనా వైపు చూస్తున్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం, వాటి నిర్వహణ ఆ దేశాలను భారత్‌కు మరింత దగ్గర చేస్తాయి.
 
ఇక పాకిస్థాన్‌తో సత్సంబంధాలు నెలకొల్పడం అంత సులభం కాదు. ఒకవైపు పాకిస్థాన్ మిలిటరీ, ఇంకొక వైపు ఉగ్రవాద సంస్థలు ఈ ప్రయత్నాలను వమ్ము చేస్తాయి. కాశ్మీరు సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఇండియా- పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడడం కష్టమే. కాని మనకు తూర్పున ఉన్న నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లతో, దక్షిణాన ఉన్న మాల్దీవులతో సంబంధాలు మెరుగు పరచుకోవచ్చు. అలాగే దక్షిణ ప్రాచ్య ఆసియా దేశాలతో వర్తక వాణిజ్య పెంపుదలకు మోదీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

వాణిజ్య సుంకాలను తగ్గించడం ద్వారా ఇండియా మిగిలిన పశ్చిమాసియా దేశాల మధ్య వాణిజ్యాన్ని అభివృద్ధిపరచాలి. దక్షిణాసియాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా పొరుగు దేశాలకు తక్కువ వడ్డీతో ఋణ సౌకర్యాలు కల్పించి వాణిజ్య లావాదేవీలను వృద్ధి చేయవచ్చు. ఇది ఆర్థిక ఐక్యీకరణ, రాజకీయ ఐక్యీకరణకు దోహదం చేస్తుంది. భారతదేశం ఏకపక్షంగా చొరవ తీసుకుని పొరుగు దేశాలకు ఆపన్నహస్తం అందించాలి. ఇందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలి.
 
కూటమిగా ఏర్పడాల్సిందే
భారత ఉపఖండంలో ప్రధానంగా మతతత్వ రాజకీయాలే పొరుగు దేశాలతో మనస్పర్థలకు కారణం. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మోదీ ఒకవైపు పాకిస్థాన్‌తో ఇంకొక వైపు బంగ్లాదేశ్‌తో, సరిహద్దు, ఇతర సమస్యలపై ఎలాంటి చొరవ తీసుకున్నా మిగిలిన రాజకీయ పక్షాలు సానుకూలంగా స్పందిస్తాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
 
జూలై నెలలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఇండియా, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా దేశాలతో కూడిన ఐబిఎస్‌ఎ సమావేశం 2015లో జరగడానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారు. అంతకంటే ముఖ్యమైనది నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, పాకిస్థాన్, మాల్దీవ్ దేశాలలో ప్రజాస్వామ్యాన్ని పటిష్టవంతం చేయడం. ఈ దేశాలన్నింటిలో రాజకీయ సుస్థిరత్వం లేదు. మోదీ ఇటీవల నేపాల్ సందర్శించినప్పుడు ప్రజాస్వామ్య పటిష్టతకు భారతదేశం అన్ని విధాల తోడ్పడుతుందని హామీ ఇచ్చారు.
 
చైనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమవుతున్న ఈ రోజుల్లో ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో రాజకీయ అల్లకల్లోలా లు తరచుగా సంభవిస్తున్నాయి. ప్రజాస్వామ్య అనుకూల దేశాలు కూటమిగా ఏర్పడి ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా ఇందుకు చొరవ తీసుకోవాలి.
 
మోదీ వ్యూహం, వ్యక్తిత్వం
మోదీ ప్రభుత్వం భారత విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు తెచ్చే అవకాశముంది. యూపీఏ ప్రభుత్వాలనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నంగా వ్యవహరించడం జరుగుతుంది. నెహ్రూ రూపొందించిన అలీన విధానానికి స్వస్తిచెప్పి, అమెరికాకు దగ్గర కావడం జరుగుతుంది. ప్రాచీన భారత వైభవాన్ని తరచూ ప్రస్తావిస్తూ చురుకైన, శక్తిమంతమైన విదేశాంగ విధానానికి పునాది వేయడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు.

ఈయన వ్యక్తిత్వం, మతతత్వ రాజకీయ భావాలు ఇందుకు తోడ్పడుతున్నాయి. స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్నేర్పరచిన మోదీకి దేశీయ రాజకీయాలు విదేశాంగ విధాన రూపకల్పన అంత ప్రతిబంధకం కాకపోవచ్చు. కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఏకపక్ష ధోరణి కొన్నిసార్లు అనాలోచిత నిర్ణయాలకు దోహదం చేయవచ్చు. పాకిస్థాన్, ఇండియా దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం ఇటీవల అకస్మాత్తుగా రద్దు కావడం ఇందుకొక ఒక ఉదాహరణ.

వైవిధ్యానికి మారు పేరైన భారతదేశంలో విదేశాంగ విధానరూపకల్పన, అమలు అంత సులభం కాదు. ప్రాంతీయ, మత, రాజకీయ విభేదాలు విదేశాంగ విధానాన్ని మరింత జటిలం చేస్తాయి. మోదీ వీటిని ఏ మేరకు అధిగమించి దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకనుగుణంగా విదేశాంగ విధానాన్ని మలుస్తారో కాలమే నిర్ణయిస్తుంది.

చెలిమి కూటమిని నిర్మించుకునే ప్రయత్నం
స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలన్నీ ‘వ్యూహాత్మక భాగస్వామ్యాలే’ అనే మాట బాగా పాతబడిపోయినదే అయినప్పటికీ వీటిలోని కొన్ని సంబంధాలు తక్కిన వాటితో పోల్చిచూసినప్పుడు మరింత వ్యూహాత్మకమైన భాగస్వామ్యం కలిగివున్నవి. ప్రస్తుతం మోదీ అనుసరిస్తున్న విదేశీ వ్యూహంలోని ప్రత్యేకత ఇటువంటిదే.

వసుదైక కుటుంబం అనే శతాబ్దాలనాటి ఉత్కృష్టమైన ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి భారతదేశానికి సముచిత స్థానాన్ని సాధించి పెట్టే మహోన్నత లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందుకోసం ఇరుగు పొరుగు దేశాలను కలుపుకుని పోయే వ్యూహానికి ప్రాధాన్యతను ఇస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతలను, భయాలను తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక చెలిమి కూటమిని నిర్మించుకునేందుకు మోదీ తన విదేశాంగ విధానాన్ని వ్యూహాత్మకంగా మలుచుకుంటున్నారు.
 - ప్రొఫెసర్ కె.స్టీవెన్‌సన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
 

మేక్ ఇన్ ఇండియా
దేశీయంగా ఆర్థిక వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి మోదీ ప్రభుత్వం ఇటీవల లేవనెత్తిన ‘భారతదేశంలో తయారీ’ (మేక్ ఇన్ ఇండియా) అనే నినాదం సబబైనదే. మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, నాణ్యత కలిగిన వస్తువులను, సేవలను సకాలంలో అందించగలిగితే స్వదేశీ వస్తువులకు విదేశాలలో గిరాకీ ఏర్పడుతుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థను పటిష్టవంతం చేయడంతో పాటు, విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడం, ఎగుమతి చేసే దేశాలతో మన సంబంధాలు పటిష్టవంతం గావించుకోవడం వీలవుతుంది.

పరోక్షంగా ఇది విదేశాంగ విధాన విజయానికి పరీక్ష. అలాగే ఆహార భద్రత చట్టం అమలు విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్ధ లేవనెత్తిన అభ్యంతరాలను విజయవంతంగా తిప్పికొట్టడం, మోదీ ప్రభుత్వ దృఢ నిశ్చయతకు మచ్చుతునక. అమెరికాతో సత్సంబంధాలు ఈ విషయంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. తోటి వర్ధమాన దేశాల మద్దతును సంపాదించడంలో కృతకృత్యులయ్యాం.ద్వైపాక్షిక, బహుళపాక్షిక సమావేశాల్లో మునిగి తేల్తున్న ప్రధానమంత్రి, దేశీయ సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉన్నప్పటికీ, ఆ సమావేశాల్లో ప్రముఖ నాయకులతో వ్యక్తిగత పరిచయాలు పెంచుకోవడం, పరోక్షంగా మన జాతీయ ప్రయోజనాలకు లబ్ధిచేకూరుస్తుంది. మోదీ 45 మంది విదేశీ నాయకులను కలుసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు ఒబామా 2015 రిపబ్లిక్ ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా రావడం మోదీ దౌత్యనీతికి కలికితురాయి. రాజకీయ చదరంగంలో సరియైన పావులను కదుల్చుతున్నట్లు కనబడుతోంది. ఇజ్రాయేల్‌లో రక్షణరంగంలో, నిఘారంగంలో సహకారాన్ని పెంపొందించడం ద్వారా పరోక్షంగా ఉగ్రవాదులకు, వారికి మద్దత్తునిస్తున్న పాకిస్థాన్ లాంటి దేశాలకు సరియైన సంకేతాలందుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement