
కవ్వింత: ప్రతీకారం
టీచరు: ఏరా రామూ, గ్రహాలెన్ని అని ప్రశ్న ఇస్తే పదకొండు అని రాస్తావా?
రాము: అవును సార్... ఆగ్రహం, సత్యాగ్రహం కూడా గ్రహాలే కదండీ!
టీచరు: అయితే, ఇట్రా, నీకిపుడు ఏడో గ్రహం (శని) తిరగబడి, పదకొండో గ్రహానికి (ఆగ్రహానికి) బలవుతావు.
లెక్కలు రావని
అమ్మ: సిద్ధూ, ఐదు రూపాయలు ఇచ్చి సగం చెల్లికి ఇవ్వమని చెబితే రెండ్రూపాయలే ఇచ్చావు... చూడు అది ఏడుస్తుంది.
సిద్ధు: అమ్మా, అదింకా స్కూల్లో చేరలేదు కదా, ఎటూ లెక్కలు రావులే. రెండ్రూపాయలే సగం అని చెబతా!
ఒకరికొకరు!
సుందరం: ఒరే అదేంట్రా, మీ ఆవిడ బట్టలు నువ్వుతుకుతున్నావు...
సర్వం: ఆ మాత్రం ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి కదరా! నేను వంట చేస్తున్నపుడు ఆమె సాయం చేస్తుంది రోజూ!
ప్రేమ లేదట
యుమున: ఎందుకు జ్యోతక్కా, ఈ మధ్య అదోలా ఉంటున్నావు...
జ్యోతక్క: నలుగురు పిల్లలు పుట్టాక తెలిసింది మా ఆయనకు నామీద ప్రేమలేదని!
యుమున: ప్రేమ ఉంటే మీకు ఇంకెంత మంది పిల్లలుండే వారో!
నిక్‌నేమ్
రాజ్: మా కాలేజీ కొత్త లెక్చరర్ వచ్చాడు డాడీ.
తండ్రి: ఏం పేరు?
రాజ్: మేమింకా ఆయనకు పేరు పెట్టలేదు.
గుండ్రటి కారణాలు
లెక్చరర్: చైతన్యా, భూమి గుండ్రంగా ఉందని నిరూపించడానికి మూడు కారణాలు చెప్పు...
చైతన్య: ఒకటి ... మా నాన్న చెప్పాడు. రెండు..మా అమ్మ కూడా చెప్పింది. మూడు...మీరు కూడా చెప్పారు.