
‘యద్దృశ్యతే శ్రూయతే చ’ దేన్ని ఇష్టంగా మనసుకి పట్టించుకుని చూస్తామో, దేన్ని చెవులారా విని బుద్ధికి ఎక్కించుకుంటామో వాటి ప్రభావం మనమీద తప్పక ఉంటుందనేది నూటికి నూరుపాళ్లు నిజమైన అంశం. శరీరానికి అనారోగ్యకరమైన తిళ్లని తినిపిస్తే ఎలా శరీరం రోగమయమౌతుందో.. వైద్యుని అవసరం కలుగుతుందో, దానివల్ల ఇటు శారీరక బాధ అటు ధనవ్యాయం, అంతేకాక మనకి బంధుమిత్రులు సేవచేయడంలో అలసటా.. కలుగుతాయో, అదే తీరుగా బుద్ధికి కూడా సరికాని కథలనీ సంఘటనలనీ గట్టిగా హత్తుకునేలా అందిస్తే మానసికంగా వ్యక్తి పూర్తిగా రోగిగా మారిపోతాడు. అందుకే పెద్దలు ‘సరైన వాటినే చూపించు–సరైన వాటినే తినిపించు’ అనేవాళ్లు. అలా శరీరానికీ బుద్ధికీ మనసుకీ ఆరోగ్యకరమైన సాయి చరిత్రలో ప్రయాణిస్తూ సాయి దృక్పథాన్ని ఒంటికి పట్టించుకుంటూ వెళ్తున్నాం. ఆ నేపథ్యంలో మరో మతమంటూ లేదనీ అందరిమతం ఒక్కటేననీ నిరూపించే సాయికథని జరిగినదాన్ని జరిగినట్లుగా అనుకుందాం!
కృతజ్ఞత
‘కృత = తనకి చేయబడిన సహాయాన్ని, జ్ఞ–త=గుర్తుంచుకోవడం’ అని ఈ మాటకి అర్థం. ‘గోపాలరావు గుండ్’ అనే పేరున్న ఒక ధార్మికుడుండేవాడు. చేస్తున్నది పోలీసుశాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా అయినప్పటికీ, రోజూ నేరగాళ్ల మధ్యే ఉండవలసిన ఉద్యోగమైనప్పటికీ, పూర్తిగా వ్యతిరేకబుద్ధితో నేరం దిశగానే ఆలోచిస్తూ ఎవరొచ్చినా దొంగ– ఘాతుకుడు(హత్య చేసినవాడు).. అని ఈ తీరు మనస్తత్వమే కలిగినవాడుగా ఉండవలసిన వాడే అయినప్పటికీ ధర్మబుద్ధితోనే ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. అందుకే ఆయన్ని ధార్మికుడు అనవలసివచ్చింది. తననెప్పుడూ ఏ ఒత్తిడీ ఉద్యోగపరిస్థితీ తోవ తప్పనీయకుండా చేయాలనే దృఢ సంకల్పంతో దైవానికి నిజమైన సమర్పణ బుద్ధితో (ఏదో ఇచ్చుకోవాలనే బుద్ధి అనేది సమర్పణమనే మాటకి అర్థం కాదు. దైవానికి దాసుడైన వాడినని తనని తాను సమర్పించుకున్న బుద్ధి కలవాడనేది అర్థం) ఉంటూ కాలాన్ని గడుపుతుండేవాడు. వివాహమై ఎక్కువకాలమైనా సంతానం కలగలేదు. ఆ భార్య ఒత్తిడితో ప్రోత్సాహంతో మరో ఆమెని చేరదీయడం కాదు. వివాహమే చేసుకున్నాడు. అందుకే అతణ్ణి ధార్మికుడన్నాం. అయినా సంతానం కలగలేదు. ఈ ఉన్న ఇద్దరి భార్యల ప్రోత్సాహం ఒత్తిడితో మూడవవివాహాన్ని కూడా చేసుకున్నాడు. లోపల ఒక భయం. ఇలా ఎన్ని వివాహాలని చేసుకోవాలి? అని. ఈ సారి ఏమైనా మరి వివాహమనేమాటని ఎంతటి ఒత్తిడి వచ్చినా అంగీకరించననుకుని కాలాన్ని గడుపుతూ ఉంటే ఎవరో తన అదృష్టానికి సాయి గురించిన విశేషాలని వివరించారు. తన భార్యలు ముగ్గురితో కలిసి సర్వసమర్పణ æభావంతో ఆయనని చూడలేదు. దర్శించుకున్నాడు హృదయంతో.. హృదయంలో ఉన్న ఆర్తితో..! ఆయన కన్నుల్లో కన్నుల్ని పెట్టి మనసుతో ఆయన మనసుకి విన్పడేలా మౌనంగా చెప్పుకున్నాడు తన ఆవేదనని. వేదన అంటే ఎవరో వినేవాడున్నప్పుడు చెప్పుకోగల బాధ అని అర్థం. ఆవేదన అంటే దైవం తప్ప మరెవరికీ విన్పించుకోగల బాధ అని అర్థం. ఆవేదన అంటే దైవం తప్ప మరెవరికీ విన్పించుకోలేక ఒకవేళ విన్నా మనస్థాయి దుఃఖంతో సమానమైన దుఃఖాన్ని అనుభవిస్తూ అర్థం చేసుకోలేని బాధ అని అర్థం. అలాంటి ఆవేదనని అర్థం చేసుకోగలవాడు సాయి మాత్రమే అని నిశ్చయించుకుని ఆవేదనని చెప్పుకున్నాడు గోపాలరావు గుండ్.
సరైన కాలంలో విత్తనాన్ని నాటితే చక్కని అంకురం వచ్చి మొక్కై మానుగా ఎదుగుతుందన్నట్లు సాయికి తన ఆవేదనని చెప్పుకున్న కొంతకాలంలోనే ఆయనకి సంతానం కలిగింది. సంతానం కల్గించిన సాయిపట్ల తన ‘కృత–జ్ఞ–త’ తనకి మేలు కల్గించిన సాయికి తన మానసికానందాన్ని హృదయపూర్వకంగా చెప్పుకోవాలని ప్రత్యక్షంగా తనకి తానుగా ఆయనకి కన్పించి చెప్పుకునేలా వెళ్లాలని బయల్దేరి సాయికి సాష్టాంగపడి తన ‘కృతజ్ఞత’లను నమస్కారపూర్వకంగా తెలియజేసుకున్నాడు.ప్రార్థిస్తే సంతానం కలిగితే అన్ని పనుల్నీ మానుకుని వెళ్లి దర్శించిన గోపాలరావు గుండ్ ద్వారా ఎందరో అర్థం చేసుకోవాలి. ‘మొక్కుకుని, ఆ మొక్కుకున్న కారణంగా తీరవలసిన కోరిక తీరాక, ఇప్పుడు కుదరలేదు, అప్పుడు సాధ్యపడదు, మరొక కొంతకాలం వీలుపడదు’ అంటూ దైవదర్శనాన్ని వాయిదా వేసే వారందరూ ఎంతటి తప్పుని చేస్తున్నారో గమనించుకోగలగాలి. కేవలం ఒక్క కుటుంబపు బాధ్యతని నిర్వహిస్తున్న మనకే వీలుపడలేదని, వీలుపడదనీ మనం అంటుంటే, ఆ దైవం తనకంటూ ఎందరు కుటుంబాల బాధ్యతని చేపట్టి ఉన్నాడో కాబట్టి ఆయన అసలు ఏ మాత్రం తీరుబడి లేనివాడవుతూ మన కోర్కెని పట్టించుకోకుండా ఉన్నా అడిగే అవకాశమే లేదు మనకి. అంతటివాడు మన కోర్కెని తీర్చినా ఆయన్ని దర్శించుకోకపోవడం ఎంత ఘోరం ఎంత నేరం ఎంతటి ద్రోహం? ఎంతటి అకృతజ్ఞత?(కృతజ్ఞతకి వ్యతిరేకం కృతఘ్నత కాదు)అందుకే ధార్మికుడైన గోపాలరావు గుండ్ సాయిని దర్శించి తనకి జరిగిన ఆ ఆనందాన్ని ఒక దర్శనంతో వ్యక్తీకరించుకోవడం కాకుండా, అంతతో ముగించుకోవడం కాకుండా, ఆ ఆనందానికి గుర్తుంగా ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం– జాతర– భక్తిపూర్వకంగా జరిపే తిరునాళ్లు జరపాలని దృఢంగా అనుకున్నాడు. బుద్ధింతు సారధిం విద్ధి– మనకి కలిగే ఆలోచనే మన జీవితరథానికి సారథి(నడిపించే వ్యక్తి) అని దీనర్థం. అందుకే తనకి కలిగిన ఈ ఆలోచనని తనకి ఆప్తులైన పాటిల్ ద్వయం(తాత్యా కోత్ పాటిల్, దాదాకోత్ పాటిల్) తోనూ వీరితో సమాన బుద్ధి కలిగిన మాదవరావు అనే ఆయనకీ చెప్పాడు గోపాలరావు గుండ్. ఓ మంచిపనిని చేయబోతే ఆహ్వానం లేకుండానే పదిమంది రావడమనేది సహజం కాబట్టి, నిస్వార్థంగా జరుపబోయే ఉత్సవానికి సంబంధించిన ప్రతిపాదనకి షిర్డీ గ్రామస్థులు కూడా సహకరిస్తామన్నారు. గోపాలరావు గుండ్ ఆనందానికి అవధుల్లేవు.
నిరాకరణ – అంగీకారం
చేస్తున్నది మంచిపనే కదా! అనే అభిప్రాయంతో ఈ షిర్డీవాసులంతా ఆ ఉత్సవానికి సంబంధించిన అన్ని విధాల సహకారాలని అందించడానికి ముందుకొచ్చారు. అయితే సాంకేతికంగా మాత్రం ఇలాంటి ఉత్సవాలు చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్‌గారి అనుమతి తప్పనిసరి. పైగా ప్రతి సంవత్సరం చేయదలిచిన ఉత్సవం కాబట్టి ప్రతిసారీ ఈ అనుమతి కోసం ఎదురుచూడనక్కరలేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నారు అందరి తరఫునా గోవిందరావు గుండ్ ప్రభృతులు.వేప చెట్టుకి పాలుపోసినా, తేనెని ఎరువుగా వేసినా, గంధాక్షతలతో పూజ చేసినా, గొడ్డలివేటు వేసినా.. దాని రుచి ఎన్నటికీ తీపికానట్లు, చేదుతనమే తన స్వభావమైనట్లు ఆ గ్రామ కులకర్ణి(కరణం) తనదైన సహజబుద్ధితో ఈ దరఖాస్తుని పంపుతున్నట్లే పంపుతూ.. ఈ ఉత్సవానికి అనుమతినీయడం మంచిది కాదంటూ తన సూచనని రాశాడు. రెవెన్యూ వారు ఈ కులకర్ణి అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకు తీరాలి. దానికి కారణం ఆయనే ఆ గ్రామ విశేషాలని అందించాల్సిన అధికారి కాబట్టి. దాంతో అనుమతి నిరాకరింపబడింది.గుర్తుంచుకోవాలి! ఎంత గొప్ప పనిని గోపాలరావు గుండ్ తలపెట్టాడో, దానికి గ్రామస్థులంతా ఎలా ముందుకొచ్చారో, ఒక్క సంవత్సరం ఏదో తూతూ మంత్రంగా కాకుండా ప్రతి సంవత్సరం జరుపదలిచారో, ఇది కూడా గోపాలరావు గుండ్‌కి చక్కని పరిశోద్ధారకుడు కలిగిన కారణంగా తప్పక కొనసాగుతూ వెళ్తుందో.. ఇన్నింటినీ ఆ గ్రామాధికారిగా ఉండి అన్నీ తెలిసికూడా కులకర్ణి (కరణం) అలా చేసాడంటే గమనించాల్సిన అంశాలు రెండు. ఒకటి : లోకమంతా ఒకవైపున ఉండి మంచి చేయదలిచినా ఇలాంటి చీడపురుగులుంటాయనీ..! రెండు : సాయి అనుగ్రహం కోసం ముందుగా ప్రయత్నించకుండా ఆయనకి మాట మాత్రంగానైనా చెప్పకుండా చేస్తూండడం వల్లే ఇదంతా జరిగిందనీను. భాగవతం చదువుతూ ఉంటే ఎలా కృష్ణుని చరిత్రతోపాటు శిశుపాలుడూ కంసుడూ గురించి కూడా అనుకుంటామో, శ్రీమద్ రామాయణాన్ని చదువుతుంటే ఎలా శూర్పణఖ–సీతని అపహరించవలసిందని చెప్పిన అకంపనుడనే రాక్షసుణ్ణి గురించి కూడా అనుకుంటామో అలా ఈ కులకర్ణి(కరణం) చరిత్రలో ఒక దుష్టునిగా శాశ్వతంగా నిలిచిపోయాడు. కాబట్టి చరిత్రలో మనమెప్పుడు మాయగా అనుకునేలా ప్రవర్తించాలి తప్ప ఎలా బడితే అలా ఉండడం సరికాదన్నమాట!
నిరుత్సాహపరులైన గ్రామస్థులందరితో కలిసి గోపాలరావు గుండ్ సాయికి ఈ విషయాన్ని వివరించాడు. అయితే! సాయి ఆశీర్వచనం కారణంగా అనుమతి రానేవచ్చింది కొన్ని రోజుల్లోనే. అంటే ఏమన్నమాట? మనకేదైనా ఓ పని కాక మధ్యలో అడ్డంకి కలిగితే సాయిని ప్రార్థిస్తే పని మళ్లీ సక్రమ స్థితికి వచ్చేస్తుందని తెల్పడమే కదా!మరో విశేషం ఉంది కూడా. గోపాలరావు గుండ్ తనకి పుత్రుడు కల్గిన సందర్భంగా తానొక మహ్మదీయుడు కాబట్టి ఉరుసు ఉత్సవాన్ని చేయ సంకల్పించి ఇంత చేసాడు. సత్ప్రవర్తన కలిగిన మహాత్ములైన మహ్మదీయులు మర ణిస్తే వాళ్ల సమాధుల వద్ద ప్రతి సంవత్సరం వాళ్లని స్మరిస్తూ వాళ్లకి నివాళులనర్పించుకునే ఆరాధనోత్సవం ఉరుసు. అలాంటి ఉరుసుని చేయవచ్చునని కలెక్టర్ నుంచి అనుమతి రాగానే సాయి అందరినీ పిలిచి ఆ ఉరుసుని తప్పకుండా ఈ సంవత్సరంలో ప్రారంభించి ప్రతి సంవత్సరం జరుపుకుందాం! అయితే ఆ ఉరుసుని శ్రీరామనవమినాడు జరుపుకుందామని తన నిర్ణయాన్ని ప్రకటించాడు.గమనించాలి! సాయి ఎంత గొప్పవాడో హృదయవైశాల్యం కలవాడో! పరమత ద్వేషి కానికాడో! ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి!
‘నాకు పరమతసహనం ఉంది. స్వమతం మీద సంపూర్ణ అభిమానం మాత్రమే కాదు’ అంటుంటారు ఎందరో. సాయి దాన్ని అంగీకరించాడు. మతాలంటూ రెండున్నాయని అంగీకరిస్తూ ఈ రెంటింటిలో నాదికాని మతాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇతర మతాన్ని ద్వేషించననడం గొప్ప కాదని తీర్మానిస్తాడు సాయి. రెండు మతాల్లోనూ వేర్వేరుదనం ఉండనే ఉండరాదు. ‘రెండు’ అనుకుంటున్న ఆ ‘రెండూ ఒక్కటే’ అని నిరూపిస్తూ, ముందుకాలం వారికి మార్గదర్శకుడు కూడా అవుతూ ‘ఆ చేయబోతున్న ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమినాడు చేయాలి’ అంటూ ఆజ్ఞ చేసాడు సాయి!ఇలాంటి చరిత్రలని పాఠ్యాంశాల్లో చదివి నేడు కన్పిస్తున్న హిందూ ముసల్మాన్ ద్వేషాలు ఇంతకు వెనుకకాలంలో చరిత్రలో జరిగాయని చెప్పిన ముసల్మాన్ దండయాత్రలు, ప్రస్తుతం ఇంకా జరుగుతున్న హిందూమహ్మదీయ పరస్పర దూషణలు చిన్నచిన్న ఘర్షణలు కూడా పూర్తిగా సమసిపోతాయి. ముఖ్యంగా బాల్యం నుండే పిల్లల్లో మతాల్లో ఉండే రెండు తనం పోయి, మతాలన్నీ ఒకటే అనే అభిప్రాయం బలపడుతుంది! సాయిని కొందరు హిందువులు ఆయన ఓ మహ్మదీయుడనే అభిప్రాయంతోనూ ఆ సంప్రదాయమే ఆయన ఆలయంలో జరుగుతూ ఉంటుందనే ఊహతోనూ సాయిపట్ల ఆయన ఆరాధన పట్ల విముఖతని చూపిస్తూ ఉంటారు. వీరి ఆలోచనే నిజమైనదైనట్లైతే – మసీదేమిటి? ధుని ఏమిటి? లోపల తులసి మొక్కని నాటడమేమిటి? దీపారాధన ఏమిటి? ద్వారకామాయి అని దానికి పేరు పెట్టడమేమిటి? కొద్దిగా ఇలా ఆలోచించుకోగలగాలి. ఇదే సందర్భంలో కొందరు మహ్మదీయులు కూడా ఈయన హిందువనే అభిప్రాయంతో కొంత విముఖతని చూపిస్తూ ఉంటారు. రాబోయే చరిత్రలో ముసల్మానులు అభిప్రాయంతో హిందువులని ఏం చేయబోయారో కూడా తెలియబోతోంది! నిజంగా ఆయన హిందువే అయ్యుంటే నిరంతరం ‘అల్లాహోమాలిక్’ అనడమేమిటి? కఫనీని ధరించడమేమిటి? తల గుడ్డని గట్టిగా చుట్టి ఎడమచెవి మీదుగా ముడిని వేయడమేమిటి? కొద్దిగా పరిశీలించగలగాలి.
మరైతే సాయి ఎవరట? ఆయన హిందువుగా కన్పించే మహ్మదీయుడు. మహ్మదీయుడిగా కన్పించే హిందువు. రెంటినీ కలిపి ఒకేమాటలో చెప్పాలంటే ఏ మతానికీ చెందని మహనీయుడూ, అన్ని మతాలు ఒకటే సుమా! అని అర్థం చేసుకునేలా మనకి ఉపదేశాన్నిచ్చే అనన్యసామాన్యుడూను.మొత్తానికి ఉరుసుని శ్రీరామనవమినాడు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి గ్రామస్థుల సహకారం సాయి అనుగ్రహపూర్వకమైన ఆమోదం అన్నీ లభించాయి గానీ మళ్లీ గ్రామస్థుల్లో ఒక చింత బయల్దేరింది. రెండుత్సవాలనీ ఒకే మారు చేస్తున్న కారణంగా భక్తుల సంఖ్య మరింత మరింత అవుతుంది. షిర్డీలో నీటి సమస్య ఉంది. ఉత్సాహంతో మనం ఉత్సవాలని ఇక్కడ కాకుండా మరోచోట చేసుకుంటేనే ఈ ఉత్సవాలని? అనే ఆలోచనదాక వచ్చేసారు జనం అందరూ. దీన్నే అస్థిర అవిశ్వాస తీర్మానం’ అంటారు. ఒకేచోటంటూ ఉత్సవం జరగాలనే గట్టి ప్రయత్నంతో గోపాలరావు గుండ్ ఇంత భగీరథ ప్రయత్నం చేస్తే చివరి క్షణంలో నీటి సమస్య కారణంగా వాయిదా వేయడమా? అదుగో ఆ ఆలోచననే ‘అస్థిర అవిశ్వాస ఆలోచన’ అంటారు.అస్థిర ఆలోచనంటే ముందు షిర్డీలో అనుకుని, తర్వాత షిర్డీ కాక మరోచోట చేద్దామని సంకల్పించడం, అవిశ్వాస ఆలోచనంటే సాయి కూడా ఈ సమస్యని తీర్చలేడనే మానసిక అవిశ్వాసంతో ఆలోచించడం. అసలు సాయికి ఈ సమస్యని చెప్పుకోకుండా తమలో తాము ఆలోచించేసుకోవడమూను. కొన్ని కొన్ని సందర్భాల్లో మనుష్యులు ఇలాంటి ఆలోచనలనే చేస్తారు. ఆ సరైన ఆలోచన రావడానికి కూడా సాయి అనుగ్రహం ఉండాలి. గోపాలరావు గుండ్‌తో పాటు పాటిల్ ద్వయం మాధవరావు ఇంకా కొందరికి మెరుపులా ఇదేమిటి? ఇలా ఈ సమస్య మరో తోవ పడుతోంది? అనే ఆలోచన కలిగి సాయికి విన్నవించారు. ‘దేవా! ఈ ఉత్సవాలని చేయదలిస్తే షిర్డీలో రెండే రెండు నీటి వసతులున్నాయి. ఒకపేద్ద నుయ్యి ఉందిగాని ఈ ఉత్సవాలు ఎండల కాలంలో కాబట్టి నీరు సరిపోకపోవచ్చు. లేదా ఇంకిపోతుంది కాబట్టి మధ్యలో ఆ నుయ్యి మనని ఇబ్బందికి గురిచేయచ్చు. ఇక రెండో నుయ్యి ‘నడబావ’. అంటే నాలుగు వైపుల్నించి నడిచే మార్గాల మధ్యలో ఉన్న పెద్ద విశాలమైన బావి. నాలుగు వైపుల వారూ చక్కగా తోడుకుని నీళ్లు పట్టుకోగల వసతి ఉన్న బావి, అయితే దురదృష్టవశాత్తూ ఆ నూతినీరు ఉప్పగా అయిపోయింది. ఎవరికీ ఉపయోగపడడం లేదు. నువ్వే మాకు శరణం’ అని.సాయి చిరునవ్వు నవ్వుతూ ‘చెడు పనులకి విఘ్నాలు కలగనే కలగవు. మంచి పనులకే విఘ్నాల మీద విఘ్నాలొస్తూ ఉంటాయి. (‘శ్రేయాంసి బహు విఘ్నాని’ అని శ్రీమద్ రామాయణంలోని మాట ఇదే అర్థాన్నిస్తుంది) అందుకని ఆలస్యం చేయకూడదు మంచిపని విషయంలో. రండి! అంటూ ఆ నూతి దగ్గరికి వెళ్లి దగ్గర్లో ఉన్న చెట్లపూలని స్వయంగా తానే కోసి లోపల ఏదో ధ్యానం చేసి నూయి చుట్టూ తిరుగుతూ కొన్ని పుష్పాలని తాను వేసాడు నూతిలో.‘ఇక వెళ్దాం!’ అన్నట్టుగా తాను ద్వారకామాయి వైపు నడిచాడు. ఆశ్చర్యం మరురోజునుండే ఎందరో నీళ్లు తోడుకోవడం కన్పించిందక్కడ! నీళ్లన్నీ ఉప్పదనాన్ని కోల్పోయి రుచికరంగా తాగవీలైన తీరులో ఉన్నాయి పరిశీలించి చూస్తే.అప్పుడర్థమైంది షిర్డీ ప్రజలకి. గంగానది మన పక్కనే ప్రవహిస్తూ ఉంటే పొరుగూరి చెరువుకి నీళ్లకోసం వెళ్తున్నామా? అనీ మలయపర్పత వాయువు ఇక్కడే వీస్తుంటే విసనకర్రల్ని కొనుక్కుని వీచుకుంటున్నామా? అనీను! ఇంతలో మరో శుభవార్త వినపడింది అందరికీ!
Comments
Please login to add a commentAdd a comment