
రావణుడు సీతను అపహరించి, రథం మీద కూర్చోబెట్టుకుని వినువీధులలో దూసుకెళ్తున్నాడు. సీతమ్మ భయ విహ్వల అయి, తన భర్తను తలచుకుంటూ, రావణుని నిందిస్తోంది. ఈ దృశ్యం అల్లంత దూరాన చెట్టునీడలో విశ్రాంతి తీసుకుంటున్న జటాయువు దృష్టిలో పడింది. సరిగ్గా అదే సమయంలో సీతమ్మ కూడా జటాయువును చూసింది. రెండు చేతులూ జోడించి ‘ఆర్యా! ప్రణామాలు. నన్ను ఈ దుష్ట రావణుడుఅపహరించుకుని పోతున్నాడు. మీరు వెంటనే ఈ విషయాన్ని రామలక్ష్మణులకు తెలియజేయండి. వారే వీడి పీచమణుస్తారు’’ అంటూ అభ్యర్థించింది. కంటిముందు జరుగుతున్న ఆ ఘోరాన్ని చూసి జటాయువు చలించిపోయాడు. ఆగ్రహావేశాలతో రావణుడి రథాన్ని వెంబడిస్తూ, ‘‘ఓరీ దుష్టరాక్షసా! పిరికిపందలాగా రామలక్ష్మణులు లేని సమయాన సీతమ్మను అపహరించుకు వెళుతున్నావా! సిగ్గులేదా నీకు? చావు దగ్గర పడినవాడు స్వీయ వినాశనం కోసమే నీలాంటి అధర్మ కార్యాలకు ఒడిగడతాడని నిన్ను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, మర్యాదగా సీతమ్మను తీసుకెళ్లి, సగౌరవంగా రామునికి అప్పగించి, శరణు వేడు. ఆ దయామయుడు నిన్ను క్షమించి వదులుతాడు’’ అంటూ హితవు చెప్పాడు.
రావణుడు ఆ మాటలను వినిపించు కోకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఇలా లా¿¶ ం లేదనుకుని. జటాయువు, తన బలమైన ముక్కుతో, గోళ్లతో రావణుని పొడిచాడు. కాళ్లతో రావణుని ధనుస్సును విరిచిపారేశాడు. క్రోధంతో భగ్గుమన్న రావణుడు, జటాయువు మీదికి ఎన్నో శస్త్రాస్త్రాలను ప్రయోగించాడు. వాటన్నింటినీ తన రెక్కలతో ఆవలికి విసిరికొడుతూనే, సువర్ణ సదృశమైన తన వాడి గోళ్లతో రావణుణ్ణి పొడిచి చికాకు పెట్టసాగాడు. ఇది సామాన్యమైన పక్షి కాదని గ్రహించిన రావణుడు మహిమాన్విత మైన తన ఖడ్గంతో జటాయువు ముక్కును, రెక్కలను, పార్శా్వలను ఖండించివేశాడు. దాంతో, ఆ వృద్ధ పక్షిరాజం మొదలు నరికిన చెట్టులా నేలకూలింది. అది చూసిన రావణుడు, రెట్టించిన వేగంతో లంకవైపు దూసుకుపోయాడు. అవతలి వాడు అమిత బలశాలి అని ఆ పక్షికి తెలుసు. అయినప్పటికీ, అతణ్ణి నిలువరించేందుకు తన ప్రయత్నం తాను చేసి, ఈ వార్తను రామలక్ష్మణులకు చేరవేసేందుకు ప్రాణాలు ఉగ్గబట్టుకుని వేచి చూసింది. చివరికి రాముడికి వర్తమానం అందించింది జటాయువు. నీతి ఏమిటంటే, చెడును అడ్డుకోవడానికి చివరి వరకూ పోరాటం చేయాల్సిందే! అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావలసిందే!
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment