అన్వేషణం: బీచ్ కాని బీచ్
బీచ్ అంటే ఎలా ఉంటుంది? మేటలు వేసిన ఇసుక, ఆ ఇసుకలో మెరిసే గవ్వలు, అడ్డదిడ్డంగా పరుగులు తీసే పీతలు... ఇలాంటివే కనిపిస్తుంటాయి బీచ్‌లలో. కానీ ఆ బీచ్ అలా ఉండదు. ఎరుపురంగును చల్లినట్టుగా ఉంటుంది. ఎర్ర దుప్పటిని ఆరబెట్టినట్టుగా ఉంటుంది. సంధ్యాసమయంలో సూరీడు కనిపించినంత ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. అందుకే దాన్ని రెడ్ బీచ్ అని పిలుస్తారు.
చైనాలోని దవా కౌంటీలో, ల్యోనింగ్ అనే ప్రాంతంలో ఉంది రెడ్‌బీచ్. అయితే బీచ్ అన్నాం కదా అని ఇది సముద్రతీరం కాదు. ఓ నదీ పరీవాహక ప్రాంతం మాత్రమే. నిజానికి ల్యోనింగ్‌లో ఒకప్పుడు చాలా నదులు ఉండేవట. ఇవన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉండేవని చెబుతారు. వాటిలో కొన్ని కాలక్రమంలో అంతరించి పోయాయి. ఇప్పటికీ చాలా నదులు మిగిలే ఉన్నాయి. అలా మిగిలివున్న పంజిన్ నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది రెడ్‌బీచ్.
ఈ బీచ్ ఎర్రగా ఉండటానికి, అసలు దీన్ని రెడ్‌బీచ్ అనడానికి కారణం... అక్కడ ఆవరించి ఉన్న ఎరుపురంగు మొక్కలు. జీనస్ అనే ఒక రకమైన రెల్లుగడ్డి ఆ ప్రాంతమంతా విస్తారంగా పెరుగుతుంది. ఆ గడ్డిమొక్కలు ఎరుపురంగులో ఉంటాయి. కొన్ని కిలోమీరట్ల మేర ఆవరించిన వాటిని చూస్తే, అక్కడి నేలే అంత ఎర్రగా ఉందా అనిపిస్తుంది. పేరుకు ఇది రెల్లు గడ్డే అయినా దీనితో చాలా ఉపయోగం ఉంది. దీనితో పేపర్ తయారు చేస్తారు. అందుకోసమే ఈ బీచ్‌ను ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు.
జీనస్ మొక్కలు ఏప్రిల్ నెల నుంచి ఎదగడం మొదలు పెడతాయి. ఇవి మరీ ఎత్తుగా పెరగవు. అలా అని మరీ చిన్నగా కూడా ఉండవు. తొలుత పచ్చగానే ఉన్నా... పెరిగేకొద్దీ ఎరుపురంగును సంతరించుకుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలలు వచ్చేసరికి పూర్తిగా ఎర్రగా మారిపోవడంతో అక్కడంతా చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. అందుకే అక్టోబర్ చివరి వారం నుంచి ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతుంది!
శిక్షించే జైలు కాదు... శిక్షణనిచ్చే జైలు!
నార్వేలోని బాస్టోయ్‌లో ఉన్న దీవిలో ఒక జైలు ఉంది. ఇది అన్ని కారాగారాల్లాంటిది కాదు. ఇక్కడ ఖైదీలను బంధించరు. ఫ్రీగా వదిలేస్తారు. వాళ్లు ఎలాగైనా తిరగొచ్చు. ఏది నచ్చితే అది చేయవచ్చు. సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. మొత్తంగా హాయిగా ఉండవచ్చు. కేవలం నూట పదిహేను మంది మాత్రమే పట్టే ఈ జైల్లో జైలర్, మరో ఇద్దరు అధికారులు, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉంటారట.
వంట దగ్గర్నుంచి గడ్డి కోయడం వరకూ ఖైదీలే వంతుల వారీగా చేస్తుంటారు. ఇంతే తినాలి, ఇవే తినాలి అనే రూల్స్ ఉండవు. కావలసినంత సుష్టుగా తినవచ్చు. రోజులో కాసేపు వారికి ఆసక్తి ఉన్న ఏదో ఒక అంశంలో శిక్షణ ఉంటుంది. బయటకు వెళ్లాక తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు, మళ్లీ నేరాల జోలికి పోకుండా ఉండేందుకు అవసరమైన పనులు నేర్పిస్తారు. మిగిలిన సమయమంతా సరదాగా, ప్రశాంతంగా గడపవచ్చు. బంధించడం వల్ల నేరస్తుల్లో మార్పు రాదని, వారి ఆలోచనల్లో మార్పు తేవాలని నమ్మే ఆర్నే వెర్నెవిక్ ఆలోచనలకు ప్రతిరూపమే బాస్టోయ్ కారాగారం. జైళ్ల గవర్నర్‌గా ఆయన తీర్చిదిద్దిన ఈ జైలు ఇతర దేశాల్లోని అధికారులను కూడా ఆలోచింపజేస్తోంది!